ఈ రాత్రి గడిస్తే చాలు - బుద్ధవరపు కామేశ్వరరావు

Enough to pass tonight

పక్క ఊర్లో ఉన్న బావమరిది గృహప్రవేశం వేడుకకు ఒక రోజు ముందుగా ఆ రోజు సాయంత్రమే వెళ్లారు శ్రీహరిరావు యొక్క భార్యాపిల్లలు. ఊర్లో దొంగలభయం ఉండడంతో తాను ఒక్కడే ఇంటికి కాపలాగా ఉండిపోయాడు, మర్నాడు వెళ్దామని. రాత్రి భోజనం కానిచ్చి, అన్ని తలుపులకు గట్టిగా తాళాలు వేసి వచ్చి, టీవీ ముందు కూర్చున్నాడు శ్రీహరిరావు. ఏదో హర్రర్ సీరియల్ వస్తోంది. అందులో కిరోసిన్ వేసి కోడల్ని తగలెట్టేస్తోంది ఓ అత్తగారు, ఏదో ఓ తెలుగు డైలీ సీరియల్ లో. వెంటనే నాలుగు రోజుల క్రితం తమ ఊరి మునసబు గారి కోడలు ఇలాగే కిరోసిన్ ఒంటి మీద పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన, అలాగే ఆమె ఆత్మ ఊర్లో తిరుగుతోందన్న విషయం గుర్తుకొచ్చి ఉలిక్కిపడి, ఇంకో ఛానెల్ మార్చేడు. అందులో, "భార్యాపిల్లలు ఇంట్లో లేని సమయంలో అడ్డు వచ్చిన ఇంటి యజమానిని హత్య చేసి, సర్వం దోచుకుపోయిన దొంగలు" అంటూ గొంతుచించుకుంటూ చెబు తున్నాడు, నేరాలు ఘోరాలు ప్రోగ్రాంలో చూడడానికే భయంకరంగా ఉన్న అనౌన్సర్. ఆ వార్త చూడగానే గొంతులో తడారి పోయింది శ్రీహరిరావుకి. వెంటనే , ఈ ఇంట్లో కూడా, ప్రస్తుతం తను ఒక్కడినే ఉన్నానన్న విషయం గుర్తొచ్చింది. చిన్న తనంలో తల్లిదండ్రులుతో, తోబుట్టువులతో, ఆ తరువాత రోజుల్లో భార్యాపిల్లలతో కలకలలాడిన తాతల కాలం నాటి ఆ ఇంట్లో తాను ఏ ఒక్క రోజూ కూడా ఒంటరిగా లేడు. జీవితంలో మొట్టమొదటి సారిగా ఒంటరితనం, భయం అంటే ఏమిటో తెలిసొచ్చింది శ్రీహరిరావుకి. పోనీ భార్యకు ఫోన్ చేసి కాసేపు కబుర్లు చెప్పుకుందామా అంటే, రాత్రి పది గంటల సమయంలో ఫోన్ చేస్తే, వాళ్లని కంగారు పెట్టినట్లు అవుతుంది అని ఆ ప్రయత్నం విరమించుకుని, ఇక లాభం లేదనుకుని టీవీ కట్టేసి, లైట్లు ఆర్పేసి ఆంజనేయ దండకం చదువుకుంటూ మంచం మీదకి చేరాడు శ్రీహరిరావు, మొహంతో సహా ఒళ్ళంతా పూర్తిగా కప్పేసేలా దుప్పటి ముసుగు పెట్టేసుకుని, ఈ రాత్రి గడిస్తే చాలు అని మనసులో అనుకొని. ***** ***** ***** ***** కరెంటు పోవడంతో, మెలుకువ వచ్చిన శ్రీహరిరావుకు ఎక్కడో తలుపు మీద ఎవరో టిక్కు టిక్కు మంటూ నెమ్మదిగా కొడుతున్న శభ్ధాలు వినబడ్డాయి. ఉలిక్కిపడి, వెంటనే ఊపిరి బిగపెట్టి ఆ శభ్ధాలు వినసాగాడు. ఆ శభ్ధాలు ఆగకుండా ఇంకా ఎక్కువ కావడంతో, "అనుమానం లేదు, తప్పకుండా ఇది మునసబు గారి కోడలు ఆత్మ అయి ఉంటుంది, కాకపోతే ఎవరో దొంగలు ఇంట్లోకి రావడానికి తలుపు పగలకొడు తున్నారా?" అని భయంతో వణికిపోతూ ఆలోచించసాగాడు శ్రీహరిరావు. "ఎప్పుడో శతాబ్దం కాలం నాటి ఈ కొంపలో వంటింటి వెనకవైపు గోడలు చవుడు బారిపోయి, పడిపోయాయి. ఎవరో ఆ మార్గంలో వంటింట్లోకి వచ్చి, ఆ తలుపు పగలకొట్టి, హాలులోకి రావడానికి ప్రయత్నిస్తున్నారన్న మాట. వచ్చే నెలలో ఈ ఇల్లు పడకొట్టి, కొత్తది కట్టుకునే ఏర్పాట్లు చేసుకున్నాడు తను. కానీ అనుకోకుండా ఈ రోజు ఇలా " అని అనుకుంటూ భగవంతుని తలచుకుని మొండి ధైర్యంతో మంచం మీదనుంచి లేచి, ఆంజనేయ దండకం మనసులో చదువుకుంటూ, సెల్ ఫోన్ లోని టార్చ్ సాయంతో, చప్పుడు కాకుండా నడుచుకుంటూ వంటింటి వద్దకు వచ్చాడు. తలుపు మీద ఓ సారి గట్టిగా తట్టి, "ఎవరు లోపల" అని అరిచాడు శ్రీహరిరావు. అంతే ఆ శభ్ధాలు ఆగిపోయాయి. ఓ నాలుగు నిమిషాలు అలాగే కదలకుండా ఉండిపోయాడు. మళ్ళీ శభ్ధాలు మొదలవడంతో ఇక ఆలశ్యం చేయకూడదు అని ధైర్యంగా తలుపు గొళ్లెం తీసాడు, పక్కనే ఉన్న ఓ దుడ్డుకర్రను చేత్తో పట్టుకుని. అంతే.... భయంతో కె..వ్వు..మ..ని అరుస్తూ వెనక్కి పడ్డాడు శ్రీహరిరావు కాళ్ళ మీదనుంచి వేగంగా వెళ్లిపోయిన రెండు పందికొక్కులులను చూసి. "హమ్మయ్య! బతికించావు దేముడా!"అని మనసులో అనుకొని, వంటింటి తలుపు మళ్ళీ బయట గొళ్లెం పెట్టి, "ఇక ఇలాంటి భయానక సంఘటనలు జరగకుండా ఈ రాత్రి గడిస్తే చాలు" అని మనసులో అనుకొని మళ్ళీ మొహంతో సహా ఒళ్ళంతా కనబడకుండా దుప్పటి కప్పుకొని నిద్రకు ఉపక్రమించాడు శ్రీహరిరావు. ***** ***** ***** ***** కాసేపటికి, ఎవరో కాలింగ్ బెల్ అదే పనిగా కొడుతున్న శబ్దం వినబడడంతో ఉలిక్కిపడి లేచిన శ్రీహరిరావుకు, లేచి వెళ్లి తలుపు తీయక తప్పలేదు. "ఈ సమయంలో ఎవరు వచ్చి ఉంటారు? ఎవరో దొంగలు ఇంట్లోకి రావడానికి తలుపు పగలకొడుతున్నారు అనుకుంటూ గజగజ వణుకుతూ వీధి గదిలోకి వచ్చాడు. లైటు వేద్దామనుకుని, ఆ ప్రయత్నం విరమించుకుని, చీకట్లో తలుపుకు ఉన్న చిన్న రంధ్రం లోంచి బయట ఎవరా అని చూసాడు. ఎవరో ఒక తెల్లటి బట్టలతో ఉన్న రూపం, బయట ఉన్న పంచాయతీ వారి వీధి దీపం గుడ్డి వెలుతురులో మెరిసిపోతోంది. అనుమానం లేదు, ఇది తప్పకుండా మునసబు గారి కోడలు ఆత్మే అని మనసులో అనుకుని, ఎక్కడ లేని ధైర్యం కూడ దీసుకుని, "ఎవరు మీరు ? ఏం కావాలి?" గట్టిగా అరిచాడు శ్రీహరిరావు, తలుపు తీయకుండా. "ఒరే తమ్ముడూ! నేనురా, భాస్కర్ అన్నయ్యను. తలుపు తియ్యరా! నీ భయం తగలెయ్యా?" సమాధానం వచ్చింది బయటనుండి. "ఔను. వీడు చిన్నప్పుడు మా ఇంట్లో ఉండి చదువుకుని, అమెరికాలో స్థిరపడిన పెద్దమ్మ కొడుకు భాస్కర్ అన్నయ్యే. ఓ పదిరోజుల ఆఫీసు పని మీద హైదరాబాద్ వచ్చాడని తెలుసు కానీ, ఇప్పుడు ఇక్కడికి రావడం ఏమిటి షడన్ గా?" అనుకుంటూ తలుపు తీసాడు. లోపలికి వచ్చిన భాస్కర్, "కంగారు పడకురా! ఈ రోజు ఉదయం చిన్న పని మీద విజయవాడ వచ్చా. అక్కడ మన చిన్న మావయ్య కనబడి, నువ్వు వచ్చే నెలలో ఈ ఇల్లు కూల్చేసి, కొత్తది కట్టుకుంటాన్నావని చెప్పాడు. నా బాల్యం అంతా గడిచింది ఇక్కడే కదా? మళ్ళీ ఇండియా ఎప్పుడొస్తానో తెలియదు. అందుకే ఆ మధుర స్మృతులను మళ్ళీ ఓసారి మననం చేసుకుందామని అప్పటి కప్పుడు బయలుదేరి వచ్చా. ఔనూ? ఇంట్లో మీ ఆవిడా, పిల్లలు లేరా?" అడిగాడు భాస్కర్. "లేరన్నయ్యా, మా బావమరిది ఇంట్లో ఫంక్షన్ కి వెళ్లారు. రా! ముందు కాళ్ళు కడుక్కో" "అవన్నీ తర్వాత. ముందు అన్ని గదులూ చూద్దాం పద" అంటూ తమ్ముడుతో సహ అన్ని గదులు చూడ్డానికి బయలుదేరాడు భాస్కర్. "ఇదిగో అన్నయ్యా! ఇది మనం చిన్నప్పుడు ఆడుకున్న వెనుక వెంపు వసారా. ఇది వంటిల్లు, పడిపోయే స్టేజిలో ఉంది. ఇది ఉల్లిపాయలు గది. ఇది బెల్లం దిమ్మల గది" అంటూ అన్ని గదులు చూపించాడు శ్రీహరిరావు. "చాలా ఆనందంగా ఉందిరా. ఇలా వచ్చి మళ్లీ చూస్తాననుకోలేదు. అంతా నా అదృష్టం" అంటూ పొంగిపోయాడు భాస్కర్. "కూర్చో అన్నయ్యా! కొంచెం ఉప్మా చేసి తెస్తా!" అంటూ తన పడకగదిలో అన్నని కూర్చోపెట్టి, లేవబోయాడు శ్రీహరిరావు. "ఏమీ వద్దురా! నీకు తెలుసుగా, నాకు జీలకర్ర పొడి వేసిన పల్చటి మజ్జిగ అంటే ఇష్టమని. రెడీగా ఉంటే అది ఇయ్యి చాలు" చెప్పాడు భాస్కర్. "ఏమిటో, తనకు మజ్జిగ అంటే అసలు ఇష్టం ఉండదు. భాస్కర్ అన్నయ్యకు అదంటే ప్రాణం" అనుకుంటూ, జీలకర్రపొడితో చేసిన మజ్జిగ గ్లాసు అందిస్తూ, "ఔనూ, ఇక్కడికి రావడానికి ఇంత ఆలశ్యం ఎందుకయ్యింది అన్నయ్యా?" అడిగాడు శ్రీహరిరావు. "ఓ, అదా ! చిన్న మావయ్య చెప్పగానే, మా వాళ్లకు పనులు పురమాయించి, సాయంత్రం విజయవాడలో రెడీగా ఉన్న రాజమండ్రి బస్సు ఎక్కాను. అప్పటికే అక్కడి నుంచి మన ఊరు వచ్చే ఆఖరి బస్సు వెళ్లిపోయింది. వెంటనే టాక్సీ కట్టించుకుని బయలుదేరాను. అయితే మూడు గంటలు ప్రయాణం తర్వాత ఇంకో పది నిమిషాల్లో మన ఊరు వచ్చేస్తాం అనగా శృంగవరం వంతెన దగ్గర టైర్ ఫంక్చర్ అయ్యి, ఓ చెట్టుకు గుద్దుకుని కారు ఆగిపోయింది. లేకపోతే కాలవలో పడిపోయేదే" చెప్పాడు భాస్కర్. "ఔనా ? ఎంత ప్రమాదం తప్పింది. మరి అక్కడ నుండి ఎలా వచ్చావు? పోనీ నాకు ఫోన్ చేయలేకపోయావా?" అడిగాడు శ్రీహరిరావు, అన్నయ్య తాగి ఇచ్చిన మజ్జిగ గ్లాసు పక్కన పెడుతూ. "చేసానురా! నువ్వు ఎత్తలేదు. నీకు తెలుసుగా! ఎల్లుండే నా అమెరికా తిరుగు ప్రయాణం. సమయం తక్కువ. అందుకే నడుచుకుంటూ వచ్చేసా" చెప్పాడు భాస్కర్ అక్కడనుండి లేవబోతూ. "సరే అన్నయ్యా! బాగా అలసిపోయావు. రెస్ట్ తీసుకో" అంటూ తన గదిలో మడతమంచం వాల్చబోయాడు శ్రీహరిరావు. "ఒద్దురా! నేను చిన్నతనంలో పడుకున్న మేడమీద గదిలోనే పడుకుంటా! పోద్దున్నే లేపరోయ్. ఫస్ట్ బస్సుకు వెళ్లిపోవాలి" అంటూ పడుకోవడానికి పైకెళ్లిపోయాడు భాస్కర్. అన్నయ్య కోరికను కాదనలేక, తన గదిలోకి వచ్చి మంచం మీద హాయిగా మేను వాల్చేడు శ్రీహరిరావు, ఈ రాత్రి గడిస్తే చాలు అని మొక్కగానే, వెంటనే స్పందించి, తనకు భయం లేకుండా అన్నయ్యని పంపిన ఆ దేమునికి మనస్పూర్తిగా నమస్కరిస్తూ. ***** ***** ***** ***** గదంతా వెలుతురు పరచుకోవడం, బయట ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో బద్ధకంగా లేచాడు శ్రీహరిరావు, బహుశా విత్తనాలు తీసుకోవడానికి పెద్ద పాలేరు మరిడయ్య వచ్చి ఉంటాడని. తలుపు తీసి, బయట ఉన్న పోలీసులను చూడగానే వణికిపోయాడు, పేకాట పిచ్చి ఉన్న శ్రీహరిరావు. కొంచెం ధైర్యం తెచ్చుకుని, "ఎందుకు వచ్చారు సార్. కొంచెం కబురు పంపితే నేనే వచ్చేవాడిని కదా?" భయం భయంగా అడిగాడు. "ఆ విషయాలు తర్వాత కానీ, ఈ ఫొటోలో ఆయన మీకు తెలుసా" అడిగాడు పోలీసు ఓ ఫొటో చూపించి. "తెలుసు సార్. ఇతను మా భాస్కర్ అన్నయ్య. ఏం నేరం చేసాడు? పైన పడుకున్నాడు. పిలుస్తానుండండి" అంటూ అక్కడ నుంచి వెళ్లబోయాడు. "కంగారు పడకండి. ఈయన పయనిస్తున్న కారుకి రాత్రి రెండున్నర సమయంలో శృంగవరం దగ్గర ప్రమాదం జరిగింది. డ్రైవర్, ఈయనా కూడా స్పాట్ డెడ్. ప్రమాదంలో దెబ్బతిన్న డ్రైవర్ వాచ్ కూడా ఆ సమయం వద్దే ఆగిపోయింది. ఈయన ఫోన్ లో ఆఖరి కాల్ మీకు చేసినట్టు ఉంది. దాని ఆధారంగానే ఇక్కడికి వచ్చేము. మీరు ఓ సారి వస్తే ఫార్మాలిటీస్ పూర్తి చేసి మృతదేహం మీకు స్వాధీనం చేస్తాము" పోలీసు చెబుతున్న మాటలతో బుర్ర తిరిగి పోయింది శ్రీహరిరావుకి. "అన్నయ్యా...." అంటూ ఘొళ్లుమని రోదిస్తూ, మేడమీదకు వెళ్లి, ఖాళీగా ఉన్న మంచం చూసి, పోలీసులు వెనక వెళ్లడానికి తన గదిలోకి వచ్చి, బట్టలు మార్చు కుంటున్న శ్రీహరిరావుకు రాత్రి తను అన్నయ్యకు ఇచ్చిన, జీలకర్ర పొడితో చేసిన మజ్జిగ గ్లాసు, ఎవరో పూర్తిగా తాగినట్టుగా, ఖాళీగా, కొంచెం ఎండిపోయి ఉండడం కనిపించింది. పోలీసులతో కలసి వెళ్తూ యాధాలాపంగా తన సెల్ వైపు చూసిన శ్రీహరిరావుకు, రాత్రి రెండున్నర కు భాస్కర్ ఇచ్చిన మిస్ కాల్ వెక్కరిస్తూ కనపడింది. ***** ***** ***** ***** అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చి, తిరిగి బావమరిది ఇంటికి వెళ్తున్న శ్రీహరిరావు మనసులో అనుకున్నాడు. "ఈ ఇంటిని వచ్చే నెలలో కాదు. ఈ రోజు నుంచి సరిగ్గా పదవ రోజు లోపలే పూర్తిగా పడగొట్టేయాలని". ***** ** *సమాప్తము* ** *****

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు