మనకోసం మనమే - సుస్మితా రమణమూర్తి

For ourselves

రచయిత సుందరంకి యాక్సిడెంట్ అయింది. ప్రాణ భయం లేకున్నా ఓ చేయి,కాలు స్వాధీనంలోకి రావడానికి సుమారు ఏడాది పట్టవచ్చన్న డాక్టర్ల మాటలకు తను కృంగిపోయాడు. ‘సాహితీ మిత్ర ‘ రచయితల సంఘం మిత్రులు సమావేశమై, సుందరం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. “ దురదృష్టకర సంఘటన !...సుందరం గారి టెంపరరీ ఉద్యోగం కూడా పోయింది. ఈ పరిస్థితిలో తనకు మనం ఏ విధంగా సహాయం చేయాలో, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. “ సెక్రటరీ రాజు మాటలు అందరూ మౌనంగా విన్నారు. “ మనం సమాజంలోని సమస్యలకు స్పందిస్తున్నాం.రచనలు చేస్తూ,పరిష్కార ద్వారాలు తెరవడానికి ప్రయత్నిస్తున్నాం.ఇప్పుడు మన గురించి మనమే , సీరియస్ గా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. “ “ అవునండీ!...మన గురించి మనమే ఆలోచించు కోవాలి.” “ మన సమూహ రచయితను ఆదుకోవటం, మన అందరి బాధ్యత. “ “అవును!..మనం సహాయం చేయాలి “ “ తప్పకుండా ఆదుకుందాం.మనం ఉన్నామన్న భరోసా కలిగిద్దాం.” “ ఏంచేస్తే బాగుంటుందో, అందరూ ఆలోచించండి.ఎవరికైనా అనుకోని ఆపద వాటిల్లినప్పుడు, వెంటనే ధైర్యం చెప్పడంతో బాటు, ఆర్థిక సాయం కూడా చేయాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలు చెప్పండి. “ సెక్రటరీ మాటలకు అందరూ తలలూపినా, ఎవరూ నోరు విప్పలేదు. “ . రెండ్రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాం .బాగా ఆలోచించండి. రాజు గారు ,నేను సాయంత్రం సుందరం గారిని చూసి వస్తాం” అన్న ప్రెసిడెంట్ గారి మాటలకు అందరూ ఆమోదం తెలిపారు. **** “ ‘సాహితీ మిత్ర ‘ సంఘం సెక్రటరీ రాజు గారికి నమస్కారం. మీ ఆలోచనా సరళి బాగుంది. సుందరం గారికి మా అందరి సానుభూతి తెలియ జేయండి.మీ కార్యాచరణలో తప్పకుండా మేము పాల్గొంటాం. త్వరలో ఆర్థిక సహాయం అందిస్తాం. రంగనాధం సెక్రటరీ సాహిత్య వేదిక **** “ ‘ సాహితీ మిత్ర ‘సంఘం “ సెక్రటరీ రాజు గారికి నమస్కారం. సుందరం గారికి మా ‘ సాహితీ సుమం ‘ రచయితలు తమ సానుభూతి తెలియ జేసారు. ఇలాంటి సమయాల్లో సాహితీ సంఘాలన్నీఏకం కావాలి. చేతనైన ఆర్థిక సహాయం త్వరలో అందిస్తాం. దినకర్ సెక్రటరీ సాహితీ సుమం. **** ‘సాహితీ మిత్ర ‘ సంఘం సెక్రటరీ రాజు గారికి నమస్కారం. మా ‘ సాహితీ సౌరభం’ రచయితలు, సాహితీ మిత్రులు సుందరం గారికి వాటిల్లిన ఆపదకు విచారం వ్యక్తం చేసారు. వారికి మా సానుభూతి తెలియ జేయండి. ఆర్థిక సహాయం తప్పక అందిస్తాం.. శ్రీకాంత్ సెక్రటరీ సాహితీ సౌరభం. **** ‘ సాహితీ మిత్ర సంఘం ‘ సెక్రటరీ రాజు గారికి నమస్కారం. సుందరం గారికి మా అందరి సానుభూతి తెలియ జేయండి. సుందరం గారి లాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. మీలాగే మేమూ ఆలోచిస్తున్నాం. తప్పకుండా సహాయం అందిస్తాం. శ్రీనాథ్ సెక్రటరీ ‘ స్పృహ ‘ రచయితల సంఘం. **** ‘ సాహితీ మిత్ర ‘సంఘం సెక్రటరీ రాజు గారికి నమస్కారం. సుందరం గారి విషయం తెలిసి అందరం బాధ పడ్డాం. మా సహాయం తప్పకుండా ఉంటుంది. సందర్భం వచ్చింది కాబట్టి నా మనసులో మాట చెబుతున్నాను. సమాజంలోని అందరి బాగు గురించి మనం ఆలోచిస్తున్నాం. మన భవిష్యత్తు గురించి కూడా మనం ఆలోచించు కోవాలి. మన రచయితల కథలు, కవితలు, నవలలు, నాటికలు….వివిధ వార, మాస పత్రికలలో, దిన పత్రికలలో వస్తున్నాయి.ఆకాశ వాణి, టీవీలో, అంతర్జాలంలో కూడా వస్తున్నాయి . కొందరు సినిమాలకు సైతం రాస్తున్నారు.మంచి పారితోషికాలు అందుకుంటున్నారు. అంతా మంచిగా ఉన్నప్పుడే,ఏ సంఘంకి ,ఆ సంఘం వారు తమ భవిష్యత్తు గురించి ఆలోచించు కోవాలి. పారితోషకాలలో అందరూ కొంత భాగం “భవిష్య నిధి “ కోసం సంఘంలో జమ చేయాలి. ఎవరికైనా అనుకోని ఆపద వచ్చినప్పుడు, ఆ ‘నిధి’ మనకు ఆసరా అవుతుంది. మనకోసం ఎవరూ ఆలోచించరు. ‘మనకోసం మనమే ‘ ఆ లోచించు కోవాలి. ఇదే మా అందరి అభిప్రాయం. అమలు చేస్తున్నాం కూడా.మా ఆలోచన మీకు నచ్చితే, మీరూ మాలా చేయండి. శ్రీరామ్ సెక్రటరీ యువ రచయితల సంఘం. **** ‘ సుందరంకి కష్ట కాలమైనా, సాహితీ సంఘాల ఆదరాభిమానాలు పుష్కలంగా ఉన్నాయి. తనను అందరూ ఆదుకుంటారు. మరేం ఫర్లేదు…..మరేం ఫర్లేదు……హ్హహ్హ్హహ్హ!!...’ “ ఏఁవిట్రా అన్నాయ్!?...నీలో నీవే గొణుక్కుంటున్నావు!?.....పిచ్చాడిలా ఆ అరుపులు ఏఁవిట్రా!?...నిద్రలో కూడా కథల లోకంలోనే విహరిస్తున్నావా!?...బాగానే ఉన్నావా?...” ఆశ్చర్యంగా చెల్లెలు సుధ తట్టి లేపుతూ ,ఓ గ్లాసెడు నీళ్ళు ముఖం మీద పోసే సరికి, ఉలిక్కి పడి కళ్ళు విప్పాడు రాజు. ఎదురుగా చెల్లెలు సుధ. అయోమయంగా ఇటూ అటూ చూసాడు తను. ‘ ఇదంతా రాత్రి పడుకునే ముందు, సుందరం గురించి తీవ్రంగా ఆలోచించడం వలనేనా!..నిజం కాదా?...ఊహల ఉయ్యాలేనా!?... కలేనా!?...ఏదైతేనేం?...మంచి ఆలోచన!. మంచి పరిష్కారం! కలల కుంచె కార్యాచరణకు అద్భుత ప్రణాళికా చిత్రాన్ని చిత్రించింది. ఈ చిత్రాన్ని మిత్రులందరి ముందు ఉంచి, తుది మెరుగులు దిద్దాలి.’ స్వగతంలా అనుకుంటూ, నవ్వుకుంటూ లేచాడు రాజు .