Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
yuva

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

ఆముక్తమాల్యద

(గతసంచిక తరువాయి )

వీరశైవుడైన పాండ్య రాజును వైష్ణవునిగా మార్చి, ఆయన సోదరిని వివాహమాడి, అర్ధరాజ్యాన్ని పొంది,  దండయాత్రచేసి శత్రువులను అణిచివేయమని కోరిన రాజుకు ప్రస్తుతం వర్షాకాలం కనుక, వర్షఋతువు  వెళ్ళిపోయిన తర్వాత దండయాత్రకు బయల్దేరుతానని చెప్పి ఆగిపోయాడు యామునాచార్యులు. ఇక్కడ  వర్షఋతువర్ణన అద్భుతంగా చేశాడు రాయలు. శ్రీకృష్ణదేవరాయల బహుముఖ పాండిత్యానికి, విచిత్రమైన ఊహలకు, కల్పనలకు, ప్రపంచ పరిశీలనా శక్తికీ, కొండొకచో కొద్దిగా కష్టపడితే తప్ప కొరుకుడు పడని ఆయన క్లిష్టమైన శైలికి ఈ వర్షాకాలపు వర్ణనలు అత్యుత్తమమైన ఉదాహరణలు. 

కర్కశుఁ డంటకోర్వ కుదకంబులు వాఃపతి గూర్చినట్లు న
య్యర్కుఁడుఁ దాను గూర్చి మఱి యా సలిలాధిపచిహ్నవాహతం
బేర్కలగంగ నాతఁ డెలమి న్మకరస్థితిఁ గన్న నీర్ష్యఁ  దాఁ
గర్కటకస్థుఁ డయ్యె ననఁ గర్కటకస్థితిఁ గాంచె నత్తఱిన్

తనను ‘కర్కశుడు, నిరంతరమూ తన వేడిమితో కష్టపెడతాడు’ అని లోకులందరూ అనడాన్ని ఓర్వలేక సూర్యుడు తనపై వచ్చిన మచ్చను దూరం చేసుకోడానికా అన్నట్లు, వరుణుడు జలములను ఉద్భవింపజేసినట్లు తాను కూడా జలములను ఉద్భవింప జేయడానికి అంటే వర్షములను కురిపించడానికి నిశ్చయించుకుని, వరుణుడు మొసలిని వాహనంగా చేసుకుని పవిత్రమైన గంగానదిలో నిరంతరమూ ఉంటాడు కనుక, తాను కూడా ఆ మొసలికి చిహ్నమైన మకర రాశిలో ఉండడం ఏమిటి చిన్నతనంగా అని భావించి, ఈర్ష్యతో అన్నట్లు తాను కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. అంటే వర్ష ఋతువు ప్రారంభం ఐంది. సహజంగా జరిగే వర్ష ఋతు ప్రారంభాన్ని ఇలా చమత్కరించాడు రాయలు.

వనతతివరాహవాహారివాయుభుగ్వి
రోధివారణ వర్షాభులాధిఁ దొఱఁగె
నెండ్రి రవి చేర మూఁడవ యెడకుఁ జేరు
తరణి ధరణిం బ్రమోద సంధాయి గాఁడె

సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో (ఎండ్రిన్ రవి చేర)వనసమూహము, వరాహములు, మహిషములు (వాహారి)వాయువును భక్షించే సర్పములకు విరోధులైన నెమళ్ళు (వాయుభుగ్విరోధి)ఏనుగులు(వారణ) కప్పలు (వర్షాభులు)మొదలైనవాటికి మనోవ్యధ తీరిపోయింది. ‘వే’ ‘వో’, ‘వా’, ‘వీ’ అనే అక్షరాలు రోహిణీ నక్షత్రమునకు చెందినవి, వృషభ రాశికి చెందినవి. వృషభరా శికి మూడవ రాశి కర్కాటకరాశి కనుక, ‘మూడవ యెడకు’ అంటే (తమ జన్మ రాశి ఐన వృషభరాశికి) మూడవ రాశి ఐన కర్కాటక రాశిలోకి సూర్యుడు చేరడంతో , వర్ష ఋతువు ప్రారంభం కావడంతో వనములకు, వరాహములకు, మహిషములకు, వాయుభక్షక విరోధులైన నెమళ్ళకు, ఏనుగులకు, కప్పలకు మనోవ్యధ తీరి సంతోషం కలిగింది. పద్యరచనపై రాయలకున్న పట్టుకు, జ్యోతిషశాస్త్ర పరిజ్ఞానానికి, కాల్పనిక ఊహా శక్తికి, పరిశీలనా  శక్తికి ఒక గొప్ప నిదర్శనం ఈ పద్యం!  

వనధిగమనజగర్భార్కజనిత ఘ్రుణులు
మఱి ప్రసూతికి నతని ధామంబుఁ జేరె
ఘనతఁ జొచ్చినయిండ్లను దనయ లుండి
కాన్పునకుఁ బుట్టిని ల్చేరు క్రమము గనమె

సముద్రముతో కలియడం వలన గర్భాన్ని ధరించి మేఘములైనాయి  సూర్యుని కిరణములు.(వనధిగమనజగర్భార్కజనిత ఘ్రుణులు)సూర్యుని కిరణములే మేఘములు అని సంప్రదాయం. లోకంలో గర్భం ధరించిన కన్యలు ప్రసవానికి పుట్టినిల్లు చేరడం సహజమే, అందునా తొలి చూలు పుట్టింట్లో ప్రసవం జరగడం తెలుగువారి సంప్రదాయం కనుక, వర్ష ఋతువు ప్రారంభం కనుక తొలి చూలు ఐన మేఘములు తమ పుట్టిల్లు ఐన సూర్యమండలానికి చేరుకున్నట్లు(మఱి ప్రసూతికి నతని ధామంబుఁ జేరె) ఆకాశం మేఘావృతం ఐంది అని అంటున్నాడు తెలుగుసంప్రదాయ పక్షపాతి ఐన రాయలు.

అలపర్జన్యుఁడు భానుఁ డన్కొలిమిలో నభ్రంపుఁ  బెన్కొప్పెరన్
జల మాఁగన్ బిడుగుక్కుజాత్యపుటయస్కాంతంబునత్తున్కలో
పలఁ జాప న్మహిమీఁదిలోహరజముల్ పైఁ బర్వె నా లేచె వా
త్యలఁ బ్రాగ్దావమషుల్మొగి ల్మొదల గ్రద్దంతై దివిం బర్వినన్ 

వేసవిలో  తీవ్రమైన వేడిమికి గురి ఐన భూమండలం తొలి వర్షాలకు దుమ్ము, ధూళి రేగే సుడిగాలులతో కూడిన వర్షాన్ని పొందడం ప్రకృతిలో సహజంగా జరిగేదే. దాన్నే తన సహజమైన శైలిలో విచిత్ర కల్పనతో ఇక్కడ చెప్తున్నాడు రాయలు. దేవేంద్రుడు అనే కమ్మరివాడు (పర్జన్యుడు) సూర్యుడు అనే కొలిమిలో కాల్చి ఆకాశము అనే పాత్రలో నీరు కారకుండా నిలవడానికి పిడుగుజాతికి చెందిన, అంటే ఇనుపజాతికి చెందిన అయస్కాంత శక్తి కలిగిన ముక్కలను అతికాడు, చిల్లు పడి కారకుండా ‘మాటు’వేశాడు. ఆ మహా అయస్కాంతపు శక్తికి ఆకర్షింపబడి భూమి మీది ఇనుపముక్కలు అన్నీ విసురుగా లేచి ఆకాశంలోకి దూసుకెళ్తున్న రీతిగా సుడిగాలి తాకిడికి అంతవరకూ కాలి కాలి మాడి మసి ఐన భూమిమీది బూడిద వంటి నల్లని ధూళి కణాలు గ్రద్దల్లాగా పైకి ఎగిరి నల్లని మేఘాలను ఇంకా నల్లగా చేశాయి. తొలి వర్షానికి ముందు వీచిన సుడిగాలికి దుమ్మూ ధూళి కణాలు సుడులు సుడులుగా లేచి ఆకాశంలోకి ఎగరడాన్ని ఇలా విచిత్ర కల్పన చేసి వర్ణించాడు రాయలు.   

ఇలకు డిగి  చుట్టిచుట్టి దు మ్మెత్తి యెగసి
పోయి తము ముంచుసుడిగాలి పుష్కరములఁ
గడలినీ రభ్ర కలభముల్ క్రాసె ధరణి
నభ్రకరిశిక్ష దివిఁ గాంచి నట్టికరణి

భూమిమీదికి దిగి సుడులు సుడులుగా చుట్టి దుమ్మెత్తి పోసి, ఎగిరి ఆకాశ మండలానికి చేరుకున్న సుడిగాలులను తమ తొండములతో లాగి వాటిలోని సముద్ర జలాలను గ్రహించి మరలా వర్షధారలుగా కురిపించాయి ఏనుగు గున్నలవంటి మేఘాలు. అది, చూడడానికి ఆ ఏనుగు గున్నలవంటి మేఘాలు దేవజాతికి చెందిన ఐరావతము అనే ఏనుగువద్ద ‘తర్ఫీదు’ పొందినట్లుగా ఉంది. ఏనుగులు, మరీ ఎక్కువగా గున్న ఏనుగులు దుమ్మును ధూళిని తొండంతో పీల్చి మరలా ఎగజిమ్మడం, నీటిని పీల్చి మరలా బయటకు చిమ్మడం వాటి జన్మ లక్షణం. ఇక్కడ మేఘాలు గున్న ఏనుగుల్లాగా ఉన్నాయి రంగులో, పరిమాణంలో. ఏనుగుల జాతికి గురువు వంటి ఐరావతంవద్ద శిక్షణ పొందిన వాటిలాగా సముద్రపు నీటిని, దుమ్మూ ధూళిని పీల్చి, వెంటనే ధారలుగా వర్షాన్ని కురిశాయి మరలా అంటున్నాడు, సుడిగాలి వీచి వెంటనే ఏనుగుతొండాల ధారల్లాగా ఉద్ధృతంగా వర్షంపడడాన్ని యిలా చమత్కరించాడు రాయలు.    

కృతపయఃపాననవ మేఘపృథుకములకు
రాలె నొయ్యన వడగండ్ల పాలపండ్లు
మఱి బలాకాద్విజాళిసంప్రాప్తి గలిగెఁ
బెరుఁగఁ బెరుగంగా ధ్వనియు గంభీరమయ్యె

పాలు తాగే పసిపిల్లలకు పండ్లు రాలడం, మరలా పండ్లు రావడం, పెరిగినకొద్దీ గొంతులో ధ్వని హెచ్చడం లోక సహజం. మేఘములనే పసిపిల్లలు(పృథుకములు)నీరు అనే పాలను తాగి, వడగళ్ళు అనే పాలపళ్ళు రాలి, బారులు తీరిన కొంగలు అనే నూతన దంతముల వరుసలను పొందాయి. నూతనంగా తొలకరిలో ఉద్భవించిన మేఘములు కనుక శిశువులతో పోల్చాడు. తొలిమేఘాలు కురిసే వానలు వడగళ్ళతో కూడిన వానలు కనుక రాలే వడగళ్ళను పిల్లలకు రాలే పాల పళ్ళతో పోల్చాడు. ఆకాశం మేఘావ్రుతము ఐనప్పుడు ఆకాశవీధిలో బారులు తీరి కొంగలు తమ గూళ్ళకు ప్రయాణం చేయడం మనము చూసేదే. ఆ తెల్లని కొంగలబారును శిశువులకు వచ్చే తెల్లని పలువరుసతో పోల్చాడు. ఆ మేఘములు అనే శిశువులకు క్రమక్రమంగా ‘ఉరుములు’ అనే ధ్వనికూడా పెరిగింది అని, శిశువులు పెరిగినకొద్దీ గొంతులో ధ్వని పెరగడంతో పోల్చాడు. యింతటి సహజప్రతిభ, పాండిత్యం, చమత్కృతి, రసికత నిండిన అవిశ్రాంత యోధుడైన ఒక మహాచక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు. ధర్మబద్ధమైన ఆదర్శ సామ్రాజ్య స్థాపనకోసం నిరంతరమూ యుద్ధభూమిలోనే గడిపిన రాయలకు, ఓటమి అనేది ఎరుగకుండా ఇరవైతొమ్మిది సంవత్సరాలు అటు కదనరంగంలో, యిటు కవనరంగంలో సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తికి, తెలుగుసాహిత్యప్రియులు ఎంతగా నీరాజనాలుపట్టినా తక్కువే!     

దినముల వెంబడిం జడనిధి న్మును గ్రోలిననీరిలోనఁ బే
రిన లవణంపుఘట్టముల దృప్యదిరమ్మద దావముల్దవు
ల్కొని పెటిలించు నార్భటు లొకో యనఁగా సతటిద్భయంకర
స్తనితములన్ సృజించె నతిసాంద్రఘనాఘనగర్భగోళముల్  

రోజులతరబడి త్రాగిన సముద్రపు నీటిలోని ఉప్పు మేఘములలో బిళ్ళలు బిళ్లలుగా పేరుకునిపోయి, మేఘములు పరస్పరం రాసుకున్నప్పుడు పుట్టిన విద్యుత్తు వలన, నిప్పులో పడ్డ ఉప్పు కావచ్చు అన్నట్లు మెరుపులతో కూడిన ‘ఫెటిల్లు’ ‘ఫెటిల్లు’మనే ధ్వనులను వెలువరించాయి మేఘములు.                             

అలపర్జన్యుఁడు కేకిపాత్రముల గుంపాడించుచో మేఘమం
డలపున్ మద్దెల గ్రుంగ లేవను మరున్మార్దంగి కుం డర్థి నొ
త్త లలి న్నేలకు వ్రాలుచు న్నెగయుచుం దారాడునత్తెల్లజ
ల్లులుఁ గెంగుచ్చులు నయ్యె ధారలును దల్లోలేంద్రగోపంబులున్

ఆకాశం మేఘావృతం ఐంది. ఆనందంతో నెమళ్ళు నృత్యం చేస్తున్నాయి. మేఘుడు (పర్జన్యుడు) నెమళ్ళు అనే పాత్రలతో చేయిస్తున్న నాట్యంలో వాయువు అనే మృదంగ వాయిద్యకాడు (మరుత్ మార్దంగికుడు)మేఘమండలం (మేఘం)అనే మద్దెలను వాయిస్తున్నాడు. గాలికి జల్లులు జల్లులుగా, తెల్లని పరదాల్లాగా, తెల్లని పరదాల దారాల్లాగా నీటి ధారలు పడుతున్నాయి, వర్షం పడడంతో తమ పుట్టల్లోనుండి పైకి ఎగురుతున్న ఎర్రని ఆరుద్రపురుగులు ఆ తెల్లనిపరదాలకు అల్లిన ఎర్రనికుచ్చుల్లాగా కనబడుతున్నాయి!  

గగనరంగస్థలంబున మిగులఁ బ్రౌఢి
మమునఁ గాళిక నిల్చి కోలము నటింపఁ
బొరి మొగంబున రాలు నిప్పుక లనంగ
గుంపులై రాలె మహి నింద్రగోపతతులు

గగనము అనే రంగస్థలం మీద కాళికాదేవి ప్రావీణ్యంగా గాఢముగా నర్తనం చేస్తుంటే ఆతల్లి కనులనుండి,  ముఖమునుండి రాలుతున్న ఎఱ్ఱని నిప్పుకణికలలాగా గుంపులు గుంపులుగా ఎఱ్ఱని ఆరుద్ర పురుగులు ఎగిరిపడుతున్నాయి భూమి మీద.

స్ఫురణ మొగుళ్ళపై  మొదలఁ బొల్చి జలసృతి నాఁడు
నాఁటికింగరఁగుచుఁ బుట్టుచుండు మణి కారుక రక్తిమ యెల్ల వెల్లిఁ గె
న్నురుగులు గట్టినట్టులు గనుంగొన నయ్యె సురేంద్రగోపముల్
గరఁగిన వింటియ ప్పసరుకైవడిఁ దెట్టెలుపెట్టుపచ్చికన్      

జోరున వర్షం కురిసి ఇంద్రధనుస్సు విరియడం జరిగింది. ప్రకాశవంతంగా మేఘములమీద విరిసిన  ఇంద్రధనుస్సు ఆ నీటి ఉద్ధృతికి కరిగిపోయింది. వరద ఎత్తి ప్రవాహం ఐనప్పుడు ఆ వరదనీటి ఎర్రని బురద రంగుగా ఇంద్రధనుస్సులోని ఎర్రరంగు కారి మారిపోయిందా అనిపిస్తున్నది. ఆ ఇంద్రధనుస్సులోని ఆకుపచ్చని రంగు కరిగి పచ్చికల రంగుగా మారిందా అన్నట్టు కనిపిస్తున్నది. ఆ పచ్చికలమీద ఎర్రని తివాచీ పరిచినట్లు ఆరుద్ర పురుగులు గుంపులు గుంపులుగా, దట్టంగా పరుచుకున్నాయి. 

ఘనవృష్టికతన ఫణు లే
పున నలవల్మీకరంధ్రములు మూయఁగ నె
త్తినగొడుగు లనఁగ ఛత్రా
కనికాయం బవనినెల్ల కడలం బొడమెన్   

తీవ్రంగా వర్షం కురియడంతో, తమకలుగులలోకి చేరిన నీరు నిలిచి నివాసం పాడైపోకుండా ఉండడంకోసమా అన్నట్లు ఎత్తిన గొడుగులలాగా భూమిమీద, పుట్టలమీద అంతటా అంతటా కుక్కగొడుగులు మొలిచాయి.

(కొనసాగింపు తరువాయి సంచికలో)         
వనం వేంకట వరప్రసాదరావు

మరిన్ని శీర్షికలు
navvu nalugu yugalu