చారుమతి - లత పాలగుమ్మి

చారుమతి
వడివడిగా అడుగులు వేస్తున్నా బస్ స్టాప్ కేసి. మధ్య మధ్యలో వాచ్ లో టైం చూసుకుంటూ. సమయం ఉదయం ఎనిమిది కావస్తోంది.
రోజూ వేళ్ళే బస్సు మిస్ ఐపోయానని, ఈ రోజు కూడా బాస్ తో అక్షింతలు తప్పవని అర్ధమవుతోంది. మా బాస్ అసలే చండశాసనుడు. ఏది ఏమైనా, ఎవరికి ప్రాణం మీదకి వచ్చినా సమయానికి ఆఫీసులో ఉండాలంటాడు. ఆడవాళ్లు ఉద్యోగానికి వెళ్ళటం మొగవాళ్ళు వెళ్లినంత తేలిక కాదు. ఉదయాన్నే పని మనిషి తో మొదలుకొని పిల్లలు స్కూల్ బస్సు మిస్ కాకుండా వెళ్లడం దగ్గర నుంచి అన్ని సమస్యలే. ఈయనకి, పిల్లలిద్దరికీ లంచ్ బాక్సులు కట్టడం, వాళ్ళు హోమ్ వర్క్ బుక్స్ పట్టుకు వెళ్ళారో లేదో చూడటం, ఎక్స్ ట్రా ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటే అవి మర్చి పోకుండా చూడటం, ఇవన్నీ ఆడవాళ్ళ బాథ్యత కదా మరి. వాళ్ళని స్కూల్ బస్సు ఎక్కించాక ఇహ నా పరుగు మొదలవుతుంది ఆఫీసుకి. సరిగ్గా ఆఖరి నిమిషంలో మా అబ్బాయి మరచి పోయిన చార్ట్ టేబుల్ మీద వెక్కిరిస్తూ కనపడుతుంది, మరి నా సంగతేంటి అని. అసలే వాడు ఆఖరి రోజు వరకు సబ్మిట్ చెయ్యడు. తప్పని సరిగా ఆఫీసుకి వెళ్లే దోవలో వాడి స్కూల్ దగ్గర ఆగి ఆ సెక్యూరిటీ అతన్ని బతిమాలుకొని మా వాడి క్లాస్ రూమ్ లో అందచేయమని చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు ఆఫీసుకి లేటుగా వెళ్ళడానికి.
ఇవన్నీ బాస్ కి ఎలా చెప్పటం. ఆయన రూమ్ లోనికి వెళ్ళగానే బుర్ర పని చేయటం మానేస్తుంది. ఏం తిడతాడోనని భయం. కనీసం బయటకి వినపడకుండా ఉంటే చాలు అనుకుంటాను. మా ఆఫీసులో నాకు ఎలాగు లేట్ గా వస్తానని ముద్ర పడిపోయింది.
నేను ఈ ఆలోచనల్లో ఉండగానే బస్సు రానే వచ్చింది. కిక్కిరిసి పోయి ఉన్న బస్సు లో ఎలాగోలా ఇరకబడ్డాను. కండక్టర్ అడిగితె్ బస్సు పాస్ తీసి చూపించటానికి కూడా వీలు లేనంత రద్దీగా ఉంది బస్సు. అర్ధ గంట ప్రయాణం తర్వాత కూర్చోడానికి సీట్ దొరికింది. మరో ఐదు నిమిషాలలోనా గమ్యం రానే వచ్చింది. బ్రతుకు జీవుడా అని బస్సు దిగి నడక ప్రారంభించాను. పది నిమిషాలు నడకే అయినా ఉదయం సమయం లో అదే గంట లాగ అనిపిస్తుంది.
దోవలో ఏదో ఆక్సిడెంట్ అయినట్లుఉంది. చాలా మంది గుమిగూడారు. వద్దనుకుంటూనే లోపలి కితొంగి చూసాను. చిన్న అమ్మాయి, పాపం బ్రతుకుతుందో లేదో అని జాలి పడుతూనే అందరు చోద్యం చూసి వెళ్లిపోతున్నారు వాళ్ళ పనులకి ఆటంకం కలగకుండా. ఎవరూ పోలీసులకి గానీ, అంబులెన్సుకి గానీ కాల్ చేయడం లేదు. నా మనసు ఉండబట్టలేదు, అయిన ఆలస్యం ఎలాగూ అయ్యింది కదా అని అంబులెన్సుకి, పోలీసులకి కాల్ చేసి టెన్షన్ తో వెయిట్ చేస్తున్నాను. కాసేపు ఆఫీస్ సంగతే మర్చి పోయాను.
ఆ అమ్మాయిని చుస్తే చాలా బాధ అనిపిస్తోంది. చాలా వరకు రక్తం పోయింది, బ్రతుకుతుందో లేదో కూడా తెలీదు. లారి వాడు గుద్ది వెళ్లిపోయాడని అక్కడ ఉన్న వాళ్లు ఎవరితోనో చెపుతుంటే విన్నాను.
ప్రక్కనే ఆ అమ్మాయి హ్యాండ్ బాగ్, బుక్స్ పడి ఉన్నాయి. అవి కూడా రక్తసికం అయి ఉన్నాయి. ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకొని వాళ్ళ వాళ్ళకి తెలియ పరుద్దామని అనుకునేంత లోపే అంబులెన్సు రానే వచ్చింది. గబాగబా వాళ్ళు ఆమెని లోపలికి చేర్చారు. ఎవరో ఒకళ్ళు రావాలి అంటే ఎవరికి వారు మాట్లాడకుండా వెళ్లిపోయారు, అనవసరంగా పోలీస్ గొడవల్లో ఎవరు పడతారని. నేనే ధైర్యం చేసి ఆంబులెన్సు ఎక్కి ఆమెని హాస్పిటల్లో చేర్చడానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశాను.
హడావిడిగా ఆమెని ఐసీయూ లోనికి తరలించారు. అర్ధగంట వరకు నర్సులు, డాక్టర్స్ హడావిడిగా లోపలికి బయటకి తిరుగుతున్నారు. షుమారుగా గంట తర్వాత ఒక డాక్టర్ బయటకు వచ్చి పేషెంట్ తాలూకు ఎవరు అని నన్ను అడిగారు. నేనే జాయిన్ చేసానని, నాకు కూడా ఆమె ఎవరో తెలీదని చెప్పాను. సమయానికి తీసుకు వచ్చి మంచి పని చేసారని, లేకపోతే ఆమె ప్రాణాలు దక్కేవి కావుఅని అన్నారు.
ఆమె గురించి వాళ్ళ వాళ్ళకి తెలియ పరచమని చెప్పి, ఆమెకి ఎలా ఉందో నాకు కూడా ఇంఫాం చేయమని చెప్పి నేను ఆఫీసుకి బయలుదేరాను.
ఎందుకో గాని ఇంత లేట్ గావెళుతున్నానని భయంగా కాని, బాస్ ఏమంటాడో అని కాని, కొలీగ్స్ వింటారేమోననే భయం కానీ ఏమీ లేవు నాలో. ఎంతో సంతృప్తిగా అనిపించింది. నేను కూడా అందరిలాగే ఆమెని అక్కడ వదిలేసి వెళితే ఈరోజు ఆఫీసుకి సమయానికి వెళ్లగలిగేదాన్నేమో కాని ఆ గిల్టీ ఫీలింగ్ నాలో ఉండి పోయేది ఎప్పటికీ.
పూర్తిగా రెండు గంటలు లేట్. బాస్ నుండి పిలుపు రానే వచ్చింది. విచిత్రంగా నాలో ఏ విధమైన తత్తరపాటు లేదు. బాస్ నన్ను చూసి ఏమీ అనలేదు. సింపుల్ గా నా చేతిలో సస్పెన్షన్ ఆర్డర్స్ పెట్టాడు. మూడు నెలల పాటు నేను విధులకు రావలసిన అవసరం లేదని దాని తాత్పర్యం.
నేను జరిగిన విషయం ఆయనకి చెపితే ఆయన కోపం నషాళానికి అంటింది. అందరిని ఉద్ధరించే ఠేకా ఏమన్నా తీసుకున్నవా నువ్వు? అని మండిపడ్డాడు. ఇంతకు మునుపు కూడా ఇలాంటి సంఘ సేవా కార్యక్రమాల వలన లేట్ ఐన దాఖలాలు ఉన్నాయ్ లెండి నాకు.
ఈ మూడు నెలలు ఇంటి మార్ట్ గేజ్ ఎలా పే చేయాలి, పిల్లల స్కూల్ ఫీసెస్ ఎలా కట్టాలి ఇలా ఆలోచించుకుంటూనే ఇంటికి చేరుకున్నాను. సాయంత్రం అయింది. ఈయన, పిల్లలు రానేవచ్చారు. ఈయనికి జరిగిన విషయం చెప్పి లెటర్ చేతిలో పెట్టాను. విచిత్రంగా ఈయన ఏమీ అనలేదు. అందరూ మాకు సంబంధం లేదని వెళ్ళిపోతే ఎలా, మంచి పని చేసావు. హాయిగా రెస్ట్ తీసుకో. ఈ మూడు నెలలు అన్నారు నవ్వుతూ.
మరుసటి రోజున హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది ఆ అమ్మాయి క్షేమం గానే ఉందని. వాళ్ళ పేరెంట్స్ మీ అడ్రస్, ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, ఇవ్వవచ్చా అని అడిగారు. మీ ఇష్టం, ఇస్తే ఇవ్బండి, నాకేమి అభ్యంతరం లేదని చెప్పాను. సాయంత్రం వేళ అయింది. అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. మావారు వెళ్లి తలుపు తీశారు. చారుమతి గారి ఇల్లు ఇదేనా అని ఎవరో అడుగుతున్నారు (అయ్యో, ఇప్పటి దాకా నా పేరు చెప్పనేలేదుకదండీ. నా పేరు చారుమతి). ఈ గొంతు ఎక్కడో విన్నట్లువుంది ఏమిటా అని బయటకి వచ్హాను. ఎదురుగుండా మా బాస్, అతని భార్య, వాళ్ళ అబ్బాయి నిలబడి ఉన్నారు. ఒక్క క్షణం నాకు ఏమీ తోచలేదు. వాళ్ళని లోపలికి రండి అని ఆహ్వానిస్తూనే నా మనసు పరిపరి విధాల పరిగెడుతోంది. కొంపతీసి ఉద్యోగం లోంచి తీసేస్తున్నానని చెప్తాడా ఏంటి, దానికి కుటుంబం తో సహా మా ఇంటికి రావలసిన అవసరం లేదు ఆయనకి. ఒక్క ఫోన్ కాల్ చాలు, మరి ఎందుకు వచ్చినట్లు అని తర్జన భర్జనలు పడుతున్నా మనసులోనే. నా సందేహం తీరిపోయింది ఆయన మాటలతో.
ఆ రోజు నేను హాస్పిటల్ లో చేర్పించింది వాళ్ళ అమ్మాయినేనని వాళ్లిద్దరూ నా చేతులు పట్టుకుని కళ్ళ నీళ్ళతో నాకు కృతజ్ఞతలు తెలియ చెప్పారు. నా కళ్ళు తెరిపించావమ్మా నువ్వు, ఎప్పుడు డిసిప్లిన్ అని, పక్కవాడి ప్రాణం పోతున్నా నీకెందుకు సమయానికి ఆఫీసుకి రావాలని లెక్చర్స్ఇచ్చేవాడ్ని. నాలాగే నువ్వు కూడా అనుకుంటే ఈరోజు మా అమ్మాయి బ్రతికేది కాదు. ఆరోజు నువ్వు చెప్పినది కూడా వినకుండా నిన్ను సస్పెండ్ చేసినందుకు సిగ్గు పడుతున్నానమ్మా, నన్ను క్షమించు అన్నారు. నీలాంటి మంచి వాళ్ళు ఉండబట్టే ప్రపంచంలో ఇంకా మంచితనం బ్రతికి ఉంది అనిచెప్పి నా చేతిలో ప్రమోషన్ ఆర్డర్ పెట్టి వెళ్లారు.