మమతానురాగాలు - మల్లవరపు సీతాలక్ష్మి

love affections

 నిద్ర లేవడం తోనే టీవీ ఆన్ చేసి న్యూస్ చూడడం అలవాటు శ్రీ రామ్ కి. కానీ ఇటీవలి కాలంలో రోజంతా మహమ్మారి అనే వ్యాధి గురించిన   వార్తలే. మహమ్మారి అనేది ఇటీవలే దేశమంతా వ్యాపిస్తున్న ఒక వ్యాధి. టీవీ నిండా  దానికి సంబంధించిన వార్తలే. ఎప్పటిలాగే ఆ రోజు టీవీ ఆన్ చేసి వెంటనే ఛానల్ మార్చేశాడు శ్రీరామ్. వ్యాధి కంటే దానికి సంబంధించిన వార్తలే ప్రజలకు ఎక్కువ ఆందోళన కలిగిస్తున్నాయి. మహమ్మారికి గురైన వారిని కుటుంబ సభ్యులే దూరంగా ఉంచుతున్నారు. ప్రతి ఒక్కరూ తాము బ్రతికితే చాలు అనుకునేంతగా ఆ వ్యాధి అందరినీ భయపెడుతోంది.

వంటింట్లో ఫోన్ మాట్లాడుతున్న సునీత గొంతులో ఆదుర్దా. 

“ఎప్పుడూ.....! అవునా.....! అయ్యో......! మరి నాన్నగారి పరిస్థితి ఏమిటి?.....” ఫోన్ ముగించి ఆందోళనగా భర్త వద్దకు వచ్చింది సునీత.

"ఏమైంది సునీతా!” అడిగాడు శ్రీరామ్.

 "మా తమ్ముడికి జ్వరంగా ఉందట.”

 "ఎప్పటినుంచి?"

 "నాలుగు రోజులుగా ఉందట.” 

"మరి మహమ్మారి టెస్ట్ చేయించారా?” 

"లేదు భయపడుతున్నాడు.” 

"నిజమే! మహమ్మారి ఉన్నట్టు తేలితే నలుగురూ వెలి వేసినట్లు చూస్తున్నారు. అలాగని  దాచి పెడితే దాగేది కాదు. ఇంట్లో అందరికీ వస్తుంది.” 

"అదేనండి ఆందోళన. వాడంటే చిన్నవాడు తట్టుకునే శక్తి ఉంది.  కానీ మా నాన్నగారు పెద్దవారు. ఈ వ్యాధి ఆయనకు వస్తే తట్టుకోలేరు." బాధగా చెప్పింది సునీత.

 సునీత తండ్రి జనార్ధన రావు గారు. ఆయన వయస్సు  80 సంవత్సరాలు . నెల్లూరులో తన పెద్ద కొడుకు రామారావు  దగ్గర ఉంటున్నారు. రెండవ కొడుకు సురేష్ అమెరికాలో ఉంటున్నాడు

జనార్ధన రావు గారికి ఇటీవలే హార్ట్ సర్జరీ జరిగి  కోలుకున్నారు. ఈ పరిస్థితులలో ఆయనకి మహమ్మారి వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

సునీత కు తండ్రి మీద చాలా అభిమానం. ఆయనకు ఈ వ్యాధి రాకుండా ఎలాగైనా కాపాడుకోవాలి. కానీ ఏమిటి మార్గం? అమెరికాలో ఉన్న తన తమ్ముడు సురేష్ కు ఫోన్ చేసింది.

"అక్కయ్యా! నువ్వు చెప్పిన వివరాలను బట్టి అన్నయ్యకు మహమ్మారి వచ్చినట్లుంది. మరి నాన్న ను ఎలా కాపాడుకోవాలి? అన్నయ్య ను ఒప్పించి హాస్పిటల్ లో చేర్పించాలి లేదా విడిగా గది తీసుకొని అందులో ఉంచాలి.” 

“ఈ వయసులో నాన్నగారు ఒంటరిగా ఎలా ఉంటారు? ఈ పరిస్థితులలో ప్రయాణం చేసి ఇక్కడికి రావడం కూడా ప్రమాదమే!  ఏం చేయాలో పాలుపోవడం లేదు దిగులుగా చెప్పింది సునీత.”

 

“బహుశా నాన్నకు ఈపాటికే ఈ వ్యాధి వచ్చి ఉండవచ్చు .లక్షణాలు బయటకు రావడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు. ఈ పరిస్థితులలో మీ దగ్గరకు తీసుకొని వస్తే నీకు ,బావకు కూడా ప్రమాదమే!  ఎటూ తేల్చలేని ఇబ్బంది వచ్చింది .ఒకసారి నాన్న గారికి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పు.” అన్నాడు  సురేష్.

 "నెల్లూరు లో మేము కొన్న ఇల్లు ఖాళీగా ఉందిగా. నాన్నగారిని అక్కడికి వచ్చి ఉండమని చెబుతాను" చెప్పింది సునీత. ఆమె ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే జనార్ధన రావు గారు నుండి ఫోన్ వచ్చింది.

,   "అమ్మా! మీ తమ్ముడికి నాలుగు రోజులుగా జ్వరంగా ఉంది .నాకు ఇక్కడ ఉండాలంటే భయంగా ఉంది .ఏం చేయాలో పాలుపోవడం లేదు "దీనంగా చెప్పారు జనార్దన్ రావు గారు. ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయింది సునీత. అంతా గమనిస్తున్న శ్రీరామ్ ఆమె చేతి నుంచి ఫోన్ తీసుకున్నాడు.

"మామయ్యగారూ!మా దగ్గరకు వస్తామని చాలా రోజు నుంచి చెప్తున్నారు .కానీ రాలేదు .అక్కడ ఏవో పనులు ఉన్నాయని వారం పడుతుందని పోయిన వారం చెప్పారు. బహుశా మీ పనులు ఈపాటికి పూర్తి అయి ఉంటాయి వెంటనే బయలుదేరి  మా దగ్గరకు రండి .కారు ఏర్పాటు చేస్తాను " చెప్పాడు శ్రీరామ్." అలాగే అల్లుడు గారు తప్పకుండా వస్తాను" జనార్దన్ రావు గారి గొంతులో ఆర్ద్రత.

భర్త ఫోన్ పెట్టగానే అతని దగ్గరకు వచ్చింది సునీత . "ఏమండీ! ఒకవేళ నాన్నగారికి కూడా ఆ వ్యాధి సోకి ఉంటే?----"  సునీత కళ్ళలో నీళ్ళు. ఆమెను ఓదార్పుగా దగ్గరకు తీసుకున్నాడు శ్రీరామ్. ఈ పరిస్థితిలో మా నాన్నగారు ఉంటే వదిలివేయ లేను కదా! మీ నాన్నగారు అయినా అంతే! ఎలాగైనా ఆయనను కాపాడుకోవాలి చెప్పాడు శ్రీరామ్. ఆ రోజు రాత్రికే వారి దగ్గరకు చేరుకున్నారు జనార్దన్ రావు గారు. అక్కడకు వచ్చిన మూడవరోజే ఆయనకు జ్వరం మొదలైంది. దాంతోపాటే ఇతర మహమ్మారి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. దిగులుగా భర్త దగ్గరకు వచ్చింది సునీత.

" ఏమండీ! నాన్నగారికి జ్వరం మొదలైంది. ఒకవేళ మహమ్మారి అయితే ఏం చేయాలి? ఆయనని విడిగా ఒక గదిలో ఉంచాలా ?

టెస్ట్ చేసి మహమ్మారి అని తేలితే ఎలా? ఒంటరిగా హాస్పిటల్లో ఉంచాలా?"

 “80 ఏళ్ల వయసులో ఆయన లో చాలా భయాలు ఉంటాయి. తనకు మహమ్మారి అని తేలితే ఆయన తట్టుకోలేరు. ఏదో మామూలు జ్వరం అని చెబుతూ ఉండు. వీలైనంత వరకు  ఇంట్లోనే ట్రీట్ చేద్దాం. మరీ విధి లేని పరిస్థితులలోనే హాస్పిటల్లో చేరుద్దాం. జ్వరంతో ఉన్న వారిని ప్రేమగా దగ్గరకు తీసుకుని ,తల నిమరడం ఆ తరం వారికి అలవాటు.విడిగా ఒక గదిలో బంధిస్తే ఆయన తట్టుకోలేరు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను.

ఆయనతో పాటే మనమిద్దరమూ!.మామూలు జ్వరం అయినా, మహమ్మారి అయినా భరించడానికి సిద్ధంగా ఉందాం. ఆత్మవిశ్వాసంతో వ్యాధిని   జయిద్దాం. అలాగని మన వల్ల ఇతరులకు ఈ వ్యాధి సోక కూడదు .నేను ఆఫీసుకు సెలవు పెడతాను .నువ్వు కూడా పనిమనిషిని మాన్పించు. ముగ్గురము ఇల్లు కదలకుండా ఉందాం" అన్నాడు శ్రీరామ్.

తన తండ్రి గురించి భర్త మనసులో ఉన్న ఆలోచన చూసి సునీత కళ్లలో నీళ్లు తిరిగాయి. భయపడినంతా జరిగింది.  జనార్ధన రావు గారికి వదలకుండా జ్వరం వస్తోంది. అది మామూలు జ్వరమేనని, త్వరలో తగ్గిపోతుందని ధైర్యం చెబుతున్నారు, శ్రీరామ్ ,సునీతలిద్దరూ!

మరో నాలుగు రోజులు గడిచాయి.  రోజు ఉదయం ఆరింటికల్లా నిద్ర లేచే శ్రీరామ్ ఆరోజు ఏడైనా లేవక పోవడంతో దగ్గరికి వచ్చి కదిలించింది సునీత.  శ్రీరాం ఒళ్ళు వెచ్చగా తగలడంతో ధర్మామీటర్ పెట్టి చూసింది.   కొద్దిపాటి జ్వరం ఉంది. మెల్లగా అతనిని నిద్ర లేపింది.  “ఏం పర్వాలేదు ముందే ప్రిపేర్ అయ్యాము కదా” అని ధైర్యం చెప్పాడు శ్రీరామ్.  “ తనవల్ల అల్లుడికి కూడా జ్వరం వచ్చిందని తెలిస్తే మామగారు బాధపడతారని ఆయనకు  ఈ విషయం చెప్పవద్దు” అన్నాడు .

సునీతకు ఆందోళన పెరిగింది.  భర్త కి కూడా మహమ్మారి సోకినట్లు ఉంది.  భర్త కి ఏమవుతుందో అన్న భయం పెరిగింది ఆమెకు. హైదరాబాదులో ఉన్న కొడుకు విజయ్ కి ఫోన్ చేయాలని నిశ్చయించుకుంది.

విజయ్ అమెరికా లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు.  కోడలు ప్రణవి కూడా అక్కడే పని చేస్తోంది.  హైదరాబాదులో తన ఫ్రెండ్ మ్యారేజ్ కోసం ఇండియాకి వచ్చిన విజయ్  మహమ్మారి కారణంగా ఫ్లయిట్స్  రద్దవడంతో అక్కడే ఉండిపోవాల్సివచ్చింది.    విజయ్ కి ఫోన్ చేసి ఈ విషయం వివరించింది సునీత.  తల్లి ద్వారా విషయం తెలుసుకున్న విజయ్ తండ్రికి ఫోన్ చేశాడు. 

“నువ్వు కంగారు పడి రావాల్సిన అవసరం లేదు.  చాలా మైల్డ్ గానే వచ్చినట్లుంది. త్వరలోనే తగ్గిపోతుంది.

మీ తాతయ్య టెస్ట్ చేయించుకోవడానికి కాస్త భయపడుతున్నారు. నేను టెస్ట్ చేయించుకుని, ఆ మందులే ఆయనకి వాడుతాము” అని చెప్పాడు శ్రీ రామ్. "అలాగే!" అని ఫోన్ పెట్టేసిన విజయ్ మరుసటి రోజు ఉదయానికి తండ్రి ముందు ఉన్నాడు.

"అదేమిటి? రావద్దన్నాను కదా?" ప్రశ్నించాడు శ్రీ రామ్.

 "మామగారు ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేక దగ్గరికి రమ్మన్నారు మీరు మరి నాన్న ఇబ్బంది పడుతుంటే నేనెలా ఉండగలను" సమాధానమిచ్చాడు విజయ్.

మరుసటి రోజే తండ్రిని హాస్పిటల్కి తీసికొని వెళ్ళాడు విజయ్. హాస్పిటల్ నిండా మహమ్మారి పేషెంట్ లే. టోకెన్ కౌంటర్ దగ్గర చాలా పెద్ద క్యూ ఉంది. తండ్రిని ఒక చోట కూర్చోబెట్టి, రెండు  గంటలు క్యూలో నిల్చొని టోకెన్  సంపాదించాడు . తండ్రికి టెస్ట్ చేయించి ఇంటికి తీసికొని వచ్చాడు. తిరిగి సాయంత్రం హాస్పిటల్ కి వెళ్లి రిపోర్ట్స్ తెచ్చాడు విజయ్.

 శ్రీరామ్ కు మహమ్మారి వచ్చినట్టు నిర్ధారణ అయింది. మరుసటి రోజు సునీతకు జ్వరం గా ఉండటంతో  ఆమెకు కూడా టెస్ట్ చేయించాడు విజయ్. పాజిటివ్ రిపోర్ట్ రావడంతో చాలా  బాధపడ్డాడు .

శ్రీరామ్ అన్నగారి పేరు మధుసూదన రావు గారు .ఆయన వయస్సు అరవై ఐదు  ఏళ్ళు .వదిన లక్ష్మి గారు.ఇద్దరూ చాలా మంచివారు. శ్రీరామ్ పక్క పోర్షన్ లోనే ఉంటున్నారు ఇద్దరూ. శ్రీరామ్ కి జ్వరం గా ఉండటం తో చూడకుండా ఉండలేక పోయారు . దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పారు.జనార్ధన రావు గారిని కూడా పరామర్శించారు.

మనిషికి మనిషి తోడుగా ఉండటం మహమ్మారికి నచ్చదేమో మరి! మరో రెండు రోజుల్లో వారిద్దరికీ  మహమ్మారి వచ్చింది.

వాళ్ళ అబ్బాయి రవి, కోడలు ప్రణీత మలేషియా లో ఉండటం తో వారి బాధ్యతను కూడా తన భుజాలపై వేసుకున్నాడు విజయ్. వాళ్లను కూడా హాస్పిటల్ కి తీసుకువెళ్లి టెస్ట్ చేయించాడు వారికి కూడా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

అందరికీ ధైర్యం చెప్పాడు విజయ్, ఎంతమాత్రం భయపడాల్సిన అవసరం లేదని. కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని, ఇంట్లో అందరికీ ఈ వ్యాధి తీవ్రత తక్కువగా ఉందని చెప్పాడు.

శ్రీరామ్ మరో ఇద్దరు అన్నలు  సుబ్బారావు గారు, శివప్రసాద్ గారు వెంటనే శ్రీరామ్ ను చూడటానికి వస్తామన్నారు. కానీ శ్రీరామ్ సున్నితంగా వారించాడు.

మూడు రోజులపాటు అందరి గురించి హాస్పిటల్ చుట్టూ తిరిగిన విజయ్ కి నాలుగోరోజు  జ్వరం వచ్చింది.  అందరికీ టెస్ట్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పించిన విజయ్ మీద మహమ్మారికి మరి కోపం వచ్చిందేమో, మరుసటి రోజు నుండి జ్వరం పెరగడం ప్రారంభమైంది.

 తడిగుడ్డతో విజయ్ వొళ్ళంతా తుడుస్తున్నారు శ్రీరామ్, సునీతలు.  జ్వరం అంతకంతకూ పెరిగి ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు విజయ్.

ఇక ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్లో చేర్పించారు శ్రీరామ్, సునీత లు.  హాస్పిటల్లో చేర్పించిన వెంటనే విజయ్ కు స్కానింగ్ చేయించారు.  పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆక్సిజన్ మాస్క్ తగిలించారు.

  రెండు రోజులు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమన్నారు డాక్టర్లు. 

విజయ్ పరిస్థితి అందరినీ కలచివేసింది. తనకు ఏమైనా ఫరవా లేదని ,తన వాళ్లను కాపాడుకోవాలని తపన పడే విజయ్, అచేతనంగా హాస్పిటల్ లో పడి ఉండటం  చూసి అందరూ బాధ పడ్డారు.

 మొదటి నుండి విజయ్ ది నలుగురికి సహాయపడే మనస్తత్వం. స్నేహితులకు అవసరం వస్తే తన అవసరాల కోసం దాచుకున్న డబ్బులు అయినా సరే ఇచ్చేసేవాడు.తన పనులన్నీ మానుకుని ఇతరుల పనిమీద తిరిగేవాడు.

 అలాంటి విజయ్,  ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ కావడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోయారు.

అమెరికాలో ఉన్న ప్రణవి ని ఓదార్చే వారే లేరు పాపం. భర్తకు చిన్న దెబ్బ తగిలినా తల్లడిల్లి పోయే ప్రణవి,విజయ్ హాస్పిటల్ లో ఉండటం జీర్ణించుకోలేక పోతోంది .ఆమె పడే బాధను మాటల్లో వర్ణించడం ఎవ్వరికీ తరం కాదు.

విజయ్ కుటుంబ సభ్యులే కాక,ఇతర బంధువులు,స్నేహితులు,ఆఫీస్ సిబ్బంది .....

ఇలా ఒక్కరేమిటి,అందరూ విజయ్ క్షేమంగా తిరిగి రావాలని తమ ఇష్ట దైవాలను ప్రార్థిస్తున్నారు.

 

  మహమ్మారికి మమతానురాగాలను జరిగిన యుద్ధంలో మహమ్మారి  ఓడిపోయింది.

విజయ్ క్షేమంగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు.

 శ్రీరామ్, సునీత, జనార్దన్ రావు గారు అందరూ కోలుకున్నారు. జనార్ధనరావు గారి అబ్బాయి రామారావు కూడా కోలుకున్నాడు.

 శ్రీరామ్ అన్నా వదినలు మధుసూదన రావు గారు,లక్ష్మిగారు కూడా  రికవర్ అయ్యారు.

అందరూ కోలుకున్నాక వారిని treat చేసిన డాక్టర్ గోపాల్ గారు శ్రీ రామ్ కి ఫోన్ చేశారు.

“కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో మీరు ఉదాసీనంగా వ్యవహరించారు.

అయినా ఒకరి  మరొకరు తోడుగా ఉన్నారన్న ధైర్యం వ్యాధిని జయించింది.  మంచి మనసులకు తోడు భగవంతుని అనుగ్రహం కూడా పనిచేసింది” అన్నారు డాక్టర్ గోపాల్. 

“నిజమే డాక్టర్ గారు ఈ రోజుల్లో భగవంతుడు డాక్టర్  రూపంలో ఉన్నాడు. మీరు చేసిన సహాయం మర్చిపోలేను. “కృతజ్ఞతతో అన్నాడు శ్రీరామ్.

“వ్యాధి కంటే తాము ఒంటరి అయ్యామనే బాధ మనిషిని కబళించి వేస్తుంది.

మీ కుటుంబంలో అలా జరగలేదు .ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. తమకేదో అవుతుందని ఆలోచించకుండా తమవారితో కలిసి నడిచారు. ఈ కథ శుభం తో ముగియడానికి కారణం మీ మధ్య ఉన్న ప్రేమానురాగాలే.” అభినందించారు డాక్టర్ గోపాల్ గారు.