parampara - వనం వేంకట వరప్రసాదరావు

పరంపర
పరంపర 
~~~~~~~

కృష్ణ! కృష్ణ! అనుకుంటూ కృష్ణాజినం పరిచిన పీఠం మీద కూర్చున్నాడు కవిరాజు, బమ్మెర పోతరాజు. 

ఆయన మనసునిండా వర్ణించడానికి వల్లకాని ఆనందం. మామూలు ఆనందమా? ఏళ్ళ తర్వాత ఏలికయైన నేస్తాన్ని చూచిన కుచేలుడి ఆనందం. ధేనువులూ, వృషభాలూ, తువ్వాయిలూ, పల్లె, పిల్లలు, గొల్లలు, గొల్లెతలు, వాగులూ, వంకలూ, చెట్టూ, చేమా అన్నీ తానే  అయిపోయి  సంవత్సరంపాటు సందడి చేసింది గుర్తుకొచ్చినప్పటి శుకమహర్షి ఆనందం. అదే, బ్రహ్మానందం! ఆ బ్రహ్మానందరసమయుడి దయతో జన్మ సార్థకం అయింది. జన్మకారణ లక్ష్యం నెరవేరింది. ఇక సంతోషంగా బ్రహ్మానందంలో కలిసి కరిగిపోవడమే! కనుకొలకులు కొలనులైనాయి. 
 
పరవశంగా కనులు మూసుకొనబోతూ ఎందుకో అటువైపు చూశాడు. గవాక్షంనుండి పడుతున్న తెల్లని వెన్నెల పరదాలాగుంది.  స్తంభానికి  ఆనుకుని ఎవరో కూర్చుని వున్నారు. వెనుకనుండి కురుస్తున్న 
వెన్నెల వలన ముఖం కనబడడంలేదు. పోలికలు తెలియడంలేదు. శరీరాకృతి మాత్రమే తెలుస్తున్నది. కొద్దిదూరంలో వున్న చమురు దీపం వత్తి తగ్గించి వున్నది. అంత దూరానికి దాని మసక వెలుతురు సరిపోవడంలేదు. ఆనందబాష్పాలతో నిండిన కనులకు అంత స్పష్టంగా కనబడడంలేదు.
 
పొట్టమీదున్న పంటచేను కావలి వెళ్ళడానికి సిద్ధమైనట్లున్నాడు మల్లన. బరిసెను బాహుమూలంలో యిరికించుకుని, ఒక చేయి గడ్డం కింద చేర్చి ఏదో ఆలోచిస్తున్నట్లున్నాడు. తనతో యేమైనా జరుగురు ప్రస్తావన వున్నదేమో బహుశా.  
 
'ఎవరూ? నాయనా! మల్లనా?' అనునయంగా పిలిచాడు. సమాధానం లేదు.
 
'ఏమిటి నాయనా? కావలి వెళ్ళడానికి బద్ధకిస్తున్నావా? పోనీ నేను వెళ్లేదా?'
 
వులుకూ పలుకూ లేదు.
 
ఏదో గంభీరమైన విషయమే అనుకుంటూ లేచాడు. భుజాలమీదుగా  ఉత్తరీయాన్ని కప్పుకుంటూ వెళ్లి భుజంమీద మృదువుగా  తడుతూ  విషయం  యేమిటో అడగబోతూ పరికించి చూశాడు. ఒక్కసారిగా 'ప్రభూ' అంటూ ఆనందంతో నిలువెల్లా కంపించిపోతూ ఆ మూర్తి పాదాలమీదవాలిపోయాడు.
అరచేతులలో ఆ మృదువైన పాదాలను ఉంచుకుని అబ్బురంగా పుణుకుతూ  తలెత్తి చూశాడు. 
 
కౌసల్యానందవర్ధనుడు! దాశరథి! మైథిలీమనోహరుడు! అయోధ్యానాథుడు! శ్రీరామచంద్రమూర్తి! భుజానికి బలువైన విల్లు వ్రేలాడుతున్నది. నల్లని గిరిజాల జుత్తు  భుజాలమీదకు వాలుతున్నది. కాలుమీద కాలువేసుకుని, తళుకులీనుతున్న చెంపకు చేయిచేర్చి, కోరగా చూస్తున్నాడు 
కోదండరాముడు. నల్లకలువలలాంటి  నాజూకైన కనులు ఎందుకో  మంకెనపూలైనాయి. 
 
అరచేతులలోని పాదాలను అలాగే మృదువుగా స్పృశిస్తూ నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. 'తండ్రీ! రామచంద్రా!' అంటూ స్వామి ముఖంలోకి  పరవశంగా చూశాడు. నిష్ఠూరంగాచూసి, ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు  స్వామి. 
 
'జగన్నాథా! జానకీపతీ!'
 
నిలువునా చురచురా చూసి మరలా ముఖం తిపుకున్నాడు స్వామి.
 
'ఆ? స్వామీ! అలుకా? నావలన యేదైనా అపచారం జరిగిందా?' 
 
రుసరుసలాడుతున్నట్లు చూశాడు స్వామి. పలుకులేదు. భరించలేని మౌనం! 'స్వామీ! స్వామీ! మాట్లాడు తండ్రీ! నావలన ఏం పొరపాటు జరిగింది తండ్రీ?'
 
చివాలున ముఖం యిటు తిప్పి చురుక్కున చూశాడు స్వామి. అబ్బ! ఆ కోపం ఎంత అందంగా వుంది! మౌనంగా ఒక్క నిముషం చూశాడు స్వామి. తూచి తూచి అడిగాడు. 
 
'నేనేం చెప్పాను? నువ్వేం చేశావు?'
 
'నువ్వు చెప్పినట్లే చేశానుకదా తండ్రీ!'
 
మరలా మౌనం. అలుకగా అలానే చూస్తున్నాడు స్వామి.
 
'నీ యాజ్ఞనే నెరవేర్చాను కదా తండ్రీ! నీ దయవల్లనే  భాగవతాన్ని తెనిగించాను. నీప్రసాదలబ్ధఫలాన్ని నీకే సమర్పించాను!'
 
'నాకే సమర్పించావా? నేనేమడిగాను? నా నామాంకితంగా భాగవతాన్ని తెనిగించుమని అడగలేదా నిన్ను?  
 
'అయ్యో! ఎంతమాట! అలా ఆగ్రహించకు తండ్రీ. నీకే అంకితం చేసి ధన్యుడినైనాను కదా దాశరథీ!'
 
'ఔనా! నాకు అంకితమిచ్చావా? బమ్మెరవారు బహుచమత్కారులు. 'హారికి, నందగోకులవిహారికి, రుక్మిణీమనస్థాయికి, బాణహస్త నిర్మూలికి, యింద్రనందన నియంతకు' అంటూ సమర్పించి, నాకు 
యిచ్చానంటున్నావే! కథ నాకు వినిపించి, కావ్యాన్ని 'కాళియోరగ విశాలఫణోపరినర్తనక్రియారంత'కు అంకితమిచ్చావు కాదూ?'  
 
'ఆ!? అదేమిటి స్వామీ! యిద్దరూ ఒకటే కదా! యిందరిలో, అందరిలో  నీవేకదా!'
 
మందహాసం చేశాడు స్వామి. 'వ్యాసాంశజుడివి! నీవెరుగనిదా? యిద్దరమూ ఒకటే అయితే యిద్దరమెందుకు? మూలకారణమొక్కటే కానీ, మూర్తులు, తత్త్వములు, ప్రయోజనములు వేరు కాదూ? మీ యమ్మను వెంటబెట్టుకుని మరీ వచ్చానే! సీతాసమేతుడనై వచ్చి, నేను రామభద్రుడిని, నాకు 
అంకితంగా భాగవతాన్ని తెలుగులోకి అనువదించుమని అడిగానని నీవే చెప్పావు కాదూ?' 
 
పిడుగుపాటు పడినట్లైంది! అరచేతులలోని పాదములను  కన్నీటితో  అభిషేకించాడు. 'తండ్రీ! తండ్రీ! ఎంతపని జరిగింది! అయ్యో! ఎంత పొరపాటు జరిగింది! రామా! శ్రీరామా! రామచంద్రా! అపచారం 
చేశాను నా తండ్రీ' పాదములను విడువకుండా విలపిస్తూ తల్లడిల్లిపోయాడు పోతరాజు.  
 
**********************              ************************             ********************* 
 
చప్పున మెళకువ వచ్చింది. తలగడ, చెక్కిళ్ళు కన్నీళ్ళతో చివికిపోతున్నాయి. చెవులు కన్నీరు నిండిన చెరువులైనాయి. విలపిస్తూనే పూజాగృహంలోకి పరుగెత్తాడు పోతరాజు. సీతాలక్ష్మణహనుమత్సమేత 
కోదండరాముడు నిలదీస్తున్నట్లుగా నిలబడివున్నట్లు కనిపించాడు ఆయన కనులకు. 
 
సువాసనలీనుతున్న చందనపు పేటిలో భద్రపరచి వున్నది తెనుగుల పుణ్యపేటి. పట్టువస్త్రముతో పదిలంగా, పవిత్రంగా కప్పబడివున్నది రామభద్రుడు పలికించిన భవహరమైన తెనుగు తేనెల భాగవతం. 
పట్టువస్త్రపు ముడులు విప్పాడు. పరిమళములను వెలువరిస్తున్న తాళపత్రముల దొంతరను గుండెలకు హత్తుకున్నాడు. నవ్వుతున్న  నెమలికన్నును కురుస్తున్న కనులకు అద్దుకున్నాడు. 
 
'మల్లన్నా! నాయనా! మల్లన్నా!' శోకంతో రుద్ధమైన గొంతుతో ఎలుగెత్తి పిలిచాడు. పరుగున ఆందోళనగా వచ్చాడు మల్లన. ఆ వెనుకే కలవరపడుతూ, పరుగులుపెడుతూ వచ్చారు ధర్మపత్నీ, చిన్నతల్లి. వెక్కిళ్ళమధ్య తండ్రి చేసిన ఆజ్ఞాపన విని నిర్ఘాంతపోయాడు మల్లన. 'ఎందుకంత కఠినమైన నిర్ణయం తండ్రీ! మీ జీవితలక్ష్యమని మురిసిపోయారే, ఎందుకిలా? సింగభూపాలుడు దౌర్జన్యముగా స్వంతము చేసుకుంటానని బెదిరించాడా? ఎందుకిలా తండ్రీ?' మల్లన కంఠం కూడా శోకముతో గద్గదమైంది.
 
'లేదు! లేదు! సింగభూపాలుడు సజ్జనుడు! సాధుస్వభావుడు' అన్నాడు పోతరాజు. దుఃఖముతో అంతకన్నా ఎక్కువ మాటలాడలేకపోయాడు. 'మల్లనా! వెళ్ళు నాయనా! పలుగు..' అంటూ పలుకురాక కసంద్రంలో మునిగిపోయాడు. కనులు తుడుచుకుంటూ భారముగా బయటకు నడిచాడు మల్లన.  పవిటచెంగుతో కనులు అద్దుకుంటున్న తల్లి చీరకుచ్చిళ్ళలో దిగులుగా చేరింది చిన్నతల్లి.
 
పలుగు, పార పట్టుకుని లోపలికివచ్చాడు మల్లన. ప్రభువు రాముడికి నమస్కరించి పూజామందిరానికి ఎదురుగా నేలను చూపించాడు పోతరాజు. నీరు నిండిన కనులను తుడుచుకుంటూ, కంపిస్తున్న చేతులతో త్రవ్వడం మొదలుబెట్టాడు మల్లన.
 
************************              ************************           *********************
 
'పోతరాజా! పోతరాజా!'
 
'శ్రీరామా! వచ్చావా తండ్రీ!'
 
'ఊ! ఇక పద!'
 
'సిద్ధంగా వున్నాను తండ్రీ! ఇక ఏ కోరికా లేదు! ఏమీ వద్దు! నీలో కలిసిపోవడమే!'
 
'నా కోరిక తీరలేదుగా పోతరాజా! అప్పుడే నాలో కలిసిపోతే ఎలా? కొంతకాలం నా సన్నిధిలో సేద దీరుదువుగాని! నన్నే పలికి, నన్నే పాడి, నాకోసమే ఆడి నాకే ఊడిగం చేద్దువుగాని. రామ నామామృతం నీ నోట ప్రవహించాలి. రామదాస పరంపర అనంతంగా కొనసాగాలి. ఆతరువాత నాలో చేరుదువుగాని. అవునూ! ఏదీ నాకు వినిపించిన కథ?'
 
'.....        .....    ....    ....  ..'
 
'ఎందుకలా మౌనంగా కన్నీరు పెట్టుకుంటావు మహాకవీ? ఏదీ యిలా చూడు!'
 
'ఆ! శ్రీకృష్ణా! యదుభూషణా! ఆహా! త్రిజగన్మోహన నీలకాంతి..'  
 
మందహాసపు కాంతివాక! 
 
'ఏదీ నా లీలామృతం? నేలమాళిగలో బంధించావేం? పన్నెండు స్కంధాలు! పన్నెండు వత్సరాలు! బయటకు తీయించాలని మల్లనకు నీలా చెప్పానులే! మహాకవీ! మందారమకరందమాధుర్య ఝరీ! అంతా నా లీల! అపరవ్యాసా! స్వాత్మారామదాసా! నారద, ప్రహ్లాద, వాల్మీకి, వ్యాస, శుక, భీష్మ,  పోతరాజ,  రామదాస పరంపర అనంతంగా కొనసాగాలి! యిలా రా! యిదిగో! నా వేలు పట్టుకో! పద!'
 
రామచిలుక ఎగిరిపోయింది యింకొక కొమ్మమీద వాలడానికి!
 
*******************                **********************             ***********************
 
'ఛెళ్ళు'న మోగింది కొరడా. 'రామా!' అన్న గోపన్న ఆర్తనాదం వెలువడింది. గోల్కొండ ఖైదుగోడలు ప్రతిధ్వనులతో  దద్దరిల్లిపోయాయి. కొరడాకున్న  యినప ముళ్ళపూసలు కసిదీరా కాటువేశాయి. ఇప్పుడిప్పుడే ఎండిపోతున్న  నిన్నటి దెబ్బల పుండ్లు నల్లగా నోళ్ళు తెరుచుకున్నాయి. ఉబుకుతున్న  వెచ్చని కన్నీళ్లు ఎఱ్ఱని రక్తంతో కలిసి, అట్టకట్టి ఎండిపోయిన పట్టు ధోవతీని  మరలా తడుపుతున్నాయి. పన్నెండు సంవత్సరాలుగా  ఆయన శరీరంమీదే వేడి కన్నీళ్ళతో, వెచ్చనెత్తురుతో నానుతూ ఎండుతూ వున్నది ఆ పట్టువస్త్రం. పట్టువస్త్రం చుట్టిన పంజరంలా వున్నాడు గోపన్న. బాధతో  మెలికలు  తిరిగిపోయాడు.
 
'హరాంకోర్! బాప్ కా జాగీర్ సంఝే' అని పళ్ళు పటపట కొరికాడు నవాబు సైనికుడు. కొరడా మళ్ళీ గాలిలోకి లేచింది.
 
'అబ్బబ్బ దెబ్బలకు తాళలేరా 
రామప్ప గొబ్బున నన్నేలుకోరా'
 
గోపన్న గొంతునుండి కృతి ఆర్తిగా సావేరిలో శోక సాగరమై ఎగిసింది. కొరడా మళ్ళీ ఛెళ్ళుమన్నది.
 
మేలుచేయుదు నంటిగదరా 
మేలుచేసితినేమి భయమంటి గదరా
వరహాలు మొహరీలు జమజేస్తిగదరా 
నీ పరిచారకులకు నే పెట్టితిగదరా
 
కొరడా ఆగకుండా మోగుతున్నది. గోపన్న గొంతు  ఆగకుండా  ఆర్తిగా  మోగుతున్నది. గోల్కొండ ఖిల్లా మారుమోగుతున్నది. 
 
'నీ యబ్బ సొమ్మా? చోర్! లూట్ మార్' కరకుగా ఒక గొంతు అరుస్తున్నది. కసిగా కొరడా దెబ్బ పడినచోటల్లా రక్తంతో మెరుస్తున్నది. ఆగకుండా శోకరస సమ్మిళితంగా ఒక గొంతు గానరసం కురుస్తున్నది. 
 
'పరులకొక్కరువ్వ యీయలేదుగదరా 
ఓ పరమాత్మ నీ పాదముల్‌ నమ్మితిరా
కొరడాలు తీసుక గొట్టిరిగదరా 
హరనుత గోవింద హరితాళలేరా' 
 
కొరడాదెబ్బల జోరు పెరిగింది. ఇక శక్తిలేనంతవరకూ కసిదీరా బాది ఎత్తైన  మెట్లమీదినుండి ఈడ్చుకుపోయాడు. జైలు గదిలోకి మెడ పట్టుకుని తోసి, యినప తలుపు మూసి తాళం వేసి వెళ్ళిపోయాడు సైనికుడు. వుండచుట్టి  విసిరేసిన గుడ్డలా రాతిగోడకు కొట్టుకుని కుప్పలా కూలిపోయాడు గోపన్న.
తల తగిలి నీళ్ళకుండ భళ్ళున పగిలిపోయింది. అడుగున ఎక్కడో వున్న నీళ్ళు ఆయన కన్నీళ్ళతో కలిసి కారిపోయాయి. 
 
'రామా! దాహం..దాహం..' గొణుగుతూ స్పృహ తప్పుతుండగా యినపతలుపు  కిర్రుమన్నది. 'యా అల్లా!' అంటూ లోపలకు వచ్చాడు అప్పుడే సాయంకాలం  విధిలో చేరిన సైనికుడు. గోపన్న స్థితిని గమనించాడు. పరుగున బయటకు వెళ్ళి చల్లని నీళ్ళకుండతో లొపలికి వచ్చాడు. పడుకునే బండరాతిపలకపైకి గోపన్నను చేర్చి నీరు తాగించాడు. కాళ్ళూ చేతులు గొలుసులతో బంధించాడు. జైలుగది తలుపు మూసి తాళం వేసి బయట కూలబడ్డాడు. 
 
మోకాళ్ళలో తలను దాచుకుని విలపిస్తూ జైలు గోడలు కరుణతో కరిగేలా  మొదలుబెట్టాడు గోపన్న.
 
'సీతారామస్వామి నే జేసిన నేరంబేమి?
ఖ్యాతిగ నీ పదపంకజములు నే
ప్రీతిగ దలపక భేదమెంచితినా..'
 
కావలివాడు చువ్వలకు ముఖం ఆనించి లోపలకు చూస్తూ జాలిగా అడిగాడు గోపన్నను.  'దెబ్బలకు  చచ్చిపోతావు బాపనయ్యా! రామ్డు గీమ్డు ఎవ్వళ్ళేడు. వుంటే యిన్నేళ్ళు ఖైదుంటావ్?'
 
నీరసంగా తల ఎత్తి అతడిని చూశాడు గోపన్న. రాతి గోడలమీద  సుద్దముక్కలతో తను తీర్చిన రాముడి రూపాన్ని నీళ్ళు నిండిన కనులతో  చూశాడు. జాలిగా ప్రశ్నించాడు. నాదనామక్రియానాదం నరాల తీగల      వీణానాదంలా మోగింది.
 
'ఏమిర రామ నావల్ల నేర మేమిరా రామ
ఏమిర రామ యీ కష్టము నీమహిమో నాప్రారబ్ధమో'
 
'నీ పిచ్చి!' అన్నట్టు జాలిగా చూసి నుదుటిమీద కొట్టుకున్నాడు కావలి భటుడు.
 
'కుండలిశయన వేదండ రక్షకా
అఖండతేజ నాయండ నుండవే ..
పంకజలోచన శంకరనుత నా
సంకటమును మాన్పవె పొంకముతోను ..'
 
 
వినీ వినీ విసురుగా లేచాడు కావలివాడు. 'పాగల్ బొమ్మన్. తుం నహీ సున్తే.. నహీ సుధ్రోగే' తల విదిలిస్తూ మెట్లు దిగి వెళ్ళిపోయాడు. మూకుడులో సంకటితో తిరిగివచ్చాడు. చువ్వల తలుపుల కిందినుండి మూకుడు లొపలికి నెట్టాడు. నెమ్మదిగా లేచాడు గోపన్న. గొలుసులతో కట్టేసిన కాళ్ళను 
నెమ్మదిగా ఈడుస్తూ వెళ్లి, మూకుడు అందుకున్నాడు. గోడమీది రాముడి పాదాలపై తలవాల్చాడు. కన్నీళ్లు రాల్చాడు. ఆత్మనివేదన చేశాడు. కుండలోని నీళ్ళతో సంప్రోక్షణ చేసి సంకటిని నివేదన చేశాడు. అరచేతిలో పట్టే సంకటి ముద్దను అయిష్టంగానే తిన్నాడు. రేపటి చిత్రవధను తట్టుకోడానికి శక్తికావాలికదా. వంగి చిత్తరువుకింద పెద్ద బండరాతిపై వున్న తాళపత్ర గ్రంథాన్ని అందుకున్నాడు.
 
భద్రాచలం తహశీల్దార్ గోపన్నగారు ప్రత్యేకంగా వ్రాయసగాళ్ళను నియమించి వ్రాయించిన తాళపత్ర ప్రతి అది. బమ్మెర పోతనామాత్య విరచితమైన ఆంధ్రమహాభాగవతం! మరలా కాళ్ళు ఈడ్చుకుంటూ  రాతిశయ్యపైకి  చేరుకున్నాడు. కంపించే చేతులతో నెమ్మదిగా వెతికి తెరిచాడు. గాన పారాయణం మొదలుబెట్టాడు.     
 
'లావొక్కింతయు లేదు.. రావె ఈశ్వర కావవే వరద..' జైలు గోడలు ధన్యత్వంతో పులకరిస్తున్నాయి. ఎంతసేపు గడిచిందో తెలియదు. అలాగే బండమీదికి ఒరిగిపోయాడు. గదిలోకి వస్తున్న గాలికి తాటాకులు గలగలలాడుతున్నాయి. గుండెలమీది భాగవతం గుసగుసలు చెబుతున్నట్లున్నది. 
 
కొన్ని గంటలు గడిచాయి. తెలతెలవారుతున్నది. విశాలమైన వృక్షాలమీది పక్షుల కిలకిలలు పక్కవాయిద్యాలైనాయి. జైలుగది రాతి గోడలు గోపన్న గానంతో మధురంగా మారుమ్రోగుతున్నాయి.
 
'..అబ్బా! తిట్టితినని ఆయాసపడవద్దు రామచంద్రా!
ఈ దెబ్బలకోర్వక అబ్బా! తిట్టితినయ్యా రామచంద్రా'
 
కొరడా దెబ్బలకు ఒళ్లంతా పుళ్ళుపడి, సొమ్మసిల్లి ఎప్పుడు నిదురించాడో, ఎప్పుడు మేల్కొన్నాడో, ఎలుగెత్తి పాడుతున్నాడు గోపన్న.
 
'సర్కారు పైకము తృణముగనెంచకు రామచంద్రా
దెబ్బలకోర్వను యప్పుదీర్చుమయ్య రామచంద్రా
ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్ను
రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా'   
 
కిర్రున జైలుతలుపులు తెరుచుకున్నాయి. తాళం తెరిచి, గొలుసులను విడదీసిన ధ్వనులను కప్పివేస్తూ ఖైదు కావలిభటుడి కంఠం వినయంగా వినిపించింది. 
 
'రాందాస్ జీ! తమరి నౌఖర్లట.. రామోజీ, లక్ష్మోజీ అట.. యిద్దరు వచ్చారు! తమరి బాకీ చెల్లించి తానీషావారి రసీదు తీసుకున్నారు! తమరిని విడుదల చేసి సగౌరవంగా యింటికి చేర్చాలని తానీషా వారి హుకుం! దయచేయండి!
 
************************             ***********************            ********************
 
అదిగో భద్రాద్రీ! గౌతమి యిదిగో చూడండీ!
ముదముతొ సీత ముదిత, లక్ష్మణుడు 
కదిసి కొలువగా కలడదె రఘుపతి 
 
చారు స్వర్ణప్రాకార గోపుర
ద్వారములతొ సుందరమై యుండెడి
అదిగో భద్రాద్రి గౌతమి యిదిగో చూడండి 
 
రాముడు పరవశుడయేలా గానగంగాప్రవాహం గోదావరీ ప్రవాహంతో పోటీ పడుతున్నది! ఆ మధుర మురళీగానానికి మెళకువ వచ్చి చటుక్కున లేచి కూర్చున్నాను. హాలులోనుండి మంగళంపల్లివారి గానమకరందం ప్రవహిస్తున్నది.
 
ఎంత అందమైన కల! ఎంత అదృష్టం! యిద్దరు  కారణజన్ముల దర్శనం అయింది, కలలో ఐతేనేం? ఆలోచనలలోనే నా చూపు టీపాయ్ మీద వున్న పుస్తకాలపై పడ్డది. ఆంధ్రమహాభాగవతం అయిదు సంపుటాలు, పక్కన 'భద్రాచల రామదాస' కీర్తనలు. గోడమీది గడియారం అయిదున్నర చూపిస్తున్నది. బయట కురుస్తున్న మార్గశిరమాసపు మంచు చల్లదనం గదిలో తెలుస్తున్నది.  
 
దర్శనమా? స్వప్న దర్శనమా? దివ్య సూచనా? అందమైన ఊహయేనా? కాలగర్భంలో నిక్షిప్తమైన రహస్యవివరణ జరిగిందా? పోతన పుణ్యమూర్తి రామదాస రమ్యమూర్తి అయిందా? అవునంటూ కోదండరాముడి గుడిగంటలు ఘల్లుమన్నాయి. అందమైన అనుభూతులు అల్లుకున్నాయి.  
 
(సమాప్తం) 
            
Vara Prasad!