Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
yatra

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

 

జరిగిన కథ : నానమ్మ, అమ్మమ్మ గార్ల ఊళ్ళ ప్రయాణాలు, సరదాలు, సంతోషాలతో వేసవి సెలవులు గడచిపోతాయి. తిరిగొచ్చాక బిజీ అయిపోతుంది చంద్రకళ. చిన్మయ వారి ప్రోగ్రాం లో పెర్ఫాం చేసాక కొత్త ఉత్సాహం వస్తుందామెకు. భూసణ్ అంకుల్ సినిమా ప్రీవ్యూకి వెళారందరూ....ఆ తర్వాత..


ప్రీవ్యూకి  కొద్ది మందే వచ్చారు. వచ్చిన వాళ్ళంతా ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళంట. దేవుళ్ళ  సినిమా.  పేరు ‘శ్రీ లలితా శివజ్యోతి’.. మేము వెళ్ళి రెండో వరసలో సోఫాల్లో కూర్చున్నాము.

కాసేపటికి  భూషణ్ అంకుల్, నీరూ ఆంటీ, రాణి వచ్చి పలకరించారు.

***

డిన్నర్ వద్ద అక్కడున్న వాళ్ళల్లో చాలా మందిని  పలకరించి మాట్లాడారు నాన్న.. మమ్మల్ని,  సినిమా హీరోయిన్  వసంత కుమారికి  పరిచయం చేసారు.ఆవిడ ఇల్లు కూడా మా కాంప్లెక్స్ దగ్గరేనట.  మాటల్లో,  నాన్న నా డాన్స్ క్లాస్ గురించి చెప్పారామెకి. “శివరామ మాస్టారు నాకు తెలుసు.  నన్ను సినిమాల్లో డైరెక్ట్ చేసారు.  ఈ మధ్య, మన  ఏరియాలోనే డాన్స్ స్కూల్  స్టార్ట్ చేసారు,” అంది వసంతకుమారి.

ఇంతలో భూషణ్ అంకుల్ మా దగ్గరికి వచ్చారు.

“ఏమ్మా కళా, నీ గురించి వింటూనే ఉన్నాము.  నీ పర్ఫార్మెన్స్  మన స్టుడియో  కల్చరల్  క్లబ్బుకి  ఏర్పాటు  చేద్దాము.  ఎప్పుడు నీకు వీలుంటుందో చెప్పు,” అన్నారు నా తలపై తాకి.

నేను నాన్న వంక చూసాను.

“ఏమంటావ్  సత్యం?  మీ డాటర్ తన ఇద్దరి పేరెంట్స్ నుండి టాలెంట్ పుణికి పుచ్చుకుందోయ్.  ఎంకరేజ్ చెయ్యాలి,” , “మన స్టుడియోలో డాన్స్ రిసైటల్ ఏర్పాటు చేద్దాం,” అన్నారు  భూషణ్ అంకుల్, నాన్నతో.

“డాన్స్  విషయంలో మా కళ  ఎవరెడీ.. అది  డాన్స్  చేయడం  అసలాపింది  ఎప్పుడు?” అంటూ నవ్వారు నాన్న.

“కానివ్వండి, ఇంకా పద్దతిగా నేర్చుకొన్నాక  చేస్తుందిలెండి,” అంది అమ్మ...

“ఈ సారి సమ్మర్ లో మా రాణీకి కూడా కాస్త తర్ఫీదు ఇచ్చి, మెల్లగా మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కి తయారు  చేయమని  మీకు  మా  రిక్వెస్ట్,” అన్నారు అంకుల్ అమ్మతో.

**

మునపటి కంటే తన మ్యూజిక్ క్లాసుతో  బిజీ అయినా,  నా డాన్స్ విషయంలో చాలా శ్రద్ధ పెడుతుంది అమ్మ.  నాకు స్పెషల్ డైట్  అని  కూడా  కేర్  తీసుకుంటుంది.

అమ్మ తన చిన్నప్పుడు  చేసిన డాన్స్ ఐటమ్స్ కొన్ని, ఒకదాని వెంట ఒకటి  నాకు నేర్పుతూనే ఉంది.

ఈ మధ్యనే ‘మధురానగరి ’  పాటకి డాన్స్  ప్రాక్టీస్ తో పాటు, ‘మొక్కజొన్న తోటలో ‘ ఫోక్ డాన్స్ నేర్పిస్తుంది.  

“కళా, నీ అదృష్టం రా.  మీ అమ్మ నీకు గురువు కూడా!”  అని  నాన్న అన్నప్పుడు ,

“నా ఫస్ట్ ఎండ్ బెస్ట్ గురువు అమ్మ,” అంటూ, నా తల బ్రష్ చేస్తున్న అమ్మని ముద్దు పెట్టుకున్నాను.

**

మరో  మూడేళ్ళు  గడిచాయి.......

డాన్స్ క్లాస్ లో కొన్ని మంచి నృత్యాలు నేర్చుకున్నాను.  ఒక్కోసారి అమ్మ దగ్గరుండి ప్రాక్టీస్ చేయిస్తుంది. అవకాశం వచ్చినప్పుడల్లా ఒకటీ, రెండు ఐటమ్స్ పర్ఫాం  చేస్తున్నాను.  ప్రతిసారి నా డాన్స్ గురించిన మంచి కామెంట్ గాని, రీవ్యూ గాని నాకు ఎంతో సంతోషాన్నిస్తున్నాయి. అమ్మా, మాస్టారు కూడా చాలా గర్వపడతారు.  సమ్మర్ లో జరిగే డాన్స్ వర్క్- షాప్స్ అటెండ్ అయి అభినయం, థియరీ కూడా నేర్చుకుంటున్నాను.

ఈ మూడేళ్ళలో  నేను బాగా పొడవయ్యాను కూడానట.

**

డాన్స్ క్లాస్ నుండి,అలసటగా ఇంటికెళ్ళేప్పటికి, అమ్మ ఫోన్ లో మాట్లాడుతుంది.  లోనికెళ్ళి  షవర్ చేసి వచ్చాక కూడా ఇంకా ఫోన్ మీదే ఉంది....ఆకలేస్తుందని సైగ చేసి, హోమ-వర్క్ చేస్తున్న  బాబు వద్ద కూర్చున్నాను.  ఢిల్లీ నుంచి రాంమామయ్య, మణత్తయ్య వాళ్ళ ఫోన్ అని అర్ధమయ్యింది.  ఎప్పుడు మాట్లాడినా మీరు రండంటే, మీరు రమ్మని ఆర్గ్యూ చేసుకుంటారు అమ్మ, మణత్తయ్య. రాంమామయ్య  నిజానికి  అమ్మకి  కజిన్ బ్రదర్.  చిన్నప్పటి  నుండి సొంత అన్నయ్య లా  ప్రేమగా ఉంటాడట.  ఆస్ట్రేలియాలో ఉన్న సుశీల పెద్దమ్మ కంటే పెద్దవాడట. అమ్మమ్మ తాతయ్య సొంత కొడుకులా భావిస్తారట ఆయన్ని.

**

అమ్మ ఫోన్ పెట్టేసి,  “రండి రండర్రా,  మాటల్లో పడిపోయాను,” మమ్మల్ని  డిన్నర్  కి పిలిచింది అమ్మ.  “ఈ సారి సెలువల్లో మణత్తయ్య వాళ్ళు ఒక వారం రోజులు చెన్నై వస్తున్నారు.తిరుపతి కూడా వెళ్ళాలనంట,” అంది వడ్డిస్తూ.

“గుడ్,  ఇన్నాళ్ళకన్నా వస్తున్నారు,”  భోంచేస్తూ,  రాంమామయ్య గురించిన  కబుర్లు చెప్పసాగారు  నాన్న. భూషణ్ అంకుల్  క్లాస్మేట్ అయితే,కాలేజీలో,  రాంమామయ్య వీళ్ళకి  సీనియర్ అట.  ఆయనే ముందు ఇండియన్ ఆర్మీలో సెలక్ట్ అయి,  తనను కూడా జాయిన్ అవమని ఎంకరేజ్ చేసాడట.  అమ్మతో, తన పెళ్ళి కూడా, రాంమామయ్య కుదిర్చిందేనని గుర్తుచేసుకున్నారు నాన్న.

**

**
అలవాటుగా,  సండే బ్రేక్ ఫాస్ట్  తరువాత, నాన్నతో బోర్డ్ - గేమ్స్ ఆడడానికి  హాల్లోకి వచ్చాను.  గేమ్ సెటప్ చేసి,  ఆడ్డం మొదలుపెట్టే లోగా ఫోన్  రింగయింది.  
నాన్నేతీసారు...

“హలో.... ఆ..ఆ.. భూషణ్,  గుడ్ మార్నింగ్”   ఫోన్లో మాట్లాడుతూ పక్కనే వరండాలోకి వెళ్ళారు నాన్న.... ఇక  ఆ  ఫోన్ కాల్  అయ్యేంత మటుకు  వెయిట్ చేయక తప్పదు కనుక,  నాన్న మాటలు వింటూ,  టి.వి ఆన్ చేసి వాల్యూం తగ్గించేసాను.....

“....నీది సెన్షేషనల్  ఐడియా భూషణ్.... అలా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది.  పైగా వచ్చే వారం నుండే సమ్మర్ హాలిడేస్ కదా!  రెండు నెలల  టైం పెట్టుకొని బాగా చేయవచ్చు,” , “అదే  టైంకి, ఢిల్లీ నుంచి మన రాం వాళ్ళ ఫామిలీ కూడా  ఉంటారేమో భూషణ్! ఇదిగో ఒక్క నిముషమాగు,  శారదకి విషయం చెపుతాను,” అని ఫోన్ టేబిల్ మీదుంచి,   అమ్మని పిలిచి  సంగతి వివరించారు నాన్న.

“భూషణ్ నాన్నగారి వర్ధంతికి,  స్టుడియోలో  గ్రాండ్ గా ఫంక్షన్ చేస్తారట,  ఈ సారి ఆ  ఫంక్షన్ లో  వాళ్ళమ్మాయి  రాణి చేత పాట,  మనకళ చేత  కూచిపూడి  డాన్స్  చేయిస్తే  బాగుంటుందని  భూషణ్ వాళ్ళ ఆలోచన.  వీలుంటుందా!  అని  నిన్ను  అడగడానికి  ఫోన్ చేసారు,” అంటూ బల్ల మీదున్న ఫోన్ అమ్మకందించారు.

ఫోను తీసుకొని, “హలో,  బాగున్నారా?” అంది అమ్మ.

అంకుల్, అమ్మకి మళ్ళీ సంగతి చెప్పారనుకుంటా.

“అవును నిజమే,  ప్రోగ్రాం  అని  అనుకుని  కూడా దగ్గర దగ్గర  మూడేళ్ళవుతుంది.  ఈ సమ్మర్ ఎండింగ్ అంటే,  అదే టైంకి మా  అన్నయ్య వాళ్ళు  కూడా వస్తున్నారు,” క్షణమాగింది అమ్మ..“అదేలెండి,  వాళ్ళు  మీకూ తెలిసిన వాళ్ళే గా! పోతే  క్లాసికల్  ప్రోగ్రాం కాబట్టి , చంద్ర వాళ్ళ గురువుగారితో కూడా మాట్లాడాలి.  అన్నీ ఆలోచించి మళ్ళీ చెబుతానండీ,” అని ఫోన్ పెట్టేసింది అమ్మ.

నేను వెళ్ళి  నాన్న కుర్చీ హాండిల్ మీద కూర్చున్నాను.

మా ఇద్దరి వంక చూసిన అమ్మ,  “నన్ను అలోచించనివ్వండి.  బాబు పుట్టినరోజు, అన్నయ్యా  వాళ్ళు రావడం, అన్నీ ఒకేసారి..,” తల పట్టుకుంది అమ్మ.

“చూడు శారద, మీ అన్నయ్యా వాళ్ళ రాక, ఈ ప్రోగ్రాముకి అడ్డం రాదు.  బాబు పుట్టిన రోజుకి, మన కళ డాన్సుకి కూడా వాళ్ళుంటారు.  పోతే తిరుపతికి ట్రిప్పు,ఈ ప్రోగ్రాముకు ముందో, వెనకో రెండురోజుల్లో  వెళ్ళి రావచ్చు.  అలోచించి  ఏ తేదీ మనకి  వీలో  చెప్పు.  భూషణ్ తో డిస్కస్  చేద్దాము,”  అన్నారు నాన్న.  పట్టలేనంత ఆనందంగా అనిపించింది నాకు.

“ఇటువంటి  ‘వేదిక’  మీద  చేయడం  మంచి అవకాశం.  ఈ వయసుకే  క్లాసికల్ డాన్సులో  అవార్డ్స్,  పేరు వచ్చినా,  ఇలాటి ప్రోగ్రామ్స్ చేస్తే తప్ప, మన కళ టాలెంట్ కి తగ్గ గుర్తింపు  రాదు.

భూషణ్ ఏది చేసినా పెద్దెత్తున చేస్తాడు.  ఫంక్షన్ కి ఆర్ట్ ఫీల్డులో హేమాహేమీలు  వస్తారు.

ఈ  ప్రోగ్రాముకి  స్పెషల్ గా కళకి మంచి  కాస్ట్యూమ్స్  కుట్టించి, అన్నీ ప్లాన్ చేద్దాము.  అయినా  నువ్వు  తలుచుకుంటే, చక్కగా  చేయగలం,” అన్నారు నాన్న మళ్ళీ.

మరునాడు,  మా మాస్టారు గారితో  డిస్కస్  చేసింది అమ్మ.  ఓ సింగర్ తో పాటు ఆర్కెస్ట్రాని,  నట్టువాంగం  చేసేందుకు  శేషు మాస్టారుని  ఏర్పాటు  చేస్తారట.  వారానికి రెండుసార్లు రిహార్సల్స్  చేయిస్తారట.

ఇక,  భూషణ్  అంకుల్ తో  కూడా మాట్లాడి, స్కూల్ రి-వోపెన్ కి ముందు, ప్రోగ్రాం  డేట్ ఫిక్స్  చేసింది  అమ్మ.

**

సమ్మర్ లో మ్యూజిక్ క్లాసులు ఎక్కువవడంతో,  కామాక్షి  అక్క మీనాక్షిని కూడా యింటి పనికి పెట్టింది అమ్మ. ఒకళ్ళు  పైపని. ఒకళ్ళు వంట చేసి రోజంతా ఉండేలా అంట....పదిహేనేళ్ళ మీనాక్షి వంట బాగా చేస్తుందట కానీ, నత్తి వల్ల సరిగ్గా మాట్లాడలేదట..భూషణ్ అంకుల్ వాళ్ళ వంటమనిషి  ‘అంబుజ’  కూతుళ్ళే కామాక్షి,  మీనాక్షి. అంబుజ వచ్చి జీతం మాట్లాడుకొని  వెళ్ళింది.

“బీదవాళ్ళైనా, పద్ధతిగా ఉన్నారు,”  అంది అమ్మ వాళ్ళ గురించి.

**

మొదటి రెండు రోజులు దగ్గరుండి మీనాక్షి చేత వంట చేయించింది, అమ్మ. 

“బాగానే ఉన్నాయి రుచులు,” అన్నారు నాన్న భోంచేస్తూ.

“అంత మాత్రం నచ్చితే మంచిదే, అన్నీ చేస్తుంది మీనాక్షి... ఇక వీళ్ళ డాన్స్, పాట ప్రోగ్రాముల ప్రాక్టీసులకి, నాకు బోలెడంత సమయం ఉంటుంది,” అంది అమ్మ....

నా ప్లేట్లో కర్రీ వడ్డిస్తూ, “అది సరే గాని, చంద్రా, ఇప్పటి వరకు  చేసిన  ప్రోగ్రాములకి,  ఒకటో  రెండో  డాన్సులు  మాత్రమే  చేసావు.  ఈ ప్రోగ్రాం అలా కాదు.  ఇటువంటి  ‘వేదిక’  మీద, పద్దతిగా కొన్ని ఐటమ్స్ చెయ్యాలి,” ,”నువ్వు ఇప్పుడు పెద్దయ్యావు కూడా.  ఈ  ప్రోగ్రాం చక్కగా ప్లాన్ చేసి చెయ్యాలి,”  అంది అమ్మ.

మరి అమ్మ  ప్లాన్  ప్రకారమే - గణపతి కౌత్వం, జతిస్వరం, రామ పట్టాభిషేక శబ్దం, గోవర్ధన గిరిధారి, మొక్కజొన్న తోటలో –ప్రాక్టీసు చెయ్యడం మొదలుపెట్టాను.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattistE koti