నూతిలోని కప్పకి...! - మీగడ.వీరభద్రస్వామి

The frog in the nut ...

నూతిలో కప్పలకు నుయ్యే సముద్రమా...!!! ఒక నూతిలో ఒక పెద్ద బాండ్రు కప్ప ఉండేది.ఆ నూతిలో ఉన్న అన్ని కప్పలకూ పెద్దదిక్కు ఆ బాండ్రు కప్పే...దాని వంశమే ఆ నూతిలో ఉన్న కప్పలన్నీ,అందుకే ఆ కప్పలన్నీ బాండ్రు కప్పకి గౌరవం ఇస్తూ...దాని మాట ప్రకారమే నడుచుకునేవి.ఒక రోజు ఒక కుందేలు వచ్చి"నూతిలో ఉంటే మీకు ప్రకృతి గొప్పతనం తెలీదు ఒకేసారి నూతినుండి బయటకు రండి ప్రకృతిని చూసి ఆస్వాదించండి"అని చెప్పింది.కుందేలు మాటలు విని కొన్ని కప్పలు నూతి ఒడ్డుకు వచ్చి ఒడ్డు దాటబోతుండగా బాండ్రు కప్ప వచ్చి,ఆ కప్పల కాళ్ళు పట్టుకొని నూతిలోకి లాగేసింది."కప్పలకు నుయ్యే సురక్షితం,అసలు నుయ్యను మించిన ప్రపంచం అంటూ ఏమీలేదు, నుయ్యలాంటి అందమైన ప్రపంచాన్ని చూసి ఓర్వలేక ఈర్ష్యతో ఈ నుయ్య బయట ఉన్న వారు మనల్ని బయటకు రమ్మంటారు,వాళ్ళ మాటలు నమ్మి మనం బయటకు వెళ్లకూడదు,వెళ్తే మన చావు మనం తెచ్చుకున్నట్లే,అయినా నుయ్యను మించిన సౌందర్యం, ఆనందం,ఆహ్లాదం మరొకటి లేదు"అని తోటి కప్పలకు చెప్పి ఏ కప్పా నుయ్యను దాట కుండా చూసుకునేది బాండ్రు కప్ప.కొన్ని కప్పలకు నుయ్యదాటి వెళ్లాలని వున్నా బాండ్రు కప్ప పోరు పడలేక నుయ్య దాటి బయటకు వెళ్లలేకపోయేవి. మరోరోజు ఒక పావురం నుయ్య ఒడ్డున ఎగురుతూ కప్పలను"నుయ్య దాటి రండి ఈ లోకాన్ని చూడండి సంతోషపడండి"అని పిలిచింది.బాండ్రు కప్ప పావురాన్ని తిట్టిపోసింది."నువ్వు మా పిల్లల్ని నుయ్య ఒడ్డుకు పిలిచి వాళ్లకు లోకం గీకం అని చెప్పి వాటి బుర్రలో ఎక్కువ ఆశలు రేపితే ఏదోఒకరోజు నీ తలకాయను అందుకొని నిన్నూ ఈ నూతిలో ముంచేస్తాను" అని హెచ్చిరించింది.ఇంకోరోజు ఒక పాము నుయ్య పక్కన ఉన్న చెట్టుమీద నుండి నుయ్యలోకి దిగి "మిత్రులారా నన్ను శత్రువులా చూడకండి,ఒక్కసారి నాతో నుయ్య బయటకు వస్తే పంటపొలాలు,అడవులు,చెట్టు చేనులు, సూర్యుడు, చంద్రుడు ఇలా మొత్తం వింతలు,విశేషాలు చూపిస్తాను"అని చెప్పగా,"నువ్వు మర్యాదగా నుయ్యనుండి బయటకుపో లేదంటే నిన్ను చంపి మా పిలకాయలకు ఆహారంగా వేసేస్తాను"అని పాముని బెదిరించి పాము నుయ్య దాటే వరకూ తరిమేసింది బాండ్రు కప్ప.సీతాకోకచిలుకలు,కాకులు,తూనీగలు, ఉడతలు,తొండలు,కోతులు,కొంగలు,చీమలు,దోమలు, చివరకు,చెట్లు,చేనులు మొక్కా,మోడులు కూడా కప్పలుకు"నుయ్యదాటి వస్తే మీకు జ్ఞానము విజ్ఞానం పెరుగుతుంది,వినోదం కూడా కలుగుతుంది"అని ఎన్నిసార్లు చెప్పినా బాండ్రు కప్ప ఒక్క కప్ప పిల్లను కూడా నుయ్యదాటి రానిచ్చేది కాదు.నుయ్యదాటి ఒకసారైనా బయట ప్రపంచాన్ని చూడాలని కప్పలకు వున్నా బాండ్రు కప్ప ఒప్పుకునేదికాదు.ఒకసారి ఆ నుయ్య పరిసరాల్లో ఉన్న జంతువులు,పక్షులు,పాములు,చెట్లు,చేనులు మొక్కా,మోడు సమావేశమై పిచ్చాపాటి మాటలాడుకుంటూ... నూతిలోని బాండ్రు కప్ప ప్రస్తావన వచ్చి అందుకే అన్నారు పెద్దలు "నూతిలో కప్పకు నుయ్యే సముద్రం"అని హేళనగా నవ్వుకున్నాయి. రెండోరోజు ఉదయాన్నే ఒక చిలిపి కోతి నుయ్య ఒడ్డుకు వచ్చి బాండ్రు కప్ప గాడనిద్రలో గురక తీస్తుండటం చూసి,"ఇప్పుడు కొన్ని కప్పలను ఒడ్డుకు చేర్చితే ఉదయం ప్రకృతి అందాలను చూసి అవే బాండ్రు కప్ప చాదస్తాన్ని ఛేదించుకొని నుయ్యదాటి మరో ప్రపంచానికి వస్తాయి" అనుకోని అమాంతంగా సుమారుగా ఒక పది కప్పల్ని అందుకొని నుయ్య బయట పడేసింది.నుయ్యదాటి వచ్చిన కప్పలకు కళ్ళు జిగేల్ మన్నాయి,తొలి సంధ్యా వేళలో తూరుపు అందాలను చూసి కప్పలు సంభ్రమాశ్చర్యాలు చెంది ఆనందంతో ఈలలు వేసాయి ఈ కప్పలు ఈలలు విని మరికొన్ని కప్పలు నుయ్యినుండి బయటకు వచ్చాయి,వాటి పిలుపు అందుకొని ఇంకొన్ని కప్పలు నుయ్యిదాటి వచ్చాయి,ఇలా మొత్తం కప్పలన్నీ నుయ్యి నుండి బయటకు వచ్చి మొట్ట మొదటిసారి ఎనలేని సంతోషం,ఆశ్చర్యం పొంది స్వేచ్ఛగా గెంతుకుంటూ నుయ్య పరిసరాలను తనివితీరా చూశాయి.ఒక్క బాండ్రు కప్ప మాత్రం నుయ్యిదాటి రాలేదు దానిమాట కాదని కప్పలు నుయ్యి ఒడ్డు దాటి పోయాయని అలిగి నూతిలోనే ముభావంగా ఉండిపోయింది.అప్పుడు కోతి ఒక అద్దం ముక్కను తెచ్చి తొలిపొద్దు తూరుపు అందాలను అద్దంలో బాండ్రు కప్పకు చూపించి,"ఒక్కసారి బయటకు రా తాత స్వయంగా నువ్వే లోకాన్ని చూసి మురిసిపోతావు" అని అంది,కప్పలు కూడా "తాతయ్య బయటకు రావాలి, రావాలి" అంటూ గట్టిగా అరిచి కోరాయి బాండ్రు కప్ప మనసు మార్చుకొని నూతినుండి బయటకు వచ్చింది.బయట ప్రపంచాన్ని చూసి దాని నోట మాటరాలేదు,మిగతా కప్పలు కన్నా ఉషారుగా పరిసరాల్లో తిరిగి వింతలు విశేషాలు వినోదాలు గురుంచి కోతిని అడిగి తెలుసుకుంది,ఒకరోజంతా కప్పలన్నీ నుయ్యబయట ఉండి పరిసర ప్రాణులు, ప్రకృతితో హాయిగా కాలం గడిపాయి,అప్పుడు,కోతి కప్పల సమావేశం పెట్టి"మీకు ఆరోగ్యం,ఆహారం,రక్షణ ఇచ్చేది నుయ్యి మాత్రమే,అయితే మీరు కనీసం రోజుకి ఒకసారైనా నుయ్యిదాటి బయటకు వచ్చి ప్రకృతిని, బయట ప్రపంచాన్ని చూడండి,బయట ప్రపంచంతో పరిచయాలు, సంబంధాలు పెంచుకోండి"అని చెప్పి, "ఇప్పుడు అన్ని కప్పలూ తిరిగి నూతిలోకి వెళ్లి పోవచ్చు"అని సలహా ఇచ్చింది.కప్పలు ఆ రోజు పొందిన మధురానుభూతిని నెమరు వేసుకుంటూ ఉషారుగా తిరిగి నూతిలోకి వెళ్లిపోయాయి.బాండ్రు కప్ప కోతికి ధన్యవాదాలు తెలిపింది. …..మీగడ.వీరభద్రస్వామి