మెమొరి - ఎనుగంటి వేణుగోపాల్

memory

 అత్యవసరంగా మోక్ష సిద్ధ్ కి ఒక చిప్ కావాలి. మైక్రోచిప్! గ్లోబల్ పొజిషన్ సిస్టం (జిపిఎస్) సహకారంతో వ్యాపార సముదాయంలోని షాప్ ల వెంట వడివడిగా కదలి పోతున్నాడు. ఇపుడు మనుషులెవరూ సొంతంగా ఆలోచించే స్థితిలో లేరు.పూర్తిగా టెక్నాలజీకి వారసులయ్యారు. అత్యంత ఆధునికంగా అభివృద్ధి చెందిన సాంకేతికత అనేది మనుషుల్ని సహజంగా ఆలోచించకుండా మరమనుషుల్లా చేసింది. అందుకు కారణం ఒకప్పటి స్మార్ట్ ఫోన్లు.అవి జీవనాన్ని అతలాకుతలం చేసి ఈ స్థితికి తీసుకు వచ్చాయి.మెమొరీ చిప్స్,మెసేజ్ చిప్స్, కాంటాక్ట్ చిప్స్... ఏవి కావాలంటే అవి విరివిగా దొరుకుతాయి. పాన్ టేలల్లో వక్కపొడి పొట్లాలు, షాంపూ సాచేలు వేలాడదీసినట్టు ఆయా దుకాణాల్లో బయటే తోరణాల్లా కట్టబడి ఉంటాయి ఈ మైక్రోచిప్స్. ముందుకు సాగిపోతున్న వాడల్లా మోక్ష సిద్ధ్ క్షణకాలం ఆగిపోయాడు. ఇంతకూ తనకేం చిప్ కావాలి? అరే మర్చిపోయానే! ఇప్పుడెలా? రోడ్డు నుండి కాస్త పక్కకి జరిగాడు.ఆ వ్యాపార కూడలిలోకి ఎలాంటి వాహనాల అనుమతి ఉండదు.పార్కింగ్ ప్లేస్ లో ఉంచేసి కాలి నడకన వచ్చి షాపింగ్ చేయాలి. గట్టిగా తల విదిలించాడు. అలాంటి సంధిగ్ధావస్థలో ఉన్నప్పుడు ఆటోమేటిగ్గా 'బీప్ బీప్ 'మనే శబ్దం వినబడుతుంది నానో కంప్యూటర్ నుండి.అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో తయారుచేయబడిన ఆ నానో కంప్యూటర్ ఎడమ చేతి మణికట్టు దగ్గర లోపల అమర్చబడి ఉంటుంది. చేతి గడియారం సైజులో ఉండే కంప్యూటర్ స్క్రీన్ మాత్రం పైకి కనబడేలా ఉంటుంది. ఈ నానో కంప్యూటర్ ప్రతి మనిషి మెదడుకి అనుసంధానం చేయబడి ఉంటుంది. నానో టెక్నాలజీ వచ్చాక మనుషులు ఇలా ఆల్ట్రా మోడ్రన్ అయ్యారు. కంప్యూటర్ నుండి శబ్దం వెలువడుతున్న చోట స్క్రీన్ పైకి వచ్చిన ఆ కలర్ డాట్ ని టచ్ చేశాడు. వెంటనే కంప్యూటర్ స్క్రీన్ మీద మెమొరీ చిప్ అనే అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి. " ఓహ్!"అని నుదురు చరుచు కున్నాడు. తిరిగి "ఓకే! ఓకే!" అని తలాడిస్తూ ఓ షాప్ లోకి హుషారుగా ఎంటరయ్యాడు. అక్కడున్న చిప్స్ ని చాలాసేపు చెక్ చేసి చూశాడు.ఒక మైక్రో మెమరీ చిప్ మోక్ష సిద్ధ్ కంప్యూటర్ కి కనెక్టవ్వగానే దానిని చేతిలోకి తీసుకున్నాడు.షర్ట్ బటనంత స్మాల్ సైజులో ఉందా మైక్రోచిప్. స్క్రీన్ పై ఉన్న అమౌంట్ ట్రాన్స్ఫర్ డాట్ ని ప్రెస్ చేశాడు. సరిగ్గా ముప్పై సెకండ్ల పాటు ఆ మైక్రో మెమొరీ చిప్ ని స్క్రీన్ పై అలాగే టచ్ చేసి ఉంచాడు. దాని మీదున్న అమౌంట్ ని,దాని కిందున్న పే అకౌంట్ నెంబర్ ని డీకోడ్ చేసుకోసాగిందా నానో కంప్యూటర్.వితిన్ ఫ్యాక్షన్లో ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. అదే సమయంలో చిప్ మీదున్న కోడ్ నెంబర్ ని డీకోడ్ చేసుకుని టోటల్ డాటాని నానో కంప్యూటర్ అప్లోడ్ చేసుకుంది.ఈ తతంగం పూర్తయ్యాక ఆ మైక్రో చిప్ ని షాప్ లో ఉన్న డస్ట్ బిన్ లోకి విసిరేసి అక్కడి నుండి బయటకు నడిచాడు మోక్ష సిద్ధ్. ఆ మైక్రో మెమరీ చిప్ లోని డాటా సేవ్ అయిన తదనంతరం నానో కంప్యూటర్ మోక్ష సిద్ధ్ మస్తిష్కానికి సంకేతాల్ని అందించడం ప్రారంభించింది. మస్థిష్కానికి అటాచ్ చేసి ఉన్న మరో మైక్రో సూపర్ మెమొరీ అప్ లోడ్ చేసుకుంది. బ్రెయిన్ కి సమాంతరంగా ఈ మైక్రో సూపర్ మెమరీ పని చేస్తుందన్నమాట! నెమ్మదిగా గుర్తుకువస్తోంది మోక్ష సిద్ధ్ కి. తన భార్య విముక్తి కూడా ఓ మైక్రో చిప్ తీసుకురమ్మన్నట్టు గుర్తు. కానీ ఏ రకమైన చిప్పో చెప్పలేదు. బహుశా చెప్పినా తను వినకపోవచ్చు. కంప్యూటర్ స్క్రీన్ పైన విముక్తి పేరు ఫీడ్ చేశాడు. అవతలి వైపున ఉన్న కంప్యూటర్ విముక్తిని అలర్ట్ చేసింది. "చెప్పండి" లోగొంతుకతో పొడిపొడిగా అడిగింది విముక్తి. "చిప్ కావాలని అడిగావు కదా?" "అవును మోక్షా! షాపింగ్ చేస్తున్నావా?" "యా! ఇక్కడే ఉన్నాను.ఏ చిప్ అడిగావో తెలుసుకుందామని కాంటాక్ట్ అయ్యాను" " చెప్పానుగా మోక్ష... ఫోటోగ్రఫీ చిప్! ప్లీజ్ డిస్కనెక్ట్ ది కంప్యూటర్!ఆఫీస్ కాన్ఫరెన్స్ లో ఉన్నా..." ఎవరు ముందుగా కాంటాక్ట్ అవుతారో వాళ్లే డిస్ కనెక్ట్ చేయాలి. అంతవరకు అవతలివాళ్ళు అటెన్షన్ లో ఉండాల్సిందే! " ఓకే డియర్!"అంటూ డిస్కనెక్ట్ చేశాడు మోక్ష సిద్ధ్. మళ్లీ ఒకట్రెండు దుకాణాలు చుట్టేసి విముక్తి కంప్యూటర్ కి మ్యాచయ్యే ఫోటోగ్రఫీ చిప్ ని సెలెక్ట్ చేసుకొని కారు దగ్గరికు వెళ్లాడు. కారు డ్రైవింగ్ సీట్లో అమర్చిన సరికొత్త కంప్యూటర్ లో హౌస్ అని ఫీడ్ చేసి దానికి గ్లోబల్ పొజిషన్ సిస్టం కి అటాచ్ చేశాడు మోక్ష సిద్ధ్. వెనక సీట్లో రిలాక్స్ డ్ గా కూర్చున్నాడు.కారు మినిమం స్పీడ్ తో అతడి ఇంటి వైపు కదిలింది.అపార్ట్ మెంట్ చేరుకున్నాక కంప్యూటర్ కి సంకేతాలు అందించి కారు లోంచి దిగాడు.తనకు తానే వెళ్లి పార్క్ అయిందా కారు. పై అంతస్తు చేరుకున్న మోక్ష సిద్ధ్ తన పోర్షన్ లాక్ తీసి ముందైతే బాత్రూం పని పూర్తి చేసుకోవాలని గ్లోబల్ పొజిషన్ సిస్టం ఆన్ చేశాడు. అది పాయింట్ అవుట్ చేస్తున్న దిశగా బాత్రూం వైపు అడుగులు వేసాడు మోక్ష సిద్ధ్. చివరకు__ ఇంట్లో కూడా గదులు వెతుక్కోవడానికి జి పి ఎస్ సహకారం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సొంతంగా ఆలోచించడం మానేశామా? విరిగిపడిన ఉపగ్రహ శకలాలు గుండెని చిన్నాభిన్నం చేసినట్టు విలవిల్లాడి పొయాడు మోక్ష సిద్ధ్... కలవరిస్తూ.. పలవరిస్తూ.. *. *. * హఠాత్తుగా మెలకువ అయ్యింది మోక్ష సిద్ధ్ కి విష సర్పం ఒడిలో కదలాడుతున్నట్టు గుండెలు అదురుతుంటే పక్కనే ఉన్న స్మార్ట్ ఫోన్ ని గోడ కేసి బలంగా విసిరికొట్టాడు. కల తాలూకు భయంతో వణుకుతున్నాడు. కాళ్లు చేతులు అచేతన మయ్యాయి. ఆ కలను తలుచుకుంటేనే ముచ్చెమటలు పోస్తున్నాయి. సెల్ అనవసరంగా అదేపనిగా వాడి వాడి... ఏదీ జ్ఞాపకం ఉంచుకోలేని స్థితికి చేరుకోవడం... మనిషి సహజంగా ఆలోచించ లేకపోవడం...అనే జబ్బు తో సతమతమవుతూ జీవించడం.. నిజంగా దుర్భరమే! తనకీ కొత్తరకం వైరస్ సోకిందే మోనని మోక్షకి చిన్నగా అనుమానం రేకెత్తుతోంది. అందుకే నిలువెల్లా కంపించి పోయాడు. అవును భార్య విముక్తి కూడా పదే పదే అదే అంటోంది "మీకీ మధ్య ఏదీ గుర్తుండటం లేదండీ!" అని. ఆమెకిదో ఊత పదమయ్యిందని తను చివాట్లేస్తున్నాడు కానీ నిజంగా తనకి మతిమరుపు వచ్చేసిందేమోననిపిస్తోంది. ఒకసారి మార్కెట్ నుండి తిరిగి వచ్చిన మోక్ష చేతిలోంచి కూరగాయల సంచీ తీసుకొని డైనింగ్ టేబుల్ మీద ఓ పక్క కుమ్మరించింది విముక్తి. వాటిని చూస్తూనే "మార్కెట్ కి వెళ్లే ముందే చెప్పాను కదండీ! ఏమేం తేవాలో?" అసహనాన్ని వ్యక్తపరిచింది. వాట్సాప్ లో నుండి తలెత్తకుండానే "చెప్పినవన్నీ తెచ్చానే!"అన్నాడు. " అలా అయితే పచ్చి మిరపకాయలు,టమాటాలు ఏవీ?" అంటూ విసుక్కుంది భర్త వంక సీరియస్ గా చూస్తూ. ఫోన్ లోంచి తలెత్తకుండానే "అవునా?" అన్నాడు. "టమాట చట్నీ తప్ప చిన్నోడు మరొక చట్నీ తినడని చెవినిల్లు కట్టుకుని మరీ చెప్పాను." వింటున్నట్టు తలూపాడు కానీ ఆ తల ఫోన్ లోకే కూరుకుపోయింది. నుదురు చరుచుకుంది. "ఎలాగోలా ఈ రోజుకి కానివ్వు. పచ్చిమిర్చీ ల సంగతి రేపు చూడొచ్చు." అంటూ ఏం పట్టనట్టు హాల్ లోకి వెళ్ళిపోయాడు. చేసేదేం లేక నిట్టూరుస్తూ "మీకీ మధ్య ఏదీ గుర్తుండడం లేదండీ!" భర్తకి వినపడేలా గట్టిగా అరిచింది. మరోసారిలాగే మోక్ష షాపింగ్ కి వెళ్లి ఓ రెండు గంటల అనంతరం వచ్చాడు. భర్త గారి నిర్వాకానికి చిటపట లాడింది విముక్తి. "నేను తెమ్మన్నది షార్ట్స్ అండీ!ఉన్న ఒక్క షార్ట్ మార్చిమార్చి చిన్నోడికి వేయాల్సి వస్తోందని ముందే చెప్పాను కదా!" వాపోయింది విముక్తి. ఫేస్ బుక్ లో లైక్ లు కొట్టడంలో నిమగ్నమైన మోక్ష "అవును నేను తెచ్చినవి షార్ట్సేగా..."అన్నాడు. "మీ మతిమరుపు తో వేగలేక చస్తున్నానండీ!" అంది కోపంగా. లైకుల పని ముగిశాక సీరియస్ గా చాటింగ్ లో మునిగిపోయాడు. ఆమె మాట విన్నా బదులు పలకలేదు. "నేను చెప్పిందొకటి మీరు తెచ్చింది మరొకటి.మీ మతిమరుపు తో షార్ట్స్ బదులు టీషర్ట్స్ తెచ్చారు. ఇంకా నయం మీకోసం తెచ్చుకున్నారు కాదు. గుడ్డిలో మెల్ల!" అంటూ చురక అంటించింది. పొద్దస్తమానం భర్త ఆ సెల్ తోనే విరామం లేకుండా గడిపేస్తుంటే చిరాకేస్తోంది విముక్తికి. "ఒక పని చేయరాదుటండీ! ఎక్కడైనా హ్యూమన్ మెమరీ చిప్ దొరుకుతుందేమో గూగుల్ సెర్చ్ చేయండి. మీ ప్రపంచమంతా గూగులే గా! ఎక్కడో ఓ చోట దొరక్కపోదు." అంది వెటకారంగా. " ఏం చేసుకోమంటావు?" "నన్నడగ దేనికి మహాశయా! సర్జరీ చేయించుకొని లోపల పెట్టేసుకోండి. అలాగైనా మీ మతిమరుపుతో నా బాధలకు ముగింపుపలుకుతుందేమో!" అంది అక్కసుగా. ఈ ఒక్క మాట మాత్రం అతడి బుర్రకెక్కింది. భార్యామణి సరదాకి అన్నా ఇదేదో బాగుందనుకున్నాడు. దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న రోజు వచ్చిన కల అది. కలే అయినా తన ప్రాబ్లమ్ కి చక్కని పరిష్కారం చూపించినట్లనిపించింది. ఆరోజు ఆఫీసు నుండి ఇంటికి వస్తున్నప్పుడు స్మార్ట్ ఫోన్ ని అమ్మేసి చిన్న ఫోన్ ఒకటి కొనేశాడు. భర్త చేసిన పనికి ఆశ్చర్యపోయిన విముక్తి "నాకొక స్మార్ట్ ఫోన్ కావాలన్నానని మీరే దాన్ని తీసేసారా?" అంది నవ్వుతూ. "అదేం కాదు విమూ! కొంత మార్పు రావాలని..." భర్త మాటలకు కనురెప్పలు టప టపలాడించింది విభ్రాంతిగా. తిరిగి మోక్ష అన్నాడు కదా "ఉదయం లేస్తేనే వాట్సాప్.. సాయంత్రం ఇంటికి వస్తూనే ఫేస్బుక్...సెలవు దొరికిందా గూగుల్ తోనే కాలక్షేపం.. ఇదే వ్యసనమై పోతోంది. నిజం చెప్పాలంటే బ్రెయిన్ తుప్పు పట్టి పోతుంది సెల్ ని అతిగా వాడుతుండడంతో..." కళ్ళింతలు చేసుకొని ఎన్నడూ లేనిది భర్త గారి సరికొత్త వాయిస్ ని వింటోంది. "నిజం చెప్పనా విమూ...నీతో మాట్లాడుతుంటాను మనసు విప్పి మాట్లాడినట్టన్పించదు. మీతో సమయం వెచ్చిస్తున్నాను గానీ ఆ క్షణాలకు జీవమున్నట్టన్పించదు. ఇదంతా సెల్ మాయ అని తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టింది.ఇప్పటికైనా స్మార్ట్ ఫోన్ ఊబిలో పూర్తిగా కూరుకు పోనందుకు నాకు నేనే థాంక్స్ చెప్పుకోవాలి.సహనంతో నన్ను భరించినందుకు ఈ సందర్భంగా నిన్ను కూడా అభినందించాలి." విముక్తి 'ఈయన మా శ్రీవారేనా?' అన్నట్టు భర్త వంక నమ్మలేనట్టు చూస్తోంది. "తాగుడికి బానిసై భర్తలను భార్యలెలా అదుపులో పెట్టుకోవడానికి తాపత్రయపడతారో...స్మార్ట్ ఫోన్ లకు ఎడిక్ట్ అయిన నాలాంటి భర్తలను మార్చుకోవాల్సిన బాధ్యత మీలాంటి భార్యలపై పడింది." "చూశారా! చూశారా! ఆ స్మార్ట్ ఫోన్ ను వదిలేసి కొన్ని క్షణాలైనా గడిచాయో లేదో సొంతంగా ఆలోచించడం మొదలుపెట్టారు. అది కూడా నిర్మాణాత్మకంగా!" అంటూ భర్త వంక మురిపెంగా చూసింది విముక్తి. "నిజమే! నా మెమొరీ నాకు వచ్చేసిందోచ్...!!" అంటూ బిగ్గరగా నవ్వాడు మోక్ష సిద్ధ్. ***