Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview

బాబోయ్‌... మీడియాతో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి..! - ఆదాశ‌ర్మ‌

 


సైకాల‌జీ స‌బ్జెక్ట్‌లో డిగ్రీ చేసింది ఆదాశ‌ర్మ‌. మ‌నుషులనే కాదు.. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌నీ చ‌దివేసింది. రెండు సినిమాలు చేసిందో లేదో... సినిమానీ, ఇక్క‌డున్న మ‌నుషుల్నీ మీడియానీ బాగానే చ‌దివేసింది. ''ఇలాంటి పాత్ర‌లే చేయాలి..'' అనే రూలేం పెట్టుకోలేద‌ట‌. అందిన పాత్ర‌ల‌న్నీ చేసుకొంటూ వెళ్లిపోడం త‌ప్ప త‌న ద‌గ్గ‌ర ఆప్ష‌న్ లేద‌న్న విష‌యాన్ని కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెబుతోంది. హార్ట్ ఎటాక్‌తో తెలుగు ప‌రిశ్ర‌మ త‌లుపుత‌ట్టిన  ఈ ముంబై భామ‌.. ఇప్పుడు స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో ఓ కీల‌క పాత్ర పోషించింది. ఈ సినిమాతో వ‌రుస‌గా రెండో హిట్టు త‌న ఖాతాలో వేసుకొంది. ఇప్పుడు సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌లోనూ ఓ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఆదా శ‌ర్మ‌తో జ‌రిపిన చిట్ చాట్ ఇదీ...

* హాయ్ ఆదా...
- హాయ్‌...

* వ‌రుస‌గా రెండో హిట్ కొట్టేశారు... కంగ్రాట్స్...
- థ్యాంక్సండీ. నిజంగా ఈ సినిమా కోసం నేను చేసిందేం లేదు. హీరో, ద‌ర్శ‌కుడు, సాంకేతిక నిపుణులు అంతా క‌ష్ట‌ప‌డ్డారు. చివ‌రికి విజ‌యం నాకూ వాటా ఇచ్చారు.

* ఓ సినిమా విజ‌యంలో క‌థానాయిక పాత్ర ఏమీ ఉండ‌దంటారు.
- అలా అన‌డం లేదు. ఈ చిత్రంలో నేను క‌థానాయిక కాదు. స‌మంతా.. ఆ విష‌యం మ‌ర్చిపోకండి.

* రెండె సినిమాకే గెస్ట్ రోల్‌లోకి వ‌చ్చేశారు కార‌ణం ఏమిటి?
- మీరంటున్నారు గానీ... ఇది గెస్ట్ రోల్ అని. నేను మాత్రం కీల‌క పాత్ర అంటాను. నా పాత్ర‌కీ ఈ సినిమాలో చాలా ప్రాధాన్యం ఉంది.

* త్రివిక్ర‌మ్ సినిమా అని ఒప్పుకొన్నారా, లేదంటే మీ పాత్ర న‌చ్చా?
- క‌చ్చితంగా త్రివిక్ర‌మ్‌సార్ కోస‌మే. ఎందుకంటే... ఆయ‌న చాలా పెద్ద ద‌ర్శ‌కుడు. అలాంటి ద‌ర్శ‌కుడి సినిమా అంటే.. మరేం ఆలోచించ‌కూడ‌దు. నేను ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన కొత్త‌లోనే ఆయ‌న గురించి విన్నా. క‌చ్చితంగా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాలి.. అనుకొన్నా. ఆ అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు నా పాత్ర ఏమిటి?   హీరోయినా, కాదా?  అనే విష‌యాలు ప‌ట్టించుకొంటే ఎలా?

* భ‌విష్య‌త్తులోనూ ఇలాంటి చిన్న చిన్న పాత్ర‌లు చేస్తారా?
- త‌ప్ప‌కుండా. నేను చిన్న‌ప్ప‌టి నుంచీ... ఇంతే. మ‌న‌సుకి న‌చ్చింది చేస్తా. రోజూ ఒకేలా ఉంటే బోర్ కొట్టేస్తుంది. ఓ సినిమాలో హీరోయిన్‌, మ‌రో సినిమాలో ఇలాంటి చిన్న చిన్న పాత్ర‌లు చేసుకొంటూ వెళ్తే స‌ర‌దాగా ఉంటుంది. ఆదా ఏ పాత్ర‌యినా చేయ‌గ‌ల‌దు.. అనే న‌మ్మ‌కం వ‌స్తుంది.

* క‌మ‌ర్షియ‌ల్ క‌థానాయిక‌గా నిరూపించుకోవాల‌ని లేదా?
- హార్ట్ ఎటాక్ క‌మ‌ర్షియ‌ల్ సినిమానే క‌దా..?

* అంటే డాన్సులూ.. ఎక్స్‌పోజింగ్‌...
- నేను క‌థ‌క్ డాన్స‌ర్ని. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అయితే పూర్తి స్థాయిలో ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం రాలేదు. ఇక ఎక్స్ పోజింగ్ అంటారా.. దానికి అర్థం మీరే చెప్పాలి.

* లిప్‌లాక్‌, బికినీ అన్న‌మాట‌..
- ఈ విష‌యంలో మాట్లాడేట‌ప్పుడు మీడియాతో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఏం మాట్లాడినా ప్ర‌మాద‌మే.. (న‌వ్వుతూ)

* ఎందుకు?
- లిప్‌లాక్‌కి సిద్ధ‌మంటే.. అదే పెద్ద హెడ్డింగ్ అయిపోతుంది. ఆదా ఇలాంటి పాత్ర‌ల‌కే ప‌రిమిత‌మా అని మీరే రాస్తారు.

* నా పాత్ర ఇలా ఉండాలి.. అని మీరేం అనుకోరా?
- అనుకొంటా కానీ.. అలా డిజైన్ చేసుకొనే అవ‌కాశం నాకు ఇప్ప‌టి వ‌ర‌కూ రాలేదు. నిజం చెప్పాలంటే అందుకోసం ఇంకొన్నాళ్లు ఎదురుచూడాలి. ప్ర‌స్తుతానికైతే వ‌చ్చిన పాత్ర‌ని చేసుకెళ్లాలి. ఓ ఇర‌వై సినిమాలు చేశాక‌... అప్పుడు అర్థం అవుతుంది. ఆదా ఏం చేయ‌గ‌ల‌దు?  ఏం చేయ‌లేదు... అని.

* ప‌రిశ్ర‌మ‌ని బాగా చ‌దివేసిన‌ట్టున్నారు..
- (న‌వ్వుతూ) రెండు సినిమాలే చేసినా అనుభ‌వం బాగానే వ‌చ్చిందిలెండి..

* క‌థానాయిక‌గా ఎద‌గడానికి మీలో ఉన్న ప్ల‌స్ ఏమిటి?
- నాలో పాజిటీవ్ థింకింగ్ చాలా ఎక్కువ‌గా ఉంటుంది. నెగిటీవ్ విష‌యాలు అస్స‌లు ద‌రి చేర‌నివ్వ‌ను. ఓట‌మిలోనూ గెలుపు వెదుక్కొంటా.

* మ‌రి నెగిటీవ్ పాయింట్స్‌..?
- కొన్ని కొన్నిసార్లు మ‌రీ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో ఆలోచిస్తానేమో..?

* సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
- హీరోయిన్ కాదుగానీ.. అంత‌టి ప్రాధాన్యం ఉంటుంది. క‌థ‌ని మ‌లుపు తిప్పే పాత్ర నాదే.

* హీరోయిన్‌గా ఎన్ని సినిమాలు ఒప్పుకొన్నారు?
- రెండు క‌థ‌లు విన్నా. త్వ‌ర‌లోనే వాటి సంగ‌తి చెబుతా. ఓ త‌మిళ చిత్రం, మ‌రో హిందీ చిత్రం చేస్తున్నా. వాటి వివ‌రాలూ త్వ‌ర‌లో తెలుస్తాయి.

* ఓకే... ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ వెరీ మ‌చ్‌

 

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
Naa Paata 13 - Kalalonaina kalaganalede - Nuvvu Vasthavani