Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

   ఇదేమిటీ ఈయన మొత్తం తన 'జాతి' వారికందరికీ వకాలతు పుచ్చుకుని వ్రాస్తున్నాడూ అనుకోకండి. ఏం చేస్తాను, నా వ్యాసాలు చదివేది చాలామంది యువతరం వారే అని భావిస్తూ, వాళ్ళూ ఎప్పడికో అప్పటికి ఈ 'జాతి' లో చేరేవారే అయినప్పటికీ, వారికైనా ఈ బాధ తప్పుతుందేమో అన్న ఆశ తో ఈ వ్యాసం!

   మామూలుగా మనవైపు 50 సంవత్సరాలు దాటేటప్పటికి ఆ మానవులు ముసలాడూ, ముసల్దీ అయిపోతారు. మా ముసలాడు ఇలా అన్నాడురా, మా ముసిల్ది ఇలా అందిరా అనే వింటూంటాము. కొద్దిగా సంస్కారం ఉన్నవాళ్ళైతే ముసలాయనా, ముసలావిడా అంటూంటారు. ఓ సుబ్బారావుని 'సుబ్బిగా' అంటే వినడానికి ఎలా ఉంటుంది? లేకపోతే ఒక అలవేలు మంగ అనే శుభ్రమైన పేరుండగా 'మంగీ' అంటే ఎలా ఉంటుంది? ఛండాలంగా ఉంటుందంటాను.మరి ముసలాళ్ళని అలా అంటే తప్పేమిటీ అని అడగొచ్చు.

   ఇదివరకటి రోజుల్లో ఏదైనా అంగవైకల్యం ఉన్నవారిని handicapped అనేవారు. మరి ఇప్పుడో అలా అంటే వారి మనోభావాలు దెబ్బతింటాయీ అని, ఏ అవయం దెబ్బతింటే ఆ పేరుతో-mentally challenged, hearing impaired, visually challenged..- అంటూ పిలవడానికి ఎటువంటి అభ్యంతరం లేనప్పుడు, మరి ఈ ముసలాళ్ళకో పేరుకూడా పెట్టొచ్చు కదా అనే నా బాధ!కొద్ది కొద్దిగా ఎక్కడైనా వ్రాయవలసివచ్చినప్పుడు 'వయో వృధ్ధులు' అని బస్సుల్లోనూ, రైళ్ళలోనూ వ్రాయడం మొదలెట్టారు. కొంతలో కొంత ఇంప్రూవుమెంటే !ఇంగ్లీషులో అయితే మెరుగే 'Senior Citizen' అంటున్నారు. అలా అని మిగిలినవాళ్ళందరూ 'Junior' అని కాకపోయినా, ఏదో ప్రభుత్వోద్యోగాల్లో ఈ సీనియర్ జూనియర్ పదాలకి అలవాటు పడిపోయి, ఈ కొత్త యూసేజ్ మొదలైంది!ఎంత చెప్పినా ఇలా ఉపయోగించడం మొదలెట్టించింది ఓ ప్రభుత్వోద్యోగే అయుంటాడు! తన సీనియారిటీ దృష్టిలో పెట్టుకుని ఈ ఆర్డరు పాస్ చేసుంటాడు!ఏది ఏమైతేనేం, ప్రతీ చోటా ఇంగ్లీషులో ఈ బోర్డులు చూస్తూంటాము, రిజర్వేషన్ కౌంటర్ ల దగ్గరా, బాంకుల్లోనూ- ఎక్కడ ప్రభుత్వం చెయ్యి ఉంటే అక్కడ!

   ఇక్కడ పూణె లో చూస్తూంటాను-' ज्यॅश्ठ नागरिक् '( జ్యేష్ట నాగరిక్) అని బస్సుల్లో. మొట్టమొదటిసారి, రిటైరయిన తరువాత చూసినప్పుడు అనుకున్నాను,' అరే నా నక్షత్రంతో పిలుస్తున్నారే, జ్యేష్ఠా నక్షత్రం వాళ్ళే ఇక్కడ కూర్చోవాలన్న మాట ఇదీ బాగానే ఉందీ'అని ( నా జన్మ నక్షత్రం జ్యేష్ఠ లెండి!). అంటే అప్పుడు చెప్పింది మా ఇంటావిడ, జ్యేష్ట కాదూ జ్యేష్ఠ్ అని! దానర్ధం సీనియర్ అనిట!ఏమిటో ఛాన్సొచ్చినప్పుడల్లా, మా ఇంటావిడ నాతో చెడుగుడు ఆడేస్తూంటుంది. పైగా రిటైరు కూడా అయిపోయానూ! అప్పుడెప్పుడో మా చుట్టం ఒకాయన, మా ఫ్రెండు శ్రీవాత్సవ కనిపిస్తే, అది అతని గోత్రం పేరనుకుని, మనవాడేనా అన్నారు. నాకు దొరికినవాళ్ళూ నాలాటివాళ్ళే!

   అసలు 60 ఏళ్లు దాటినవాళ్ళు వృధ్ధులు అని ఎవరు చెప్పారు మీకు? అంతకంటే తక్కువ వయస్సున్నవారికే అసలు కష్టాలన్నీనూ. పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవాలి, అప్పో సొప్పో చేసి ఓ కొంపా, కారూ కొనుక్కోవాలి. పిల్లలు అడిగిన కొండమీది కోతినైనా తెచ్చివ్వాలి. ఇన్నివ్యవహారాలు బాలెన్స్ చేసికుంటూ సంసారం లాగించాలి. ఈ టెన్షన్లతో బట్టతలొచ్చేస్తుంది, పొట్ట పెరిగిపోతుంది, సుగర్లూ కెలస్ట్రొల్లూ పెరిగిపోతాయి, వీటన్నిటినుంచీ కాపాడుకోడానికి జిమ్ములూ, ఓపికుంటే ఇంట్లోనే ట్రెడ్ మిల్లులూ! అర్ధరాత్రులు దాటేదాకా ఆఫీసుల్లో టైంబౌండ్లూ, టార్గెట్టులూ! ఏదో ఓపికున్నప్పుడు పెళ్ళాం పిల్లలు ఉన్నారో ఊడేరో చూడ్డం!ఇదా జీవితం అంటే?

   ఊరికే పిలిపించుకోవడం వరకే కాదు, ఈ సీనియర్ సిటిజెన్లుకూడా తమ స్టేటస్ ని సార్ధకం చేసికోవాలి.ఖాళీగా ఉన్నాము కదా అని పేట్రేగిపోకూడదు.అలాగని ముంగిలాగా కూర్చోనూ కూడదు.ఏదో మన వంతు చేయకలిగిందేదో చేస్తూంటే, చూసేవాళ్ళకీ అనిపిస్తుంది-- పోన్లెద్దూ, ఏదో పేరే కదా, మార్చేస్తే ఏం పోయిందీ- అనుకుని, ముసలాళ్లు, ముసల్దీ అనడం మానేసినా మానేయొచ్చు! బయటి దేశాల్లో వీళ్ళని ఏమని పిలుస్తారో నాకైతే తెలియదు. ఎప్పుడైనా వెళ్ళిన మొహమా నాది? ఇక్కడ మాత్రం మరీ అలాగన్నప్పుడు కొంచం బాధేస్తుంద్.

   హిందీ లో ' ऍ बुढ्ढॅ, ऍ बुढियॅ' ( ఏ బుఢ్ఢే ) మరీ అన్యాయం. మరాఠిలో కొద్దిగా బెటరు- आजोबा, अज्जी అంటారు. Idea యాడ్ లో లాగ Sarjee లాగైనా వినిపిస్తుంది.కనీసం ఈ తరంవారందరూ వృధ్ధులూ, వయోవృధ్ధులూ అయే లోపల ఓ మంచి పేరోటి coin చేసి పుణ్యం కట్టుకోండి. కాదూ మీదారిన మీరే పొండి అంటారూ, మాకేమీ లేదు, ఎలాగూ అలవాటు పడిపోయాము, మీకే నష్టం మీరూ 'ముసలాళ్ళే' అవుతారు!

   అలా పిలవడం వలన మీరేమైనా యంగ్ హీరోలవుతారా అని అడక్కండి. అదో సరదా! జుట్టుకి రంగెందుకేసుకుంటారు? అలాగే ఇదీనూ! ఈ 'ముసలాడి' గోల కొంచం వినండి !!

 

మరిన్ని శీర్షికలు
jayajayadevam