Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nataraja nilayam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

ఆముక్తమాల్యద

శరదృతువు వెళ్ళిపోయినతర్వాత, తను క్షత్రియధర్మాన్ని అంగీరించాడు కనుక, మహారాజుకు మాట ఇచ్చాడు గనుక చతురంగ బలాలతో కూడిన మహాసైన్యముతో దండయాత్రకు వెళ్లి, శత్రురాజులందరినీ జయించి,

జన్నములు చేసి దానము
ల న్నానాదేశవిప్రులం దనిపి సుసం
పన్నత ననిశము బహుభో
గోన్నతుడై యాదమరచి యుండె నశంకన్    

యజ్ఞములు చేసి, నానాదేశములనుండి వచ్చిన విప్రులకు దానములను చేసి, త్రుప్తినొందించి, భోగభాగ్యములతో సమృద్ధిగా నిరంతరమూ నిశ్శంకగా ఆదమరిచి అంటే ప్రశాంతముగా, ఏ విచారమూ లేక గడుపసాగాడు, అంటే ఆ రాజభోగాలలో మునిగి భక్తిజ్ఞానవైరాగ్యములను విస్మరించి గడపసాగాడు. ఆతని రాజ్యము సకల సమృద్ధిగా ఆనందమయంగా ఉన్నది.  యామునాచార్యుని పితామహుడు నాథముని అనే మహా జ్ఞాని, ఆచార్యుడు. ఆయనకు శిష్యుడు పుండరీకాక్షుడు అనే మహానుభావుడు. ఆ పుండరీకాక్షుని శిష్యుడు శ్రీరామమిశ్రుడు అనే యోగి, మహాజ్ఞాని. తన గురువుగారికి గురువుగారైన నాథమునికి మనుమడు, జ్ఞాని, విరాగి ఐన యామునాచార్యుడురాచరికపు  భోగాభాగ్యాలలో మునిగి తన ఆధ్యాత్మికసంపత్తిని కోల్పోయి విలాసవంతమైన జీవితంలోమునిగిపోవడం పట్ల తీవ్రంగా బాధపడ్డాడు. ఎలాంటి  మహానుభావుని మనుమడు ఎలా భ్రష్టుడైపోయాడు అని చింతించి, ఎలాగైనా యామునాచార్యుడిని పూర్వపు ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్ళించాలి అని నిశ్చయించుకున్నాడు.

తొడిఁబడి విషయాతురు నవి
విడువు మనుటకంటెఁ గలదె వేరేపగ నే
ర్పడరఁ గథాదుల నొకవెం
బడి దోఁపం బలికి మైత్రి వాపుట యొప్పున్

తొందరపడి విషయాసక్తుడైనవాడికి వాటిని విడిచిపెట్టుమని చెప్పడం కంటె పగ కోరి కోరి కొనితెచ్చుకోడం వేరే ఏదన్నా ఉంటుందా? అందునా మహారాజు ఐన వాడికి రాజభోగాలను విడిచిపెట్టుమని చెప్పడం ఇంకా ప్రమాదకరం కదా, అందుకని ఉపాయంగా, ఏవో కథలు ఉపమానాలు చెప్పి బుద్ది మరలించడం మంచిది అనుకున్నాడు శ్రీరామమిశ్రుడు. ఉపాయంగా ప్రతిరోజూ 'ముళ్ళముస్తె కూర' ను తీసుకుని వెళ్లి, ఒకవైష్ణవుడు మహారాజుకు భోజనంలో వండిపెట్టడం కోసం తెచ్చి ఇచ్చినట్లు చెప్పి వండండి అని మహారాజుకు వండిపెట్టే వంటబ్రాహ్మణులకు ఇవ్వడం మొదలుబెట్టాడు. వారు అలాగే వండిపెట్టడం మొదలెట్టారు. అలా ఆ ముండ్లముస్తె కూరకు అలవాటుపడ్డాడు యామునాచార్యుడు. ఒకనాడు భోజనం చేస్తూ ఆ ముండ్లముస్తె కూర రుచికి ఆనందించి, నిత్యమూ దీన్ని తెచ్చి ఇస్తున్న ఆ భాగవతుడినిమా భోజనానంతరము పిలిపించి మాకు చూపించండి అని ఆజ్ఞాపించాడు యామునాచార్యుడు. అలాగే శ్రీరామమిశ్రుడికి మహారాజ దర్శనం చేయించారు భటులు. ఆయనకు నమస్కరించి ' మీ కోరిక ఏమిటి? ప్రతిరోజూ మాకు రుచికరమైన ఆ కూరను సమర్పిస్తున్నారు, మానుండి మీరు ఆశించునది ఏమైనా ఉన్నదా? అని అడిగాడు యామునాచార్యుడు.

మీపెద్దలు గూర్చిన ని
క్షేప మొకటి సహ్యజనిత సింధుజలాంత
ర్ద్వీపమున నుండ నీకుం
జూపంగా వచ్చితిని వసుమతీ నాథా!

మహారాజా! మీ పెద్దలు కూడబెట్టి, భక్తితో సేవించి, సహ్యపర్వతములో పుట్టిన కావేరీ నదీప్రవాహము మధ్యలోనున్న ఒక దీవిలో పాతిపెట్టిన నిధిని మీకు చూపించాలని నా కోరిక మహారాజా, అందుకే ప్రతిరోజూ వస్తున్నాను, ఆ ముండ్లముస్తెకూర తెస్తున్నాను, ఈ రోజూ అందుకే వచ్చాను, అందుకే తెచ్చాను అన్నాడు శ్రీరామమిశ్రుడు.

నా కేటికి నిక్షేపము
నాకు నిధియు నాకరంబు నరనాథులసొ
మ్మేకాన విన్నవించెద
నాకర్ణింపుము తదీయమగువిధ మెల్లన్ 

నాకెందుకు నిధి నిక్షేపాలు, భాగవతుడికి? నీవు మాత్రము నాకెందుకు నిధినిక్షేపాలు అని పలుకవద్దు, ('నాకు' అంటే అలా అనకు అని కూడా)మహారాజా! నిధినిక్షేపాలు గనులు సంపద అన్నీ ప్రభువుల ఆస్తులే, వారికి చెందవలసినవే గనుక, ఆ నిధి వివరాలు మొత్తం చెబుతాను వినండి.

స్ఫటల మణుల్మీర శాంతమై శ్వేతమై
  నట్టిత్రాఁ చొక్కటి చుట్టియుండు
రక్షోగృహీత మన్ప్రథ తొల్లి గల దది
  పొలయ దం దేఁడారు నెలలు గాని
యేపాటిబలి యైనఁ జేపడుఁ బ్రాణిహిం
  సాదిపూజనముల కాసపడదు
తనవెలుం గొగి నిరంజనదృష్టికినె లక్ష్య
మై యుండు నయ్యు నింతంత గాదు

రత్న మొక్కటిపై నపూర్వంబు మెఱయుఁ
గలదు పద్మంబు శంఖంబు పలుకు లేటి
కక్షయ మనంత మాద్య మే కాంతమందు
భూప నీ కొక్కనికె కాక చూపరాదు

మహారాజా! పడగలలో మణులు ప్రకాశిస్తుండగా శాంతమైన, తెల్లని త్రాచుపాము ఒకటి ఆ నిధిని చుట్టుకుని ఉంటుంది. నిధి నిక్షేపాలను నాగులు రక్షిస్తూ ఉంటాయి అని నమ్మకం, అనుభవములో ఎందఱో కనుగొన్నది కూడా. తెల్ల త్రాచులు (శ్వేతనాగులు) ప్రాచీన నిధి నిక్షేపాలున్నచోట రక్షగా ఉండడం ప్రపంచంలో ప్రసిద్ధము. నిధి అంటున్నాడు కనుక తెల్ల త్రాచు చుట్టుకొని ఉండడం న్యాయమే. అంతరార్ధం శ్రీమహావిష్ణువు తనను శయ్యగా చేసుకని నిదురిస్తాడు కనుక ప్రశాంతంగా ఏ కదలికలూ లేకుండా శయ్యయై ఉండే తెల్లని త్రాచు ఐనఆదిశేషుడు తన పడగలమీది మణులు మెరుస్తుండగా చుట్టలు చుట్టుకుని తెల్లనిపానుపులాగా ఉంటాడు అని. మరొక చమత్కారము శయ్యకు ఉండాల్సిన లక్షణాలలో తెల్లగా స్వఛ్ఛముగా ఉండడం ఒకటి. కనుక తెల్లని శేషుని తెల్లని పానుపన్నమాట!

రాక్షసునిచేత గ్రహింపబడినది అన్న ప్రసిద్ధి ఉన్నది ఆ నిధికి. నిధి నిక్షేపాలను అసురులు బలవంతముగా నైనా అనుభవిస్తారు అని చమత్కారము, బలవంతంగా స్వంతం చేసుకోవాలి అనుకునేవాడు రాక్షసుడు అని చురక. శ్రీరామచంద్రుడు తన పట్టాభిషేక సందర్భముగా అందరికీ అనేక రకాల కానుకలిచ్చాడు, విభీషణునికి ఇక్ష్వాకుల పూజామందిరములోని శ్రీరంగనాథుని మూర్తిని బహూకరించాడు, దానిని తీసుకుని వెళ్తూ సంధ్యావందన సమయమైంది అని కావేరీ నదీ తీరంలో ఇసుకతిన్నెల మీద దానిని ఉంచి, తన సంధ్యావందనవిధులు  పూర్తిచేసుకున్నతర్వాత ఎంత ప్రయత్నించినా ఆ విగ్రహమును లేపలేక బాధపడుతుంటే, తనను అక్కడే ప్రతిష్ఠించి వెళ్ళమని ఆ రంగనాథుని మూర్తి ఆదేశించడంతో అలాగే చేసి వెళ్ళాడు విభీషణుడు అని ఐతిహ్యం, కనుక రాక్షసునిచేత గ్రహించబడింది అని అంతరార్థం. ఆ రాక్షసుని పొందును ఏడాదికో ఆరు నెలలకో పొందుతుంది ఆ నిధి. శ్రీరంగనాథుని ప్రతిమను అక్కడే ప్రతిష్ఠించి ఆరునెలలకు ఒకసారి, సంవత్సరానికిఒకసారి వచ్చి పూజలు చేస్తాడు, ఇప్పటికీ, ఆయన చిరంజీవి కనుక అని ఐతిహ్యం, అది అంతరార్థం.

ఏమాత్రమూ బలి, ప్రాణిహింస అనేది కోరదు ఆ నిధి. సామాన్యంగా నిదినిక్షేపాలను స్వంతం చేసుకోడానికి బలులిస్తుంటారు లోకంలో, కానీ ఈ నిధి ఏ బలినీ కోరదు, సులభముగానే వశమవుతుంది. అంజనము అంటే కాటుక, నిరంజనము అంటే కాటుక లేకుండా అని, నిధి నిక్షేపాలను కనుక్కోడానికి మంత్రించిన అంజనమును కనులకు పెట్టుకుంటారు మంత్ర తంత్రాల సాధన చేసేవాళ్ళు, ఈ నిధిని కనుక్కొనడానికి అదేమీ అవసరములేదు.తన వెలుగులను ప్రసరించి, కాటుక వంటి అజ్ఞానము అంధకారమును తొలిగించితనే  దర్శనమిస్తుంది, సంప్రాప్తిస్తుంది ప్రాప్తమున్నవాళ్లకు. అట్లాంటిది, ఇట్లాంటిది కాదు, చవకైనది, నాసిది కాదు, అది మహానిధి. అంతలు ఇంతలు అని చెప్పడానికి వీలులేని అనంతమైన మహిమగల శ్రీరంగని నిధి.  అదొక అపూర్వమైన పూర్వపు రత్నము. పురాతనుడైన శ్రీ రంగడు అనే రత్నము. శంఖము పద్మము మొదలైన నిధులు గలది. నవనిధులలో శంఖము, పద్మము అనే నిధులు భాగాలు. శ్రీ రంగనాథుని పరంగా ఆయన చేతిలో శంఖము ఉంటుంది, ఆయన నాభిలో పద్మము, తామరపూవు ఉంటుంది,బ్రహ్మదేవుడు ఆ తామరపూవునుండేజన్మించాడు మరి. వేల మాటలు ఎందుకు, ఆ నిధి అక్షయమైనది, తరిగిపోనిది. అనంతమైనది, ఇంతా అంత అని చెప్పలేని అనంతమైన నిధి. ఆది ఐనది, ఆది దేవుడైన  శ్రీ రంగనాధుడు అనే నిధి అది. అది ఏకాంతములో తప్ప, అదీ నీకు తప్ప వేరెవరికీ చూపించారనిది మహారాజా! అన్నాడు శ్రీరామమిశ్రుడు.

ఆ వివరాలకు అబ్బురపడి, ఆనందించి, సేనాసమేతుడై ఆ స్థలానికి, శ్రీరంగానికి వెళ్లి, ముందు కావేరిలో స్నానం చేసి, పునీతుడై, రంగనాథుని దర్శించి సేవించి, ఎక్కడ ఆ నిధి అన్నట్లుగా సాభిప్రాయంగా శ్రీరామమిశ్రునివైపు చూశాడు. శ్రీరామమిశ్రుడుచిరునవ్వులు చిందిస్తూ ఇలా అన్నాడు.

మీపెద్దలు గూర్చినని
క్షేపమ్మిది కొమ్మటంచు శ్రీరంగపతి
శ్రీపదయుగ్మముఁ జూపిన
నాప్రుథివీపతిహఠాదపాస్తభ్రముడై

మీపెద్దలు దాచిపెట్టిన, పాతిపెట్టిన నిధి యిదే, చూడండి మహారాజా, తీసుకోండి, అని శ్రీరంగనాథుని పాదపద్మములను చూపించాడు. అదిరిపాటుతో అంతవరకూ తను పొందిన భోగభాగ్యాలు అనే భ్రమను పోగొట్టుకున్నవాడైనాడు (అపాస్త భ్రముడు) యామునాచార్యుడు. వెంటనే శ్రీరంగనాథసేవామయమైన తన పూర్వపు స్థితిని గుర్తుచేసుకున్నాడు. కన్నీరు కారుస్తూ ' మీరెవరు' అని అడిగాడు శ్రీరామమిశ్రుడిని. మహారాజా! నేను మీ తాతగారైన నాథమునికి శిష్యులైన పుండరీకాక్షులవారి శిష్యుడను. మీ తాతగారుమీ భావిజన్మను, భవిష్యత్తులో మహాభక్తునిగా తమ జన్మను తెలిసికొని,మీచేతనే ఈ విశిష్టాద్వైతము సకలభూతహితమై వెలుగొందగలదు అని తెలుసుకుని, మీకు ఉపదేశింపుమని తనశిష్యునికి అనగా నా గురుదేవులైన పుండరీకాక్షులవారికి 'ద్వయ మంత్రమును' ఉపదేశించారు. ఆయన ఆమంత్రాన్ని నాకు ఉపదేశించి, దానిని మీకు ఉపదేశించుమని నాకు ఆదేశంచేసిన కారణంగా మీవద్దకు వచ్చాను మహారాజా!అనగా, యామునాచార్యుడు శ్రీరామమిశ్రునకు సాష్టాంగదండప్రణామం చేసి, పంచసంస్కారములను పొంది, మంత్రోపదేశం పొంది, అంతటితో ఆగక,రాజ్యానికి తిరిగివచ్చి, తన కుమారునికి రాజ్యపట్టాభిషేకము చేసి, కుమారునికిరాజనీతిని ఉపదేశం చేశాడు.

(తరువాయి భాగం వచ్చే సంచికలో)

***వనం వేంకట వరప్రసాదరావు  

మరిన్ని శీర్షికలు
jyotishyam vignanam