పోష్టుచెయ్యని ఉత్తరం - కర్రా నాగలక్ష్మి

Unposted letter

       చిట్టితల్లీ, 

        దొడ్డమ్మ అనేక ఆశీర్వచనములతో వ్రాయులేఖ,

        దేవుడి దయ వల్ల మా యురోపు యాత్ర ముగించుకొని నిన్ననే తిరిగి మనదేశం వచ్చేం తల్లి, ఇంత వరకు నా జీవితం లోని అనుభవాలు ఒక ఎత్తైతే ఈ యురోపు యాత్ర అనుభవనాలు ఒక ఎత్తు.

        మనం ఓప్రదేశంలో పర్యటిస్తున్నాం అంటే అక్కడి వాతావరణం, వారి సంసృతి మొదలయినవి కూడా చూస్తాం.

       ఓ మహా కవి చెప్పినట్లు “యే దేశం చూసినా యేమున్నది గర్వకారణం” అని, అవే రాజ ప్రాసాదాలు, వారు వుపయోగించిన మారణాయుధాలు. ఒక రాజుపై మరొకరాజు చేసిన దండయాత్రలు ఓడిపోతే తన కూతురుని శతృరాజుపరం చేయడం లేదా గెలిస్తే శతృరాజకుమారిని తనవశం చేసుకోడం. ఆడదంటే అంత చులకనా?, ఆమె ఒక ఆస్థా?, ప్రపంచమంతా అలాగే అదే భావనవుండేదా?, మనదేశ చరిత్రలోనే ఇలా జరిగేదనే భ్రమ తొలగిపోయింది ఈ దేశాలు తిరిగేక.

        “అప్పా నాస్తి బాగా నాస్తి సర్వం నాస్తి సహోదరా” అనే మరో సీనీ రచయిత చెప్పిన మాటలు కూడా అనుభవంలోకి వచ్చేయి తల్లీ.

        అయితే నీకు నాకన్నా ముందే జ్ఞానోదయం అయినట్లుంది.

       ఇన్ని యేళ్లుగా పెంచుకున్న మమకారం, అభిమానం కళ్లయెదురుగా కూలిపోతూ వుంటే మాటలురాని మూగదానినే అయేను. 

        చిన్ననాడు చిన్న క్లాసులలో ఫస్టువస్తే నాచిట్టి తల్లి పెద్దపెద్ద చదువులు చదవాలని కోరుకున్నాను.

         నువ్వు కలలు కన్న ఐఐటి సీటు రాకపోతే, నా వొళ్లో తలపెట్టుకొని వెక్కుతున్న నిన్ను ఓదార్చి భగవంతుడా నాతల్లి కిఇంతకన్నా మంచి చదువులో ప్రవేశం కలిగించు తండ్రీ అని వెయ్యి దేవుళ్లకి మొక్కుకున్నాను.

       నీ కష్టానికి ఫలితంగా దేశంలో పేరుపొందిన కోర్సులో సీటొచ్చి, నువ్వు అంచెలంచెలుగా చదువులో రాణిస్తూ వుంటే ఎంతో సంతోషం పొందేదాన్ని.

         మగపిల్లల తల్లినైన నాకు నువ్వంటే ఎంతముద్దో, నా పిల్లవి కాకపోయినా నాపిల్లల కన్నా నిన్నే ఎక్కువగా చూసేను. అంతే ప్రేమను నువ్వునాకందించేవు కాదనను.

        పెద్ద చదువులు చదివి పెద్ద కంపెనీలో పెద్ద పదవులు చేపట్టేవని తెలిసి మురిసిపోయేను. ఉద్యోగరీత్యా లండను నగరానికి వెళ్లేవని తెలిసిన రోజు మాఅపార్ట్ మెంట్లలో వారికి స్వీట్స్ పంచేను. “ఇదేం వెర్రి నీ పిల్లా యేమన్నానా? “ అన్నవారికి “అంతకంటే ఎక్కువ” అనే సమాధానంతో నోరు మూయించేను.

         నువ్వు ప్రేమించిన భాషేతరుడిని చూసి మీ అమ్మ బాధపడుతూ వుంటే పెద్దచదువులు చదివిన పిల్ల ఆమె నిర్ణయం మీద నమ్మకం వుంచు, వూరికే బాధపడకు అని ఓదార్చింది నేనుకాదూ?. 

       ఈ సుత్తి ఇప్పుడెందుకు వేస్తోంది అనుకుంటున్నావా? 

      నిజమే మనకి యిష్టం లేని వాళ్లు చెప్పే మాటలు సుత్తి లాగే వుంటుంది.

      మా పెళ్లిళ్లప్పుడు అప్పగింతలలో పెద్ద వాళ్లు అత్తింట్లో ఎలా మెసులుకోవాలో చెప్తూ అతిథులను ఎలా చూసుకోవాలో కూడా చెప్పేవారు.

       ఇప్పుడు పెద్దవాళ్లు ఏం చెప్పినా మీకు సుత్తిలా అనిపించడంతో పెద్దలు చెప్పడం మానీసేరు .

       పెళ్లిలో నిన్ను అత్తవారింటికి దిగబెడుతున్నప్పుడు నా కళ్లల్లో నీరు నువ్వు తుడవడం నువ్వు మరచిపోయినా నేను మరిచిపోగలనా? 

        లండనులో ఇల్లు కొనుక్కున్నాను నువ్వూ పెదనాన్నా తప్పకుండా రావాలని అంటే నా చిట్టి తల్లిపొదరింటి కాపురం చూడాలని యెన్ని కలలు కన్నానో ? 

అందుకేగా పెదనాన్నగారు నా షష్టి పూర్తికి యేం కావాలని అడిగితే యురోపు ట్రిప్పు అడిగింది.  ఆ దేశాలు ఎంతో బాగుంటాయని కాదు, ఆ నిభాన నీ సంసారం చూడాలనే కోరికే కదూ? .

టికెట్లు కొన్ననాటినుంచి నీకు ప్రతీ రోజూ నా ప్రయాణం గురించి గుర్తుచేస్తూ నీ ఫోను నంబరు అడుగుతూనే వున్నాను.

          నువ్వు నవ్వుతూ “అలాగే దొడ్డమ్మా రేపు మెసేజ్ పెట్టేస్తా” అంటూవుంటే ఆరేపు కోసం యెదురుచూసేదాన్ని, అదేంటో ఆ రేపు ఇవాల్టకి కూడా రాలేదు.

         అక్కడ మా చెల్లి కొడుకు వుండబట్టి సరిపోయిందిగాని లేకపోతే దేశంగాని దేశంలో, ఈవయసులో ఏమయేవాళ్లం నేనూ మీ పెదనాన్న?.

         ఫోను నెంబరు యివ్వలేదనే విషయం నీకు గుర్తులేదా? నువ్వైతే చాలా సులువుగా మరచిపోయేను దొడ్డమ్మా అనేస్తావు, ఆ మాటను నేను నమ్మగలనా? ప్రతీ రోజూ మేం చూసిన నదిదో భవనానిదో ఫొటోలు నా గోడ మీద పెడుతూనే వున్నాను, నీ గోడమీదవి నాకు వచ్చినట్లే నా గోడమీదవి నీకు కూడా వస్తాయి, మరుపే అయితే అప్పుడేనా గుర్తురావాలి కదా? కాని రాలేదు. నిజంగా నువ్వు నీ ఆఫీసు పనులలో బిజీగా వుంటే ఒక్క ఫోను ఇలా బిజీగా వుండి రాలేకపోయేను అని చెప్తే అర్దం చేసుకోలేని మూర్ఖులం కాముకదా? అలా చెప్పడం నీ సంస్కారాన్ని తెలియ జేస్తుంది. అలా చెయ్యకపోవడం నీ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. 

             విద్య వినయాన్నివ్వాలి, చదువు సంస్కారాన్నివ్వాలి, ఆ రెండు ఇవ్వని చదువును ఏమనాలో నాకు తెలీదు. 

        ఆర్జన అవుసరమే, అనుబంధాలని మరచిపోయేంత ఆర్జన అనర్థదాయకమే సుమా! 

         నాలుగు కాళ్ల పశువును కొనొచ్చు కాని రెండు కాళ్ల మనిషిని కొనలేవు, కొనగలిగినా ఆ మనిషి నీ కష్ట సుఖాలలో పాలు పంచుకోలేడు అది మాత్రం నిజం.

        ఇవాళ నువ్వు నీ ముందుతరాన్ని మరచిపోతున్నావు, నీ ముందుతరం నిన్ను మరచిపోతే? ఫరవాలేదంటావా?.

        పెద్దవాళ్లం కాబట్టి మంచీ చెడూ చెప్పే భాద్యత మామీదవుంది, పెద్దలమాట వినడమా? పెడచెవిన పెట్టడమా? అనేది నీ విజ్ఞత మీద వుంటుంది.

        చెప్పడం మా ధర్మం, వినకపోతే మీ ఖర్మం.

                  ఉంటాను తల్లీ

                  ఇట్లు

          మీ దొడ్డమ్మ .

       ఈతరం మీద కోపం వచ్చినప్పుడల్లా రాసుకున్న వుత్తరాలలో మరొకటి చేరింది. ఎవరినైతే వుద్దేశించి వ్రాశానో వారికి పంపడం దండగ, ఎందుకంటే ఈ తరం పిల్లలకి తెలుగు రాదుగా?.....