పేరు ప్రతిష్ఠలు - డి వి డి ప్రసాద్

name and fame

బ్రహ్మపురమనే పట్టణంలో నివసించే తన చిన్ననాటి స్నేహితుడైన మాధవుడ్ని కలసుకోవడానికి తన గ్రామంనుండి బయలుదేరాడు సదాశివుడు.  ఇద్దరూ చిన్నప్పటి స్నేహితులు.  అయితే సదాశివుడికి పైచదువులు అబ్బక సొంత ఊరిలోనే ఉండిపోయి వ్యవసాయం వృత్తిగా స్వీకరించాడు.  మాధవుడు మాత్రం పై చదువులు చదువుకొని ప్రస్తుతం వైద్యుడిగా పట్టణంలో తన వృత్తి సాగిస్తున్నాడు.  మాధవుడే మధ్యమధ్య ఊరికి పోయి వస్తున్నాడు కానీ, సదాశివుడు మాత్రం పట్టణం వెళ్ళి చాలా ఏళ్ళైంది.  చాలా రోజుల తర్వాత , ఇప్పుడు పట్టణంలో చిన్న పనిపడటంతో పనిలోపనిగా స్నేహితుడ్ని కూడా కలిసినట్లుంటుందని బ్రహ్మపురం బయలుదేరాడు సదాశివుడు.

మాధవుడు ఒకసారి ఊరికివచ్చినప్పుడు పట్టణంలో అతను ఎక్కడుంటున్నాడో ఆ వివరాలు అడిగాడు.  అందుకు మాధవుడు, "నేనుండేది పట్టణమైనా, నువ్వెప్పుడైనా మా ఇంటికి రావడానికి పెద్దగా కష్టపడక్కరలేదు, ఎందుకంటే అక్కడ ఎవరినడిగినా నా ఇంటివివరాలు సులభంగా చెప్పగలుగుతారు.  వైద్యవృత్తి చేస్తున్నాకదా, నా గురించి ఇక్కడవారందరికీ బాగా తెలుసు.  నా పేరు చెప్తే చాలు నా ఇల్లు ఎవరైనా చూపించగలుగుతారు. అయినా నా విలాసం రాసి ఇస్తున్నాను." అని తన ఇంటి వివరాలు రాసి ఇచ్చాడు.

అయితే తీరా పట్నంవచ్చి చూసుకున్నాక మాధవుడి ఇంటివివరాలు తెలిపే కాగితం కనబడలేదు.  'ఇప్పుడెలాగా?' అని మధనపడుతున్న సదాశివుడికి మాధవుడి మాటలు గుర్తుకు వచ్చాయి.  ‘పట్నంలో తన స్నేహితుడు మాధవుడు వైద్యవృత్తిలో మంచి పేరుప్రతిష్టలు తెచ్చుకొని ఉంటాడు. అందుకే బహుశా తన ఇల్లు ఎవర్నడిగినా చూపించగలరని అన్నాడు’ అనుకున్నాడు.  మాధవుడి విలాసం వివరాలు తనవద్ద లేకపోయినా, సులభంగా అతని ఇల్లు కనుక్కోవచ్చని ఆశించాడు సదాశివుడు.  బాడుగబండిలో పట్నంవచ్చిన సదాశివుడు పట్టణంలోకి ప్రవేశిస్తూనే మాధవుడి గురించి అడిగాడు ఆ వైపు వెళ్తున్న ఓ వ్యక్తిని.

ఆ వ్యక్తి సదాశివుడ్ని ఎగాదిగా చూసి, "ఎక్కడికి, వైద్యుడు మాధవుడింటికా?  ఈ బాటమ్మట నేరుగా పోయి కుడి వైపు తిరుగు.  అక్కడో శివాలయం ఉంటుంది, అక్కణ్ణుంచి ఎడమచేతివైపుకి తిరిగి రెండామడలు దూరంపోతే అతని ఇల్లువస్తుంది.  ఇంతకీ ఎందుకు అక్కడికి?" అడిగాడు.

"అతనితో పని ఉంది." అన్నాడు సదాశివుడు.

ఆ వ్యక్తి సదాశివుణ్ణి జాలిగా చూసి ముందుకి సాగాడు.  అతనెందుకలా చూసాడో అర్థం కాలేదు సదాశివుడికి.

వెళ్ళే దారిలో ఇంకో ముగ్గుర్ని అడిగాడు ఎందుకైనా మంచిదని.  అందరూ మాధవుడి ఇంటి దారి ఒకేలా చెప్పినా, ఎందుకో తనని వింతగా చూడటం సదాశివుడి దృష్టి దాటిపోలేదు.  అయినా తన స్నేహితుడు మంచి పలుకుబడిగల వైద్యుడవటం వల్ల అతని ఇంటికి దారి సుళువుగా తెలుసుకోగలిగినందుకు సంతోషించాడు.  మాధవుడికి వైద్యుడిగా మంచి పేరు ప్రతిష్ఠలు ఉన్నందుకు ఆనందించాడు.

శివాలయం వద్దకు చేరుకోగానే ఎందుకైనా మంచిదని మళ్ళీ మరోసారి మాధవుడి ఇంటికి దారి అడిగాడు సదాశివుడు తనకి ఎదురుపడ్డ బాటసారిని.  మొదటి బాటసార్లు చెప్పినట్లే దారి చెప్పి, "అయినా మీరు మాధవుడి వద్దకు కాక అనంతుడనే మరో మంచి వైద్యుడున్నాడు ఇటుపక్క వీధిలో,  అక్కడికి వెళ్ళడం అన్నివిధాలా శ్రేయష్కరం." అన్నాడతను.

ఆ మాటలకి సదాశివుడు నివ్వెరపోయాడు.

"మాధవుడు నా స్నేహితుడు, అందుకే అక్కడికి వెళుతున్నాను, అంతేగానీ వైద్యం కొరకు మాత్రం కాదు, ఇంతకీ ఎందుకలా అంటున్నారు తమరు?" అని అడిగాడు ఆ బాటసారిని.

"ఓహో!  మాధవుడు మీ స్నేహితుడా!  అయితే వైద్యం కోసం అని అనుకున్నాలెండి!  వైద్యం కోసమయితే అతను బొత్తిగా పనికిరాడు.  అతని చేతి మాత్ర వైకుంఠయాత్ర అని మా పట్టణంలో పేరు ఉంది లెండి." అన్నాడు.  ఆ మాటలు విని సదాశివుడు తెల్లబోయాడు.

వైద్యుడిగా మాధవుడికి ఆ పట్టణంలో ఎటువంటి పేరు ప్రఖ్యాతులు  ఉన్నాయో తెలుసుకొని ఆశ్చర్యపోయాడు.  అతని ఇంటిదారి చెప్పిన బాటసారులెందుకు తనని జాలిగా చూసారో అప్పుడర్థమైంది సదాశివుడికి.

ఆ తర్వాత మాధవుడి ఇల్లు ఇంకేం కష్టపడకుండా సులభంగా పోల్చుకొని వెళ్ళాడు.  మిత్రుడు సదాశివుడ్ని చూసి మాధవుడు చాలా సంతోషపడి తన ఇంట్లోకి ఆహ్వానించి, కుశల ప్రశ్నలు వేసి తగిన మర్యాదలు చేసాడు.

భోజనాలయ్యాక విశ్రాంతి తీసునేటప్పుడు ఇద్దరూ కబుర్లలో పడ్డారు.  అప్పుడు, "ఇల్లు పోల్చుకోవటానికి నీకు ఇబ్బందేమీ అవలేదు కదా!" అని స్నేహితుడ్ని అడిగాడు మాధవుడు.

"లేదు మిత్రమా!  అయితే నువ్వు విలాసం రాసిచ్చిన కాగితం పోగొట్టుకున్నాను, అయినా నువ్వన్నట్లు నీ గురించి అడిగి సులభంగానే ఇల్లు కనుక్కున్నాను." అన్నాడు సదాశివుడు.

"అవును మరి!  వైద్యుడిగా నాకు పేరుంది కదా!" గర్వంగా అన్నాడు మాధవుడు.

సదాశివుడు ఒక్క క్షణం మాధవుడివైపు జాలిగా చూసాడు.

"మాధవా!   నిజమే, నీకు వైద్యుడిగా పేరుంది, కాని మంచి వైద్యుడిగా మాత్రం కాదు!   నీ గురించి మీ పట్టణంలో వాళ్ళు చాలా సులభంగా చూపిస్తారంటే ఏమో అనుకున్నాను సుమీ!  నువ్వు వైద్యుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొని ఉంటావని చాలా సంతోషించా, కానీ ఇక్కడికొచ్చాక తెలిసింది నీ గురించి.  నువ్వు మంచి వైద్యుడిగా కంటే చెడ్డ వైద్యుడిగా పేరు పొందావని." అన్నాడు.

ఆ మాటలు విన్న మాధవుడి ముఖం తెల్లగా పాలిపోయింది.

"నీకున్న పేరు ప్రఖ్యాతులు ఈ విధంగా విన్న నాకు చాలా బాధ కలిగింది.  నువ్వు మళ్ళీ గురుశుష్రూష చేసి మంచి వైద్యుడిగా కావలసిన విద్య సాధించి, వృత్తిలో సరైన శ్రద్ధపెట్టి మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకుంటే నా కన్నా సంతోషించేవాడు ఉండడు." అన్నాడు సదాశివుడు.

మిత్రుడి మాటల వలన తన పేరు ప్రతిష్ఠల వెనుకగల రహస్యం అప్పుడు  తెలిసింది మాధవుడికి.

స్నేహితుడి మాటల్లోని నిజాన్ని గ్రహించిన మాధవుడు ఆ తర్వాత అతను చెప్పినవిధంగా చేసి అచిరకాలంలోనే ఆ పట్టణంలో మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నాడు.  ఆ విషయం తెలిసిన సదాశివుడు చాలా సంతోషించి తన మిత్రుడ్ని మనసారా అభినందించాడు.