మంచి రోజులు - ఎన్ ‌‌‌వి.రామశేషు

good days

సోఫాలో కూర్చుని భర్త రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది సుజాతమ్మ. కొంత సేపటికి గేట్ తీసుకుని లోపలికి వచ్చాడు భర్త ప్రసాద రావు. వస్తూనే సుజాతమ్మ వైపు చూసి "ఏమైంది అలా ఉన్నావు." అన్నాడు.

"ఏమండీ, అక్కయ్య మనవడి పెళ్లి కి వెళ్తానండీ." అడిగింది ఆతృతగా.

"ఏమిటి వెళ్ళేది? ఆ పెళ్లి కి వాళ్ళు వస్తారు, తెలీదా." అడిగాడు.
"అందుకేనండీ. వాడిని చూసి చాలా కాలమైంది. ఒక్కసారి చూడాలని మనసు లాగుతోంది. వాడితో మాట్లాడను. దూరం నుంచి చూస్తాను. అంతే!" ఆమె కళ్ళల్లో నీళ్ళు ధారగా కారుతుంటే అడిగింది.

"నువ్వు, వాడు మాట్లాడుకోరు. కానీ వాడు నిన్నేమైనా అంటే తట్టుకోగలవా. వాడిని చూసి పలకరించకుండా ఉండగలవా!" ఆయన గొంతులో బాధ సుడులు తిరుగు తూంది.

"ఫర్వాలేదు. ఏదైనా తట్టుకుంటాను. కానీ ఒక్క సారి వాడిని చూడాలని ఉంది." ఆవిడ కళ్ళల్లో నీళ్ళు ధారగా కారుతున్నాయి.

"సరే, నీ ఇష్టం. కానీ జాగ్రత్త. నేను ఊరు వెళ్తున్నాను. తప్పని పరిస్థితిలో. నేనున్నా కొంచెం ఫర్వాలేదు. కానీ నేను కూడా రాలేని పరిస్థితి." అన్నాడు ప్రసాదరావు.

"నాకు తెలుసు. మీరు రాలేరు. మీరు ఊరు వెళ్లి తీరాలి కదా. మరైతే నేను వెళ్ళనా." అడిగింది సుజాతమ్మ.

"సరే." అన్నాడు ప్రసాదరావు కొంత అయిష్టంగానే.
ఆ రాత్రి ఇరువురికీ నిద్ర లేదు. ఎవరి ఆలోచనల్లో వారున్నారు.
ఆరోజే పెళ్ళి. పెళ్ళికి వెళ్ళింది సుజాతమ్మ. అందరినీ ఆ‌ప్యాయంగా పలుకరిస్తూ సందడిగా పందిరంతా తిరిగింది. ఇంతలో దూరం నుంచి వస్తున్న వ్యక్తి ని చూసి చటుక్కున పదిమంది మధ్యలోకి వెళ్ళి కూర్చుంది.

అప్పుడే పెళ్లి జరుగుతున్న హాలులోకి అడుగు పెట్టిన విశ్వం తన స్నేహితుల‌కోసం అటు ఇటు చూసాడు.

ఇంతలో తన భుజం మీద చెయ్యి వేసి ఎవరో లాగడంతో వెనక్కి తిరిగాడు. తన దూరపు బంధువు నారాయణ రావు. వరుసకు మామయ్య అవుతాడు.

"ఏమోయ్ విశ్వం. నిన్ను చూసి చాలా కాలం అయింది. మా చెల్లి, అదే మీ అమ్మ, సుజాతమ్మ ఎలా ఉంది." అన్నాడు.
"చచ్చి పోయింది." ఆయనకు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడ నుండి కదిలాడు విశ్వం.

అక్కడికి దగ్గరలో మంది మధ్యలో కూర్చున్న సుజాతమ్మ తలదించుకుంది. పచ్చని మేనిఛాయతో ఆకుపచ్చని పట్టుచీర తో, నుదుట పెద్ద కుంకుమ బొట్టు తో చూడగానే చేతులెత్తి నమస్కరించాలి అనిపించేలా ఉన్న ఆ అరవయ్యేళ్ళ సుజాతమ్మ మనసు విలవిలలాడింది

తలవంచి కూర్చున్న ఆమె కంటినుండి వెచ్చని కన్నీటి బొట్లు ఆమె ఒడిలో రాలి పడ్డాయి. ఇంతలో ఆ నారాయణరావు ఆమెని చూడనే చూసాడు.

"ఏవమ్మా సుజాతమ్మా, నువ్వు ఇక్కడే ఉన్నావా. మరి నీ కొడుకు విశ్వం ఏంటి అలా మాట్లాడతాడు." అన్నాడు ఆశ్చర్యంగా.

"అన్నయ్యా, కొంచెం అలా వెళ్ళి మాట్లాడుకుందాం, రా." అంటూ కొంచెం ఖాళీ గా ఉన్న చోటికి తీసుకెళ్ళింది సుజాతమ్మ.

"బావ ఎక్కడా, తను రాలేదా." అనడిగాడు నారాయణ రావు.

"లేదు. ఆయన ఊరెళ్ళారు, రాలేదు. నువ్వు ఈమధ్య అయిదారేళ్ళ నుండి ఇటువైపు లేవు కదా. కొడుకు దగ్గరికి ఢిల్లీ వెళిపోయావేమో, ఎప్పుడొచ్చావు." ఎదురు ప్రశ్నించింది సుజాతమ్మ.

"అవును. మా అబ్బాయి తో ఢిల్లీ వెళిపోయాక మళ్ళీ ఇటు రావడం కుదర లేదు. మీ వదిన కి బాగులేక పోవడం, వాడికి విదేశాల్లో 2 సంవత్సరాలు ఉండాల్సి రావడం తో కోడల్ని, మనవల్ని, మీ వదినని చూసుకోవడం తో సరిపోయింది. ఇంతకీ నీ విషయం చెప్పు. ఏం జరిగింది? విశ్వం ఎందుకలా అన్నాడు." నారాయణ రావు నిలదీసి నట్లుగా అడిగాడు.

"అన్నయ్యా, పెళ్ళింట్లో ఈ విషయాలు మాట్లాడితే బాగుండదు. మనం భోజనమయ్యాక మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం." అంది సుజాతమ్మ.

"సరే." అని పెళ్ళి వారితో మాట కలుపుతూ వెళ్ళి పోయాడు నారాయణ రావు.

భోజనాలు అయ్యాక ఇద్దరూ సుజాతమ్మ ఇంటికి వెళ్ళారు. తాళం తీసుకుని లోపలికి వెళ్ళాక మంచినీళ్ళు ఇచ్చి ఎదురుగా కూర్చున్న సుజాతమ్మ ని చెప్పమన్నట్లుగా చూసాడు నారాయణ రావు.

"అన్నయ్యా, నీకు అన్ని విషయాలు తెలుసు. నా జీవితంలో జరిగిన ప్రతి సందర్భంలో నువ్వు ఉన్నావు. నీకు తెలియనిది ఏదీ లేదు. ఏ విషయమైతే వాడికి తెలియనివ్వ కూడదు ఆనుకున్నామో ఆ విషయం వాడికి తెలిసింది. ఏ ప్రళయం మా జీవితాల్లో రాకూడదని కోరుకున్నామో అది రానే వచ్చింది." అంది కన్నీళ్ళతో సుజాతమ్మ.

"ప్రళయం రావడం ఏమిటి? ఇదెలా జరిగింది? వాడికి ఆ విషయం‌ ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు?" ఆతృతగా అడిగాడు.

"వాడికి ఏ లోటూ రాకుండా పెంచాం. వాడికి నచ్చిన చదువు చదివించాం. నచ్చిన పిల్లనిచ్చి పెళ్లి చేశాం. అంతా సవ్యంగా జరుగుతోంది అని సంతోషంగా ఉన్నాం. కోడలు మాతో బాగానే ఉంటుంది. వాడికి కొడుకు, కూతురు పుట్టారు. పెద్దవాళ్ళు అవుతున్నారు. ఆనందంగా గడుపుతున్న సమయంలో ఫ్రెండ్ ఇంట్లో పెళ్లి అని పిల్లలను మా దగ్గర వదిలి వెళ్ళారు. మూడు రోజుల తర్వాత వచ్చి ఒక పూట అంతా మాట్లాడలేదు. పిల్లలు స్కూల్ కి వెళ్ళాక విశ్వం నా దగ్గరకు వచ్చి 'నీ ముఖం చూడడానికి అసహ్యంగా ఉంది. మీ ఇద్దరినీ నేను భరించలేను. మేం ఇక్కడ నుండి వెళ్లిపోతున్నాం' అని‌ చెప్పి బైటికి వెళ్ళి పోయాడు. వాడిని బైటికి పంపి ఇబ్బందుల పాలు చేయడం ఇష్టం లేక ఆ మరునాడు ‌మేమే వాళ్ళని వదిలి దూరంగా వచ్చేశాం." అంది సుజాతమ్మ ధారగా కారుతున్న కన్నీళ్ళతో.

"కనీసం నిన్ను ఏమీ అడగలేదు. నీ మాట వినిపించుకోలేదు. అవునా." అడిగాడు నారాయణ రావు.

"అవును. నేనే ఉండబట్ట లేక కోడల్ని అడిగాను. తను చెప్పింది. వీళ్ళు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పక్కింట్లో ఒక పెద్దాయన ఉన్నాడట. ఆయనని పరిచయం చేస్తానని ఫ్రెండ్ వాళ్ళింటికి తీసుకువెళ్ళాడట. అక్కడ నాది ఆనంద్ ది, తర్వాత వాడి చిన్నప్పటి ఫొటో చూసి అడిగాడట, 'ఎవరివి ఈఫొటోలు ' అని. దానికి ఆ పెద్దాయన అవి తన కొడుకు, కోడలు, మనవడివి అని చెప్పాడట. ఎక్కడున్నారంటే 'కోడలు చంటివాడిని తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళి పోయి, వేరే పెళ్లి కూడా చేసుకోవడంతో, తన కొడుకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు' అని చెప్పాడట. ఆ మాటలు వీడి మీద బాగా పని చేశాయి అన్నయ్యా." అంది సుజాతమ్మ గొంతు పూడుకు పోతూంటే.

"అయినా, ఇన్నాళ్లు పెంచిన తల్లిని ఒక్క మాట కూడా అడగకుండా, వాడి నిర్ణయం వాడే తీసుకుంటాడా. ఇదెక్కడి న్యాయం."  అన్నాడు నారాయణ రావు కోపంగా.

"అవతలి వాళ్ళు ఏం చెప్పారో, ఎలా చెప్పారో, ఎలాంటి విష బీజాలు వాడి మనసులో నాటారో, నా మీద అంత ద్వేషం పెంచుకున్నాడు. నా ముఖం చూడటానికి ఇష్టపడటం లేదు. మా నీడనే భరించలేక పోతున్నాడు. నువ్వే విన్నావు గా, నేను వాడి దృష్టిలో చనిపోయాను." ముఖం చేతులతో కప్పుకొని ఏడ్చేసింది సుజాతమ్మ.

"బాగుంది. ఎవరో ఏదో చెప్తే, కన్నతల్లి అని కూడా చూడకుండా అనుమానించి వెళ్ళగొడతాడా. కనీసం వివరం తెల్సుకోవద్దా. ఏంటి ఈ పిల్లలు. రాను రాను ఇలా తయారవుతున్నారు. సరే. నా ప్రయత్నం నేను చేస్తాను." అన్నాడు నారాయణ రావు.

"నాకు నమ్మకం లేదన్నయ్యా." నిరాశ గా అంది సుజాతమ్మ.
"సరే చూద్దాం." అని ఆయన వెళ్ళి పోయాడు.కొద్ది రోజుల తర్వాత ప్రసాదరావు వరండాలో కూర్చుని పేపర్ చూస్తూండగా గేట్ శబ్దం కావడంతో తలెత్తి చూశాడు. వస్తున్న వారిని చూసి ఒక్క క్షణం తన కళ్ళని తానే నమ్మలేక పోయాడు. వచ్చింది విశ్వం.

వెంటనే లేచి నిలబడగానే విశ్వం వచ్చి కాళ్ళ మీద వాలి పోయి "క్షమించండి నాన్నా, మిమ్మల్ని , అమ్మని చాలా బాధ పెట్టాను." అంటూండగానే సుజాతమ్మ బైటికి వచ్చింది.

విశ్వం "అమ్మా" అంటూ ఆమెను చుట్టేసి "నన్ను క్షమించమ్మా." అన్నాడు.

ఇంతలో నారాయణరావు లోపలికి వస్తూ "చెప్పానా, తీసుకొస్తానని. తీసుకొచ్చాను చూడు." అన్నాడు.

"రా అన్నయ్యా."అంటూ సుజాతమ్మ, "రా బావా" అంటూ ప్రసాదరావు ఆనందంగా ఆహ్వానించారు.

"నీకు తెలుసా, ఆయన వీడికి ఏం చెప్పాడో, నువ్వు, బావా ప్రేమించుకున్నారట. మీ నాన్న ఒప్పుకోకుండా వాళ్ళ అబ్బాయిని నీకు బలవంతంగా కట్టపెడితే నీకు అతనంటే ఇష్టం లేక పిల్లాడు పుట్టినా లెక్క చేయకుండా బావతో లేచిపోయి మీ పుట్టింటిది, ఆత్తింటిది పరువు తీసేశావుట. అది భరించలేక మీ అమ్మా, నాన్న, నీ భర్త ఆత్మహత్యలు చేసుకున్నారుట. ఇంతమంది చావులకు నీవే కారణం అని‌ వాళ్ళందరూ రాసిన ఉత్తరాలు చూపించాడట."

సుజాతమ్మ, ప్రసాదరావు నిశ్చేష్టులై చూడసాగారు.

"అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసా. ఆయన నిన్ను వెళ్ళగొట్టినా, నీ విషయాలన్నీ తెలుసుకొంటూనే ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు దెబ్బ కొట్టాలని నిర్ణయించు కున్నాడు. వీడి స్నేహితుని ఇంట్లో వీడి ఫొటో చూసి , తన కొడుకు పోలికలు ఉండడం తో గుర్తు పట్టాడు. మిగిలిన విషయాలు స్నేహితుని ద్వారా తెలుసు కున్నాడు. అందుకే వీడు వస్తాడని మీ ఫొటోలను బైట పెట్టి నాటకం ఆడాడు, దుర్మార్గుడు." అన్నాడు నారాయణరావు కోపంగా.

"అవునమ్మా. ఆ రుజువులు, సాక్ష్యాలు చూసి గుడ్డిగా నమ్మానమ్మా. ఆయనని ఒంటరిని చేశేసావని, దుఃఖం లో కూడా పట్టించుకో లేదని చెప్పాడమ్మా ఆయన. క్షమించమ్మా, నిజానిజాలు తెలుసుకోకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను." అన్నాడు విశ్వం కన్నీళ్ళతో.

"మామయ్య అన్ని విషయాలు చెప్పారమ్మా. నా మొదటి పుట్టిన రోజు కోసం అమ్మమ్మ, తాతయ్య వస్తుంటే వాళ్ళని స్టేషన్ నుండి తీసుకు రావడానికి వెళ్ళి నప్పుడు, వాళ్ళు ముగ్గురు వస్తున్న ఆటో ఏక్సిడెంట్ అయి అక్కడికక్కడే చనిపోయారని, తర్వాత ఆయన నిన్ను శని అని ఇంటి నుండి వెళ్ళగొడితే నారాయణరావు మామయ్య ఆదుకుని, తానే తన మామయ్య కొడుకు, బావకిచ్చి పెళ్ళి చేసానని చెప్పారమ్మా." అంటూ మళ్ళీ తాను తెలుసుకున్న విషయాలు చెప్తూ  "అంతే కాదమ్మా, ఏక్సిడెంట్ అయిన రోజు పేపర్లో ఫొటోలతో సహా ఉన్న వార్తను చూపించారమ్మా, మామయ్య" అన్నాడు విశ్వం మళ్ళీ.

సుజాతమ్మ, ప్రసాదరావులు నారాయణరావు వైపు చూసి కన్నీళ్ళతో చేతులు జోడించారు.

"బావా, మా జీవితాల్లో మళ్ళీ మాకు మంచి రోజులను తీసకొచ్చావు. నీకెప్పటికీ ఋణపడి ఉంటాం." అన్నాడు ప్రసాదరావు.

"అవునన్నయ్యా, ఆయన అన్నది నిజం. నీ వలనే మళ్ళీ మా జీవితాల్లో మంచిరోజులు వచ్చాయి." అంది సుజాతమ్మ.

"ఛ, ఛ అదేంటమ్మా, ముందు నుంచి మీగురించి తెల్సిన వాణ్ణి, మీ జీవితాలు ముడి పెట్టిన వాణ్ణి. నేను కాక ఎవరు బాధ్యత వహిస్తారు?" అన్నాడు నారాయణరావు చిన్నగా నవ్వి.

"ఏరా విశ్వం, నీ అనుమానాలు అన్నీ తీరిపోయి నట్లేనా. ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా." అనడిగాడు నారాయణరావు విశ్వాన్ని.

"అయ్యో, మామయ్యా, ఇప్పటికే నేను చేసిన దానికి చాలా సిగ్గు పడుతున్నాను. ఇంకా నన్ను అలా అనకండి." అన్నాడు ‌బాధపడుతూ.

"దానికేముంది విశ్వం, కొన్నిసార్లు మనని మనమే నమ్మలేం. గతంగతః అనుకోండి. ఇంక నుంచి హాయిగా కల్సిమెల్సి ఉండండి. మీ బాగు కోరే వాళ్ళలో నేను ఒకడిని. నా మీద నమ్మకం ఉంచి ఇంక హాయిగా ఉండండి, సరేనా. ఇంక వెళ్తాను. ఇంతదూరం నన్ను దేవుడు ఎందుకు తీసుకు వచ్చాడా, అనుకున్నాను. పోనీ, వచ్చినందుకు మీకైనా ఉపయోగ పడ్డాను. వచ్చేవారం ఢిల్లీ వెళిపోతున్నాను. రేపు మా అక్కయ్య ఊరెళ్ళి, ఆ తర్వాత కలవాల్సిన వాళ్ళని కల్సి వెళ్ళి పోవాలి." అన్నాడు నారాయణ రావు

ఇంతలో కాఫీ, ఉప్మా తీసుకుని సుజాతమ్మ వచ్చింది.టిఫిన్, కాఫీ తీసుకుని నారాయణరావు సంతోషంగా శెలవు తీసుకున్నాడు.