Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajayadevam

ఈ సంచికలో >> శీర్షికలు >>

యువ - డా. ఎ రవీంద్ర

 

ఆత్మవిశ్వాసం హద్దులు దాటితే...!

                                                                       

ప్రతి మనిషికి ఓ నమ్మకం ఉంటుంది. ఓ విశ్వాసం ఉంటుంది. తన ప్రతిభ గురించి ఒక అవగాహన ఉంటుంది. ఏమి చేయగలనో, ఏమి చేయలేనో అనే అంచానాలు ఉంటాయి. శక్తియుక్తుల మీద అభినివేశం ఉంటుంది. ఆ పరిధిలోనే సంచరించగలం. ఒకవేళ దాన్ని అధిగమించాలంటే కృషి, పట్టుదల, నిత్యం శ్రమించడం అవసరం. కానీ కొంతమంది యువత తమ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. తమ స్నేహితుల దగ్గర, లవర్స్ దగ్గర మెప్పు కోసం తమను తాము ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. అబ్బాయిలు అమ్మాయిలకు దగ్గరవ్వడానికి,  అమ్మాయిలకు అబ్బాయిలు దగ్గరవడానికి దీన్ని ఆయుధంగా ఉపయోగిస్తారు. మా ఇంట్లో అయితేనా!, నే నైతేనా!!, నాకు అస్సలు ఇష్టం ఉండదు!, ఎస్, ఐ డూ యిట్... !!! ఇలాంటివే ఎక్కువ వినిపిస్తుంటాయి మాటల మధ్యలో...


అతిశయోక్తులు... ఊహలు


శిరీష ఎప్పుడు పరీక్షలు రాసినా 90 పర్సంటేజ్ వస్తుంది. క్లాసు ఫస్టు వస్తుంది అని చెప్తుంది. తల్లిదండ్రులకు, బంధువులకు, చిన్నప్పటి నుంచి శిరీషతో చదువుకున్న స్నేహితులకు ఆ మాటలు వినివిని అలవాటైపోయాయి. కానీ శిరీష తను రాసిన సమాధానాలు అన్నీ కరెక్టు అనుకుంటది. తనలా ఎవ్వరూ రాయలేదని భావిస్తుంది.

నవీన్ అని ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి చేరిన ఆరునెలల్లోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ పేరు అతని పనిని బట్టి రాలేదు. అందరి దగ్గర కాలక్షేపం చేస్తూ నాకు వర్క్ బాగా వచ్చని తనకు తానే డప్పు కొంటుకున్నాడు. మేనేజర్ కు కూడా నమ్మకం కలిగించాడు. దాంతో కొత్తగా వచ్చిన యాభై లక్షల ప్రాజెక్టు నవీన్ కు అప్పజెప్పాడు మేనేజర్. దాంతో నవీన్ కు మొదలయ్యాయి కష్టాలు.

శీను గురించి కూడా మీకు చెప్పాలి. శీనుకు చిన్నప్పటి నుంచి సినిమాల పిచ్చి. ఒక్కడే సినిమా చూడడు. పది మంది ఫ్రెండ్స్ ను వెంటేసుకొని వెళ్తాడు. సినిమా చూస్తూనే- ఆ సీను అలా తీయకూడదు, ఇలా తీయాలి, డైలాగ్స్ లో పంచ్ లేదు. స్క్రీన్ ప్లే సరీగా లేదు... ఇలా అందరికీ చెప్తుంటాడు. నేను అయితే గొప్పగా తీస్తానని ప్రగల్భాలు పలికేవాడు. చివరకు ఓ ఫ్రెండ్ ముందుకొచ్చి అతనితో సినిమా తీయడానికి సిద్ధమయ్యాడు. ఇక మొదలయ్యాయి శీనుకు సినిమా కష్టాలు.
 

మాటలు కోటలు దాటకూడదు


శిరీష మొదటి నుంచి సాధారణ విద్యార్థిని. గొప్పగా చదవలేదు. బహుశా పరీక్షలు బాగా రాసి ఉండొచ్చు. కానీ ముందే ఇన్ని మార్కులు వస్తాయని చెప్పుకోవడం, తర్వాత అన్ని రాకపోతే బాధ పడడం మంచిది కాదు. తక్కువ చెప్పుకుంటే, రిజల్ట్స్ వచ్చాక ఎక్కువ వచ్చినా అందరూ మెచ్చుకుంటారు. కానీ ఆమెలోని అతివిశ్వాసమే అందుకు కారణం. అలానే నవీన్ కూడా తన పని గురించి అందరికీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇచ్చిన టార్డెట్ సమయానికి, తప్పులు లేకుండా పూర్తిచేస్తుంటే, వాళ్లే అతనిలోని ప్రతిభను గుర్తిస్తారు. అలా కాకుండా తెలియని పనిని కూడా తెలుసు అని చెప్పి ఇబ్బందుల్లో పడడం, తర్వాత సమస్యలతో ఉద్యోగం పోయే వరకు తెచ్చుకోవడం మంచిది కాదు. జాబ్ లో చేరిన కొత్తల్లోనే ఎదగాలి, మంచి పొజీషన్ రావాలి అంటే... ఏదీ ఆకాశం నుంచి ఒక్కసారిగా ఊడిపడదు. ప్రాజెక్టు డీల్ చెయ్యాలంటే పూర్వానుభవం, సీనియర్ల సహాయం అవసరం, ముఖ్యం. దీని వెనక నవీన్ లో ఉండే అత్మవిశ్వాసం హద్దులు దాటటమే మనకు కనిపిస్తుంది.

సినిమా తీయాలంటే..., ఏదో సినిమాలు చూడ్డం వస్తే చాలదు కదా. బాగలేదు అనడం కాదు ముఖ్యం. ఎలా తీయాలి. కథను ఎలా సిద్ధం చేసుకోవాలి. సన్నివేశాలు ఎలా కూర్చాలి. దర్శకుడిగా తనకున్న ప్రతిభ ఎంతవరకు. ఏ డైరెక్టరు దగ్గరైనా పనిచేశాడా, దానికి సంబంధించిన కోర్సు అయినా చదివాడా... ఇవన్నీ ఆలోచించకుండా తను చెప్పుకున్న గొప్పలతో శీను సినిమా తీయడం సాధ్యమేనా... కుదరదని మీరు సులభంగా చెప్పేస్తారు.
 

కొండ అద్దమందు కొంచమై ఉండు


గొప్పలకు పోయి ఆస్తులు పోగొట్టుకున్న వాళ్లు, నలుగురిలో అవమానాలకు గురయ్యే వాళ్లు మనకు నిత్యం ఎదురవుతూనే ఉంటారు. అందుకే ఎప్పుడూ మనల్ని మనం ఎక్కువగా ఊహించుకోకూడదు. మన గురించి మనకు ముందే ఓ అంచనా ఉంటుంది. దాన్ని బట్టే లక్ష్యాలు ఎంచుకోవాలి. లక్ష్యానికి సరైన మర్గాన్ని, సాధించేందుకు సమయాన్ని నిర్ణయించుని సాధన చెయ్యాలి. అంతేకానీ నాకు తెలుసు, నేను తలచుకుంటే ఎంతపని అని అనుకోకూడదు. బాధ్యతను స్వీకరించాలన్నా, కొత్త విషయం తెలుసుకోవాలన్నా ఆసక్తితో పాటు, కృషి ముఖ్యం. ఏమీ చేయకుండా మాటలు చెప్తే సరిపోదు. ఆ మాటలు మాటల వరకే పరిమతం అని నలుగురికి తెలియడానికి ఎంతో సమయం పట్టదు. ఆత్మవిశ్వాసం ఉండాల్సిందే. కానీ అది మాత్రం హద్దుల్లో ఉండాలి, బైబిల్ లో ఓ వాక్యం ఉంది. తనను తాను తగ్గించుకునువాడు, తర్వాత హెచ్చించబడును అని, అలానే వేమన ఎప్పుడో చెప్పాడు అనువుగాని చోట అధికులమనరాదు, కొండ అద్దమందు కొంచమై ఉండదా అని. అందుకే మాటలు ఎప్పుడూ కోటలు దాటకూడదు. చేతలు మాత్రమే దాటాలి.
 

నాయకుడు అవసరమైతే సైనికుడవ్వాలి


ఒకమాట మాట్లాడేటప్పుడు దాని ముందు వెనకలు ఆలోచించాలి. ప్రియరాలికోసం గొప్పులు చెప్పడం, వాస్తవ పరిస్థితుల్లో వాటిని నెరవేర్చడం కోసం నానా తిప్పలు పడడం, స్నేహితుల మధ్య తమ గురించి, తమ శక్తియుక్తుల గురించి అతిగా  పోవడం, తీరా పని చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం పక్కకు తప్పుకోవడం మంచిది కాదు. మనిషి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. నిజంగా యవ్వనంలోనే మనిషికి ఉండాల్సిన సంపూర్ణ వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని మన పెద్దవాళ్లు చెప్తుంటారు. అలా అని అవసరమైనప్పుడు కూడా నోరు మెదపకపోవడం మంచిది కాదు. మీరేంటే నిరూపించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ముందుండాలి. అలానే వెనకున్న మనం తక్కువగా చూడబడుతున్నాం అనే న్యూనతా భావం ఉండకూడదు.

మనిషికి అతి ముఖ్యమైంది ఆత్మవిశ్వాసం. ఒక పనిని నేను చేయగలను అనుకోవడం ఆత్మవిశ్వాసం. నేను మాత్రమే చేయగలను అనుకోవడం మితిమీరిన ఆత్మవిశ్వాసం. మనిషి ఎప్పుడూ పాజిటివ్ దృక్ఫథంతో ఉండాలి. కానీ శక్తి సామర్థ్యాలను మించి ఊహాలోకాల్లో తేలిపోకూడదు. మనిషి సైనికుడిగా ఉండటానికి, అవసరమైతే నాయకుడిగా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడే పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నట్లు చెప్పొచ్చు. మీరు పరీక్షలు రాసినా, ప్రేమలో పడినా, స్నేహాన్ని కోరుకున్నా, ఉద్యోగంలో చేరినా ఆత్మవిశ్వాసంతో ఉండండి. మీ వ్యక్తిత్వాన్ని చంపుకొని లేనిదాన్నిమీకు ఆపాదించుకోకండి. అంటే ఆత్మవిశ్వాసం ఆధిక్యతా భావంగా పరిణమిస్తే వ్యక్తిత్వమే కాదు, పనిలో కూడా అపజయం పాలవుతారు. అందుకే ఆత్మవిశ్వాసం ఎప్పుడూ హద్దులు దాటకూడదు.

మరిన్ని శీర్షికలు
sahiteevanam