గొప్ప చిత్రకారిణి - భాగ్యలక్ష్మి అప్పికొండ

great artist

ఆకాశం అరుణ వర్ణాన్ని అద్దుకుంటూ సంధ్యవేళ చల్లని పిల్ల గాలులని మా బాల్కని వైపు ప్రసరింపజేస్తుంది.  నా మనసు ఎప్పటిలానే "ఇక నువు చూసింది చాల్లే సాయంత్రం అయింది నీ వంటింటి సామ్రాజ్యానికి బయలుదేరు" అంటుంది  హెచ్చరింపు ధోరణిలో. అలవాటుగా నా అడుగులు హాల్లో కి పడుతుండగా నా చూపులు కుడివైపు గోడపై అందంగా నవ్వుతున్న చిత్ర రాజంవైపు వాలాయి. ఆ చిత్రం ఎలా ఉందంటే అద్భుతమైన వనంలో దివ్య కాంతులు ప్రసరింపజేస్తున్న ఆశ్రమాన  లతలు, తీగలు  అల్లుకున్న చిన్న కుటీరం.  దూరంగా లీలగా కనిపిస్తున్న కొండలు. ఆ కొండల మధ్య మందహాసం చేస్తూ వన దేవతలా కనిపిస్తున్న సుందరాంగి  శకుంతల వైపు చూస్తున్న సూర్యుడు. పొగడ చెట్టు నీడన గట్టుపై అరమోడ్పు కన్నులతో కూర్చున్న వయ్యారి శకుంతల  తన ఒడిలో ఉన్న  జింకని  ప్రేమగా తన లేలేత మునివేళ్ళతో నిమురుతుంది. చుట్టూ ఉన్న మందార, మంకెన్నలు మూతి ముడుచుకున్నట్టుగా విచ్చుకున్నాయి. కల్లా కపటం తెలియని వెన్నెలంటి కన్నెపిల్ల  తెల్లని నన్ను కాక మిమ్మల్ని ఎందుకు అలంకరించుకుంటుందే అన్నట్టు నఖశిఖ పర్యంతం ఆ సన్నజాజి తీగ శకుంతలని అల్లుకున్న మల్లెలు గర్వంగా  నవ్వుతున్నట్టున్నాయి.

         ఆ చిత్రం చిత్రించినపుడు నాకు శకుంతల అందమైన అడవిలో ఆడుకుంటున్న అల్లరి ఆడపిల్లలా తోచింది. నా పెళ్లి సమయంలో చూసినప్పుడు కాబోయే వరుడికై కలలు కనే కన్నెపిల్లలా అనిపించింది. ఇప్పుడు నాకు పెళ్లీడుకొచ్చిన పిల్లలు. వయసు పెరిగే కొద్దీ కళను ఆస్వాదించే తీరు దానిని అర్థం చేసుకునే ఆలోచనా సరళి కూడా మారుతుంటాయి. నా మనసు ఈనాడు  ఆ చిత్రం పురుడు పోసుకున్న సమయాన్ని పదె పదె గుర్తుకు తెచ్చి  పరుగు పరుగున వెళ్ళి పదహారేళ్ళ వయసు దగ్గర ఆగింది.

            "పదవ తరగతి పరీక్షలు అయ్యే వరకు బొమ్మ లు గిమ్మలు అంటే ఊరుకునేది లేదు" అని  నాన్న హుకుం జారి చేశారు. అందుకే పదవ తరగతి పరీక్షలు అవగానే అప్పటి వరకు దాచుకున్న డబ్బులతో నా చిత్రలేఖన  సరంజామా కొనడానికని ఇంటి బయటకు అడుగు పెడుతుండగా బాబాయి ఎదురు పడి "ఎక్కడికి రా బుజ్జీ?" అని అడిగాడు 
అంతులేని అనురాగాన్ని, ఆప్యాయతని ముద్దు పేరుతో మూటకట్టి తనదగ్గరే అట్టి పెట్టుకుంటుంది పుట్టిల్లు. 

          "ఇక్కడికే బాబాయ్....నే వెళ్తాను" అన్నా వినకుండా
        "నీ కెందుకురా ఆ కష్టం, ఏం కావాలో చెప్పు ...నేనున్నాగా తెస్తాను"  అని  నే చెప్పిన  ఆక్రిలిక్ పెయింట్, నెంబర్ 3 మరియు నెంబర్ 6 బ్రష్ తేవడానికి ఆఘమేఘాలమీద వెళ్ళాడు బాబాయ్.

         నేను వెనుదిరిగి అడుగు గది లోపలికి వేసేలోపే "ఏమే! బుజ్జి బాగున్నావా?" నా జడ లాగి  మరీ కుశల ప్రశ్న అడుగుతూ లోపలికొచ్చాడు  మావయ్య.

           "అమ్మా! మావయ్య వచ్చాడు"  వంటగదిలోకెళ్ళి  కాస్త భయంగా చెప్పాను. "వచ్చాడా!?"  కాస్త చిరాకుగా నిట్టూరుస్తున్నట్టుగా అడిగింది. నా భయానికి బదులుగా నేను చూసుకుంటాలే భయపడకు అన్నట్టు  కనులతోనే  సైగ చేసింది. మా ఇంట సిరులన్ని ఆ కనుదోయి మధ్యలో ఉదయించిన  బాలసూర్యుడి  కుంకుమ  కిరణాలే.

              తన కొంగు సర్దుకుంటూ బయటికి వచ్చి "తమ్ముడు ! బాగున్నావా?. పిన్ని, చిన్నాన్నా , మరదలు ఎలా ఉన్నారు? " అని  అప్పటివరకు ఉన్న చిరాకుకు చిరునవ్వుల రంగును పులిమి పలకరించింది.

           ఇంటి ముందు ఉన్న తులసి కోట  దగ్గర కూర్చుని ఇదివరకే నా వద్ద  ఉన్న కాన్వాస్ పై పెన్సిల్ తో రఫ్ స్కెచ్ గీయడం ప్రారంభించాను, ముందుగా పొగడ చెట్టు నీడన గట్టుపై  కూర్చున్న శకుంతలను గీయనారంభించాను.

      "అక్కా! బావ నీకు విషయం చెప్పానన్నాడు, నువ్వూ ఒక మాట చెప్పెస్తే వాళ్ళకి  చెప్పి సంబంధం ఖాయం చెసేస్తాను" అన్నాడు బిగ్గరగా నవ్వుతూ.

          ఆ నవ్వు నా జీవితానికి చరమగీతం లా అనిపించి, వెగటుగా వికటాట్టహాసంలా వినిపించింది.

          ‌ "అవన్నీ తర్వాత తమ్ముడు, ముందు ఈ టీ తాగు" అని టీ చేతికందించి బల్లపై పై ఫలహారం పెట్టి  ఆ బల్ల అతని ముందుకి నెమ్మదిగా జరిపి పని ఏదో ఉన్నట్టు వంటగదిలోనికి వెళ్ళింది అమ్మ.

           "అమ్మా! " అని  ప్లేటు నిండుగా ఉన్న పకోడిలు మా అమ్మమ్మ చేతిలో పెట్టెలోపె " ఏంటత్త ఎప్పుడూ మా ఇంట్లో నే వుంటావు " అని ఒక చేత్తో ఆ ప్లేటు లాక్కొని మరో చేతిలో నేను అడగకనే తెచ్చిన వస్తువులు నా చేతిలో పెట్టి వసారాలో మా అమ్మ మ్మ ఎదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడు బాబాయ్.

          ‌‌"ఆ...మీ అమ్మ ఎప్పుడు మీ అక్క ఇంటిలో ఉండట్లేదటరా అల్లుడు!" అని ముడతల మూతిని ముమ్మారు తిప్పింది అమ్మమ్మ.
         ‌‌" పోన్లే అత్తా...ఇదిగో పకోడి తిను" అని మా అమ్మమ్మతో అని, పకోడి తన నోట్లో వేసుకుని వెక్కిరింపుగా  అమ్మమ్మ వైపు చుసి నవ్వాడు బాబాయి.
"తిను...తిను...నీ...." అని తిట్ల దండకం మొదలెట్టింది అమ్మమ్మ.

           వాళ్ళిద్దరిని చూసి గది లోపలికి నవ్వుకుంటూ వచ్చిన అమ్మ,  మావయ్యని చూడగానే కొంచెం ఆలోచనలో పడింది. అతను అది గమనించేలోపే మందహాసం తో మరిపించి "తమ్ముడు వాళ్ళు చాలా ఆస్తిపరులటగా, మంచి సంబంధమని బావ కూడా చెప్పారు?" అని సంశయాత్మకంగా అడిగింది.

              "అక్కా! ఆస్తి అని చిన్న గా అంటున్నావు. వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు.పెళ్లి కొడుకు డిగ్రీ వరకు చదువుకున్నాడు మనమ్మాయికి ఈడు జోడు చక్కగా  సరిపోతాడక్కా!" ఏదో అబ్బురాన్ని ఆవిష్కరిస్తున్నంత దర్పంగా అన్నాడు.

             "అంత మంచి సంబంధం అయితే ఖాయం చేసెయడమే మంచిదిరా తమ్ముడు" అని నిశ్చయంగా అంది అమ్మ

           ఆ మాటలు విని వినబడగానే నా చేయి వణికి  కుంచెలో ఉన్న రంగు తుంపర్లు గా నేలపై పడింది. మావయ్య తిమ్మిని బమ్మిని చేయడంలో సిద్ధహస్తుడని ఒకసారి నాన్న చెబుతుండగా నే విన్నాను.  అయినా మా నాన్న ఎలా నమ్మాడో ?! నా కర్థం కాలేదు. ఈ పెద్ద వాళ్ళ ఆలోచనలెంటో ఎప్పటికి అర్థం కావు. చదువుకోమంటారు,  చదువులోని ఆనందం, చదువంటే అర్థం  ఏంటో  తెలుసుకునేలోపే పెళ్ళంటారు. నా గుండెల్లో గుబులు, ఆలోచనల్లో శూన్యం అలుముకుంది. కుంచె యథాలాపంగా  శకుంతలకి రంగుల సొగసును అద్దుతుంది.

           "విజయనగరం దగ్గర పొలం కొన్నావని విన్నాను. ఆ సంబంధం వారే సాయం చేసారటగా? అబ్బాయికి మందు, సిగరెట్, జూదం లాంటి అలవాట్లున్నాయంటున్నారు " అని అమ్మ నెమ్మదిగా  ప్రశ్నించగా.

            "అవునక్కా సాయం చేసారు. చాలా మంచి వారు. అంత మంచి సంబంధం మీకు కుదురుతుందన్న అక్కసుతో కొందరు అవాకులు చవాకులు వాగుతారు అవన్నీ నువ్వు నమ్మకు. బావ,  నేను  అదే మాట్లాడుకున్నాం కుటుంబం చాలా మంచిది. చిన్న చిన్న అలవాట్లున్నా ....అవే మాత్రం పెళ్ళైన తరువాత మన అమ్మాయే మార్చుకుంటుంది. పైగా కట్నకానుకలవీ పెద్ద గా అవసరం లేదన్నారు. బావగారికి ఈ సంబంధం బాగా నచ్చింది. నీకు ఓ మాట చెప్పమన్నాడు" ఈ సంబంధం ఒప్పుకోవడం మినహా  నువ్విందులో మాట్లాడాల్సింది ఏమి లేదు అన్నంత నిర్లక్ష్యంగా అన్నాడు మావయ్య.

            వంటగది వెన్నంటి ఉండే ఈమెకి విజయనగరం విషయాలు ఎలా తెలుస్తాయో. అయినా ఇంటికి ఎవరొచ్చినా ఆదరణలో ఎక్కడా లోపం చెయ్యదు అందుకే వచ్చిన వాళ్ళు వస్తున్నట్టే ఉంటారు. నాకైతే ఆ టీ అతని మొహం మీద కొట్టాలనిపించేంత కోపం వచ్చింది. అమ్మ నేర్పిన సంస్కారమేదో అడ్డుకట్ట వేసి ఆపుతోంది.

                       వసారాలోని  అమ్మమ్మ, బాబాయి నవ్వే నవ్వులు  నా చెవుల మార్మోగుతున్నాయి. ఇప్పటికీ నాకు అంతుపట్టదు పెను తుఫాను లా మొదలయ్యే వారి సంభాషణ ఎప్పుడు ప్రహసనంగ మారుతుందో!‌. నా భయాన్నెప్పుడు ఆ నవ్వులు ఏమార్చాయో నా   మనసు కాస్త తేలిక పడింది. కుంచె అలవోకగా అలరించే మందార, మంకెన్న, మల్లెలకి రంగు రంగుల  పరిమళాలు అందిస్తుంది.

           "నిజమే  నువ్వు చెబుతుంటే  చాలా మంచివారుగా అనిపిస్తున్నారు.  అంతే తమ్ముడు అలవాట్లే మాత్రం మానమ్మాయే  మార్చుకుంటుంది. నీకూ తెలుసుగా మొన్నే  మీ బావ గారు కూడా పెందుర్తి లో పొలం కొన్నారు కాని ఎవరూ సాయం అందివ్వక ఉన్న పొలాన్ని కొంత మేర అమ్మి అప్పులు కూడా చేయాల్సి వచ్చింది.  ఉన్న దాంట్లో ఏదో గుట్టుగా సంసారం సాఫిగా సాగుతుంది. అయినా అలాంటివారు వియ్యంకులు అయితే బావగారికి కొంచెం చేదోడు, వాదోడుగా ఉంటుంది" అని కాస్త దిగాలుగా, అమాయకంగా మొహం పెట్టి ఆనందంగా అంది.

          ‌" ఆ పొలం కోసం అంత ఖర్చు పెట్టారా? అయినా అది సగానికి సగం కొత్తగా గవర్నమెంటు వారు వేస్తున్న రోడ్డులో కలిసిపోయిందంటున్నారు?" అని అడిగాడు అనుమానం గా.

           "అవునా! ఈ విషయం నాకిప్పటి వరకు చెప్పనేలేదు మీ బావగారు"  అని మళ్ళీ తనలో తానే అనుకున్నట్టుగా మావయ్యకి మాత్రమే వినబడేటట్టుగా" అందుకే అనుకుంటా మొన్న బంగారం కూడా" అని వెంటనే గొంతు సవరించుకొని  "ఇంక్కొంచెం పకోడి తెస్తాను తమ్ముడు" అంది నవ్వుతూ
"ఇక చాలు అక్కా " అన్నాడు తెచ్చిపెట్టుకున్న నవ్వుతో

           " మా మరదలి దగ్గర ఏ మాత్రం  బంగారం ఉంది" అని అడిగింది రెపెప్పుడైనా అరువివ్వాల్సి ఉంటుంది సుమా! అన్న ధోరణిలో .

             ఆ మాటకి అతని కాళ్ళు మా ఇంటి గచ్చులపై నిలవలేననట్టు..అప్పటికప్పుడే అరికాలి లో ముల్లుగుచ్చుకున్న చందాన  లేచి టీ కప్పు అమ్మ చేతిలో పెట్టి " అంత బంగారం మా దగ్గర ఎక్కడుంటుంది అక్కా ! చీకటౌతుంది ఇక బయల్దేరతాను" అని అన్నాడు కాస్త అసహనంగా 

              నే కోల్పోబోయిన రెక్కలు నా అధీనంలోకి వచ్చినంత ఆనందంగా అనిపించింది . కుంచె సూర్యుడుకి వెలుగు కిరణాలు, ఎగిరే పక్షులకి   రంగుల రెక్కలని ప్రసాదిస్తుంది. 

           "కొంత  సేపు ఉండు తమ్ముడు ఇంకో పది నిముషాల్లో మీ బావగారు వచ్చెస్తారు. అన్ని మాట్లాడుకుందాం" అని  అనునయంగా అంది.

             "దారిలో వేరొక పని ఉంది వెళ్ళాలి. వస్తానక్కా!" అని బయల్దేరాడు

              "అలాగే తమ్ముడు, ఇంట్లో వారందరిని అడిగానని చెప్పు. సంబంధం నువ్వే ఎలా అయినా కుదర్చాలి" అని బతిమాలుతున్నట్టుగా అడిగుతూ వీధి గుమ్మం వరకు దిగబెట్టింది.

             మసిపూసిన కళ్ళాపి వేసినట్టుగా చీకట్లు కమ్ముకుని, తెల్లని చుక్కలతో చందమామ  ముగ్గులు పెట్టినట్టినట్టుగా ఉంది ఆకాశం. శూన్యానికి నవ్వులు జతచేసినట్టుగా మా పందిరిలో మల్లెలు విచ్చుకున్నాయి. ఆ పందిరి కింద  పదేళ్ళ నా చిట్టి చెల్లి ప్రపంచాన్ని పకోడి రూపంలో  పాల బుగ్గల్లో కి కూరి ఆరగిస్తుందా అన్నంత ఆనందంగా ఆస్వాదిస్తుంది. అజ్ఞానం, బాల్యం ఎంతటి ఆనందదాయకమో నాకు ఆ క్షణంలో అనుభవానికి వచ్చింది. కుంచె కుటీరానికి తీగలు పాకిస్తుంది. మనసు మట్టుకు ఇప్పుడు నాన్న వస్తే ఎలా? అని మధనపడుతుంది.

          " బుజ్జి ! పెయింటింగ్ చాలా బాగా వచ్చిందిరా. జాగ్రత్త గా ఉంచు నేను రేపు తీసుకెళ్ళి ఫ్రేమ్ కట్టిస్తాను,  వదినా వెళ్ళొస్తాను " వంటగదిలో ఉన్న అమ్మకి వినబడేటట్టుగా  అన్నాడు బాబాయ్

           "ఒకసారి ఆగవయ్యా! వస్తున్నాను" అని హాడావుడిగా వచ్చి జామకాయలు, తినుబండారాలున్న సంచిని బాబాయి చేతిలో పెట్టింది

           "ఎందుకు వదినా ఇవన్నీ ?తరచు వస్తూనే ఉంటాను కదా!" అని మొహమాటంగా అన్నాడు.

         " మా చెట్టు రోజూ కాయలందిస్తుంది. పిల్లలకియవ్వవయ్యా" నవ్వుతూ ఆప్యాయంగా అంది.

   ‌     "అలాగే వదినా, వస్తాను"అని ఇంటి దారి పట్టాడు బాబాయ్.

       " అమ్మా! పెయింటింగ్ ఎలా ఉంది" అని అడుగుతూ ఉండగా మా అమ్మ మ్మ అందుకొని.
"నీ వయసుకి నా కూతురి కి నువ్వు పుట్టేసావే... ఎందుకే  మీ అమ్మకి సాయం చేయకుండా ఆ పనికిరాని గీతలు" విసురుగా అంది.

        "నువ్వుండమ్మా! నా కుతురు నాలా ఉండకూడదు" అంది విసుగ్గా.

          ఆ "నాలా" అన్న రెండక్షరాల్లో అగాధం, అంత: సంఘర్షణ అర్థం చేసుకోవడానికి ఈ జన్మ సరిపోదేమో.

        " నేను అదే అంటున్నా అత్తయ్యా! " అని అమ్మమ్మతో అని  "మీ తమ్ముడొచ్చాడా?" అని అమ్మని అడిగాడు గుమ్మం లోకి వస్తున్న నాన్న గద్ధిస్తున్నట్టుగా.

              " వచ్చాడండి! సంబంధం గురించి అన్ని విషయాలు చెప్పాడు. నాకు బాగా నచ్చిందండి. కట్నం అది చాలా ఎక్కువ గా అడుగుతున్నట్టుగా అనిపించింది కాని వాళ్ళ  స్థాయికి ఆ మాత్రం అడగడంలో తప్పు లేదనిపించింది. అందుకే ఎలా అయినా ఖాయం చేయమని చెప్పానండి" అని పరమానందభరితులౌతు   నాన్న దాహానికి గ్లాసుతో నీళ్ళందించింది.

             "నువ్వెందుకు ఖాయం చెయ్యమన్నావు. మన పిల్లకిప్పుడేం వయసు మించిపోయిందని అంతంత కట్నాలిచ్చి పెళ్ళి చెయడం. నన్నడిగినప్పుడు పెద్దగా కట్న కానుకలు ఏవి అక్కర్లేదు అన్నారు. పోనిలే పెద్ద కుటుంబం అని నేను వెంటనె ఒప్పుకున్నందువలన లోకువ కట్టినట్టున్నారు." అని అరిచినట్టుగా మాట్లాడాడు.

          "అయ్యో! నాకు ఈ విషయాలు ఏవి తెలియవు కదండి!!" అని తెల్ల మొహం వేసినట్టుగా జీవించింది.

        ‌‌  తన మాటలతో తరలి వచ్చే ప్రళయాన్ని  కూడా ప్రమోదంగ మార్చేసిన అనన్య సామాన్యంగా తోచింది అమ్మ.

"వేణ్ణీళ్ళు పెట్టావా!? నీకెప్పుడు లోక జ్ఞానం తెలుస్తుందో" అని స్నానాల గది వైపుగా వెళ్ళాడు నాన్న.
       
           పెను గండం తప్పిన ఆనందంలో  "అమ్మా! నువ్వు తిన్నావా? " అని అడిగా. ఆ మాటకే ఆమె కళ్ళల్లో ఎంతటి సంతోషమో!

                "ఎందుకు తినకుండా అందరికి పెడతావు. నువ్విలా పెడుతుంటేనే ఏరోజుకారోజు వస్తూనే ఉన్నారు. చివరికి ఆ మావయ్యకి కూడా నవ్వుతు ఎందుకు పెడతావు. నాకు చాలా కోపం వచ్చింది" అన్నాను  ఉక్రోషంగా.

           "కోపం ఎప్పుడూ మంచిది కాదు, దానిని నవ్వుతో నింపెయ్యాలి. అందరినీ కలుపుకుంటూ పోవాలి. ఎవరు మనకు సరిపోతారో,మంచి వారో,  చేయుత నిస్తారో వాళ్ళతో కలిసి నడవాలి. మనల్ని ఇబ్బంది పెట్టె వారితో అప్రమత్తంగా, దూరంగా మెలగాలి. ఏదేమైనా.....నా ఇంటి పువ్వుని పెంట పాలు కానిస్తానా? నవ్వులాట కాకపోతే ఏళ్ళోచ్చిన అడ్డగాడిదని లోకం తెలియని ఆడపిల్ల మారుస్తుందట? ఇంకా ఏ కాలంలో ఉన్నారో వీళ్ళు ? వాడెవడో బాగుపడడానికి నా బంగారాన్ని  బలిస్తానా?. " అంది ఉద్వేగంగా ఆమె కనులచివర కన్నీటి చుక్కలు రాలుతున్నాయి,  తన కడుపు పంట పచ్చదనానికై కురిసిన తొలకరి లా.

       ‌‌       అమ్మ తనని తానే సమ్మాళించుకొని "చూడు బుజ్జీ... 'అతిధి దేవో భవ' అన్నారుగా ఎవరు వచ్చినా ఆదరంగా చూడాలి. ఇవన్నీ నేను చూసుకుంటాగా నువ్వేమి ఆలోచించకు చక్కగా చదువుకుంటూ నీకు నచ్చిన బొమ్మలు గీసుకోమ్మా . ఎప్పటికైనా నిన్ను నేను సమున్నతంగా చూడాలి అయినా బుజ్జి....మనం పెడతామంటే మట్టుకు వస్తారా చెప్పు?" అని ప్రశ్న వేసి తన గరిటెని పట్టుకుని మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి పోయింది యదావిధిగా.

       "అవును నిజమే! పెడతామంటే మట్టుకు వస్తారా?"

          అమ్మ ఆశీర్వాదం, ప్రొత్సాహాం ఆమె కంటికి కనపడక నేసిన రక్షణ వలయమే నాకు  ఆనందమయ జీవితాన్ని, సంఘంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ప్రసాదించింది.

         ఈ చిత్రం చూస్తే ఇప్పుడనిపిస్తుంది, బంధాల కాన్వాస్ పై  గరిటెతో అనురాగాల రంగులని  అందంగా నా చుట్టూరా  అద్ది  నా  జీవితాన్ని అందంగా చిత్రీకరించిన గొప్ప చిత్రకారిణి అమ్మ!!.