Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
multiple talent

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

ఈ రోజుల్లో చూస్తున్నదేమిటంటే, మీడియా ధర్మమా అని, ఉన్నదాన్ని పది రెట్లుగా చూపించడం.. అయిన దానికీ, కానిదానికీ , ఏవేవో వ్యాఖ్యలు చెప్పి, చిలవలూ పలవలూ చేసి చూపించడం, దానినే అందరూ నమ్మేయడం.పూర్తిగా నమ్మకపోయినా, నమ్మినట్టు కనిపించడం. ఇలా ఎక్కడ చూసినా ప్రతీదాంట్లోనూ సహజత్వం పోయి, కృత్రిమమే ఎక్కువగా కనిపిస్తోంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడు, ఎలాటి పరిస్థితుల్లో అయినా ఒక్కలాగే చెప్పగలుగుతారు. కానీ, అవసరానికి ఎక్కువై అతిశయోక్తిగా చెప్పడం మొదలెడితే, ఎక్కడ ఏమి చెప్పారో మర్చిపోయి, ఒక్కోచోట ఒక్కోటి చెప్పేసి, నవ్వులపాలైపోవడంకూడా చూస్తూంటాము. పోనీ అలాగని , చెప్పడం మానుతారా, అబ్బే.. జన్మతహా వచ్చిన బుధ్ధి ఎక్కడకుపోతుందీ?

ఉదాహరణకి, ఏ పేపర్లోనో ప్రకటన చూసి, ఎక్కడో డిస్కౌంటులు ఇస్తున్నారని తెలిసి, అంతదూరమూ  వెళ్ళి ఏదో పనికిరాని వస్తువు కొంటాడు. ఆ వస్తువు ఖరీదు , రానూపోనూ ఛార్జీలు కలిపితే, దగ్గరలోనే ఉండే కొట్లోనో దొరుకుతుంది, కానీ  అడిగినవాడికీ, అడగనివాడికీ చెప్పుకోవద్దూ మరి,  “ అంత ఖరీదెట్టికొన్నారా... మొన్న దీనికి సగానికి సగం ధరలోనే దొరికిందండీ... నాలుగు కొట్లు చూసుకుని కొనాలి ఇలాటివి..” అని ఓ క్లాసు  తీసికోవచ్చు. అసలు సంగతి ఛస్తే చెప్పడు—పదికిలోమీటర్లు బస్సులో నానా అవస్తలూ పడి కొన్నట్టు. వస్తువుల విషయానికొస్తే, తనెప్పుడూ చవకలోనే కొన్నట్టుగా చెప్పుకునే పెద్దమనిషి, ఎక్కడో ఏ ఎపార్టుమెంటో కొన్నప్పుడు మాత్రం, కొన్నదానికి రెట్టింపు ధర చెప్తాడు. తక్కువ చెప్పేస్తే, మళ్ళీ అవతలివాడెక్కడ అడుగుతాడో అని ! అంతా కలిపి ఏ ముఫైవేలో అయితే, నలభై అని చులాగ్గా చెప్పేస్తాడు. ఆ తరువాత ఎప్పుడైనా, అమ్మాల్సినా, కనీసపుధర ఆమాత్రమైనా పలుకుతుందని.

కానీ ఇలాటివాటిల్లో కొన్నికొన్ని కష్టాలుకూడా ఉంటుంటాయి.  ఫలానా వస్తువు చవకలో కొన్నట్టు ఎవరితోనైనా చెప్పినప్పుడు, వెంటనే అవతలివాడు, ..” ఈసారి మాక్కూడా తీసికునిరండీ, డబ్బులిచ్చేస్తానూ..” అంటాడు. ఎరక్కపోయి చెప్పానురా బాబూ, ఇలా నెత్తికెక్కుతుందని ఆలోచించలేదూ అని జుట్టుపీక్కునే సందర్భాలు వస్తూంటాయి. అందువలన, ఊరికే ప్రతీదానినీ అతిశయోక్తంగా చెప్పడం మానేస్తే, ఇంటికీ వంటికీ కూడా శుభప్రదం.

  అలాగే entertainment  పేరుతో జనాల మీదకు వదిలే సినిమాలు. ఈరోజుల్లో ఏ సినిమా చూడండి, కొట్టుకోడాలూ, డిషుం..డిషుం.. అంటూ ఒకళ్ళమీద ఒకళ్ళు తుపాకీలు పేల్చేసికుంటూంటారు, హీరో కి ఛస్తే గుళ్ళు తగలవు. ఎంత రక్తం కారుతూ ఉన్నా సరే, రెండో సీన్ లో కొత్తపెళ్ళికొడుకులాగ తయారైపోతూంటాడు. హాస్పిటల్ బెడ్ మీదనుంచి, కట్టిన బ్యాండేజీలు పీక్కుని మరీ, హీరోయిన్ను కాపాడ్డానికి పరిగెడుతూంటాడు. కొండ మీదనుంచి, జలపాతాల్లో పడ్డా సరే, దసరా బుల్లోడిలాగే ఉంటాడు. నిజజీవితాల్లో జరిగే పనులేనా ఇవన్నీ? కాలు మడతపడితే, చచ్చేలా వాచి, నాలుగురోజులు మంచం ఎక్కాలి. అలాటిది సినిమాల్లో జరిగే స్టంటు సీన్లలో జరిగినట్టు జరగమంటే అయే పనేంటారా? ఈరోజుల్లో, హాస్యానికి నిర్వచనమే మారిపోయింది. హాస్యనటుడన్నవాడు, తప్పనిసరిగా ఓ చెంపదెబ్బ, అదీ హీరోయిన్ చేతిలో ఓ దెబ్బతింటెనే హాస్యం కింద లెక్కకట్టే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము. అంతంత సౌండుతో చెంపదెబ్బ కొడితే, ఉన్న పళ్ళు కాస్తా ఊడొస్తాయి నిజజీవితంలో. కానీ మనసినిమాల్లో దీనికి పూర్తిగా విరుధ్ధం. మరీ అంతగా  exaggerate  చెయాలంటారా?

ఏవిషయమైనా చూసినా, విన్నా నమ్మేటట్టుగా ఉండాలి. ఎవడో రాజకీయనాయకుడి ప్రసంగం వినడానికి “లక్షల్లో” ప్రజలొచ్చారంటారు. వీళ్ళేమైనా లెక్కపెట్టారంటారా? ఏదో ఉజ్జాయింపుగా ఓ అంకె పెట్టేస్తే, తమ ప్రియతమనాయకుడీ ప్రఖ్యాతి అందరికీ తెలుస్తుందని. నిజంగా చూస్తే మహా అయితే ఓ వందమందొచ్చుంటారు. టివీల్లో చూపిస్తూంటారుకదండీ అని సమర్ధింపోటీ. ఈరోజుల్లో ఉండే technology  ధర్మమా అని, బమ్మిని తిమ్మీ , తిమ్మిని బమ్మీ చేయడం,  बाये हाथ का खेल  కదండీ ఈరోజుల్లో !  వేయిమందిని లక్షలేం కర్మ, కోట్లలో చూపించొచ్చు.

ఇంకొంతమందిని చూస్తూంటాం, తమకి వైద్యం చేసే డాక్టరుగారే ఊళ్ళో బెస్టు. అక్కడకి ఊళ్ళోఉండే , ప్రతీ డాక్టరుగురించీ తనకి తెలిసినట్టు. తన పిల్లలు వెళ్ళే స్కూలు, తను సరుకులు కొనే కొట్టు,, తను నడిపే బండి, తనింట్లో ఉండే టీవీ, తను తినే తిండి... ఇలా చెప్పుకుంటూ పోతే , తనకి సంబంధించిన ప్రతీ విషయమూ బెస్టు, గ్రేటెస్టు.. నిజమే తనకిసంబంధించిన అన్ని వస్తువులూ బెస్టుగానే ఉండాలి. కానీ, మిగిలిన వారుకూడా సాధ్యమైనంతవరకూ మరీ బెస్టు కాకపోయినా, కనీసం కొంతలోకొంత బాగానే ఉంటాయనికూడా గుర్తించాలి. అంతేకానీ, ఛాన్సొచ్చినప్పుడు ఊ...రి..కే ప్రతీదానినీ అతిశయోక్తిగా మాట్టాడితే, ఎప్పుడో అసలు విషయం బయటపడ్డప్పుడు, వీధిన పడతారు. అందువలన  ఈ అతిశయాలకి వెళ్ళడమూ, ప్రతీదీ అతిశయోక్తిగా మాట్టడడమూ, కొద్దిగా నియంత్రించుకుంటే, విన్నవారికీ, కన్నవారికీ కూడా ఆరోగ్యం...

సర్వే జనా సుఖినోభవంతూ...

మరిన్ని శీర్షికలు
navvu nalugu yugalu