Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
yuva

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

ఆముక్తమాల్యద

వర్షఋతువు తర్వాత వచ్చిన శరదృతువును వర్ణిస్తున్నాడు రాయలు. రాజమరాళలబ్ధగిరిరంధ్రము శాలివనీశరావలీవైజననంబు యజ్వహుత వాజహుతాశయ భాస్వదింది రాంభోజసమాగమం బుదిత బోధభుజంగశయోపచార నీరాజనఫుల్లహల్లకసరం బుదయించె శరద్దినం బిలన్వర్షాకాలం వెళ్ళిపోయింది. శరదృతువు వచ్చింది. క్రౌంచ పర్వత బిలం రాజహంసలను పొందింది(రాజమరాళలబ్ధగిరిరంధ్రము) వర్షాకాలం మానససరోవర ప్రాంతంలో గడిపిన హంసలు వెనక్కు తిరిగివచ్చి క్రౌంచ పర్వత బిలంలో ప్రవేశించాయి. ఇతర ప్రాంతాలకు వలసవెళ్ళడంకోసం సిద్ధపడ్డాయి అని భావం.

పరశురాముడు, కుమారస్వామి యిద్దరూ పరమశివునివద్ద విలువిద్యను అభ్యసించారు. ఆతర్వాత వారిప్రతిభకు పరీక్ష జరిగింది. ఆ సందర్భంగా పరశురాముడు బాణంతో క్రౌంచ పర్వతానికి చిల్లి పెట్టాడు. ఆ రంధ్రమునుండి హంసలు వర్షాకాలంలో మానససరోవరప్రాంతానికి వెళ్లి గడిపి, వర్షాకాలం ముగిసినతర్వాత మరలా అదే బిలమార్గంనుండి వెనక్కువచ్చి వివిధ ప్రాంతాలకు వలస వెళ్తాయి అని పురాణగాథ ఆధారంగా ఏర్పడిన కవి సంప్రదాయం. ఆముక్తమాల్యదా ప్రారంభంలోని దశావతార వర్ణనలో పరశురామావతారవర్ణనసందర్భంలో కూడా ఈ విషయం చెప్పాడు రాయలవారు. శాలి(వరి)ధాన్యాలచేలకు, రెల్లుపొదలకు వెన్నులుఈనేకాలం(శాలివనీశరావలీ  వైజననంబు)వచ్చింది. యజ్ఞయాగాదులు చేసే శ్రోత్రియుల హోమాగ్నులకాలము (యజ్వహుత వాజహుతాశయ )వచ్చింది. ప్రభాకలితమైన శ్రీ లక్ష్మికి పద్మములకు కలయిక జరిగే కాలం (భాస్వదిందిరాంభోజ సమాగమం) వచ్చింది, శరత్కాలంలో కమలములు విరివిగా విచ్చుకుంటాయి కనుక, కమలములలో నివాసంచేసుకోవడానికి లక్ష్మి వస్తుంది అని రమ్యమైన భావన. మెలకువవచ్చిన భుజంగశయనుడు  ఐన శ్రీమహావిష్ణువుకు నీరాజన ఉపచారములు చేయడానికి సిద్ధమైన శరదృతువు అనే లక్ష్మి ఎర్రని కనుకొలకులు అన్నట్లుగా విచ్చుకున్న ఎర్రనికలువలు నిండిన సరోవరములతో కళకళలాడే కాలము(ఉదిత బోధభుజంగశయోపచారనీరాజనఫుల్లహల్లకసరం) ఐన శరదృతువు ఉదయించింది. చాతుర్మాస కాలంలో మహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు, ఇప్పుడు మేల్కొంటాడు శరదృతువులో, కనుకఆయనకు ఉపచారములు చేయడానికి శరదృతువు అనే ‘లక్ష్మి’ సిద్ధమైంది! రాయలకు పక్షుల, పంటల, జనజీవన విధానాల, ఆధ్యాత్మిక వివరాల లోతులు ఎంతగా తెలుసో అన్నది, తెలిసినవాటిని ఎంత అందంగా చెప్పగలడో అన్నదానికి గొప్ప నిదర్శనం యిది. 

సాంధ్యరాగలహరి సామిరంజితములై
తిరిగె మింట నిదుర దెలిసినట్టి
యిందిరాధిపతికి  నెత్తుకర్పూరనీ
రాజనంబులన శరద్ఘనములు

శరదృతువులో సంధ్యాకాలంలో సగము(సామి)ఎర్రనైన మేఘాలు అప్పుడే నిద్రలేచిన విష్ణుమూర్తికి పట్టిన నీరాజనంలా కదులుతున్నాయి ఆకాశంలో. నీరాజనం ఇచ్చేప్పుడు కదిలే ఎర్రనిజ్యోతిలాగా సంధ్యారాగాన్నిఅలుముకున్న ఎర్రని మేఘాలు కదులుతున్నాయి.    

రవి శశి ముకురములు శర
ద్యువతి మెఱుఁగువెట్టుభూతి యో యనఁ బర్వెన్
బవనాహతసప్తచ్ఛద
నివహపరాగంబు దివికి నిర్మలకాంతిన్

సూర్యుడు, చంద్రుడు అనే దర్పణాలకు వర్షాకాలంలో మురికి పట్టింది. శరదృతువులో గాలికి ఎగురుతున్న ఏడాకుల అరటి చెట్ల పుప్పొడి ఆ అద్దాలను తుడవడానికి శరదృతువు అనే యువతి  ఉపయోగిస్తున్న బూడిదలాగా ఉన్నది. వర్షాకాలపు నీటి మేఘాలు అనే నిమ్ము, మురికి పట్టింది సూర్యుడు, చంద్రుడు అనే రెండు అద్దాలకు. అద్దములను తుడవడానికి మెత్తని బూడిదను ఉపయోగించడం గ్రామీణ స్త్రీల అలవాటు, ఇక్కడ శరదృతువు అనే గ్రామీణ స్త్రీ ఆ సూర్య, చంద్రులనే అద్దములను తుడవడానికి ఉపయోగిస్తున్నమెత్తని బూడిదలాగా ఉన్నది ఎగురుతున్న ఆ ఏడాకుల అరటి పుప్పొడి.

నీరజేక్షణుడవ్వేళ నిద్ర దెలిసి
యడుగుఁ  దనమీఁద మోపనో యవనిరమణి
కంటకిత గాత్రి యయ్యె నాఁగా విపాక
పరుషకంటక శాలిమంజరులు వొలిచె

(నీరజేక్షణుడు) తామరపూలవంటి  విశాలమైన కన్నులున్న శ్రీమహావిష్ణువు, తన నాథుడు, నాలుగునెలలునిద్రపోయి ఇప్పుడే మేల్కొన్నాడు, తనమీద కాలుమోపాడు అనే ఆనందంతో ఆయన పాదస్పర్శకు పులకించిన భూదేవి దేహంమీది పులకలు అన్నట్లు భూమిమీద పండిన వరిచేల వెన్నులమీది ముళ్ళు కనిపిస్తున్నాయి.. హెచ్చిన

మైత్రిఁ బద్మినుల కెల్ల ఘనాత్యయ కారుకుండు సొ
మ్మచ్చుపడంగఁ జేయుటకు నై యలక్రౌంచనగంబుపేరిక
మ్మచ్చున నీడ్చు శర్వగిరియందలి వెండిశలాక పిండు నా
వచ్చి మరాళమాలికలు వ్రాలెఁ గొలంకులఁ జక్ర ఝంకృతిన్ 

ఆ శరదృతువులో తెల్లని రాజహంసలు వేగంగా తొందరగా వచ్చి కొలనులలో చేరాయి. పద్మినీజాతి స్త్రీలు అనే కొలనులకు(పద్మములున్న కొలనులు కనుక) ఆభరణాలు చేసి ఇవ్వడానికి క్రౌంచపర్వతము అనే కమ్మచ్చు రంధ్రమునుండి శరదృతువు అనే కంసాలి లాగుతున్న వెండికొండ(కైలాసము)అనే వెండి తీగలలాగా ఉన్నాయి ఆ హంసలు.  

కొలనఁ గరిదంపతులు పద్మకళిక లొకటి
కొకటి యీనెత్త మకరంద మొలుక నమరె
నివి శరత్పద్మ నిలయకు నెలమితోడఁ
గావల నభిషేకమున కెత్తు కడవ లనఁగ

ఆ శరదృతువులో నిర్మలంగా ఉండే సరస్సులోజలక్రీడలాడడంకోసం దిగిన ఏనుగుల జంట ఒకరికొకరు ప్రేమతో ఇవ్వడం కోసం అన్నట్టు పద్మములను పైకెత్తి పట్టుకోవడంతో ఆ పద్మములలోని మకరందం జాలువారుతున్నది. పైకెత్తిన ఆ పద్మములు కడవలలాగా ఉన్నాయి. కారుతున్న ఆ మకరందం పద్మనిలయయైన శ్రీమహాలక్ష్మికి అభిషేకం చేయడానికి జాలువారుతున్న తేనెలా( శుద్ధోదకంలానో)ఉన్నది. యిది అత్యద్భుతమైన ఆధ్యాత్మికరహస్యం ఉన్న అందమైనపద్యం. ఇదే భావాన్ని ఆముక్తమాల్యద ప్రారంభంలో శ్రీవిల్లిపుత్తూరులోని గృహముల వర్ణనలో చేశాడు అని తెలుసుకున్నాము.

‘ లక్ష్మీర్దివ్యైర్గజేంద్రై ర్మణిగణ ఖచితైః స్నాపితా హేమకుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వ మాంగల్య యుక్తా ’ అని శ్రీసూక్తం చెప్తుంది, అమ్మవారి అభిషేకం చేసేప్పుడు చెప్పే మంత్రం యిది (ఆస్తికులైనవారికి)అలా చేయడం శ్రీప్రదం, అది ఒక సూచన. మరొకటి ఆది శంకరాచార్య విరచితమైన కనకధారాస్తోత్రంలో కూడా చెప్పబడిన శ్రీలక్ష్మీఉపాసనలోని రహస్యాన్ని ఇక్కడ చెప్పాడు శ్రీ కృష్ణ దేవరాయలు .‘దిగ్గస్థిభిః కనకకుంభ ముఖావసృష్ట స్వర్వాహినీ విమల చారుజలాప్లుతాంగీం ..’ అన్నాడు ఆదిశంకరుడు, రెండుప్రక్కలా దిగ్గజాలు స్వర్ణ కలశాలతో (దేవగంగా) జలంతో అభిషేకిస్తుండగా పద్మాలయయైన శ్రీ మహాలక్ష్మీ ధ్యానము, ఉపాసన ఆమెకు అత్యంత ప్రీతికరమైన ఆరాధనా విధానము, సాధకులకు సర్వార్ధప్రదాయకం. దాన్ని ఇక్కడ ప్రత్యక్షముగా సూచిస్తున్నాడు రాయలవారు. ఆ తర్వాత యామునా చార్యుల వారికి యుద్ధములో లభించే విజయలక్ష్మికి , ఆ తర్వాత ఆధ్యాత్మికప్రపంచంలోలభించబోయే శాశ్వతమైన మోక్షలక్ష్మికి యిది సూచన, యిలా శ్రీమహాలక్ష్మిని భావించి ఉపాసించడం వలన ‘ గుణాధికా గురుతర భాగ్య భాగినో భవంతి తే భువి బుధ భావితాశయాః’ సద్గుణ సంపత్తిచేత మహాజ్ఞానులు, విద్వాంసులచేత  కూడా స్తుతింపబడే ఉత్తమమైన యశస్సు అనే ఐశ్వర్యం లభిస్తుంది అని కూడా కనకధారాస్తవ ఫలశ్రుతిలో ఆదిశంకరుడు చెప్పాడు, ఆ శాశ్వతసిరి సంప్రాప్తించబోతున్నది యామునాచార్యులకు ముందుముందు, అది ధ్వని!

ఇటువంటి శరదృతువు వచ్చింది. సరస్సులు నిర్మలములైనాయి. బురదనేలలు   ఎండిపోయాయి.యుద్ధయాత్రకు అనువైనసమయము వచ్చింది. ఇచ్చినమాటప్రకారము శత్రురాజులను లొంగదీయడానికిబయల్దేరాడు యామునాచార్యులు.

(కొనసాగింపు తరువాయి సంచికలో)

మరిన్ని శీర్షికలు
navvu nalugu yugalu