నా చిన్ననాటి జ్ఞాపకం - అన్నపూర్ణ. జొన్నలగడ్డ

Memories of my childhood

బస్సు రెండు సార్లు హారను కొట్టింది. డ్రైవరు మెల్లిగా బ్రేకు వేస్తూ వస్తున్న బస్సు స్టాపు వద్ద ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కండక్టర్ జొన్నడ స్టాపు "దిగాలి... దిగాలి.." అన్నాడు. అమ్మ నేను దిగి ఒక నాలుగు అడుగులు వెనక్కి వేశాం. అక్కడే ఒక నుయ్యి, దాని పక్కనే చిన్న అమ్మవారి గుడి. ఆ గుడి కి ఎదురుగా రోడ్డు కు అటువైపు ఉంది,, జొన్నడ ఊరు స్వాగత రాతి తోరణం. కోనసీమ అందాలు పచ్చగా నవ్వుతున్నాయ్. రోడ్డు దాటి మా నడక మొదలు అయ్యింది.చిన్న దారి, ఎర్ర మట్టి రోడ్డు, తెల్లవారు ఝామున కాస్త వాన జల్లు కురిసిందేమో, కొంచం బురద గా ఉంది. అదిగో చెరువు మొదలు అయ్యింది. ఆ ఊరికి అదే ఆధారం. సైకిళ్ళు మీద అరటి గెలలు, కూరగాయలు వేసుకుని వెళ్తున్నారు. వాళ్ళని దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇంతలో చిన్న బడ్డి కొట్టు, అందులో కడియాల మామ్మ, పొడుగు తాత నవ్వుతూ పలకరించారు "వచ్చారామ్మ! పాప గారా?" అని నవ్వుతూ ... ఉండండి అని ఒక కలరు సోడా తుస్సుమనిపించి ఇచ్చింది. "తాగమ్మ ఎండగా ఉంది కదా.." అంది. అమ్మ వంక చూసాను, అమ్మ "ఇవన్నీ ఎందుకు ....ఇంటి నుంచే వచ్చాము" అంది. మామ్మ ఊరుకోలేదు "తగానీయాండమ్మ పాపగారు అలసిపోయి ఉంటారు" అంది. నేను తాగుతూ మామ్మనే చూస్తున్నాను, మొహానికి పసుపు రాసుకుని, రూపాయి కాసంత బొట్టు, నెరిసిన జుట్టు, పక్క ముడి వేసుకుని ఉంది. ముక్కుకు నత్తు, కాస్త పైకి కట్టిన నేత చేర, కాళ్ళకి వెండి కడియాల తో పల్లె మా తల్లి లా అందం గా ఉంది. సోడా తాగడం అయ్యాక తాత 4 పిప్పర్మింట్ బిళ్ల లు చేతిలో పెట్టాడు. "ఇవి కూడా ఎందుకు" అంది అమ్మ. "పోనిలేండమ్మ... తింటారు" అంది మామ్మ. వాళ్లు లక్ష్మీ, సోమరాజు జంట. వారికి పిల్లలు లేరు, ఊళ్ళో ఉన్న పిల్లలే వారి పిల్లలు, ఆ చిన్న బడ్డి కొట్టుతో వారికి గడిచిపోతుంది. అక్కడ నుంచి ముందుకు వెళ్ళాం. నాగేశ్వరరావు అనే అతను ఎదురు వచ్చి అమ్మ చేతిలో ఉన్న రిజిస్ట్రరు ఫైళ్లు తీస్కుని, పక్కన ఉన్న పాలె కాపు కి "డాక్టరమ్మ గారు వచ్చారని సత్యవతి అమ్మ గారితో చెప్పు" అన్నాడు. అమ్మ ఆ ఊరికి డిస్పెన్సరీ డాక్టరు. రోజూ జొన్నాడ వెళ్లి పని చేసి వస్తుంది. మా నివాసం రాజమండ్రి దగ్గర కొవ్వూరు. గవర్నమెంట్ వారు డిస్పెన్సరీ భవనం ఇంకా కట్టలేదు, ఆ ఊరి రైస్ మిల్లు లో ఒక గది ఇచ్చారు పంచాయతీ వారు. నాగేశ్వరరావు తలుపులు తెరిచి, పుస్తకాలు లోపల పెట్టి ఉంచాడు. అమ్మ తన పని తాను మొదలు పెట్టుకుంది. పేషెంట్లు రావటం మొదలయ్యింది. బైట మెట్ల మీద కూర్చుని చుట్టూరా చూస్తున్నాను, అంతా పంట పొలాలు, దూరం గా మేత మేస్తున్న పశువులు. ఇంకో వైపు ఊరి చెరువు చుట్టూ పనులు చేసుకుంటున్న జనం. ఎత్తయిన గట్ల మీద నుంచి చెరువు లో దుముకుతున్న పిల్లలు.... ఇంతలో సత్యవతి అమ్మగారి ఇంటి నుంచి కాఫీ వచ్చింది. కమ్మటి వాసన చిక్కటి పాలతో చేసింది కదా మరి. "ఇవాళ నాతో పాటు మా అమ్మాయి వచ్చిందని సీత అమ్మగారి తో చెప్పు రంగయ్య" అంది అమ్మ. భోజన విరామం కోసం డిస్పెన్సరీ కట్టేసి నేను, అమ్మ బయలుదేరాం. ఒక మలుపు తిరిగాక, అక్కడ ఎంకనిపించారు సత్యనారాయణ మాష్టారు. వచ్చారా అని పలకరించారు. నన్ను చూపించి ఇదిగో మా అమ్మాయి అని చెప్పింది అమ్మ, "ఎమ్మా అమ్మ తెచ్చే చందమామ పుస్తకాలు అన్ని చదువుతున్నావా" అన్నారు. అప్పుడు అర్ధం అయ్యింది ఆ పుస్తకాలు అన్ని మాస్టారు ఇచ్చేవని. ఆయన రిటైర్డ్ స్కూల్ హెడ్ మాస్టరు. ఖాళీ గా ఉండకుండా ఇలా చిన్న లైబ్రరీ పెట్టుకున్నారు. అక్కడ నుంచి ఏడు నాపరాళ్లు ఉన్న అరుగు వెంట నడుస్తూ వెళ్తే వచ్చింది ఎత్తు అరుగుల ఇల్లు, అదే సీతమ్మ గారి ఇల్లు. మాధవయ్యగారు, సీతమ్మ గారు ఊరిలో పెద్దలు. ఆయన పోస్టు మాస్టారు. వారి మీద ఆధార పడిన వారి అక్క అప్పాయి గారు(బాల వితంతువు). ఆరు మెట్లు ఎక్కి లోపలికి వెళ్తే ఒక వాసారా, అది దాటి వెళ్తే చిన్న చావిడి దానికి ఒకవైపు వంటిల్లు, వంట పూర్తయ్యి మడి బట్ట ఆరేస్తూ సీతమ్మ గారు పలకరించారు, రామ్మా రా... రోజు అమ్మ భోజనం అక్కడే ఆవిడ ఇంటి నుంచి అన్నం మోసుకుని రావకర్లేదు, నేను వేడిగా పెడతను తిను అని అమ్మని చనువు గా వారి అమ్మాయి తో సమానం గా చూసుకుంటారు. అమ్మ నెల జీతం రాగానే వారి ఇంటికి వీలైనన్ని సరుకులు, కూరలు పంపుతుంది. అక్కడ నించి సత్యవతి అమ్మ గారి ఇంటికి వెళ్ళాం. అందరూ వచ్చి పలకరించారు. నాతో బోలెడు కబుర్లు చెప్పారు. అమ్మమ్మ గారైతే నన్ను ఉన్నంతసేపు ఇది తిను అది తిను అని చాలా గారం చేశారు. మళ్ళీ డిస్పెన్సరీ తెరిచే వేళ అయ్యిందని మేము లేచాం. సాయంత్రం టీ పుంపుతాను తాగాక బయలుదేరండి అని చెప్పారు సత్యవతి అమ్మ గారు. ఈ రెండు కుటుంబాలకు అమ్మ ఇంట్లో మనిషి. సాయంత్రం టీ తో పాటు ఒక సంచి, అందులో పరంపర పనాస పళ్ళు, జొన్న పొత్తులు, కూరలు ఉన్నాయి. బస్సు ఎక్కడానికి వెళ్తూ మళ్ళీ కడియాల మామ్మ దగ్గర ఆగాము. "లక్ష్మీ ఒక సంచి తీస్కురా" అంది అమ్మ. అందులో కొన్ని కూరలు, జొన్న పొత్తులు వేసింది." మాకెందుకమ్మ, ఇంట్లో అందరూ తింటారు కదా...," అని అంది కడియాల మామ్మ. మళ్ళీ బస్సు స్టాపు కి వచ్చాము, నేను అమ్మని అడిగాను... అమ్మ, మనకి ఇచ్చిన వాటిల్లో కొన్ని కూరలు అవి మామ్మ కి ఎందుకు ఇచ్చావు అని. అమ్మ నవ్వి.... చూడు తల్లి మనం ఎప్పుడు ఒకరి దగ్గర తీసుకోవటమే కాదు, అంతకంటే ఎక్కువ కాకపోయినా కొంతైనా మనం తిరిగి ఇస్తే వాళ్ళు సంతోషం గా అక్కర అవుతారు. ఊరు మనకి చాలా నేర్పుతుంది. అందులో మనుషులు ఇంకా ఆప్యాయత పంచుతారు అని అంది. మనతో కలుపుకున్న వారు ఆత్మీయులు, ఆదుకున్న వారు బంధువులు, ఏదైనా మన చేతిలో ఉంది. మనమే తెలుసుకోవాలి. ఇది నా జ్ఞాపకాలలో ఒక మంచి పాఠం.😊😊