మాధవ సేవ (బాలల కథ) - సరికొండ శ్రీనివాసరాజు

Madhava seva

   ‌‌ "ఈ లెక్కలు నాకు అర్థం కావడం లేదు. నువ్వైనా నాకు అర్థం అయ్యేటట్లు చెప్పవా శిల్పా!" అన్నది సుష్మ. "నాకూ అర్థం కావడం లేదు. మన లెక్కల టీచరుని అడుగుదామంటే వారం రోజుల నుంచి అనారోగ్య కారణాల వల్ల వారు పాఠశాలకు రావడం లేదు." అన్నది శిల్ప. "అయితే శ్రావణి మన తరగతిలో మొదటి ర్యాంకు కదా! ఆమెను అడుగుదాం రా!" అన్నది సుష్మ. "అమ్మో! దాని దగ్గర చెప్పించుకోవడమా! ఎప్పుడు మొదటి ర్యాంకు మా ఇద్దరిలో ఎవరు వస్తారో చెప్పడం కష్టం. తాను చదువులో ముందు ఉంటానని తనకు బాగా పొగరు. ఈ ఒక్కసారికి గణితంలో వెనుకబడ్డాను కానీ ఎప్పుడూ దానిమీద నాదే పైచేయి. ఫెయిల్ అయినా ఫర్వాలేదు కానీ దానితో మాత్రం లెక్కలు చెప్పించుకోను." అన్నది శిల్ప. "ఎందుకే తనను అలా అంటావు. తాను ఎప్పుడైనా నీతో గొడవ పడిందా? నీ గురించి ఇతరులకు చెడుగా చెప్పిందా? అందరితోనూ కలసిమెలసి ఉండి, వారు చదువులో వెనుకబడితే వారిని తెలివైన వారిని చేయడమే శ్రావణి చేసిన తప్పా? తాను అలా ఉండబట్టే చాలామంది తనకు స్నేహితులు అయ్యారు. నువ్వు ఎవరితోనూ కలువవు కాబట్టే అందరూ నీకు దూరంగా ఉంటున్నారు. నువ్వూ అందరితో స్నేహం చేసి, వారిని ప్రోత్సహించి చూడు. వారంతా నీతోనూ స్నేహం చేస్తారు. శ్రావణి నువ్వూ కలిసిపోయి ఒకరి సందేహాలను మరొకరు నివృత్తి చేసుకుంటూ ఉంటేనే కదా! ఇద్దరికీ చదువు మరింతగా పెరుగుతుంది." అన్నది సుష్మ. ప్రాణ స్నేహితురాలి సలహాతో ఆలోచనలో పడింది శిల్ప.

 

        నిజానికి శ్రావణి ఎంత తెలివైన అమ్మాయో అన్ని మంచి గుణాలు కలిగిన అమ్మాయి. శ్రావణిపై శిల్పకు ఎప్పుడూ అసూయ. మొదటిసారి ఆ అసూయను పక్కన పెట్టి శ్రావణితో లెక్కలు చెప్పించుకుంది శిల్ప. శ్రావణి ఎంతో ఆప్యాయంగా శిల్పతో కలిసిపోయింది. శ్రావణి కూడా తనకు సందేహాలు వస్తే శిల్పతో చెప్పించుకుంది. అలా వారిద్దరూ ప్రాణ స్నేహితులు అయ్యారు. ఎంతటి వారినైనా మంచివారిగా, తెలివైన విద్యార్థులుగా మార్చడం శ్రావణికి ఉన్న ప్రత్యేకత. 

 

     ఇంతలో శ్రావణికి వైరల్ ఫీవర్ వచ్చింది. వారం పది రోజులుగా కోలుకోలేదు. చాలా సీరియస్ అయింది. శ్రావణి కోలుకుంటే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కొన్నింటికి ఒక్కో పుణ్యక్షేత్రానికి పదివేల నూట పదహార్ల చొప్పున దేవుళ్ళకు కానుకగా ఇస్తానని మొక్కింది శ్రావణి వాళ్ళ అమ్మమ్మ. శ్రావణి కోలుకుంది. పదవ తరగతి పరీక్షలలో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. 

 

       శ్రావణి వాళ్ళ అమ్మమ్మ శ్రావణికి ఏఏ గుళ్ళకు కానుకలుగా డబ్బును మనీ ఆర్డర్ ద్వారా పెట్టాలో వివరిస్తూ తగినంత డబ్బును ఇచ్చింది. కొన్నాళ్ళ తర్వాత అమ్మమ్మ ఫోన్ చేసి, ఆ డబ్బులను శ్రావణి ఆయా దేవాలయాలకు పంపించిందా అడిగింది. పంపలేదని జవాబిచ్చింది శ్రావణి. అమ్మమ్మకు కోపం వచ్చి తిట్టింది. "ఎందుకింత నిర్లక్ష్యం నీకు? ఆ దేవుళ్ళకు మొక్కుకోవడం వల్లనే కదా నీవు ఆరోగ్యంగా ఉన్నావు. మరి ఆ దేవుళ్ళనే మర్చిపోయావా?" అన్నది. "ఏం మర్చిపోలేదు అమ్మమ్మా! మా పాఠశాలలో ఇద్దరు తెలివైన విద్యార్థులు ఇంటర్మీడియట్ చదవడానికి ఆర్థిక స్థోమత లేక 10వ తరగతితోనే చదువు అనేస్తున్నారు. వారికి నువ్వు ఇచ్చిన డబ్బులను ఇచ్చాను. వారు పై చదువులు చదివి, మంచి ఉద్యోగం సాధిస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది కదా! మానవ సేవే మాధవ సేవ అని నువ్వు ఎప్పుడూ చెబుతుంటారు కదా! అలా పేద విద్యార్థులకు దానధర్మాలను చేస్తే ఆ దేవుడి ఆశీస్సులు మనపై ఉంటాయి కదా అమ్మమ్మా!"అన్నది. చిన్న వయసులోనే తన మనవరాలికి ఉన్న సుగుణాలకు శ్రావణి వాళ్ళ అమ్మమ్మ మురిసిపోయింది. శ్రావణి చేసిన సాయం గురించి తెలుసుకున్న శిల్ప శ్రావణిని అభినందించింది. తానూ తన తల్లిదండ్రుల సాయంతో మరో ఇద్దరి పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేసింది.

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు