ఎదురుచూపులు - లత పాలగుమ్మి

waiting for long

నేను త్రిష చిన్ననాటి స్నేహితులం. చిన్నప్పటి నుండి కలసి చదువుకోవటం, ఆడుకోవటం ఇలా మా చిన్నతనం ఆడుతూ పాడుతూ హాయిగా గడిచి పోయింది.  మా మధ్య స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో మాకే తెలీలేదు. మాదొక చిన్న పల్లెటూరు.  మా నాన్న గారు పెద్ద ఆసామి కావడంతో ఊరిలో మాదే పైచేయి.మా నాన్నగారికి నేను ఎక్కువ త్రిషతో స్నేహంగా ఉండటం ఇష్టం ఉండేది కాదు.  అమ్మకి మాత్రం త్రిష అంటే చాలా ఇష్టం. 


తను మెుదటి నుండి బ్రైట్  స్టూడెంట్ కాబట్టి నాకు స్టడీస్ లో హెల్ప్ చేసేది. అందువలన ఇంట్లో వాళ్ళు ఏమీ అనలేక  ఊరుకునేవారు. త్రిష వాళ్ళ నాన్నగారు వ్యవసాయం చేసేవారు. వాళ్లకి ఒక ఎకరం పొలం ఉండేది. దానితో వచ్చేఆదాయంతోనే  ఇల్లు గడవాలి. పెద్ద కుటుంబం కావడంతో ఆర్ధికంగా చాలా ఇబ్బంది పడేవారు.  తనకి ఏమి కావాలన్నా నేనే సహాయం చేసేవాడిని. త్రిష కాలేజీలో అందరితో స్నేహంగా ఉండేది. తను చాలా అందగత్తె కావడంతో  ఎక్కువగా అబ్బాయిలు అందరు తనతో మాట్లాడాలని ప్రయత్నించేవారు.


మాది సెయింట్ స్టీఫెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ. అందరం బీటెక్ ఫైనల్ ఇయర్ చివరిలో ఉన్నాం. అందరికి క్యాంపస్ రిక్రూట్మెంట్ లో వేర్వేరు ప్లేసెస్స్ లో ఉద్యోగాలు దొరికాయి. 



ఈ నాలుగు ఏళ్లు చాలా హ్యాపీగా గడిపేసాం. ఇది ఆఖరివారం కావటంతో అందరి ముఖాల్లో దిగులు.. ఉద్యోగానికి వెళుతున్నామనే సంతోషం అన్ని భావాలు కలగాపులగంగా ఉన్నాయి. 



ఆ రోజు త్రిష చాలా హడావిడిగా వగరుస్తూ వచ్చింది కాంటీన్ కి. అందరూ తను ఏం న్యూస్ చెప్తుందో అని తన కేసి కుతూహలంగా చూశారు.  తనకి ంఐచ్రోసాఫ్ట్ లో యు ఎస్ ఏ  లో మంచి జాబ్ ఆఫర్ వచ్చిందని చెప్పడంతో ఆందరూ క్లాప్స్ కొట్టి తనని అభినందించారు.  కొందరు ఈర్ష్య పడుతున్నారని తెలుస్తూనే ఉంది వారి హావ భావాలని బట్టి.  త్రిషకి ఏదైనా మంచి జరిగితే సంతోషించేవారిలో నేను మొదటి వాడిని.  


త్రిషకి ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడల్ రావడంతో మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీలో ఆఫర్ దొరికింది. ఆర్ధికంగా పేరెంట్స్ కి సపోర్ట్ గా ఉండచ్చని చాలా సంతోషంగా ఉంది త్రిషకి.  తనకి మంచి ఆఫర్  వచ్చినందుకు సంతోషంగా ఉన్నా అంత దూరం వెళ్లిపోతుందంటే చాలా బెంగగా ఉంది.  


మరుసటి రోజు సాయంత్రం కాఫీ షాప్ దగ్గర కలుసుకున్నప్పుడు ఇద్దరిలోను నిశ్శబ్దం చోటుచేసుకుంది. తనలో కూడా జాబ్ వచ్చినప్పుడు ఉన్నంత హుషారు ఇప్పుడు కనిపించటం లేదు. తప్పని సరి పరిస్థితులలో వెళ్ళడానికి సిద్ధ పడింది. ప్రతిరోజూ వీడియో కాల్ చేసుకుందామని ప్రామిస్ చేసుకున్నాము. తనకి కూడా నన్ను వదిలి వెళ్లడం అస్సలు ఇష్టం లేదు అని అర్ధమయింది నాకు.  



ఆ రోజే ప్రయాణం.  తనని ఎయిర్ పోర్ట్  దగ్గర డ్రాప్ చేసి వస్తుంటే మనసంతా ఖాళీ ఐపోయినట్లుగా ఉంది.  
వాళ్ళ పేరెంట్స్ ని డ్రాప్ చేసి ఇంటికి వెళ్లి రూంలో దిగాలుగా కూర్చున్నాను. దేని మీద ఇంట్రేశ్త్ ళెడూ.  ఏమి చేయాలో తెలీటం లేదు. తన కాల్ కోసం వెయిట్ చేయటం తప్పించి.  
రోజూ కాల్ చేస్తోంది త్రిష. తన గురించి ఆలోచించటం తప్పించి ఇంక దేని మీద నాకు కాన్సంట్రేషన్ లేదు. మెల్లగా త్రిష బిజీ అవడంతో డైలీ కాల్  వీక్లీ కాల్ గా మారింది.  
త్రిష నెగ్లిజెన్సు భరించలేక పోయాను.  మెల్లగా ఆల్కాహాల్కి అలవాటు పడ్డాను. ఇంట్లో వాళ్ళు ఎంతో చెప్పి చూశారు.  త్రిష ఫోన్ కాల్ తప్పించి నాకు ఏమి సంతోషాన్ని ఇచ్చేవి కావు.  ఇంకో సంవత్సరం ఇలాగే గడిచి పోయింది. 
ఇప్పుడు నన్ను చుస్తే ఎవ్వరూ గుర్తు పట్టేలా లేను.  మాసిన గడ్డం, పోషణలేని శరీరం, అస్థిపంజరం లాగా తయారు అయ్యాను నేను.
సుమారుగా రెండు ఏళ్లు గడచి పోయాయి. తాను ఒక్కసారి కూడా ఇండియాకి రాలేదు సరికదా వీడియోకాల్స్ కూడా బంద్ అయిపోయాయి. ఎప్పుడో ఒకసారి కాల్ చేసేది, అప్పుడు కూడా ముక్తసరిగా మాట్లాడేది.



వాళ్ళ పేరెంట్స్ తో కూడా అంతే.  మిగతా ఫ్రెండ్స్ ఎవరితో కాంటాక్టులో లేనే లేదు. సడన్ గా డిసప్పీర్ అయినట్లుగా అయిపోయింది.  కారణం తెలీటం లేదు. ఎన్నిసార్లు అడిగినా పని ఒత్తిడి తప్పించి వేరే ఏమి లేదు అని చెప్పేది.  
ఆ రోజు త్రిష వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి తాను అమెరికాలోనే వివాహం చేసుకుంటోందని చెప్పడంతో నేను పూర్తిగా కృంగిపోయాను. 
ఆత్మహత్యకి పాల్పడ్డాను.  సమయానికి మా పనిఅబ్బాయి చూడటంతో హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు.
మాట్లాడటానికి కూడా మా తాహతుకి తగరు అని భావించే మా నాన్నగారు త్రిష వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయిని ఒకసారి ఇండియాకి రప్పించండి అని ప్రాధేయపడ్డారు.  

నాలుగు రోజులు మృత్యువుతో హోరాహోరీగా పోరాడిన  తర్వాత నాకు కొంచెం స్పృహ వచ్చినట్లుగా ఉంది.  ఎవరెవరివో మాటలు వినపడుతున్నాయి.  ఏం జరుగుతోందో ఎక్కడున్నానో అర్ధం కావడం లేదు.  సడన్ గా త్రిష గొంతు వినపడింది అంత మత్తులో కూడా.  
కళ్ళు తెరిచి చుసేటప్పటికి నిజంగానే త్రిష ఎదురుగుండా.  కల కాదు కదా అనిపించింది.  

త్రిషని చూసి ఖంగు తిన్నాను.  తనకి వంటి నిండా తెల్ల మచ్చలు (విటిలిగో).  ఎందుకిలా వీడియో కాల్స్ కి రాకుండా మొహం చాటేస్తోందో నాకు అర్ధం అయింది.  తను కూడా నన్ను చూసి అలాగే షాక్ తింది. ఇద్దరికీ కంటినిండా నీళ్ళు నిండటంతో ఎదురు గుండా అంతా  మసక మసకగా కనిపించింది.  
తనకి వివాహం అయిందని తెలిస్తే నేను కూడా లైఫ్ లో సెటిల్ అవుతానని ఆలా చెప్పించిందట వాళ్ళ పేరెంట్స్ తో.
ఒక్క ఉదుటన లేచి వెళ్ళి ఆమెని ఆలింగనం చేసుకున్నాను.  ఆమె కూడా  సంతోషంగా  నాలో ఒదిగి పోయింది.  ఇంతేనా ఇన్ని ఏళ్ళలో నువ్వు నన్ను  అర్ధం చేసుకున్నదని మెల్లగా ఆమెని కేకలు వేశాను.  



ఆమె అవన్నీ వినే పరిస్థితులలో లేదు.  బాహ్యసౌందర్యం కన్నా అంత:సౌందర్యం ముఖ్యం అని, ఆమె నాతో ఉంటే చాలని, జీవితాంతం ఆమె గొంతు వినపడితేనే చాలని చెప్పి ఆమెని అలాగే అక్కున చేర్చుకున్నాను