Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
temple

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఈ తూరుపు ఆ పశ్చిమం - దంతులూరి కిశోర్ వర్మ

కెరటం

ఈ రోజు పెర్ల్‌బక్(1892-1973) రాసిన ది బిగ్ వేవ్ కథని పరిచయం చేస్తాను. కథను గురించి మాట్లాడుకోవడానికి ముందు కథా రచయిత్రి పెర్ల్‌బక్ గురించి ఉపోద్ఘాతంగా నాలుగు ముక్కలు చెప్పుకొందాం. పెర్ల్‌బక్ అమెరికా జాతీయురాలు. ఆమె తండ్రి చైనాలో క్రీష్టియన్ మిషనరీ. అందువల్ల చిన్నప్పటినుంచీ నలభై సంవత్సరాల వయసు వరకూ పెర్ల్‌బక్ చైనాలోనే నివశించింది. చైనా స్కై, ఈస్ట్ విండ్ వెస్ట్ విండ్, ది మదర్, ది గుడ్ ఎర్త్, లెటర్ ఫ్రం పెకింగ్ లాంటి ఎన్నో  నవలలూ, కథలూ రాసింది. ది గుడ్ ఎర్త్ నవల ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందింది. 1932లో ఈ నవల రాసినందుకు పులిట్జెర్ ప్రైజ్ గెలుచుకొంది. చైనాలో రైతుల, సామాన్యుల జీవితాలను గురించి మాస్టర్ పీసెస్ అనదగిన పుస్తకాలను రాసిన పెర్ల్‌బక్‌కి 1938లో సాహిత్యంలో నొబెల్ ప్రైజ్ వచ్చింది. నొబెల్ ప్రైజ్ గెలుచుకొన్న మొదటి అమెరికన్ మహిళ కూడా పెర్ల్‌బక్కే.
ఇప్పుడు కథలోకి వెళదాం. సముద్రపు వార నిటారుగా ఉండే కొండ ఉంది. దాని వాలులో ఉన్న పొలంలో కీనో అనే కుర్రవాడి తండ్రి వ్యవసాయం చేస్తాడు.పొలంలో పండించిన కాయగూరల్ని కొండ దిగువున సముద్రతీరంలో నివశించే జాలరి వాళ్ళకి అమ్ముతాడు. వాళ్ళ దగ్గర నుంచి చేపలు కొనుక్కొంటాడు. సముద్రపు వొడ్డున ఉన్న మత్యకారుల గ్రామంలో కీనోకి జియా అనే స్నేహితుడు ఉన్నాడు. వాడి దగ్గరనుంచి కీనోకి ఒక విషయం తెలిసింది. జియాకి సముద్రం అంటే భయం. `అది మా శత్రువు` అంటాడు. సముద్రం నుంచి వచ్చే మత్యసంపదే వాళ్ళకి జీవనాధారం. అటువంటప్పుడు సముద్రం శత్రువు ఎలా అవుతుంది? సాయంత్రం భోజనం చేసిన తరువాత తన సందేహాన్ని కినో తండ్రి దగ్గర వ్యక్తపరుస్తాడు. వాళ్ళిద్దరి మధ్యా ఆసక్తికరమైన సంభాషణ నడుస్తుంది. 

`నాన్నా జియా సముద్రం అంటే ఎందుకు భయపడుతున్నాడు?`

`సముద్రం చాలా పెద్దది. దానిని మనం అర్థం చేసుకోలేం.` `మనం కొండ మీద ఉన్నందుకు  దేనికీ భయపడనవసరం లేదు కదా నాన్నా?``మనం నేల అన్నా భయపడాలి. గతంలో మనం చూసిన అగ్నిపర్వతం నీకు గుర్తుందా?` `అంటే మనం ఎప్పుడూ దేనికో దానికి భయపడవలసిందేనా?`

`నా ఉద్దేశ్యం అది కాదు. కానీ ఏదో ఒకరోజు ఉప్పెన రావచ్చు, అగ్నిపర్వతం బ్రద్దలవ్వొచ్చు.. మనిషన్నాకా వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. ప్రమాదాల వల్లో, ముసలితనం వల్లో, వ్యాదుల వల్లో మరణం తప్పదు అనే నిజాన్ని అంగీకరించాలి. జీవితాన్ని ఆనందంగా జీవించు. మృత్యువుకి భయపడకు.`

ఆనందించడానికి చాలా ఉంది. కీనో బడిలో చేరాడు. జియాతో కలసి ఒకే బల్ల మీద కూర్చుంటాడు. బడిలేనప్పుడు వాళ్ళిద్దరూ జియా తండ్రితో పాటూ పడవమీద చేపల వేటకు వెళతారు. ఒక్కోసారి జీయా కొండపైకి వచ్చి కీనో వాళ్ళ పొలంలో పనిచేస్తాడు.  రోజులు సరదా సరదాగా గడిచిపోతున్నాయి. కానీ ఒకరోజు ఆకాశం మేఘావృతమైంది, కొండ వెనుక దూరంగా అగ్నిపర్వతంలోనుంచి నిప్పురవ్వలు ఎగసి పడ్డాయి, భూమి కంపించింది. భూమీ, సముద్రం కలసి భూమిలోపలి అగ్నితో పోరాడుతున్నాయి. ఏ నిమిషాన్నయినా అగ్నిపర్వతం బ్రద్దలవ్వొచ్చు, భూకంపం సంభవించ వచ్చు, సునామీ రావచ్చు. పర్వతం పైన కోటలోనుంచి ప్రమాద ఘంటికలు మ్రోగాయి. జనాలు వచ్చి కోటలో తలదాచుకోవలసిందని హెచ్చరిక అది.  

తండ్రి ప్రక్కన నిలబడి సముద్రం వైపుకు చూస్తున్న కీనో, `నాన్నా వాళ్ళందరూ పైకి వస్తారా?` అని అడుగుతాడు. `తల్లితండ్రులు పిల్లల్ని పంపించడానికి చూస్తారు. వాళ్ళు పెద్దవాళ్ళని విడిచి రావడానికి ఇష్టపడరు. తల్లులు తండ్రుల్ని విడిచిపెట్టరు. తండ్రులు వాళ్ళ పడవల ప్రక్కనే ఉంటారు.`

జాలరి గ్రామంలో జియా తండ్రి కొడుకుని కొండపైకి వెళ్ళమని బలవంతం చేస్తున్నాడు. `భూమిలోపలి అగ్నికి సముద్రం లొంగిపోతే మా తరువాత నువ్వు జీవించే ఉండాలి` అంటున్నాడు కొడుకుతో. `మీరు లేకుండా నేను బ్రతకలేను,` అన్నాడు జియా. `నా మాటను శిరసావహించడం నీ కర్తవ్యం. వెళ్ళు,` అన్నాడు. జియా ఏడుస్తూనే కొండ ఎక్కడం మొదలుపెట్టాడు. కీనో, అతని తండ్రీ వాడిని పైకి లాగారు. ఇంటి మిద్దెమీద నుంచొని వాళ్ళు చూస్తూ ఉండగానే ప్రమాదం ముంచుకొచ్చింది. సముద్రపు అడుగున ఎక్కడో భూమి రెండుగా చీలింది. చల్లని నీరు అఘాతంలోనికి, మరుగుతున్న రాళ్ళమీదకి దూకింది. ఫలితంగా పెల్లుబికిన ఆవిరి సముద్ర జలాలని అల్లకల్లోలం చేసింది. ఆకాశం అంత ఎత్తున పెద్ద కెరటం లేచి వొడ్డుమీద విరిగి పడింది. తిరిగి వెళ్ళే టప్పుడు గ్రామంలో ఉన్న ఇళ్ళన్నింటిని తనలో కలిపేసుకొంది.

జియాని కీనో కుటుంబ సభ్యులు అందరూ అక్కున చేర్చుకొన్నారు. `జియా దుఖాన్ని తగ్గించడం ఎవరి వల్లా కాదేమో,` అన్నాడు కీనో తన తండ్రితో. పెద్దకెరటం తీసుకు వచ్చిన మరణాన్ని చూసి కీనో చలించిపోయాడు.  మళ్ళీ వాళ్ళిద్దరీ మధ్యా  ఒక తాత్వికమైన సంభాషణ జరిగింది. జీవితం గురించి, మరణం గురించి చిన్నపిల్లవాడికి కూడా అర్థమయ్యేటంత సరళంగా చెప్పడం బాగుంటుంది. ఈ సంభాషణలో కీనో తండ్రి చెప్పిన విషయాలు మనసుకు హత్తుకొంటాయి.

`ప్రమాదాల నడుమ జీవించినప్పుడే జీవితం ఎంత గొప్పదో తెలుస్తుంది. మరణం సమీపంలో ఉన్నప్పుడు ధైర్యం పెరుగుతుంది.  నువ్వు పుట్టినప్పుడు, నీకు అమ్మ కడుపులోనుంచి బయటకు రావడం ఇష్టం లేదు. ఎంతో ఏడ్చావు. నువ్వు ఎంత పిచ్చి వాడివి! అప్పటికే  అమ్మ, నేను.. మేమందరం నిన్ను ప్రేమిస్తూ ఉన్నాం.. నీకోసం బయట ఎదురు చూస్తున్నాం. ఆ విషయం  తెలియక పుట్టడానికి ఏడ్చావు.  జీవించడంలో ఎంత సంతోషం ఉందో చూశావా? ఆరోజు పుట్టడానికి ఎందుకు భయపడ్డానో అని ఈ రోజు ఆశ్చర్యపోతున్నావు, కదూ? మరణం భయపడవలసిన విషయం కాదు. పుట్టుకలాగే అది కూడా ఒక మహాద్వారం.  మరణం అంటే ఏమిటో తెలియక భయపడుతున్నావు. కానీ ఓ రోజు ఎందుకు అంత భయపడ్డానా అని ఆశ్చర్యపోతావు,` అంటాడు.    

జియా జీవితంలో దు:ఖం ఓ కెరటంలా వచ్చి వెళ్ళిపోయింది. కీనో కుటుంబంలో జియా ఒక సభ్యుడు. వాడికి మళ్ళీ తల్లీ, తండ్రీ, చెల్లీ, సోదరుడూ అందరూ ఉన్నారు. సంతోషం జీవితంలో కొత్తపువ్వులు పూయిస్తుంది.  

పెర్ల్‌బక్ నవలలూ, కథలూ చైనీయుల, జపనీయుల జీవితాల చుట్టూ తిరుగుతాయి. వాటిల్లో కష్టాలు, కన్నీళ్ళు, జీవనపోరాటం, ఆశలు, ఆశాభంగాలు, తాత్విక చింతన, విలువలు... అన్నీ పెనవేసుకొని ఉంటాయి. కేవలం బిగ్‌వేవ్ కథనే కాదు ఈమె రాసిన ఏవీ దొరికినా చదవండి.  ఈ పరిచయం గురించి మీ అభిప్రాయం తెలియజేయండి. 

మరిన్ని శీర్షికలు