Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఆరవ భాగం

"ఎంత సిటీలో వుంటే మాత్రం ఇదేం నాగరికతో అర్ధంకావడం లేదు. వాళ్ళే కాదు. ఈ వారం రోజులుగా సిటీలో నుంచి మన ఊరికి వచ్చిన చాలా కుటుంబాల్ని చూశాను. సిటీలో వుంటే మన సాంప్రదాయాన్ని మర్చిపొమ్మని ఉందా? హిందూ సంస్కృతి, సాంప్రదాయాల్ని మంట కలిపేస్తున్నారు. వాళ్ళను చూస్తేనే అసహ్యం వేసింది," అంది బాధగా.

ఆవిడ బాధ చూసి సుభద్ర అనే పొరిగింటావిడ తమాషాగా నవ్వుతూ "ముంభై, డిల్లీలో ఉంటున్న వాళ్ళ ఫ్యాషన్లు చూసే బాధ పడిపోతున్నావు ఆంటీ... ఇక అమెరికాలో ఉంటున్న మీ మనవడు, మనవరాలు ఇంకెంత ఫ్యాషన్ గా ఉంటారో, ఎప్పుడన్నా ఆలోచించారా? అమెరికాలో డ్రస్సులకే కాదు, శీలానికి విలువలేదంటారు మరి అంటూ గుర్తు చేసింది. ఆవిడ ఆ మాటల్ని తమాషాకి అన్నా కూడా అన్నపూర్ణేశ్వరి గుండెల్ని కలుక్కుమనేలా చేశాయి.

అందుకే వెంటనే ఆవిడ బదులు చెప్పలేకపోయింది.

ఈ లోపల మరొకామె కల్గజేసుకుంటూ ఆ మాట నిజమే కదా. ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కాదుగానీ, ఎక్కడో పదివేల మైళ్ళ దూరంలో అమెరికాలో ఉంటున్న నీ మనవడు, మనవరాలు ఇంకెంత నాగరికంగా ఉంటారో ఊహించవచ్చు" అంది.

"లేదు లేదు నా మనవడు, మనవరాలు అలాంటి వాళ్ళు కాదు" అంది అన్నపూర్ణేశ్వరి వాళ్ళ అభిప్రాయాల్ని ఖండిస్తూ.

"నువ్విక్కడున్నావు... వాళ్లెక్కడో ఉన్నారు. అలాంటి వాళ్లు కాదని ఎలా చెప్పగలవు?" అడిగింది సుభద్ర.

"ఖచ్చితంగా చెప్పగలను. నా పెంపకం మీద నాకున్న నమ్మకం అలాంటిది. నా కొడుకు క్రమశిక్షణలో పెరిగాడు. నా మనవడు, మనవరాలు కూడా అలాగే పెరుగుతున్నారు. కావాలంటే చూడండి వాళ్ల ఫోటోలు పట్టుకొచ్చి చూపిస్తాను..." అంటూ లేచి విసవిసా లోనకెళ్ళింది అన్నపూర్ణేశ్వరి.

కాసేపటికే అరడజను ఫోటోలు తెచ్చి వాళ్ల ముందు పడేసింది. "చూడండి నా మనవడు, మనవరాలు... అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో ఉంటున్నారు. అయినా మన సంప్రదాయాల్ని, ఆచారాల్ని ఎప్పుడూ విడిచి పెట్టలేదు. ఎంత లక్షణంగా ఉన్నారో చూడండి?" అంది గర్వంగా. తలో ఫోటోని తీసుకొని అన్ని ఫోటోల్ని మార్చి మార్చి చూశారు వాళ్ళంతా.

'అబ్బాయి పేరు అనంతసాయి. అమ్మాయి పేరు సాయిశివాని. అన్నచెల్లెలిద్దరూ ఎంతో అందంగా, చక్కగా ఉన్నారు. మనవడు నీట్ గా ఫ్యాంట్, షర్ట్ లో హుందాగా కన్పిస్తున్నాడు. మనవరాలు చక్కగా లంగా, జాకెట్ లో వాలు జడ, కాళ్ళకు పట్టీలు, చేతులకు గాజులతో చూడ్డానికి లక్ష్మీదేవిలా ఉంది. చుశారుగా మా వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు. అయినా ఎంత పద్దతిగా ఉంటున్నారో చూడండి. మన ఆచారాలు, కట్టుబాట్ల మీద నమ్మకం ఉండాలేగానీ ఏ దేశంలో ఉన్నా మనం మనంగానే గొప్పగా బ్రతకచ్చు. మనం తెలుగు వాళ్ళమని సగర్వంగా చెప్పవచ్చు." అంది ఫోటోల్ని తిరిగి తీసుకుంటూ అన్నపూర్ణేశ్వరి.

ఆవిడ మాటలకు సుభద్ర పెద్దగా నిట్టూర్చింది. "ఫోటోలు బాగానే ఉన్నాయిగానీ, ఇంత సంస్కారంగా వాళ్లు అక్కడ ఉంటున్నారంటే నాకు నమ్మకం కల్గడం లేదు" అంది.

ఆ మాటలకి విసుగ్గా చూసింది అన్నపూర్ణేశ్వరి.

"అలా ఎందుకు అనుకుంటున్నావు? నా మనవరాల్ని చూశావుగదా? యు.ఎస్.ఏ లో ఉన్నా వాలుజడ వేసుకొని, పట్టు పరికిణీలు కడుతోంది. కాలికి వెండి పట్టీలు, వాలు జడలో పువ్వులు, చేతులకి గోరింటాకు, నుదుట బొట్టు, కళ్ళకు కాటుక, నిండుగా జాకెట్ వేసుకుంటుంది. చక్కగా తెలుగు మాట్లాడతారు. ఇంతకన్నా ఏం కావాలి?" నిలదీసింది.

"లేదు ఆంటీ... నిజంగా మీరు చెప్పినట్టు ఈ ఫోటోల్లో ఉన్నట్టు వాళ్ళు లక్షణంగా ఉంటే సంతోషమే. కానీ మనం పెద్దతరం వాళ్లము. ప్రతీ విషయాన్ని సులువుగా నమ్మేస్తాం. ఏమో నువ్వు బాధపడతావని ఇలా పిల్లల్ని నీట్ గా తయారుచేయించి, ఫోటోలు తీసి, నీ తృప్తికోసం పంపిచారేమో? నిజంగా ఈ ఫోటోలో ఉన్నట్టుగా వాళ్ళక్కడ లేరేమో ఆలోచించావా?" అని అడిగింది మరొకామె.

ఈ మాటలు అన్నపూర్ణేశ్వరిని ఆలోచింపజేశాయి. ఆలోచనలో మునిగిపోయింది.

"అవును అన్నపూర్ణేశ్వరీ... నీ తృప్తి కోసం ఇలా ఫోటోలు తీయించి పంపినా ఆశ్చర్యం లేదు. ఏదైనా కళ్ళతో చూస్తేగానీ నమ్మలేం కదా... అయినా నీకేం తక్కువనీ... హాయిగా అమెరికా వెళ్లి నీ రెండో కొడుకు ఇంట్లో ఆరు మాసాలు వుండి రావచ్చు కదా... వాళ్ళను చూసినట్టూ ఉంటుంది. వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు." అంటూ సలహా ఇచ్చింది మరొకావిడ.

"నాకూ ఓ సారి వెళ్లి వాళ్ళందర్నీ చూసి రావాలని ఉంది. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు నా కొడుకు గొప్పతనం గురించి చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. గొప్ప డాక్టర్ గా మంచిపేరు... గొప్ప గొప్పవారే మా వాడితో మాట్లాడటానికి క్యూలో ఉంటారట. కోట్లు సంపాదిస్తున్నాడు. కొద్ది రోజులు అక్కడ వుండిరావాలని నాకూ వుంది. వాడూ రమ్మని అడుగుతూనే ఉన్నాడు. కానీ ఎలా వెళ్ళగలను? ఇక్కడ పొలం, పుట్రా, గొడ్డూ, గోదా ఈ పనులన్నీ నా పెద్ద కొడుకు ఒక్కడి నెత్తిన పడేసి, నేను అమెరికా వెళ్లి కూర్చుంటే ఎలాగని బాధగా ఉంటుంది" అంది.

"అంత బాధ దేనికి? ఇవాళ పోతే రేపయినా ఇదంతా వాళ్ళు చూసుకోవాల్సిందేగా? ఇప్పుడు కాకపోతే అమెరికా ఇంకెప్పుడు వెళతావు? ఎనభై ఏళ్ళ పడిలో పడితే ఉన్నఊరు దాటి బయటకు పోలేం. తర్వాత నీ ఇష్టం. ఎందుకొచ్చిన జంజాటంగానీ ఓసారి అమెరికా వెల్లొచ్చెయ్..." అంటూ సలహా ఇచ్చింది సుభద్ర.

కాసేపు కూర్చుని వాళ్ళంతా వెళ్ళిపోయారు. కానీ అన్నపూర్ణేశ్వరి మాత్రం ఆలోచనల నుంచి బయటపడలేకపోయింది. నిజంగా ఫోటోలు తీయించి, పంపి తన కొడుకు, కోడలు తనను మోసం చేశారా? లేక నిజంగానే వాళ్ళిద్దరూ సాంప్రదాయంగా పెరుగుతున్నారా? వెళ్లి చూస్తేనే బాగుంటుందేమో? నిజం తెలుసుకోవాలంటే మరో మార్గం లేదు. ఆ రాత్రంతా కూడా ఆవిడ ఆలోచిస్తూనే ఉంది. ఆవిడ మనవళ్ళు, మనవరాళ్ళ విషయంలో ఇంతగా బాధపడిపోవడానికి తగిన కారణం వుంది. తన కూతురి బిద్దలిద్దరికీ, కొడుకు బిద్దలిద్దరినీ ఇచ్చి పెళ్లి చేయాలని, ఆమె చిరకాల వాంఛ. ఇక్కడ కూతురు బిడ్డలిద్దరూ తన అదుపులో సాంప్రదాయంగా పెరిగి పెద్దవాళ్ళయ్యారు. కానీ అమెరికాలో కొడుకు బిడ్డలిద్దరి పరిస్థితి అర్ధం కావడం లేదు. వాళ్లు అక్కడ పద్ధతులకి అలవాటు పడిపోయుంటే ఖచ్చితంగా వీళ్ళని చేసుకోరు. తన కోరిక కోరికగానే మిగిలిపోతుంది. అలా జరక్కుండా ఉండాలంటే, కళ్ళు మూసుకుని కూర్చోవడం కన్నా ఒకసారి అమెరికా వెళ్ళిరావడం మంచిది. ఇలా ఆ రాత్రి ఓ నిర్ణయానికి వచ్చాకగానీ ఆవిడకు నిద్ర పట్టలేదు.

****    ****    ****

డెట్రాయిట్ నగరం!

నగర పురాతన వైభవాన్ని చాటిచెప్పే కట్టడాలు అక్కడక్కడా కన్పిస్తున్నా అధునాతనంగా ఎంతో అభివృద్ధి చెందిన నగరం. ఆకాశ హార్మ్యాలు అందమైన భవంతులు, విశాలమైన రోడ్లు అత్యాధునిక వసతులతో అలలారే అందమైన నగరం డెట్రాయిట్.

ప్రస్తుతం డాక్టర్ గోపాల్ నిమ్మగడ్డ నివాసం ఈ మహానగరంలోనే. బైపాస్ సర్జరీ ఆపరేషన్ చేయడంలో ఆయనకు గొప్ప అనుభవం. పేరు ప్రఖ్యాతులున్నాయి. ఆయనకు ఒక్క మిచిగాన్ రాష్ట్రంలోనే కాదు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే గొప్ప డాక్టర్ గా పేరు ప్రఖ్యాతులున్నాయి. సెనెటర్లు రాష్ట్రాల గవర్నర్లు కూడా ఆయన అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తారంటే అర్ధం చేసుకోవచ్చు. ఆయన ఎంత బిజీగా వుంటాడో... ఆయన ఒక పని రాక్షసుడు.

ఎప్పుడూ పని... పని... పని... క్షణం తీరిగ్గావుండటం అంటే ఏమిటో ఆయనకు తెలీదు. రాత్రింబవళ్ళు ఎప్పుడూ వృత్తిలో నిమగ్నమై వుంటాడు. తనేమిటో తన వృత్తి ధర్మం ఏమిటో బాగా తెలిసిన వ్యక్తి గోపాల్. ఆపైన క్రిందస్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అంతకు మించి ప్రాణం విలువ ఏమిటో తెలిసిన మనిషి. ప్రాణంపోసే పవిత్రమైన డాక్టర్ వృత్తి తనది. ఈ వృత్తిలో పని చేయడం ఆయనకు పరిపూర్ణ సంతృప్తినిస్తోంది. ఒక మనిషిని బ్రతికించినప్పుడు అతని కళ్ళలోనూ, అతని బంధువులు, ఆత్మీయుల కళ్ళలోనూ కన్పించే ఆనందం, కృతజ్ఞత, అభిమానం వెలకట్టలేనిది. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఒక్కోసారి పేషెంట్ ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం వుంది. అందుకే తన వృత్తిధర్మంలో ఆలస్యం అనే పదానికి ఎప్పుడూ ఆయన తావివ్వడు.

ఒక్క డెట్రాయిట్ లోనే కాదు. లాస్ ఏంజిల్స్, న్యూజెర్సీ, న్యూయార్క్, ఇండియానా, చికాగో, టెక్సాస్, బోస్టన్, కెంటకి, వాషింగ్టన్ డిసి, డల్లాస్ మొదలయిన నగరాల వెంట నిరంతరం విమానాల్లో ప్రయాణిస్తూ ఆపరేషన్లు నిర్వహించి వస్తుంటాడు. ఆయనలో వున్న మరో సుగుణం ఆయనకీ ఫ్యామిలీ అటాచ్ మెంట్ కూడా ఎక్కువే. స్వతహాగా ఆయన ఒక చక్కని కుటుంబంలోంచి అమెరికా వచ్చి స్థిరపడిన వ్యక్తి. అయిన వాళ్ళందరికీ దూరంగా తను ఇక్కడ భార్యాబిడ్డలతో వుంటున్నాడు. తను ప్రముఖ డాక్టర్ మాత్రమే కాదు, ఒక భార్యకు భర్తా, ఇద్దరు బిడ్డలకు తండ్రి కూడా. కాబట్టి పనుల ఒత్తిడిలో పడి కుటుంబాన్ని అశ్రద్ధ చేసే అలవాటు ఆయనకు లేదు.

లేదంటే కుటుంబానికి ఒక టైమంటూ కేటాయించలేకపోతున్నాడనే చిన్న లోటు తప్ప తన ఖాళీ సమయాన్నంతా కుటుంబానికే కేటాయిస్తాడు. ఏ నగరానికి వెళ్ళినా ఆపరేషన్స్ పూర్తి కాగానే వెంటనే దొరికిన ఫ్లైట్ పట్టుకుని డెట్రాయిట్ లోని తమ ఇంటికి వచ్చేస్తాడు. ఒక్కోసారి అర్ధరాత్రి దాటాక ఇంటికి చేరుకునే సందర్భాలు కూడా ఉంటాయి. పగలు, రాత్రి అనే బేధం లేదు. పనికాగానే ఇంటికి చేరుకోవడంలోనే ఆయన ఆలోచనలుంటాయి. పని తప్ప మరో వ్యాపకం ఆయనకు లేదు.

అందుకే ఆయనది విపరీతమైన సంపాదన. డెట్రాయిట్ నగరంలో అత్యంత విలాసవంతమైన బ్లూమ్ ఫీల్డ్ ఏరియాలో ఎంతో ఖరీదైన ఈ ప్రాంతంలో, సుమారు పది ఎకరాల సువిశాలమైన తోట మధ్య వుంటుంది. అద్భుతమైన ఇంద్రభవనంలా మెరిసే సొగసైన సౌధం. అదే డాక్టర్ గోపాల్ నిమ్మగడ్డ మాన్షన్.

ఆడమగ కలిసి పదిమంది పనివాళ్ళు ఎప్పుడూ ఆ తోటను, భవంతిని కనిపెట్టుకొని వుంటారు. అంతా చాలా నమ్మకమైన పనివాళ్ళు. వీళ్లుగాక సెక్యూరిటీ వాళ్లు వేరే వుండనే ఉన్నారు. అలా అమెరికా వచ్చి డాక్టర్ వృత్తిలో స్థిరపడి కోట్లకు పడగలెత్తిన డాక్టర్ గోపాల్ నిమ్మగడ్డ కుటుంబం ఎంతో పేరు ప్రఖ్యాతులతో విలాసవంతంగా జీవిస్తోంది.

డాక్టర్ గోపాల్ మితభాషి, సౌమ్యుడు, స్నేహశీలి, ఆదర్శభావాలు గల వ్యక్తి. విసుగు, విరామం లేకుండా వృత్తిలో రాణించడం అనేది ఆయనకు తల్లి అన్నపూర్ణేశ్వరి నుంచి వారసత్వంగా లభించింది. తనను పెంచి పెద్దచేసి, ఉన్నత చదువులు చదివిస్తూ, మరోపక్క ఒంటిచేత్తో ఇంటిని, అటు వ్యవసాయాన్ని లాక్కొచ్చిన తల్లి గొప్పదనాన్ని అతడు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక ఆయన ఇంత అభివృద్ధి సాధించాడంటే ఆ ఘనతలో సగభాగం ఆయన అర్ధాంగి సత్యవతికే చెందుతుంది. భర్తకు తగిన ఇల్లాలు.

తన భర్తను, ఆయన వృత్తిని అర్ధం చేసుకొని తనవంతు సహకారాన్ని, మద్దతును పూర్తిగా ఇవ్వడం వల్లనే ఆయనకి అంత అభివృద్ధి సాధ్యపడింది. ఉన్నత శిఖరాలు అధిరోహించిన ప్రతి పురుషుడి వెనకుక ఒక స్త్రీ ఉందంటారు. ఆ మాట నిజమే. తన అభివృద్ధికి తన భార్య సత్యవతి తోడ్పాటు, సహకారమే కారణం అంటాడు డాక్టర్ గోపాల్.

డెట్రాయిట్ లో తెలుగు కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాగే న్యూజెర్సీ, చికాగో, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ మొదలైన నగరాల్లో కూడా తెలుగువారు అధికంగానే ఉన్నారు. అక్కడ వుండే ఆంధ్రులకు సుపరిచితుడు డాక్టర్ గోపాల్.

అలాగే డెట్రాయిట్ నగరంతోపాటు సమీప పట్టణాల్లో నివసిస్తున్న అనేక తెలుగు కుటుంబాలతో డాక్టర్ గోపాల్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. తానా సభల్లోగాని ఇతరత్రా తెలుగువారి కల్చరల్ యాక్టివిటీస్ లోగానీ అప్పుడప్పుడూ తనూ చురుకైన పాత్ర పోషిస్తుంటాడాయన.

ఇక కుటుంబంలో చూస్తే... అత్తగారు అన్నపూర్ణేశ్వరి అలవాట్లే కోడలు సత్యవతికి వచ్చాయి. అమెరికాలో వుంటున్నా ఆవిడ కట్టు బొట్టు ఏమీ మారలేదు. ఇంట్లో హిందూ దేవుళ్ళకు పూజలు, నైవేద్యాలు, శనివారం ఉదయమే వెంకటేశ్వర సుప్రభాతం వినడం, హైందవ సాంప్రదాయం ప్రకారం పండుగలు జరుపుకోవడం అంతా చక్కగా జరిగిపోతూ ఉంటుంది.

అయితే డాక్టర్ దంపతులు పుట్టి పెరిగింది ఇండియాలో కాబట్టి అమెరికాలో ఉన్నా తమ ఆచారాలు అలవాట్లలో పెద్దగా మార్పుకి అవకాశం ఇవ్వకుండా ఉండగల్గుతున్నారు.  కానీ పిల్లలు అనంతసాయి, సాయి శివానీల పరిస్థితి వేరు. వాళ్ళిద్దరూ అక్కడే పుట్టి, అక్కడే పెరిగినవాళ్ళు. ఇప్పటికీ ఏదో అరడజను సార్లు నానమ్మ వాళ్ల వూరు వెళ్లుంటారు, చివరిసారిగా వచ్చి కూడా అయిదేళ్ళు కావస్తోంది. అన్నాచెల్లెల్లూ ఇద్దరూ కూడా అక్కడి వాతావరణంలో పెరుగుతున్నవాళ్ళు. ప్రస్తుతం కాలేజీ చదువులు చదువుతున్నారు. వాళ్లకి అక్కడి సంస్కృతికి దూరంగా వుంచడం సాధ్యపడే విషయం కాదు. వాళ్ళేకాదు. అక్కడ ఉంటున్న అనేక తెలుగు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్య ఇది.

ఎంత కట్టడి చేసినా పిల్లల్ని స్థానిక నాగరికతకు, అలవాట్లకు దూరంగా వుంచడం సాధ్యమయ్యే పనికాదు. ఒక్క భారతదేశం నుంచే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడినవారున్నారు. ముఖ్యంగా యూరఫ్ దేశాలవారికి, అమెరికా కల్చర్ కి అంతగా వ్యత్యాసం ఉండదు. కానీ భారత్ నుండి వచ్చినవారి పరిస్థితి వేరు. భిన్నత్వంలో ఏకత్వంలా ఉండే భారతీయ సంతతి వారి అలవాట్లు, కట్టుబాట్లకు అమెరికాలోని పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. తెల్లవారితే అక్కడి స్థానికుల మధ్య తిరగడం తప్పనిసరి గనుక పిల్లలకు అక్కడి అలవాట్లు తొందరగా వచ్చేస్తాయి. నాగరికత పేరుతో ఫ్యాషన్లకు పుట్టినిల్లయిన అమెరికాలో యువత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆరోజు న్యూయార్క్ లో రెండు శస్త్ర చికిత్సలు ముగించుకొని లాస్ట్ ఫ్లయిట్ లో డాక్టర్ గోపాల్ డెట్రాయిట్ ఏర్ పోర్ట్ లో దిగేసరికి రాత్రి పదకొండు దాటింది సమయం. ఏర్ పోర్ట్ బయటకోచ్చేసరికి అతడి కోసం రెడీగా ఉంది కారు.

డ్రైవర్ మెక్సికన్. వినయంగా కారు వెనక డోర్ తెరిచాడు. తన బ్రీఫ్ కేస్ లోనపెట్టి, ఎక్కి కూర్చోగానే డోర్ మూసి డ్రైవింగ్ సీట్లో కొచ్చి కారు స్టార్ట్ చేశాడు.

ఇరవై నిమిషాల ప్రయాణం తరువాత కారు ఇంటికి చేరుకుంది. లైటింగ్ సెన్సర్ లతో పనిచేసే ఆటోమేటిక్ గేట్ డోర్స్ తెరుచుకొని కారులోనకు వెళ్ళగానే తిరిగి మూసుకున్నాయి.

పోర్టికోలో కారు దిగి లోనకొచ్చేసరికి పన్నెండు కావస్తోంది సమయం. భర్త రాక కోసం ఎదురుచూస్తూ అప్పటికింకా మెలుకువగానే వుంది సత్యవతి. భర్తను చూసి లేచి చిరునవ్వుతో ఎదురువచ్చి ఆయన బ్రీఫ్ కేస్ అందుకుంది.

"భోం చేశావా?" టై విప్పి సోఫాలో కూర్చుంటూ అడిగాడు.

"లేదు. మీరు వచ్చేస్తున్నారని ఆగాను" అంది. ఆయన షూస్ ని విప్పి పక్కన పెడుతూ.

ఆమెచేత ఈ అలవాటు మాన్పించాలని చాలాసార్లు ప్రయత్నించి కూడా సాధ్యం గాక వదిలేశాడాయన. భర్త షూస్ ని తనే విప్పి పక్కన పెడితేనే ఆమెకు తృప్తి. తర్వాతే పక్కన కూర్చుంటుంది. "నా కోసం ఎదురుచూస్తూ భోజనం మానొద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఇంకా మనం కొత్త దంపతులం అనుకుంటున్నావా? వేళకు తినకపోతే ఆరోగ్యం పాడవుతుంది." అన్నాడు ఆప్యాయంగా భార్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.

"నా ఆరోగ్యానికేమీ భయంలేదు. ఎందుకంటే, నా భర్త డాక్టరుగదా... మీరు అవునన్నా కాదన్నా ఒక్కటి మాత్రం నిజం. మనం ఎప్పుడూ కొత్త దంపతులమే" అంటూ భుజం మీద తలవాల్చుకుంది.

మరిన్ని సీరియల్స్
raayi by smv gopalaraju