అసలు సంగతి - పద్మావతి దివాకర్ల

secrete

ఆ రోజు ఒకటో తారీఖు కావటం మూలాన బ్యాంకు  చాలా రద్దీగా ఉంది.  మామూలుగా బ్యాంక్‌తో నిత్యం లావాదేవీలు జరిపే వ్యాపారులు, ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగస్తులే కాకుండా నెలవారిగా పించను తీసుకునే వాళ్ళతోనూ ఆ రోజు బ్యాంకు  సందడిగా ఉంది.  పెన్షన్ తీసుకునే వాళ్ళలో చాలా మంది బాగా వృద్ధులు, నిరక్షరాస్యులు, మహిళలు.

రామారావు తన వద్దకు వచ్చినవాళ్ళ పనులు చకచకా చేస్తున్నాడు.  ఎంతపని ఉన్నా ఓర్పు వహించి పెదవులపై చిరునవ్వు చెదరకుండా, విసుగు చెందకుండా మధ్యమధ్య కష్టమర్లతో  మాట్లాడుతూ వారి వారి అవసరాలు చూస్తున్నాడు.  మధ్యమధ్య అతని వద్దనున్న జూనియర్ అసిస్టెంట్లు అతన్ని తమ సందేహాలడుగుతున్నారు.  పింఛును తీసుకోవడానికి వచ్చిన వృద్ధులు ఓ వైపు లైన్‌లో ఉన్నారు  డబ్బులు తీసుకొనే విత్‌డ్రా ఫాం మీద అతని సమక్షంలో వేలిముద్ర వేయించుకోవడానికి.  వచ్చిన కొత్తలో రామారావుకి పాస్‌బుక్‌లో ఫోటోతో వాళ్ళని చూసి వాళ్ళని పోల్చడానికి కొద్దిగా సమయం పట్టేది.  రెండు మూడు నెలలు గడిచాక ఆ పెన్షనర్ల మొహాలు అన్నీ బాగా గుర్తుండి పోవడంతో క్షణాల మీద వాళ్ళ పని పూర్తైపోతోంది.  వాళ్ళపని వేగంగా పూర్తైపోవడంతో వాళ్ళుకూడా సంతోషంగానే ఉంటున్నారు. కొంతమంది వృద్ధులు ఈ పరిచయంకే రామారావుని కుశల ప్రశ్నలు వేస్తున్నారు.  అతని గురించి వివరాలు తెలుసుకొని వాళ్ళ స్వంత విషయాలు కూడా ఆత్మీయులులానే చెప్తున్నారు.   తనుకూడా వాళ్ళకి తగిన జాగ్రత్తలు చెప్తూనే ఉంటాడు.  బ్యాంక్‌లో విపరీతమైన రద్దీ ఉన్నప్పుడు అదే అదునుగా చాలా రకాల మోసాలకు పాల్పడుతూ ఉంటారు కొంతమంది అసామాజిక వ్యక్తులు.  కొంతమంది అదును చూసి డబ్బు లాక్కుపోయేవారుంటే, మరికొంతమంది మాయమాటలు చెప్పి మోసగించే వాళ్ళుంటారు.  అందుకే డబ్బులు తీసుకోవడానికి వచ్చిన వృద్ధుల వెంట వాళ్ళ వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో కనుక్కుంటూ ఉంటాడు.

ఇంతలో ఓ వృద్ధురాలిని నడిపించుకొని మధ్యవయస్కురాలు ఒకామె తీసుకువస్తున్నది.  ఆ వృద్ధురాలు సరిగ్గా నడవలేకపోతోంది.  అందుకే వృద్ధురాలిని పట్టుకొని జాగ్రత్తగా నడిపించుకొని తీసుకొని వస్తోంది ఆమె. ఆమె వయసు ఎనభై సంవత్సరాలు దాటి ఉంటాయి. ఆమెని ఇంతకు ముందు కూడా చూసి ఉండటంతో పలకరింపుగా నవ్వాడు రామారావు. పాస్‌బుక్ చేతిలోకి తీసుకొని పేరు చూసాడు.  ఆమె పేరు 'రాములమ్మ'. ఆవిడని తన ఎదురుగానున్న కుర్చీలొ కూర్చోమని వేలిముద్ర తీసుకొని ఆమె పేరు రాసి సంతకం చేసి ఇచ్చాడు.  అక్కడ్నుంచి లేచి నిలబడి రెండు చేతులు ఎత్తి రామారావుని దీవించి వెళ్తూన్న రాములమ్మని  నడిపించుతూ తీసుకెళ్ళింది ఆమె కూడా వచ్చినామె.

'ఆమె ఎంత అదృష్టవంతురాలు, వెంట వచ్చిన ఆమె అవిడని ఎంత జాగ్రత్తగా తీసుకు వెళ్తోందో! బహుశా ఆ వృద్ధురాలి కూతురేనేమో! చాలా మంది వాళ్ళ స్వంత తల్లితండ్రులను అసలు పట్టించుకోరు. ఇలాగ ఆప్యాయంగా చూసుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళిద్దరినీ చూస్తూ మనసులో అనుకున్నాడు రామారావు.

ఆ తర్వాత మళ్ళీ పని ధ్యాసలో పడిపోయాడు రామారావు.

సాయంకాలం వరకూ అలాగే ఉన్నారు బ్యాంక్‌లో జనం.  అసలు చాలా మంది పెన్షనర్లుకి నెలలో మొదటి వారం, అందులో ఒకటో తారీఖు ఓ పెద్ద పండుగరోజు.  చాలా మందికి ఆ ఒక్కరోజు తప్పితే బయటకి రావడానికి వీలు కాకపోవచ్చు.  ఆ ఒక్కరోజు తమకి తెలిసిన వారితోను గడపడం, ఒకరి మంచి చెడ్డలు ఇంకొకరు తెలుసుకోవడంతో వాళ్ళకి సమయమే తెలియదేమో మరి.  అందుకే వాళ్ళ పని పూర్తైనా కూడా ఇంటికి వెళ్ళకుండా తమ పాత స్నేహితులని కలసుకొని తనివి తీరా మాట్లాడడానికి ఆ బ్యాంక్‌నే ఒక వేదికగా వినియోగించుకుంటారు.

చాలా మంది వృద్ధుల పెన్షన్‌ డబ్బుల కోసమే  వాళ్ళ తల్లితండ్రులని ఆ ఒక్క రోజు ఎలాగోలా బ్యాంక్‌కి తీసుకు వస్తారు. కొంత మందైతే వాళ్ళ డబ్బులు లాక్కొని మళ్ళీ ఒకటో తారీఖు వస్తేనే గాని వాళ్ళ మొహాలు తమ తల్లితండ్రులకి చూపించరు.  ఈ విషయం తెలిసినా తనేం చేయలేడు.  ఎవరో కాని ఆ వృద్ధురాలు రాములమ్మని ఆమె కూతురు చూసుకున్నంత ఆప్యాయంగా చూసుకోరని మాత్రం అనుకున్నాడు రామారావు మనసులో. 

ఇలా ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ ఒకటో తారీఖన వచ్చిన ఆ వృద్ధురాలు రాములమ్మ వెంట ఈ సారి ఇంకెవరో అబ్బాయి వచ్చాడు, ప్రతీసారి ఆమెని జాగ్రత్తగా నడిపించి తీసుకొచ్చే ఆమె రాలేదు.  ఇప్పుడు ఆమెతో వచ్చిన కొత్త మనిషిని ఇంతకు పూర్వం రామారావెప్పుడూ చూడలేదు.  అదే ఆమెని అడిగాడు.

"ఏం అవ్వా!  నీతో వచ్చిన ఈ అబ్బాయెవరు?  ఇతన్ని ఇంతకు ముందు చూడలేదే?" అని అడిగాడు రామారావు యధాలాపంగా.

"ఈ అబ్బాయి నా మనవడు దొరా, పేరు రాజు!"  అంది రాములమ్మ వణికే గొంతుతో.

“మరి ప్రతీసారి నీతో వచ్చే ఆమె, అదే… నీ కూతురు రాలేదేమీ ఇవాళ?" అడిగాడు ఉండబట్టలేక.

"ఆమె నా కూతురు కాదు దొరా!  ఆమె మా వీధిలో ఉండే వడ్డీ వ్యాపారం చేసుకొనే నీల." అందామె బోసినవ్వు నవ్వుతూ.

నమ్మ లేక పోయాడు రామారావు ఆ మాటవిని.

"ఆదేమిటి!  ఆమె నీ కూతురు కాదా!  ఆమె నిన్నంత జాగ్రత్తగా నడిపించి తీసుకు వస్తూంటే నీ కూతురనుకున్నాను." నొచ్చుకుంటూ అని, "ఏది ఎమైనా, ఆమెది అందరికీ సహాయం చేసే మంచి స్వభావమనుకుంటా." అన్నాడు రామారావు విత్‌డ్రా ఫారంపై ఆమె వేలిముద్ర తీసుకుంటూ.

అప్పుడు నోరువిప్పాడు రాములమ్మతో వచ్చిన ఆమె మనవడు.

"మా నాయనమ్మ అప్పు కోసం బ్యాంక్ పాస్‌బుక్‌ని ఆవిడ వద్ద తాకట్టు పెట్టింది నెలకి పది రూపాయల వడ్డీ మీద.  అందుకే ఆవిడ ప్రతీ నెల ఒకటో తారీఖున తన అప్పు వాయిదా వసూలు చేసుకోవడానికి మా నాయనమ్మని వెంటబెట్టుకొని బ్యాంక్‌కి వచ్చేది.  నేను కూడా వస్తానన్నా ఒప్పుకునేది కాదు. బాకీ వాయిదా వసూలు చేసుకొని మా ఇంటివద్ద దిగపెట్టేది.  కిందటి నెలతో ఆవిడ బాకీ తీరిపోయి, పాస్‌బుక్ మళ్ళీ మా చేతికి వచ్చింది.  అందుకే మా నాయనమ్మకి తోడుగా మళ్ళీ నే వచ్చినా!" అన్నాడు రాజు.

'పాస్‌బుక్‌ని కూడా కుదువ బెట్టి అప్పు ఇస్తారా?' అని దిగ్భ్రాంతి చెందాడు రామారావు.  నమ్మశక్యం గాక, ఆశ్చర్యంగా చూసాడు రాములమ్మ వైపు 'నిజమా!' అన్నట్లు.

"నిజమే దొరా!  నాకున్నది వీడొక్కడే,  ఈ పిల్లగాడికే జబ్బు చేస్తే అప్పు చేసినా!  ఇక అప్పు తీరినది. ఇక ముందు పింఛను తీసుకునేటప్పుడు నా మనవడే నా వెంట వస్తాడు." అందామె.

రాములమ్మతో వచ్చినామె వ్యవహారం చూసి ఆమె కూతురనుకున్నాడు రామారావు.  రేషన్‌ కార్డ్  కుదవ పెట్టడం  గురించి ఇంతకు ముందు విని ఉన్నాడు కాని, బ్యాంక్‌ పాస్‌ బుక్ తాకట్టు పెట్టి అప్పు ఇవ్వడం గురించి ఇదే మొదటి సారి వినడం.  తన అప్పు వసూలు చేసుకోవడానికి ఆ వృద్ధురాలి మీద ఆప్యాయత కురిపించేదన్న మాట!   అదన్న మాట అసలు సంగతి.  అసలు విషయం తెలీక ఆమె ఆ వృద్ధురాలి కూతురని అనుకున్నాడు తను. అయ్యో!  నెలకి పది రూపాయల వడ్డియే! ఎంత మోసం!  పాపం! బ్యాంక్‌ కూడా పెన్షన్‌ లోన్ తక్కువ వడ్డి మీద ఇస్తుందని ఆమెకి తెలియదు కాబోలు.  అందువల్లే ఆమె మోసపోయింది.  ఆ విషయమే వివరంగా చెప్పాడామెకి, ఇక ముందు ఏ అవసరం వచ్చినా బ్యాంక్‌ లోనే పెన్షన్‌పై రుణం తీసుకో వచ్చని, అంతే గాని అలాంటి వాళ్ళ మీద ఆధార పడ కూడదని.  అదే విషయం మిగతా అందరికీ కూడా తెలపాలని, తద్వారా మోసగాళ్ళ ఆట కట్టించాలని అనుకున్నాడు రామారావు ఈ సంగతి విన్నతర్వాత.
        

 

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు