భగవంతుడా! కరుణించవా! - నాగమణి

oh my god grace me

భారత ప్రజానీకానికి ప్రభుత్వం నుండీ , ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారి నుండీ  జారీ చేయబడిన హెచ్చరిక.

కరోనా తీవ్రంగా ప్రబలుతున్న నేపధ్యంలో జాగ్రత్తగా ఉండమని సలహాలు ఇస్తూ,  శరీరంలో రోగ నిరోధక శక్తి లోపించడం వలన కరోనా వస్తుంది కాబట్టీ ,  ఆడు వారు అతిగా శ్రమించి ఇంటి పని చేయడం ద్వారా బలహీనులై ఉండి ఉంటారు. పైగా లాక్ డౌన్ నేపధ్యంలో కూరలేంటీ? , టిఫిన్లు ఏం చేయాలి? సాయంత్రం స్నాక్స్ ఏం తగలెట్టాలి? అను ఆలోచనలతో ప్రశాంతంగా నిద్ర కూడా పోకుండా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు కాబట్టి , ఆడవాళ్ళు శక్తి పుంజుకోవడం కోసం , మరల తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం కోసం దేశం లోని ఆడాళ్ళందరినీ ఇంటి నుండి దూరంగా బయటకు పంపించాలని ఆదేశించడమైనది. 

ఎక్కడ ఉండాలనేది  వారి వారి అభిమతానికి అనుగుణంగా నిర్ణయించుకోవఛ్ఛు. 

నచ్చిన ప్రదేశంలో కుటుంబం నుండి దూరంగా , సంసార భాధ్యతల నుండీ విరమణ తీసుకోవాలి.

వారు ఎక్కడున్నా  పని చేయకూడదనీ , వంటలో వేలు పెట్టరాదనీ వినతి. 

నచ్చిన పుస్తకాలు చదువుతూ పాటలు వింటూ , కధలూ కవితలూ రాసుకుంటూ గడపాలి.

నలుగురు ఆడవాళ్ళు ఒకచోట చేరి కబుర్లు పెట్టినా , ఇరుగమ్మ పొరుగమ్మ సంగతులు మాట్లాడుకున్నా , సీరియళ్ళ సంగతులు ముచ్చటించుకున్నా , చీరలు నగలు అంటూ అలంకరణ లపై శ్రధ్ధ చూపినా వారిపై నాన్ బెయిలబుల్ కేసులు , క్రిమినల్ కేసులు పెడతారని హెచ్చరిస్తున్నాం.
లేదా అంతకంటే కఠినమైన శిక్ష విధించే అవకాశం కూడా కలదు.

క్వారంటైన్ గా పిలవబడు ఈ సరదా కాలక్షేపంలో ఆడవాళ్ళు పదిహేను రోజులు తప్పని సరిగా ఉండాలి(ఇంటి పనిలో సాయం చేసే భర్తలు కల ఇల్లాళ్ళకు మాత్రమే ఈ వెసులుబాటు.)

మంచినీళ్ళు కూడా భార్యతో  అందుకునే  మొగుడు ఉంటే ఆ ఆడవాళ్ళు ఓ నెల పాటు బందీలుగా ఉండక తప్పదు.

తద్వారా భర్తలకు భాధ్యత నేర్పి ఆపత్కాలంలో సంసిధ్ధులుగా ఉండేలా తయారు చేయుటలో దోహద పడవలసింది అని మనవి. 

మైకులో పెద్దగా పోలీసు వారి హెచ్చరికలు వినపడుతున్నాయి.

 నమ్మశక్యం కాక బాల్కనీ లో నుండి తొంగి చూసాను.

వీధీ మధ్యలో  పోలీసు వాను నిలబెట్టి ఉంది.

నాలాగే కొంత మంది ఆడాళ్ళు అయోమయంగా చూస్తూ సందేహ నివృత్తి కోసం పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

విప్పారిన మొహాలతో  , వెలిగిపోతున్న కళ్ళతో పరుగు పరుగున వెనక్కి వచ్చి బట్టల బాగ్ తీసుకుని పోలీసు వాన్ ఎక్కేస్తున్నారు. 

అది నిండగానే మరొక ఖాళీ వాన్ వచ్చి ఆగింది. తోసుకుంటూ , నెట్టుకుంటూ మా వీధి ఆడాళ్ళంతా ఎక్కుతున్నారు.
ఆఖరుకు మా పక్కింటి వనజ ఎత్తుకున్న  చంటి పిల్లాడ్ని కూడా చటుక్కున దింపేసి , మొగుడు బతిమాలుతున్నా వినకుండా , విదిలించుకుంటూ వెళ్ళి వాన్ ఎక్కేసింది.
 వాళ్ళ ఆయన జాలి చూపులు , వెర్రి మొహమూ , కంట తడి కూడా వనజను కరిగించలేక పోయాయి.
"దేవుడల్లే వచ్చారు మమ్మల్ని కాపాడటానికి. మీ ఋణం ఈ జన్మలోతీర్చుకోలేం" అంటూ పోలీసుల చేతులు పట్టుకుని కృతజ్ఞతలు చెబుతున్నారు.
గలగలమంటూ నవ్వుకుంటూ కిలకిలలాడిపోతున్నారు.
ఆ దృశ్యం చూసిన నా ప్రాణం విలవిల లాడి పోతోంది.

"అయ్యో !అయ్యో! నేనూ వస్తున్నా" అనుకుంటూ , ఇంట్లోకి పరుగెత్తి ఓ రెండు జతల బట్టలు బాగులో కుక్కుకుని మెట్ల మీదుగా పరుగెత్తాను. 

ఆఖరు మెట్టు దిగబోతుండగా చీర కాళ్ళకి అడ్డు పడి దబ్బుమంటూ బొక్కబోర్లా పడిపోయాను.

కళ్ళు బైర్లు కమ్మాయి. ఓపిక తెచ్చుకుని లేచి బయటకు వెళ్ళే లోపు వాన్ దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోయింది.
అందరూ వెళ్ళిపోయారు.

నేనూ వస్తాను , ఆగండి , ఆగండీ అంటూ అరుస్తూ వెనకాల పరుగెడుతూ ఉండగానే ఎవరో భుజం పట్టుకుని ఆపేస్తున్నారు.  ఆ బలాన్ని విదుల్చుకుని వెళ్ళ లేకపోతున్నాను.
గింజుకుంటూ ఉండగా
చెంప మీద గట్టిగా ఎవరో కొట్టారు.

ఉలిక్కిపడి లేచాను.
గుండె వేగంగా కొట్టుకుంటోంది.
వళ్ళంతా చెమటలతో తడిసిపోయి ఉంది.

మొహంలో మొహం పెట్టి అదోలా చూస్తున్నారు మావారు.

కలా!

నిజం కాదా! 
భగవంతుడా!
"ఏయ్!
ఏంటా మొద్దు నిద్ర , ఏంటా పలవరింతలు.
అందుకే పగలు పడుకోవద్దని చెబుతాను.
లే! లేచి టీ పెట్టు" ఆర్డర్ వేసి మళ్ళీ తలను టీ వీ లో దూర్చారు.

లేచి నిలబడ్డాను. కాళ్ళు ఒకటే నొప్పులు. 

అడుగు తీసి అడుగెయ్యనివ్వడం లేదు.

వంటింట్లో సింక్ నిండా ఉన్నాయి అంట్లు.

దండాల మీద వేలాడుతూ , వేలాడలేక జారుతూ , జారిపోయి నేలపై జీరాడుతూ బట్టలు మమ్మల్ని మడత పెట్టి సర్దవా అని దీనంగా అడుగుతూ.

గిన్నెలో నానుతూ మినప్పప్పు. కడిగి మిక్సీలో వెయ్యాలి.

"ఏమేవ్!పకోడీ వేస్తానన్నావ్" ఉల్లిపాయలు ఎక్కువేసి , శనగపిండి తక్కువెయ్! కరకరలాడుతూ ఉంటాయి.

అల్లం , మిర్చీ నూరి జీలకర్ర , కొత్తిమీర దట్టించి వేస్తే ఆహా భలే ఉంటాయ్" ఆర్డరు వినపడుతోంది హాల్లో నుండి.

బజ్జీలు వేసి పెడితే చాలదంట దొరలకు.
వాటిని మధ్యకు చీల్చి ,ఉల్లి తరుగు కూరి, నిమ్మరసం పిండి ప్లేటులో పెట్టి మరీ అందించాలంట.పైగా ప్లేటుకు పిండి అంటుకోకూడదంట.


ఇరవై నాలుగు గంటలూ టీ వీ లో కళ్ళెట్టి , టీపాయ్ మీద కాళ్ళెట్టి , సోఫాలో ఒళ్ళెట్టి దర్జాగా ఆయన.

చేతిలో ఫోన్లూ , చెవిలో ఇయర్ ఫోన్లతో నా పుత్ర రత్నాలిద్దరూ..
కాస్త సాయమైనా చేయకపోగా ," నీ ఇంటి పని , నీకు అలవాటైన వంట పని చేసుకోవడానికి ఏడుపెందుకే!"అంటూ ఎద్దేవాలు.

దుఃఖం పొర్లుకొచ్చింది. కళ్ళ నుండి పొంగుతున్న గంగా ప్రవాహాన్ని ఆపుకునే యత్నం చేస్తూ టీ పెట్టాను.

కల వచ్చిందంటే రాదూ! లాక్ డౌన్ ప్రకటించిన దగ్గర నుండీ పని మనిషి కన్నా దారుణమైపోతే బతుకు.

నిక్కుతూ , నీలుగుతూ  పదింటికి వచ్చి గంటలో పని ముగించుకుని వెళ్ళే పని మనిషికి భక్తి శ్రద్ధలతో టీ లు , కాఫీలు , ఒకటో తారీకు కల్లా జీతాలు , రెండో మూడో అప్రకటిత సెలవులుగా( జీతం తో కూడిన)    చెప్పబడు ఆకస్మిక నాగాలు , పాత చీరలు అందుతున్నాయి.

 పండగల్లో దండిగా అప్పచ్చులూ , మామూళ్ళూ ముడుతున్నాయి.

మరి మాకేవి అలాంటి గౌరవాలు? ఆ సన్మానాలు?

అసలు మా ఆయన జేబులో చెయ్యి పెట్టి అచ్చంగా నలభై ఏడు రోజులైంది.

ప్రతి రోజూ షాపుకు వెళ్ళి వస్తూ ఉంటే బిజినెస్ జరిగే రోజుల్ని బట్టి రోజుకు ఇరవై రూపాయల నుండీ వంద వరకూ గిట్టుబాటు అయ్యేది నాకు( అంటే ఆయన వేడి నీళ్ళ జలకాలాటలో మైమరచి ఉన్నప్పుడు మనం పర్సులో చెయ్యి పెట్టే వాళ్ళం అన్న మాట). 

ఇప్పుడా అవకాశమేది? ఆయనకే ఠికానా లేదు. నాకేం గతి?.

షాపింగులు ఎప్పుడైనా చేసుకోవచ్చు.
చీరలు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు.

పెళ్ళిళ్ళూ , పేరంటాలకు ఇవాళ కాకపోతే రేపు పోవచ్చు.
అసలు  ఆదాయ వనరుకు గండి పడిందే! 
మొదటికే మోసం వచ్చిందే!

అయ్యో !
మొగుళ్ళు అలా ఆఫీసులకు పోగానే ఇలా తలుపులేసుకుని దర్జాగా "నేనే మహరాణి" లెవల్లో ఎక్కడి పని అక్కడ పారేసి పుట్టింటోళ్ళకు ఫోన్ చేసి గంట సేపు అత్తారింటోళ్ళ మీద అభాండాలు వేసుకునే ఛాన్సేది? ఫ్రెండ్స్ తో మీటింగులు పెట్టే అవకాశమేది? పక్కింటోళ్ళను తోడు తీసుకుని గుడికో, బడికో అంటూ పోయే దారేది?

అస్తమానూ ఇంట్లో ఉండగలగడం ముందు మా ఆడాళ్ళకే చాతనవదు.

పొద్దస్తమానూ  మొగుడు ఇంట్లోనే ఉంటే ఆ టార్చర్ అనుభవిస్తేనే కానీ తెలియదు.

మందు కోసం గిలగిల కొట్టుకుంటున్న మందు బాబుల కన్నా దారుణం గా ఉంది మా పరిస్థితి.

సరే ఇవన్నీ ఒక ఎత్తు.

పాపం ఇన్నాళ్ళూ హడావిడిగా ఉదయం వేళ   నిలబడి టిఫిన్ గొంతుకు కొట్టుకుని చల్లారిన గుప్పెడు మెతుకులు బాక్సుల్లోవి మధ్యానం వేళ కతికి అలసి సొలసి రాత్రి వేళ కొంపకు చేరుతున్నారులే అని జాలిపడి , ఇంటి పట్టున ఉంటున్నారులే అని సంబరపడి "వేడిగా వడ్డిస్తాను , కమ్మగా తినండి ఈ నాలుగు రోజులు"అన్న పాపానికి కడుపులో నిద్రించే రైసు మిల్లును తట్టి లేపి , పార్టులన్నింటికీ  ఆయిలింగ్ చేసి మరీ నామీదకు సంధించారు.

వేసిన వాయలు వేసినట్లే చప్పరించబడుతున్నాయి ఇడ్లీలు .

చేతులు పడిపోయేలా రుద్దుతున్నాను చపాతీలు.

సుయ్‌ ,  సుయ్ మన్న చప్పుడే కానీ ప్లేటులో కూడా పడకుండా నేరుగా కడుపులోకి పోతున్న దోశలు  కడుపు మండిస్తోంటే
 మారు మాట్లాడలేక పోతున్నాను.
ఇన్నాళ్ళూ లేని ఆకలి ఇప్పుడెలా వచ్చిందో తెలియక నివ్వెర పోతున్నాను.

బాండీల కొద్దీ చేస్తున్న కరకరమనే బంగాళా దుంపల వేపుడు , కిలోల లెక్కన వేగుతున్న గుత్తొంకాయ కూరలు వెన్నపూసలా వాళ్ళు చప్పరించి పారేస్తోంటే, కనీసం అడుగు తుడుచుకోవడానికైనా మిగలకుంటే  కారప్పచ్చడి , చింతపండు రసంతో నా కంచం తడుస్తోంటే కన్నీళ్ళూ కలిపేసుకుంటున్నాను.

"వేడిగా పెడతాను అన్నావుగా అమ్మా!" అంటూ అమాయకంగా మొహాలు పెడుతుంటే ఏమీ అనలేక మిగిలిన చద్దన్నం ఒక్కర్తినే తింటున్నాను.

సాయంత్రాల చిరుతిళ్ళ కోసం 
గుగ్గిళ్ళో , జంతికలో చేయడమే కానీ తినే భాగ్యమే కలగకుంటే ఇలాంటి కలలు రాక ఏమవుతుంది?


అత్తారింటికొచ్చిన కొత్త అల్లుడికి మల్లే ఆయన.
శత్రు దేశానికి దొరికిపోయిన యుధ్ధ ఖైదీలా నేను.

ఏ అమ్మ కలలు కన్నదో , ఏ తల్లి భగవంతుణ్ణి వేడుకుందో "నా భర్తా పిల్లలు ఇంటి పట్టునే ఉంచు స్వామీ" అని.

ఆమె ఇప్పుడు మళ్ళీ తపస్సు ఆరంభించి ఉండాలి దేవుడా! తప్పు చేసాను , మన్నించి నాకు విముక్తి కలిగించు అని.
చాకిరితో ఒళ్ళు అలసీ , పులిసి నడుం వాల్చే వేళ కష్ట సుఖాలు కలబోసుకుందామని స్నేహితురాలికి ఫోన్ చేసాను.

"అంట్లు తోమడం ఇంత కష్టమనుకోలేదే! తాకిన ప్రతి వస్తువు , మంచి నీళ్ళు
తాగిన ప్రతిసారీ గ్లాసులు   కూడా సింక్ లోకి విసిరేదాన్ని.
ఇల్లు తుడవలేకపోతున్నాను.
నడుం విరిగిపోతోందే!
అదృష్టం కొద్దీ వాషింగ్ మెషీన్ కొన్నాం. లేకుంటే చచ్చిపోయేదాన్ని.

జుట్టుకు హెన్నా పెట్టుకోవడానికి కూడా తీరడం లేదు.
మొన్న అన్నయ్య వీడియో కాల్  చేసి 'అచ్చు అమ్మలా ఉన్నావమ్మా'  అన్నాడు తెల్ల జుట్టు చూసి  " అని నిట్టూర్చింది.

దానికి సానుభూతి తెలిపే స్థితిలో కూడా లేను నేను.

అది పెనం పై ఉంటే నేను డైరెక్ట్ గా పొయ్యిలో ఉన్నాను.
ఈ లాక్ డౌన్ కష్టాలు ఎన్నడు తీరతాయో!
ఆఫీసులు స్కూళ్ళు ఎన్నడు తీస్తారో!