బంగార్రాజు పెళ్ళి - పద్మావతి దివాకర్ల

Bangaraju married

ఆదివారం పూర్తిగా తెల్లారిపోయి బారెడు పొద్దెక్కినా హాయిగా ఇంకా ముసుగుతన్ని కమ్మని కలలుకంటూ పడుక్కొని నిద్రపోతున్న బంగార్రాజుకి చాలాసేపట్నుంచి సెల్‌ఫొన్ మోగడంతో నిద్రాభంగమైంది.  నిద్రమత్తుతో పూర్తిగా కళ్ళు తెరవకుండానే ఫోనెత్తాడు.

"ఓరీ బడుద్ధాయీ!  ఇంకా లేవలేదా ఎమిటి, ఇంతసేపైంది ఫోనెత్తడానికి?  ఒరేయ్ శుంఠా!  నీకెన్నిసార్లు చెప్పాలిరా బారెడు పొదెక్కేదాకా నిద్రపోకూడదని!  ఇలా అయితే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయిరా!" ఇలా తండ్రి వీరభద్రం అష్టోత్తర తిట్లదండకం ఫోన్లో వినబడేసరికి దెబ్బకి క్షణంలో నిద్రమత్తు వదిలిపోయి లేచికూర్చున్నాడు బంగార్రాజు.

"ఏంటి నాన్నా!  ఇంకా నన్ను చిన్నపిల్లాడిలా తలంటుతున్నారు?  ఇప్పుడు నేను పెద్దవాణ్ణి తెలుసా! పైగా ఉద్యోగస్తుణ్ణి." నసిగాడు బంగార్రాజు తండ్రి వీరభద్రం మాటలు వినగానే.

"ఏడిసావుగాని వెంటనే మన ఊరికి రా!  పక్క ఊళ్ళో ఓ మంచిపెళ్ళి సంబంధం ఉంది. పెళ్ళిచూపులకి వెళ్ళాలి. సాయంకాలం మంచి ముహూర్తం ఉందన్నారు పంతులుగారు!  వెంటనే లేచి తయారయి బయలుదేరు." ఆర్డరేసాడు వీరభద్రం.

నెత్తిమీద పిడుగుపడినట్లు చలించిపోయాడు బంగార్రాజు.

"ఎన్నిసార్లు చెప్పాలినాన్నా, నేనిప్పుడప్పుడే పెళ్ళిచేసుకోనని?  ఓ మూడు నాలుగేళ్ళు దాటాక అప్పుడు ఆలోచిద్దాం." అన్నాడు బ్రతిమిలాడుతూ, గట్టిగా చెప్తే తండ్రి రెచ్చిపోయే ప్రమాదం ఉందని గ్రహించి.

"వెధవాయ్! అదేం కుదరదు.  నువ్వు వచ్చి తీరాలి!  ఇప్పటికే నీకు పెళ్ళిసంబంధం తేవడం కష్టమైపోతోంది.  ఇప్పుడు నీకు నెత్తిమీదకు ఎన్నేళ్ళు వచ్చాయో అసలు గుర్తుందా?  మొన్నే ముఫై దాటాయి తెలుసా?  ఇంకో మూడునాలుగేళ్ళు ఆగితే నీకు పెళ్ళికుదరడం చాలా కష్టం.  బెండకాయి ముదిరినట్లు ముదిరితే ఇక అంతే సంగతులు! ఇప్పటికే చాలాసార్లు సాకులు చెప్పి తప్పించుకున్నావు.  ఈ సారి ఆ పప్పులేమీ ఉడకవు.  త్వరగా తెములు." అన్నాడు వీరభద్రం కరాఖండీగా ఫోన్ పెట్టేస్తూ.

తండ్రిమీద కోపంతో విసురుగా సెల్ సోఫా పైకి విసిరి మంచం మీదనుండి లేచాడు బంగార్రాజు.

అసలు బంగార్రాజు అలా పెళ్ళిచూపులు తప్పించుకోవడానికి ఓ బలమైన కారణం ఉంది.  అతనికో వింత కోరిక ఒకటుంది.  అతని కోరిక విన్నవాళ్ళు నోరెళ్ళబెడతారు.  చాలామంది అబ్బాయిలు తమకాబోయే భార్య అందంగా, అణకువగా ఉండాలని, బాగా చదువుకొని ఉండాలని, ఉద్యోగస్తురాలై ఉండాలని కోరుకుంటారు.  కొంతమందైతే పై లక్షణాలు ఎలాఉన్నా ఆస్థిపాస్థులు దండిగా ఉంటే చాలనుకుంటారు. కొందరైతే కాబోయే భార్య రచయిత్రిగాని, గాయకురాలు గాని అయితే బాగుండునని కోరుకుంటారు. ప్రేమించి ఆపై పెళ్ళిచేసుకోవాలనే కోరిక చాలామంది యువకులకుంటుంది.

అయితే బంగార్రాజు కోరిక చాలా భిన్నమైనది.  ఆ మధ్య ఓ పాతతరం సినిమా చూసినతర్వాత ఆ కోరిక అతనిలో బలంగా వేళ్ళూనుకుంది.  ఆ సినిమాలో కట్నంకారణంగా పెళ్ళిపీటలమీద పెళ్ళి తప్పిపోయినప్పుడు ఆ పెళ్ళి చూడడానికి వచ్చిన హీరో పెళ్ళికూతురుమెళ్ళో తాళి కడ్తాడు.  ఆ విధంగా అందరి మన్ననలు పొందుతాడు, అందరి పొగడ్తలు అందుకుంటాడు.  ఆ పాయింట్ బాగా ఎక్కేసింది మన బంగార్రాజుకి.

పెళ్ళంటూ చేసుకోవాలంటే అలాగే చేసుకోవాలి.  పీటలమీద పెళ్ళితప్పిపోయిన పెళ్ళికూతురి మెడలో తాళికట్టి తను అందరిముందు ఓ పెద్ద హీరో అయిపోవాలి.  అలా ఓ అమ్మాయి జీవితం బలైపోకుండా కాపాడినందుకు ఆమె తనకు జీవితాంతం పూర్తి కృతఙురాలై ఉండిపోతుంది.  అంతేకాకుండా తన అత్తమామలను ఆత్మహత్యనుండిగాని, హార్ట్ఎటాక్ నుండిగాని కాపాడినవాడవుతాడు.  అప్పుడు అందరూ తనని దివినుండి దిగివచ్చిన దేవుడులా చూస్తారు.  ఆ ఫీలింగ్ చాలు తనకి.

ఎన్ని సినిమాలు చూడలేదు తను?  చాలా సినిమాల్లో పెళ్ళి జరుగుతుండగా, అదీ సరిగ్గా తాళి కట్టబోతున్నప్పుడు హఠాత్తుగా "ఆగండి!" అని వినబడుతుంది.  ఆ తర్వాత కట్నం కారణంగాగాని, ఇంకే ఇతర కారణంవల్లగాని పెళ్ళితప్పిపోవడం చూసాడు తను.  అలాంటి ఒక్కటంటే ఒక్క అవకాశం తనకి వచ్చినా చాలు తన చిరకాల కోరిక తీరడానికి! తండ్రి అంటే భయం లేకపోలేదు, గానీ అతను ఎంత చండశాశనుడైనా, తన పెళ్ళైపోయిన తర్వాత ఆయనే క్షమిస్తాడన్న ధైర్యం బంగార్రాజుది. అందుకే ఎన్ని పెళ్ళిసంబంధాలు తల్లితండ్రి తెచ్చినా ఏదో వంక పెట్టి తప్పించుకుంటున్నాడు బంగార్రాజు.    పోనీ!  అలాకాకపోయినా నిన్నటి తరం సినిమాల్లోలా పెళ్ళి కుదిరిపోయి నిశ్చితార్థం జరిగిపోయిన తర్వాత కూడా, పందిట్లో పెళ్ళిజరిగేలోపు హీరోయిన్ హీరోని ప్రేమించి పెళ్ళిచేసుకునే సీన్స్ కూడా బాగా నచ్చాయి మన బంగార్రాజుకి.  ఇంకాసేపట్లో పెళ్ళిపందిరిలో పెళ్ళి ముహూర్తం ఉందనగా పెళ్ళికొడుకుని కాదని హీరోయిన్ హీరో చేత తాళి కట్టించుకోవడం తను ఎన్నిసినిమాల్లో చూడలేదు?  అలాంటి సన్నివేశాలు కూడా బాగా కిక్కు, థ్రిల్ కలిగించాయి మన బంగారాజుకి.  అలాంటి ఛాన్సైనా ఒకటి దొరికినా చాలు తనకి.  అలాంటి అవకాశం వచ్చినా సరే తను రెడీ!  దానికి కూడా తను తయారుగా ఉన్నాడు.

అందుకే ఎక్కడ, ఏ పెళ్ళి జరుగుతున్నా వెంటనే అక్కడ హాజరవుతాడు మన బంగార్రాజు, తన స్నేహితుల పెళ్ళైనా, బంధువులుగానీ, తెలిసిన, తెలియనివాళ్ళ పెళ్ళైనాసరే, తన పంట పండదా అని.  అయితే, బంగార్రాజుకి అన్ని చోట్లా నిరాశే ఎదురైయ్యేది పాపం.  అతను కలగన్నట్లు ఎక్కడా ఏ పెళ్ళిలోను, తాళి కడుతున్న సమయంలో సినిమాల్లోలా "ఆగండి!" అనే మాట ఇంతవరకూ వినబడలేదు.  ఇంతవరకూ అదృష్టదేవత కరుణించలేదు బంగార్రాజుని.  అలాగే ఏ పెళ్ళికూతురూ తనవంక మొహమెత్తి కూడా చూడలేదు.  పైగా ఆ హీరోల్లా చాలా వేషాలు వేసినా ఫలితం దక్కలేదు.  అయినా నిరాశ చెందలేదు బంగార్రాజు. అలా ఆ లక్కీ ఛాన్స్‌(?) కోసం ఎదురుచూస్తూనే ఓ అయిదేళ్ళు గడచిపోయాయి.

కానీ ఈసారి తను పెళ్ళిచూపులకి వెళ్ళకపోతే ఊరుకునేటట్లు లేడు తన తండ్రి.  అయితే తన కోరిక తీరేదెలా?  తన ఆశయం నెరవేరేదెలా?  అందుకే పట్టువదలని విక్రమూర్ఖుడిలా, సారీ విక్రమార్కుడిలా  వెంటనే తండ్రికి ఫోన్ చేసాడు.

"ఏంట్రా! వెధవాయ్! వేగిరం చెప్పు!  ఇక్కడ పంతులుగారి కోసం కాచుకున్నాను." అన్నాడు వీరభద్రం యధాలాపంగా తిట్ల దండకంతో దీవిస్తూ.

"ఆదివారమైనా పెండింగ్‌పని ఉందని ఆఫీస్‌కి రమ్మంటున్నాడు మా బాస్!  అందువల్ల నేను రావడం కుదరదు నాన్నా." అంటూ బంగార్రాజు అబద్ధమాడాడు ఎలాగైనా పెళ్ళిచూపులు తప్పించుకోవాలని.

"ఉండు! మీ బాస్ ఫోన్‌నంబర్ నా దగ్గర ఎలానూ ఉంది.  అతనికే ఫోన్‌చేసి విషయం తేల్చుకుంటాను.  ఏమైనా తేడా వచ్చిందో చూసుకో మరి!" అన్నాడు వీరభద్రం.

ఆ మాటలు వింటూనే కలవరపడ్డాడు బంగార్రాజు.

తను చెప్పింది అబద్ధమని తేలితే తన తోలు వలిచి డోలువాయిస్తాడు తండ్రి అని భయపడ్దాడు. వెంటనే, "పోనీ!... నేను బతిమిలాడుతా నాన్నా మా బాస్‌కి ఇవాళకెలాగో వదలమని.  నువ్వు ఫోన్ చేయ్యకేం!" అన్నాడు బంగార్రాజు కంగారుపడుతూ.

"అలా దారికిరా!  వెంటనే బయలుదేరి రా!  ఇప్పటికే ఆలస్యమైంది.  నీగురించి అంతా తెలిసిందిలే, అప్పల్రాజు అంతా చెప్పాడులే."  అన్న తండ్రి మాటలు వినగానే గుండె గుభేల్‌మైంది బంగార్రాజుకి.   అప్పుడు గుర్తుకు వచ్చింది బంగార్రాజుకి. 

ఈ మధ్యనోసారి బంగార్రాజుకి బాల్యస్నేహితుడైన అప్పల్రాజు మాటల సందర్భంలో ఇలా అన్నాడు, "అదేంటిరా, బంగార్రాజూ!...నీకోసం మీవాళ్ళు ఇన్ని మంచి సంబంధాలు తెచ్చినా తిరగ్గొడుతున్నావు.  చూడు నేను కూడా నీ వయసువాడినే కదా మరి!  నాకు పెళ్ళై నాలుగేళ్ళైంది. ఇప్పుడు ఓ రెండేళ్ళ అబ్భాయి కూడా మాకున్నాడు కదా!  ఇంతకూ అసలు నీ ఉద్దేశ్యం ఏమిటి?  ఇలా బ్రహ్మచారిగా  ఉండిపోదామనే?"

"అదికాదురా!" అంటూ తన మనసులోని మాట చెప్పాడు బంగార్రాజు.  ఆ మాటలు విని నిర్ఘాంతపోయాడు అప్పల్రాజు.

"ఒరే! ఇదేం వింతకోరికరా నీది!  అందుకేనన్నమాట నువ్వు ప్రతిపెళ్ళికీ ఠంచనుగా హాజరవుతోంది?” అని కొంచెం ఆగి ఏదో తట్టగా, “అయితే, నువ్వు ఆ దురుద్ద్యేశం మీదే నా పెళ్ళికీ వచ్చావన్నమాట!" కొరకొరా బంగార్రాజు వైపు చూసి అన్నాడు.

"ఆహా!...నా ఉద్ద్యేశం అది కాదురా!" అని సర్దిచెప్పబోయాడు.

తనకే ఎసరు పెడదామని చూసిన బంగార్రాజువైపు కొరకొరాచూసి మనసులో కుతకుత ఉడికిపోయాడు అప్పల్రాజు.

"అవునవును!  అప్పటి నీ ప్రవర్తన గుర్తుకువస్తూంటే ఇప్పుడు నీ మీద అనుమానం వేస్తోంది. నా పెళ్ళి ఏ కారణంవల్లనేనా ఆగిపోతే నువ్వు చేసుకుందామనే మిత్రద్రోహీ!" అన్నాడు కోపంగా అప్పల్రాజు.  అతనికి నచ్చచెప్పడానికి విశ్వప్రయత్నం చేసాడు బంగార్రాజు.

అప్పల్రాజు కోపాన్ని పోగొట్టడానికి చాలా కష్టపడవలసి వచ్చింది బంగార్రాజుకి.  కొద్దిసేపటికి కాస్త శాంతపడినాక, "నీ అమాయకత్వం చూస్తే జాలి వేస్తోందిరా!  అప్పటి పరిస్థితికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది.  ఇప్పుడు కట్నంవల్ల కాని, ఇంకే కారణంవల్ల కాని పెళ్ళిపీటలమీదనుండి లేచిపోయే పరిస్థితి లేదు ఏ అబ్బాయికైనా.  అబ్బాయిలకి పెళ్ళి సంబంధాలు దొరకడమే కష్టంగా ఉంది. ఒకసారి పెళ్ళి ఆగిపోతే ఆ అబ్బాయికి మళ్ళీ సంబంధం దొరకడం మరీ కష్టంగా ఉందీ రోజు.  ఇంకా చూసుకుంటే అమ్మాయిల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.  మొన్నామధ్య బీహార్‌లో ఉరుము శబ్దానికి పెళ్ళికొడుకు ఉలికిపడ్డాడని పెళ్ళికూతురు అతన్ని పెళ్ళిచేసుకునేందుకు నిరాకరించింది.  ఉత్తరాదిన ఇంకో ఊళ్ళో పెళ్ళికొడుకు గుర్రమెక్కలేకపోయాడని తెలిసి పెళ్ళికి నిరాకరించిందో అమ్మాయి.  ఇంకో చోటయితే, పెళ్ళికొడుకు స్మార్ట్‌ఫోన్ పట్టుకొని వాట్సప్, ఫేస్‌బుక్ చూస్తూ కూర్చున్నాడని నిరసన తెలిపి పెళ్ళినుంచి వాకౌట్ చేసిందో అమ్మాయి తెలుసా!  అందుకే పనికిమాలిన దురుద్దేశాలు మానుకొని మీ నాన్నగారు చూసిన సంబంధానికి బుద్ధిగా ఒప్పుకొని పెళ్ళిచేసుకొని జనజీవన స్రవంతిలో కలిసిపో మాలాగా!" అర్జనుడికి ఙానబోధ చేసే కృష్ణుడిలా ఫోజు ఇచ్చి మరీ క్లాస్ పీకాడు అప్పల్రాజు.

ఇప్పుడు తండ్రి వద్దనుండి బెదిరింపులు వచ్చినాక మరి తప్పిందికాదు బంగార్రాజుకి.  వెంటనే బసెక్కి ఊరికి బయలుదేరాడు. అసలే గుండెలు పీచుపీచుమంటున్నాయి.  ఇప్పుడు తను పెళ్ళి ఎప్పటికప్పుడు వాయిదా ఎందుకేస్తున్నాడో తెలిసిపోయిందతనికి. ఇంటికెళ్ళగానే రెచ్చిపోయి ఏమంటాడో అని ఆందోళన చెందాడు బంగార్రాజు.

అదిరే మనసుతో ఆటోలో ఇంటివద్ద దిగగానే ఇంటిగుమ్మం బయటే ఎదురుపడ్డారు అతనికి తన తల్లితండ్రులిద్దరూ.   అతన్ని చూస్తూనే తల్లి విశాలాక్షి, "ఎంత ఎదిగిపోయావురా కన్నా!  ఇప్పుడే చెప్పారు మీ నాన్న.  ఎంత గొప్ప ఆశయంరా నీది!  నీ తల్లిగా నేను గర్విస్తున్నా!" అంది బంగార్రాజు తలనిమురుతూ.

"ఆఁ...నువ్వు నీ కొడుకు నిర్వాకానికి గర్విస్తున్నా, నేను మాత్రం గర్హిస్తున్నా!  బుద్దిలేకపోతే సరి! అలాంటి పరిస్థితి ఈ కాలంలో ఎక్కడైనా సంభవిస్తుందా?  పగటి కలలు కనక, బుద్దిగా నేను చూసిన సంబంధం చేసుకో!  ఇంక మనం లేటుచేసామంటే మరి పెళ్ళిసంబంధాలు దొరకవు సుమా! ఇప్పటికే చాలా ఆలస్యం అయింది.  సంబంధాలు తేలేక పేరయ్య పంతులుగారు కూడా దాదాపు చేతులెత్తేసారు.  నీకోసం పుట్టిన అమ్మాయికి ఇంకో పెళ్ళి కుదిరి పెళ్ళైపోతే ఇక ఇంతే సంగతులు!  ఆ తర్వాత పెళ్ళికాని ప్రసాద్‌లా మిగిలిపోవలసి వస్తుంది జాగ్రత్త!”  మెల్లగా సుతిమెత్తగా చీవాట్లేసినా బంగార్రాజుకి సుత్తితో కొట్టినట్లే అనిపించింది.

అప్పల్రాజు ఙానబోధ, ఆపై తండ్రి హెచ్చరిక రెండూ కలసి బంగార్రాజు మెదడుపై తీవ్ర ప్రభావం చూపాయి.  పరిస్థితులకు తలవంచాలా లేక ఎదురీదాలా ఎటూ తేల్చుకోలేకపోయాడు.

సాయంకాలం పెళ్ళిచూపులకి తన తల్లి, తండ్రి, మేనమామ, అత్తతో పాటు పక్క ఊరికి టాక్సీలో అయిష్టంగానైనా బయలదేరవలసి వచ్చింది బంగార్రాజుకి. 

పెళ్ళికూతురు జానకిని వంకపెట్టడానికి ఏంలేదు.  కుందనపు బొమ్మ.   బాగా చదువుకుంది. వీరభద్రానికి, విశాలాక్షికి కూడా  జానకి బాగా నచ్చింది.  చెప్పకేం, బంగార్రాజుకీ జానకి బాగా నచ్చింది.  ముందు కొంచెం బింకంప్రదర్శించినా తండ్రి హెచ్చరిక గుర్తుకువచ్చి నోరుమూసుకు కూర్చున్నాడు.

చివరాఖరికి తన అశయాలు గాలికి వదలి జానకితో పెళ్ళికి ఒప్పుకున్నాడు. బంగార్రాజు ఆశయాలు ఈ నోట ఆ నోటా ఊరు ఊరంతా  అప్పటికే పాకింది. అయితే బంగార్రాజు పెళ్ళికుదిరిన విషయం తెలిసిన తర్వాత పెళ్ళికి రెడీగా ఉన్న యువకులంతా ఊపిరి పీల్చుకొని నిశ్చింతగా గుండెలపై చెయ్యి వేసుకున్నారు.

పెళ్ళిరోజు రానే వచ్చింది. ఆ రోజే పెళ్ళి.  పెళ్ళి మండపమంతా కళకళలాడుతోంది.  పెళ్ళికి వచ్చిన అతిథులతో పెళ్ళిమంటపం చాలా సందడిగా ఉంది.  మగపెళ్ళివారు వచ్చేయడంతో ఆడపెళ్ళివారు హడవుడిపడుతున్నారు.

పెళ్ళి ముహూర్తం ఇంకో గంటలో ఉందనగా ఆడపెళ్ళివారు ఉన్నరూంలో చిన్న కోలాహలం బయలుదేరింది.  పెళ్ళికూతురు తండ్రి పరంధామయ్య కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నాడు.  పెళ్ళికూతురి తల్లి, దగ్గర బంధువులు ఆందోళనగా ఉన్నారు.  విషయమేమిటో బోధపడలేదు మగపెళ్ళివారికి.  ఓ పదినిమిషాల్లో పెళ్ళికూతురు కనిపించడంలేదన్న వార్త ఒక్కసారిగా గుప్పుమంది.

ఈ వార్త నిమిషాలమీద మగపెళ్ళివారి విడిదికి చేరింది.  దాంతో వాళ్ళు ఇంకా ఆందోళనకి గురయ్యారు.  పెళ్ళి చేసుకోవడానికి ముప్పతిప్పలు పెట్టి చివరికి ఒప్పుకున్న పెళ్ళి, పీటలమీద ఈ విధంగా ఆగిపోవడంవల్ల వీరభద్రానికి కొడుకుమీద చెప్పలేని కోపం ముంచుకొచ్చింది.  అప్పటికే ఓ సారి తలంటుకున్న బంగార్రాజుకి మరోసారి తలంటసాగాడు.

"నీ వల్లే ఇలా అయిందిరా!  నువ్వు అనుకొనే వాడివి చూడు ఏ అమ్మాయి పెళ్ళితప్పిపోయినా పెళ్ళి చేసుకుంటానని. ఇప్పుడు చూడు, ఆ పరిస్థితి నీకే ఎదురైంది.  ముల్లు విరిగి అరిటాకుమీద పడ్డా, అరిటాకు విరిగి ముల్లుమీద పడ్డా చిరిగేది అరిటాకే.  పీటలమీద పెళ్ళి అగిపోతే కారణమేదైనా తప్పు నీదే అవుతుంది.  ఇక నీ పెళ్ళి ఏలా అవుతుందో ఏమో?" అన్నాడు అందోళనగా.

ఈ లోపున మరో వార్త గుప్పుమంది. అదేమిటంటే పెళ్ళికూతురు జానకి తన క్లాస్‌మేట్, స్నేహితుడు ఐన రామక్రిష్ణని దేవాలయంలో పెళ్ళిచేసుకొని పెళ్ళిమంటపానికి తిరిగి వచ్చిందని.  ఆమె రామక్రిష్ణని ప్రేమించింది, ఐతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక పోవడంతో సరిగ్గా పెళ్ళి సమయంలోనే తెగించి పెళ్ళిచేసుకొని వచ్చారు వాళ్ళిద్దరూ .

అందరి సమక్షంలో వాళ్ళని ఆశీర్వదించక తప్పలేదు జానకి తల్లి తండ్రులకి.  ఆ విధంగా వాళ్ళ కథ సుఖాంతమైంది.

పరంధామయ్య వీరభద్రం దగ్గరకు వచ్చి పరిస్థితి చెప్పి క్షమించమని ప్రాధేయపడ్డాడు.

ఇప్పుడు అందరిచూపు పెళ్ళి తప్పిపోయిన పెళ్ళికొడుకు బంగార్రాజు పైన పడింది. అందరూ బంగారాజు వైపు చూసారు జాలిగా. 'పెళ్ళికాని ప్రసాద్‌లా మిగిలిపోవలసిందేనా?’ అని జాలిపడ్డారు ఇరువైపులవారు.  ఆ జాలిచూపులని తట్టుకోవడం కష్టమైంది బంగార్రాజుకి.  హతవిదీ!  ఎలాంటి పరిస్థితిలో పెళ్ళికూతురిని  తను ఊహించుకునేవాడో అదే పరిస్థితి ఎదురైంది ఇప్పుడు అతనికి పాపం!  ఇప్పుడు బంగార్రాజుకెలా పెళ్ళవుతుందని బెంగపెట్టుకున్నారు వీరభద్రం, విశాలాక్షి.  బంగార్రాజు పరిస్థితి సరేసరి!

పెళ్ళికొచ్చిన వారందరూ బాంగార్రాజుకేసి జాలిగా చూసారు. 'పాపం! పీటలమీద పెళ్ళి ఆగిపోయింది!  ఈ బంగార్రాజుకి పెళ్ళి ఘటన ఉందోలేదో!  అసలే అమ్మాయిల కొరత! ఇదే ఆడపిల్ల పెళ్ళయితే వెంటనే తాళి కట్టడానికి డజనుకు పైగా యువకులు ముందుకు వచ్చివుందురు!" అనుకోసాగారు.

అప్పుడే ఓ విచిత్రం జరిగి, ఈ కథని మరో మలుపు తిప్పింది.  అదేమంటే పెళ్ళికూతురు జానకి చెల్లెలు లలిత బంగార్రాజుని అదే ముహూర్తంలో పెళ్ళిచేసుకోవడానికి సిద్ధపడింది.  ఆమె మన బంగార్రాజంటే ఇష్టపడిందో లేక జాలిపడిందో మరి తెలియదు! లేక బంగార్రాజులా ఆమెకికూడా అలాంటి ఆశయం ఉండేదో ఏమిటో మరి! 

ఆఖరికి లలిత చూపించిన జాలివల్ల జానకితో పెళ్ళి తప్పిపోయినా మొత్తానికి మన బంగార్రాజుకి లలితతో అదే ముహూర్తానికి పెళ్ళైపోయి అతని కథకూడా శుభం కార్డు వేసుకుంది.  ఆ విధంగా బంగార్రాజు కోరిక, ఆశయం రివర్సులో తీరాయి.

 

-పద్మావతి దివాకర్ల

 

                                                                     --oOOo--