జ్ఞానసంపద - చెన్నూరి సుదర్శన్

Wealth of knowledge

          దూరదర్శన్ కేంద్రం ఆహ్వానం మేరకు పద్మాకర్ అతని సతీమణి పారిజాతం స్టూడియోలో ప్రేక్షకుల మొదటి వరుసన తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యారు.

రాత్రి ఎనిమిది గంటలకు వారి ఏకైక పుత్రరత్నం పులకిత్ క్విజ్ కార్యక్రమంలో హాట్ సీటు మీద కూర్చోబోతున్నాడు.

             సరిగ్గా ఎనిమిది గంటలు ఎప్పుడవుతుందా..! క్విజ్ ప్రోగ్రాం ఎప్పుడు మొదలవుతుందా..! పులకిత్ ఎప్పుడు ప్రత్యక్షమవుతాడా..! అని తమ, తమ చేతి  గడియారాల వంక ఇరువురు పదే, పదే చూసుకోసాగారు. మధ్య మధ్యలో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ  ఉద్వేగాలను పంచుకోసాగారు.

            నాశ్రమ ఫలించబోతుందా..! నా పేరు నిలబెడ్తాడా..! అని పారిజాతం మనసు పాదరసంలా ప్రాకులాడుతోంది. పద్మాకర్ మాత్రం పులకిత్ మీద పూర్తి నమ్మకంతో భరోసా కలిగి ఉన్నాడు. కాని  పైకి ఏమాత్రం  కనబడనివ్వకుండా జాగ్రత్త పడ్తున్నాడు.

            సరిగ్గా ఎనిమిదయ్యింది. దూరదర్శన్­లో వాణిజ్య ప్రకటనలు ఆగిపోయాయి. లైవ్ టెలీ కాస్ట్ ఆరంభమయ్యింది. మరో ప్రక్క అమర్చిన తెరపై గూడా కార్యక్రమాన్ని చూడవచ్చని.. పద్మాకర్ పారిజాతానికి చెబుతుండగా  ఆంకర్ పద్మిని ప్రత్యక్షమయ్యింది.

“వారం, వారం ధర్మసమాజం వారి అధ్వర్యంలో జూనియర్ విద్యార్థులకు నిర్వహించే క్విజ్ కార్యక్రమానికి  స్వాగతం.. సుస్వాగతం” అంటూ చిలుక పలుకులు పలకసాగింది. “ఈనాటి కార్యక్రమంలో ‘రామాయణం’ మీద ప్రశ్నల పరంపర కొనసాగించే క్విజ్ మాస్టర్ మధుసూదనశర్మ గారు..” అంటూ పద్మిని ప్రకటించే సరికి మధుసూదనశర్మ హుందాగా నడిచి వచ్చి, ప్రేక్షకులకు ఆభివాదము చేస్తూ.. తన సీట్లో కూర్చున్నాడు.

“నేటి సవాళ్ళకు జవాబులు ఇవ్వడానికి హాట్ సీటుపైన  కూర్చునే  విద్యార్థి పేరు పులకిత్.. ఆరవ తరగతి, ప్రాథమిక పాఠశాల, పలాస.. శ్రీకాకుళం  జిల్లా” అని పద్మిని  ప్రకటించగానే..  పులకిత్ కనబడే సరికి  పులకించి పోయారు పద్మాకర్  దంపతులు. ప్రేక్షకుల  చప్పట్లలో తమ కరతాళ ధ్వనులు మిళితం చేస్తుంటే.. వారి కళ్ళల్లో నుండి ఆనందభాష్పాలు దొర్లసాగాయి. కళ్ళు తుడ్చుకుని తిరిగి కూర్చుంటూ..  పులకిత్  చివరి వరకూ నిలవాలని దైవాన్ని ప్రార్థించసాగింది పారిజాతం.  

క్విజ్ కార్యక్రమం ఆరంభమయ్యింది. మధుసూదనశర్మ ముందుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్ రావు గారిలా.. కొన్ని నీతి వాక్యాలు చెప్పాడు. తమ ధర్మసమాజం గురించి రెందు మాటలు మాట్లాడాడు. ఆ తరువాత క్విజ్ నియమ నిబంధనలు.. మరియు ఉపయోగించుకునే అవకాశాలు చెప్పి క్విజ్ ప్రారంభించాడు.

మధుసూదనశర్మ  ప్రశ్న అడిగినప్పుడల్లా.. నాలుగు ఆప్షన్­లు రావడం.. పులకిత్ సరియైన సమాధానం చెప్తున్నప్పుడు గ్రీన్ లైట్ వెలుగడం.. ప్రేక్షకుల చప్పట్ల మోత..  తన కోచింగ్ ఇప్పించిన ఫలితం చూడమన్నట్లుగా పారిజాతం కళ్ళెగరేసుకుంటూ.. పద్మాకర్­ను చూడ్డమనే.. పరంపర కొనసాగుతోంది.

క్విజ్ చివర దశకు చేరింది. పులకిత్ అత్యధిక మొత్తంలో బహుమతి గెలబదానికి ఇంకా.. ఒకే ఒక ప్రశ్న మిగిలి ఉంది. స్టూడియో సాంతం నిష్షబ్ధమయమయ్యింది. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ప్రాణాలు బిగపట్టుకుని టీ.వీ.కి అతుక్కు పోయి చూడసాగారు.

మధుసూదనశర్మ చివరి ప్రశ్న అడిగాడు. నాలుగు ఆప్షన్లు వచ్చాయి. పులకిత్ ఆలోచనలో పడ్డాడు. సమయం టిక్, టిక్ అంటూ గడుస్తోంది. పారిజాతం, పద్మాకర్­లు  నుదురు పట్టుకుని తలలు దించుకున్నారు. నేరుగా చూడాలంటే ధైర్యం చాలడం లేదు.

చివరి ప్రశ్న జవాబు కోసం తన కున్న చివరి ‘ఫోన్ ఫ్రెండ్’ ఆప్షన్ వినియోగించుకుంటానని అడిగాడు పులకిత్. మధుసూదనశర్మ ఎవరికి ఫోన్ చెయ్యాలో తెలుసుకుని  ఫోన్ చేయించాడు.  తప్పకుండా ఆ ఫోన్ నంబరు తాను  కోచింగ్ తీసుకుంటున్న  మాస్టారుదై ఉంటుందని  చెవులు పెద్దవిగా చేసుకుంది పారిజాతం. కాని ఒక ముసలాయన జవాబు చెప్తున్నట్లు వినబడింది. ఆ గొంతు ఎక్కడో విన్నట్లు లిప్తకాలం ఆలోచనలో పడింది పారిజాతం.  

 పులకిత్ ఫోన్లో వచ్చిన జవాబు చెప్పేసరికి గ్రీన్ లైటు వెలిగింది. లక్ష రూపాయలు గెలుచుకున్నాడు. టీ.వీ. లో పూల వర్షం కురువసాగింది. పులకిత్ ఆనందంతో రెండు చేతులూ పైకెత్తి విజయసంకేతాలు ప్రేక్షకులు అందిస్తున్నాడు. మధుసూదనశర్మ లేచి వచ్చి పులకిత్­ను ఆప్యాయంగా హత్తుకున్నాడు. రెండు నిముషాలు విజయోత్సవాల తరువాత మధుసూదనశర్మ పులకిత్­ను తనకు  రామాయణం గురించి ఇంత లోతుగా  నూరి పోసింది ఎవరని ప్రశ్నించాడు. పులకిత్ చెప్పబోతుంటే పారిజాతం చెవులు నిక్కించి వినసాగింది.

“ప్రేక్షక మహాశయులకు నమస్కారం. నాన్న ప్రోత్సాహంతో.. నాకు రామాయణం, మహాభారతం ఇంకా అనేక జానపద కథలు, పౌరాణిక శాస్త్రాలు బోధించేది మా నానమ్మ, తాతయ్యలు” అనగానే..  పారిజాతం కోపం సుర్రున అరికాలి మంట నెత్తికెక్కింది.

పులకిత్ చెప్పడం కొనసాగిస్తూనే ఉన్నాడు..

“ముఖ్యంగా రెండు మాటలు చెప్పదలచుకున్నాను. ప్రతీ ఇంటికీ నిజమైన జ్ఞానసంపద   అనువజ్ఞులైన నానమ్మ, తాతయ్యల లాంటి వృద్ధులు. అలాంటి సంపదను  వదులుకోవద్దని వేడుకుంటున్నాను” అంటూ రెండు చేతులా నమస్కరించాడు పులకిత్. “మా ఇంట్లో  నాన్నతో రోజూ గొడవ పడేది అమ్మ. ముసలివారి  మూలాన నా చదువు సరిగ్గా సాగడం లేదని.. వారిని అనాధాశ్రయంలో చేర్చుమని పోరుపెట్టేది. గొడవ జరిగినప్పుడల్లా నానమ్మ, తాతయ్యలు అన్నం తినకుండా పస్తులు పడుకునే వారు. నాన్న ఆ బాధ భరించ లేక నానమ్మను, తాతయ్యను ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంచాడు. వారికి  ఏమాత్రమూ అసౌకర్యము కలుగకుండా ఒక సహాయకురాలిని పెట్టాడు. వాళ్ళను అనాధాశ్రయంలో చేర్పించానని..   అమ్మతో తప్పనిసరి పరిస్థితిలో చిన్న అబద్ధం చెప్పాడు నాన్న.

అమ్మ కుదిర్చిన ట్యూషన్­కు తీసుకెళ్తున్నానని  చెప్పి  నాన్న ప్రతీ రోజూ నన్ను నానమ్మ, తాతయ్యల దగ్గర దిగబెట్టే వాడు. నేను చదువుతో బాటు నానమ్మ తాతయ్యలు చెప్పే పురాణాలు కథలు విన్న ఫలితమే నా  విజయానికి కారణం” అంటూ తన తల్లిదండ్రుల  దిక్కు చూశాడు పులకిత్. పారిజాతం ముఖం పాలిపోయింది. పద్మాకర్ మోములో చిరునవ్వు..

“మరో ముఖ్య విషయం.. అనాధాశ్రయం అంటే అది అనాధలకు మాత్రమే. మా నాన్న, అమ్మ,  నేను ఉండగా నానమ్మ, తాతయ్యలు ఎలా అనాధలవుతారు. ఇప్పటికైనా నానమ్మ, తాతయ్యలను ఇంటికి తీసుకురావాలని నా తల్లిదండ్రులను కోరుకుంటున్నాను.

నేను గెల్చుకున్న లక్ష  రూపాయలకు కారణమైన  చివరి ప్రశ్నకు జవాబు చెప్పింది నా తాతయ్యనే. అమ్మమ్మ తాతయ్యల  కోరిక మేరకు ఆ డబ్బును అనాధల కోసం.. అనాధాశ్రయానికివ్వడానికి అనుమతించాలని నా తల్లిదండ్రులను వేడుకుంటున్నాను” అంటూ శిరస్సు వంచి నమస్కరించాడు పులకిత్.

ప్రేక్షకులు కరతాళ ధ్వనులు మిన్నంటాయి.

పులకిత్ తల్లిదండ్రులను వేదిక మీదకు వచ్చి తమ స్పందన తెలియజెయ్యాల్సిందిగా ఆంకర్ పద్మిని  ఆహ్వానించింది. మనసులో పులకిత్­ను అభినందిస్తూ, తనతో బాటు తలదించుకుని వేదిక నెక్కుతున్న పారిజాతంలో మార్పు వచ్చినట్లు గమనించాడు పద్మాకర్.  *