Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Anubandhaalu Sixth part

ఈ సంచికలో >> సీరియల్స్

రాయి - కీ:శే: ఎస్సెమ్వీ గోపాలరాజు

అటు పల్లెటూరు గాకండా ఇటు టౌను గాకండా వుందా కొత్తపల్లి. ఆవకాయ పెట్టుకునే కొత్తపల్లి కొబ్బరి అనే మామిడి పండేది ఈ కొత్తపల్లి లోనే.ఐతే, ఆ ఊరికి చిన్న పోలీస్ స్టేషనుంది.

ఆరోజు ఉదయం హెడ్ కానిస్టేబులూ, రైటరు మిగతా కానిస్టేబుల్సూ స్టేషన్లో వుంటే ఎస్సైగారు స్టేషను వెనక తన పర్సనల్ రూమ్ లా వాడుకుంటున్న ఒక గదిలో వున్నాడు. చూడ్డానికి ఆ గది ఒక చిన్నసైజు జిమ్ లాగుంది. షార్ట్స్, బనియనూ వేసుకున్న ఎస్సై డంబుల్స్ ఎత్తుతున్నాడు. ఏ పనన్నా సరే అనుకుంటే సాధించగలిగే పట్టుదల గల ఆ ఎస్సై ఈ ఏడాది రాష్ట్రస్థాయిలో జరిగే వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ కి వెళ్ళబోతున్నాడు. అందుకోసమే ఈ ప్రాక్టీసంతా.

ఏడుగంటలు నిద్రపోవాలి. రెండు గంటలు ఎక్సర్ సైజులు చెయ్యాలి. దాంతో క్రమం తప్పకుండా చేసుకుంటూ పోతున్నాడన్నీ.

పొద్దుట ఏడు ఉడకబెట్టిన కోడిగుడ్లు, అరలీటరు పాలూ తాగాలి. మధ్యాహ్నం జొన్నరొట్టెలూ కాబూలీ శనగల మొలకలు తినాలి. సాయంత్రం ఫ్రూట్ జ్యూసు, డ్రై ఫ్రూట్సు, దాంతో ఒక్కో కానిస్టేబుల్నీ పిల్చి ఒక్కో పని చెపుతుంటే వాళ్ళంతా ఆ యంగ్ ఎస్సై ని తెగ తిట్టుకుంటున్నారు.

అదలా జరుగుతుండగా సర్పంచి నర్సింహం పరిగెట్టుకుంటూ స్టేషన్ వేపు రావడం చూసి ఆశ్చర్య పోతున్నాడు హెడ్ కానిస్టేబుల్ హనుమంతరావు.

నర్సింహం అంత డబ్బు పలుకుబడీ వున్నవాడు ఆ వూళ్ళోనేగాదు ఆ చుట్టు పక్కల చాలా వూళ్ళలో లేడు. 'అలాంటి నర్సింహం భయంతో పడతా లేస్తా ఇలా పరిగెట్టుకుంటూ వస్తున్నాడేంటీ?' అనుకుంటున్నారు పోలీసులు.

వచ్చిన నర్సింహం లోపల ఎక్సర్ సైజులు చేస్తున్న ఎస్సైని పిల్చి వాళ్ళ పాలేరు కుర్రోడు తన మీద పెద్ద రాయి విసిరినట్టు కంప్లైంట్ చేసాడు. అక్కడితో ఆగకుండా ఆ రాయిని నెత్తిమీద పెట్టుకొని తనని ఊరంతా పరిగెట్టించినట్టు చెప్పి ఆడిమీద ఎటెమ్ట్ టు మర్డర్ కేసు పెట్టి లోపలికి తోయించెయ్యమన్నాడు.

విన్న ఎస్సై ముందాడు విసిరిన రాయినీ, వాడ్నీ తీసుకురమ్మన్నాడు.

కాస్సేపయ్యింది.

ఆ కుర్రోడి కంటే ముందు వాడి తండ్రి ముసలోడొచ్చాడు. జుట్టంతా వూడి పోయి తెల్లబడిపోయింది. కళ్ళు బాగా లోతుకెళ్ళిపోయున్నాయి. పెదాలు ఎండిపోయి వున్నాయి. గాలేస్తే ఎగిరిపోయేలాగా తోస్తే పడిపోయే లాగ వున్నాడు. అస్తిపంజరానికి చర్మం కప్పినట్టుంది. వాడి పేరు ముసిలోడు. దూరం నించే దణ్ణాలు పెట్టుకుంటూ వస్తున్న వాడు, "ముక్కు పచ్చలారని నా బిడ్డనేం చెయ్యకండి... అంత పెద్ద రాయిని ఆడు విసర్లేదండి," అంటూ మొత్తుకుంటున్నాడు.

వాడి ఏడుపులు చూసిన నర్సింహం, "ఈ ముసల్నాకొడుకు నేం పట్టించుకోకండి ఎస్సైగారు. నా రిపోర్టుతో ఆ లంజికొడుక్కి ఉరిశిక్ష పడిపోవాలి," అంటున్నాడు.

నర్సింహం వేపు తిరిగిన ముసిలోడు, " ఎప్పుడో గతిలేక నీ దగ్గర వెయ్యి రూపాయలు తీసుకున్న పాపానికి వడ్డీలకి వడ్డీలు కట్టి నా అయిదెకరాల భూమినీ లాగేసుకున్నావ్. అప్పటికీ నీ కడుపుమంట చల్లారలేదు. రామ లక్ష్మణుల్లా నా చేతుల మీద పెంచిన రెండు గిత్తల్నీ నీ మందలో కలిపేసుకున్నావ్. అయినా నీ దావత తీరలేదు. నా బిడ్డని పాలేరుతనానికి నీ దగ్గరికి లాగేసుకున్నావ్," అన్నాడు.

"అంటే నీ కొడుకు జీవితాంతం నర్సింహంగారి దగ్గర పాలేరుగా వుండాలనే గదా మీ ఒప్పందం?" అన్నాడు ఎస్సై.

"అదికాదు బాబయ్యా... ఈయన గారు చెప్పిన లెక్కల ప్రకారం ఈ సంవత్సరాదితో మా అప్పు తీరిపోయింది. అయినా మాచేత చాకిరీ చేయించుకుంటున్నాడు," అన్నాడు.

"అలాగా," అంటూ అరుపులేవో వినిపించి బయటికి  చూశాడు ఎస్సై.

పదిహేనుమంది జనం గోలగోలగా అరుచుకుంటూ ఓ పెద్ద బండరాయిని మోసుకొచ్చి వాళ్ళ మధ్య పెట్టి వెళ్ళిపోయారు.

ఆశ్చర్యంగా ఆ రాయిని చూసిన ఎస్సై, "ఏంటిది?" అన్నాడు.

"ఆ కుర్ర నా కొడుకు నామీద విసిరిన రాయి," అన్నాడు నర్సింహం.

షాకుతో అర్జంటుగా కింద పడిపోయి లేచిన ఎస్సై, "ఇంత పెద్ద రాయిని ఆ కుర్రాడు మీ మీదకి విసిరాడా?" అన్నాడు.

"ఔనండీ," అన్నాడు నర్సింహం.

"ఏంటీ?" అంటూ షాకైపోయి తిరిగి ఎప్పుడో తేరుకున్న ఎస్సై చాలా చిరాకు పడిపోతా నర్సింహాన్ని చూశాడు.

ఏంటలా చూస్తున్నావన్నాడు నర్సింహం.

"పిటీషను పెట్టడానికూడా ఓ అర్ధంపర్ధం వుండాలండీ... ఇంతమంది మొయ్యలేక మోసుకొచ్చిన ఈ రాయిని మీ మీదకి ఆ కుర్రోడెత్తాడా... ఎత్తడమే గాకుండా ఈ రాయిని నెత్తిమీద పెట్టుకుని వూరంతా తిప్పేడా... నన్నెలా నమ్మమంటారండీ," అన్నాడు.

"అంటే నేను అబద్ధం చెపుతున్నానంటారా?" అన్నాడు నర్సింహం.

ఇద్దరి మధ్యా ఘర్షణ మొదలైంది.

నర్సింహంతో వాదనలో దిగలేక విసిగిపోయిన ఎస్సై, "సరే... పాలేరు మీమీద రాయెందుకు విసిరాడు?" అన్నాడు.

"ఇంతదాకా మా పొలంలో నేరేడుచెట్టు కింద కూర్చున్నప్పుడు ఒరే పాలేరు కుర్రగా నీ అప్పుకీ నా కూలీకీ రేపు ఉగాదితో చెల్లు అన్నాను. అంటే నేను నీకు పాలేర్ని కాదు పో అన్నాడు. ఏంటీడిలా తిరగబడ్డాడేంటీ అనుకుంటూ మెల్లగా లెక్కలు చెపుతుంటే వినలేదు సరిగదా బూతులు లంకించుకున్నాడు. బతిమాలుతున్నాను. అయినా వాడు బూతులు ఆపడంలేదు. కోపంతో పాటు చాలా చిరాకొచ్చింది నాకు. నీతో నాకేంట్రా... మీ అయ్యతోనే లెక్కలు తేల్చుకుంటాను అనేసరికి రెచ్చిపోయిన ఆడు అక్కడున్న బండరాయి ఎత్తి నా మీదకి విసిరేసరికి తప్పించుకొని ఇక్కడికి పరిగెత్తుకొచ్చేను," అన్నాడు.

ఆ రాయిని కదపడానికి చాలా ప్రయత్నాలు చేసిన ఆ కండలు తిరిగిన ఎస్సై, "ఊహూ! నేను నమ్మను ఈ రాయి ఆ కుర్రోడు విసరలేదు," అన్నాడు.

కోపంతో రెచ్చిపోయిన నర్సింహం స్టేషను బయట మూగిన జనం దగ్గరకొచ్చి, "మీరంతా కొంచెం లోపలికొచ్చి నిజం చెప్పండ్రా?" అన్నాడు.

నర్సింహంతో పాటు వచ్చిన జనం, "ఈ రాయి విసిరింది ఈ కుర్రోడే బాబూ," అన్నారు.

కొరికేసేంత కోపంతో వాళ్ళని చూసిన ఎస్సై, "ఆ బక్కనాకొడుకు ఈ పెద్ద రాయి విసిరేడా?" అన్నాడు.

"విసిరేడండి," అన్నారు.

తుపాకీ తీసి వాళ్ళకి గురిపెట్టిన ఎస్సై, "తేడా వస్తే కాల్చి పారేస్తాను," అన్నాడు.

"మీరు కాల్చండి, కొయ్యండి నిజమే చెప్తున్నాం. ఆ కుర్రోడా రాయి ఎత్తేడండి," అన్నారు జనం.

"నిజమే చెప్తున్నారా?" అన్నాడు ఎస్సై.

"మా భార్యాబిడ్డల మీదొట్టండి. ఆ కుర్రోడు ఈ రాయిని నరసింహంగారి మీద విసిరేడండి."

చాలాసేపలా వుండిపోయిన ఎస్సై పోలీసులు కుర్రోడ్ని తీసుకురావడంతో మళ్ళీ మామూలు మనిషయ్యాడు.

నెమ్మదిగా నడుచుకుంటూ ఆ కుర్రోడి వేపొస్తా వాడ్నే చూస్తున్నాడు. ఇరవయ్యేళ్ళ ఆ కుర్రోడి జుట్టు తాటిపీచులాగుంది. కళ్ళు జాలిగా వున్నాయి. నూనూగు మీసాల్తో లేతగా వున్న వాడి పొట్ట అప్పడంలా లోపలికి పోయింది.

ఈ కుర్రోడు అంత పెద్ద రాయి ఎత్తడం అన్నది పచ్చి అబద్ధం అనుకుంటూనే వాడి దగ్గరికొచ్చిన ఎస్సై, "నీ పేరేంట్రా?" అన్నాడు.

ఎస్సైగార్నే బెరుగ్గా చూస్తా, "బాలరాజండి," అన్నాడు.

వాడి జుట్టు పట్టుకున్న ఎస్సై, "ఈ రాయి ఈ నర్సింహంగారి మీదకి విసిరేవా..." అన్నాడు.

"ఈడు ఇంత పెద్ద బండరాయి విసరమేంటండీ... ఈ నర్సిం కాపుగారు కావాలని నా కొడుకు మీద నేరం మోపుతున్నారంతే," అంటున్న ముసిలోడ్ని బరబరమంటూ వెనక్కి లాగేశాడు కానిస్టేబులు వర్మ.

"ఏరా మాటాడవా?" విసురుగా లాటీ ఎత్తిన ఎస్సై కాళ్ళు పట్టేసుకున్న ముసిలోడు, "బాబూ బాబూ... నా బిడ్డనేం జెయ్యకండీ... ఈడి చేత నిజం చెప్పించే పూచీ నాది... ఈడ్నేం చెయ్యకండీ," అంటూ గోలుగోలువ ఏడుస్తుంటే విసురుగా కాళ్ళు వెనక్కి లాక్కున్న ఎస్సై, సరే చెప్పించయితే," అన్నాడు.

కుర్రోడి ముందుకెళ్ళి కూర్చున్న ముసిలోడు, "ఒరే నాయనా చెప్పరా... ఆ రాయి నేను ఇసర్లేదని చెప్పరా," అన్నాడు.

బక్కచిక్కిన ఆ కుర్రోడు మాటాడలేదు.

"ఒరే నువ్విప్పుడుగానీ మాటాడకపోతే ఈ పోలీసులంతా నిన్ను కుళ్ళబొడిచేస్తార్రా. నా బంగారుకొండవి గదరా!" అన్నాడు.

అప్పటికీ వాడు నోరు విప్పకపోయేసరికి, "మాటాడవేరా మొద్దు నా కొడకా," అంటూ వాడి వీపు మీదా జబ్బ మీదా చెంపల మీదా తెగ వాయించేస్తా, "మీ అమ్మంటే నీకు పంచప్రాణాలు గదా... మీ అమ్మ సచ్చినంత ఒట్టురా," అంటుండగా నోరు విప్పిన బాలరాజు, "విసిరాను... ఆ రాయి విసిరాను," అన్నాడు.

మతిపోయినట్టు చూశాడు ముసిలోడు.

షాకైపోతా కదిలిపోయారు తక్కినోళ్ళు.

"ఏంట్రా... ఏంట్రా నువ్వు వాగేది?" అన్నాడు.

"ఈ రాయిని ఎత్తి ఆ నర్సింహులు మీదికి ఇసిరాను," అన్నాడు.

విస్తుపోతూ ఆ కుర్రోడ్ని చూసిన ఎస్సై అప్పుడే పట్నం నుంచి వచ్చిన పత్రికా విలేఖరివేపు చూస్తా, "ఏంటండీ ఈ కుర్రగాడి పేలాపన?... ఇంత పెద్ద రాయి నెత్తి ఆ నర్సింహంగారి మీదకి విసిరానంటున్నాడేంటి?" అన్నాడు.

"నాకూ అదే పాలుపోవడం లేదు," అన్నాడు పత్రికా విలేఖరి.

"దీని వెనకాలేదో మర్మం వుందంటావా?" అన్నాడు ఎస్సై.

"గేరంటీగా ఏదో టెక్నిక్ వుండి వుంటుంది లేదా ఏదో కనికట్టు నేర్చుకుని వుంటాడు. దాంతోనే ఈ రాయి ఎత్తగలిగాడు," అన్నాడు పత్రికా విలేఖరి.

కాస్సేపు ఆలోచించాకా నవ్వినా ఎస్సై, "దాన్ని కక్కిస్తాను. ఆ టెక్నిక్ నా వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ కి చాలా బాగా పనికొస్తది," అన్నాడు. "అవును కనికట్టో టెక్నకో అది నా వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ కి వాడుకుంటాను. ఈడిచేత అది కక్కించి తీరతాను," అని శపథం చేశాడు.

"ఏంటయ్యా మీ గుగుసలు," అంటూ వచ్చిన నర్సింహాన్ని పక్కకి తప్పుకోమన్న ఎస్సై బాలరాజు దగ్గర కొచ్చాడు.

వెనకాలే వచ్చిన ముసలోడు భయంభయంగా చూస్తున్నాడు.

"ఒరేయ్ బాలరాజూ... ఈ రాయిని ఎత్తి విసిరేనూ అన్నావ్ గదా... ఏదీ ఒక్కసారి ఎత్తరా చూస్తాను," అన్నాడు.

"చంటి కుర్రోడు నోటి కొచ్చిందేదో వాగితే తవరు కూడా ఏంటి బాబియ్యా," అంటున్నాడు ముసిలోడు.

ముసిలాడికే సమాధానం ఇవ్వకుండా కుర్రాడి జుట్టు పట్టుకున్న ఎస్సై, "నువ్విప్పుడా రాయి ఎత్తి విసరాలి. కమాన్," అన్నాడు.

కదల్లేదు బాలరాజు.

"కదలవేంట్రా ఎముకలు ఏరెయ్యమంటావా?" అంటూ రాక్షసుల్లా చూస్తుంటే ఆ కుర్రాడికంటే ముందు ముసిలోడు భయపడిపోతున్నాడు. వాడి ముందు కూర్చుని, "ఒరే నా కొడకా... నా బాలయ్యా ఆ నర్సింబాబు అప్పు గురించి నీకు లెక్కలు చెపుతుంటే మేం బాకీలేం పోరా అంటూ ఈ రాయి విసిరావా," అన్నాడు.

"కాదు," అన్నాడు బాలరాజు.

"కాదా... అయితే మరెందుకు విసిరావురా," అన్నాడు ఎస్సై.

కుర్రోడి గెడ్డం పుచ్చుకు బతిమాల్తున్న ముసిలోడు, "చెప్పరా నాన్నా... ఇప్పుడు గనక నువ్వు నోరు విప్పకపోతే ఈళ్ళు నిన్ను నాకు దక్కనీయర్రా," అంటున్నాడు.

"ఇంకా ఆడు నీకు దక్కడమేంట్రా ఈడు ఎప్పుడైతే నా మీదకి రాయి విసిరేడో అప్పుడే అయిపోయేడు. అయినా నా మోచేతికింద నీళ్ళు తాగే ఎదవ నాకొడుకులు నన్నే ఎదిరిస్తార్రా," అంటూ అరిచాడు నర్సింహం.

బయట చూస్తే జనం అరుపులూ గోలలూ వినిపిస్తున్నాయి.

అదంతా చూస్తున్న ఎస్సై, "చూడండి నర్సింహులు గారూ, మీరు ఈ పోలీస్ స్టేషన్లో గొడవపడ్డం మంచిది కాదండి," అంటూ బయటికి చూసి, "కానిస్టేబుల్స్ బయటి జనాన్ని కంట్రోల్ చెయ్యండి," అంటున్నాడు.

అక్కడ ఎవర్నీ ఏం పట్టించుకోకుండా ముసిలోడి దగ్గరకొచ్చిన నర్సింహం, "పదరా నా కొడకా ఇటో అటో తేలిపోవాలా," అంటూ ముసిలోడ్ని జబ్బట్టుకు బయటికి తోస్తుంటే చూసిన బాలరాజు కుర్రరక్తం మరిగింది. పొగలు గక్కుతా పొంగింది. "ఒరేయ్," అంటూ రాయి ఎత్తబోతున్న వాడ్ని ఆపేశాడు నర్సింహం.

బయట్నుంచి పరిగెట్టుకుంటూ ఎస్సై దగ్గరికి వచ్చిన హెడ్ కానిస్టేబుల్ హనుమంతరావు. "సార్ బయట పరిస్థితి చాలా గందరగోళంగా వుంది. మనం ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఈ బాలరాజుగాడి మీద థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించి తీరాలి," అన్నాడు.

"నాకూ అదే అనిపిస్తుంది," అన్న ఎస్సై, "ఒరేయ్ బాలరాజూ... ఈ రాయిని ఎత్తుతావా లేదా?" అనరిచాడు. మాటాడలేదు బాలరాజు.

చాలాసార్లు అడిగి ఇరిటేట్ అయిపోయిన ఎస్సై లాటీతో ఆ బాలరాజు పొట్ట మీద బలంగా బాడుతుంటే చూళ్ళేని ముసలోడు గోలుగోలు మంటూ ఏడుస్తున్నాడు.

"ఎత్తరా ఎత్తుతావా లేదా," అంటూ ఆ కుర్రోడ్ని నేలమీద ఈడ్చి కుర్చీలో కూర్చోబెట్టి రెండు కాళ్ళతో కట్టేసి అరికాళ్ళ మీద లాటీతో కొడ్తుంటే చూస్తున్న బక్క ముసిలోడు గోలుగోలున ఏడుస్తున్నాడు.

వాడ్నేవరూ పట్టించుకోవడం లేదు.

కుర్చీలోంచి కిందకి తోసిన బాలరాజుని నడిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

నడిచీ నడిచీ నడవలేక బాధతో అరుస్తా వెనక్కి విరుచుకుపడిపోతుంటే, "తండ్రీ... నా బిడ్డా," అంటూ అరుస్తున్నాడు ముసిలోడు.

రాక్షసుల్లా తయారైపోయిన ఆ ఎస్సై, "వీడ్ని తలకిందులుగా నిలబెట్టండి," అన్నాడు.

భయపడిపోయిన కానిస్టేబుల్ వీర్రాజు, "ఈ పరిస్థితుల్లో చాలా ప్రమాదం వద్దు సార్," అన్నాడు.

అసలే శాడిస్టయిన ఆ ఎస్సై, "నే చెప్పినట్టు చెయ్యండి," అంటూ అరిచాడు.

అతని చూపులకి హడలిపోయిన మొత్తం స్టాఫ్, "ఎస్సార్," అంటూ ఆ బాలరాజు గాడ్ని తలకిందులుగా నిలబెట్టారు.

నీళ్ళగ్లాసుతో బాలరాజు దగ్గరకొచ్చిన ఎస్సై అది వాడికి చూపిస్తా, "ఒరేయ్ బచ్చా... ఈ నీళ్ళే గనక నీ ముక్కులోకి దిగాయా పేగులు తెగి చస్తావ్. నా కొడకా చెప్పిప్పుడు ఆ రాయి ఎత్తుతావా లేదా?" అంటూ గ్లాసుతో వాడి ముక్కు బెజ్జాలకి బాగా దగ్గరగా వచ్చేస్తున్నాడు.

గిలగిల్లాడిపోతున్న బాలరాజు, "ఎత్తుతానండి," అన్నాడు.

"అయితే దించండి," అన్నాడు ఎస్సై.

దించారు.

హుషారు బాగా పెరిగిపోయిన ఎస్సై వాడ్నే చూస్తున్నాడు. వాడెలా ఎత్తబోతాడా అని ఎదురుచూస్తున్నాడు.

బాగా దగ్గరకొచ్చిన బాలరాజు రాయికి బాగా దగ్గరగా వచ్చాడు.

పదిహేనుమంది మోసుకొచ్చిన ఆ పెద్ద బండరాయిని ఈ కుర్రగాడు ఎలా ఎత్తుతాడా చూద్దాం అన్న కుతూహలంతో చూస్తున్నాడు ఎస్సై.

ఆ బండరాయి చుట్టూ కల తిరుగుతూ చివరికి దానిమీద కెక్కి బాసింపీట వేసి కూర్చున్న బాలరాజు, "నేను చెప్పినట్టు చేస్తేనే ఎత్తుతాను ఈ బండరాయి," అన్నాడు.

"ఏం జెయ్యాల్రా?" అన్నాడు ఎస్సై.

"నర్సిం కాపుని తీసుకొచ్చి నా ముందు నిలబెడితేనే ఎత్తుతాను," అన్నాడు బాలరాజు.

"ఆయనెందుకురా?" అన్నాడు ఎస్సై.

"ఈ రాయి ఆది మీద విసరడానికి," అన్నాడు బాలరాజు.

"ఏంటీ?"

"ఔను ఆడ్ని తీసుకొస్తే తప్ప ఈ రాయి ఎత్తలేను. ఆడి మీద విసురుతాను అంతే."

ఆయన ఈడికి  ఇన్ఫిరేషనని అర్ధం చేసుకున్న ఎస్సై, "ఆ నర్సింగార్నిక్కడ నిలబెట్టండి," అంటూ కానిస్టేబుల్స్ కి ఆర్డరేశాడు.

ఆ పోలీసు స్టేషను వెనకున్న గదిలో వున్న నర్సింహాన్ని ఎస్సై ముందుకి తీసుకొచ్చారు.

నవ్వుతూ నర్సింహాన్ని చూసిన ఎస్సై, "వీడ్ని లెవెల్ చెయ్యడానికి చాలా టైము పట్టింది. కాస్తలా నిలబడతారా?" అన్నాడు.

"ఎందుకూ?"

"ఏంలేదు ఇదంతా అయ్యేదా చచ్చేదా... మీరక్కడ నిలబడితే మీమీదకి వాడు రాయి విసురుతానని ఒకటే గొడవ చేస్తే ఓ.కే. అన్నాను," అన్నాడు ఎస్సై.

అదిరిపోయిన నర్సింహం గింజుకుంటుంటే లాక్కుంటూ వచ్చి బాలరాజు ముందు నిలబెట్టి, "విసర్రా ఆ రాయి," అన్నాడు.

అదంతా చూసిన నర్సింహం, "అమ్మో," అంటూ పారిపోతుంటే, "పట్టుకు తీసుకురండి," అంటూ అరిచాడు ఎస్సై.

కానిస్టేబుల్సంతా నర్సింహాన్ని తీసుకొస్తా, "మీకేం ఫర్వాలేదు సార్. మా ఎస్సైగారున్నారు గదా," అంటూ బండ ముందు నిలబెట్టారు.

"ఇడిగో నువ్వు అడిగిన నర్సింకాపు... ఊ ఎత్తు ఆ బండరాయి... ఊ... ఊ... విసిరెయ్," అంటా బాలరాజుని తెగ రెచ్చగొట్టడం మొదలెట్టాడు ఎస్సై.

రెచ్చిపోతున్న బాలరాజు ఆ పెద్ద బండరాయి ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు గానీ తనవల్ల గావట్లేదు.

పెడరెక్కలు విరిచిన పోలీసుల మధ్య వున్న నర్సింహులు, "నాకు డి.ఎస్.పి తెల్సు, డి.జి.పి తెలుసు. నీ అంతు చూస్తాను," అంటూ అరుస్తున్నాడు.

స్టేషను బయటున్న జనం, "చంపండి నా కొడుకుని, నరకండి నా కొడుకుని," అంటూ అరుస్తూ రాళ్ళు విసురుతున్నారు.

అదంతా చూసి అదిరిపోయిన ఎస్సై, కానిస్టేబుల్స్ వైపు చూస్తా, "స్టేషన్ తలుపులు మూసెయ్యండి," అనరిచేసరికి టపటపా మూతలు పడ్తున్నాయా తలుపులు.

అదంతా చూస్తున్న నర్సింహం ఒళ్ళంతా రగులుకుపోతుంది. పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి. "ఒరే ఎస్సై... తలుపులు మూసి నన్ను బందిస్తావంట్రా," అంటుండగా ఆ నర్సింహం మీదికి దూకేసిన బాలరాజుగాడు, "ఏరా... బట్టలిప్పదీస్తావ్ రా నిన్నూ..." అంటూ బిగించిన పిడికిలితో వీసెగుద్దు గుద్దబోతుంటే వెనకాలే వచ్చిన ముసిలోడు అతి కష్టం మీద బాలరాజుని వెనక్కి లాగి, "ఒరే ఏంట్రా... ఏంట్రా అలా అయిపోతున్నావ్?" అంటూ బాలరాజు ఆ చెంపా ఈ చెంపా వాయగొట్టడం మొదలెట్టాడు.

విసురుగా తన ముసలితండ్రి మీద కలబడ్డ బాలరాజు, " నన్ను కొడతావేంట్రా... అసలీడు... ఈడు... ఈడు ఏం చేసాడో తెల్సా నీకు," అంటూ అరిచాడు.

"ఏం చేసాడ్రా?" అన్నాడు ముసిలోడు.

"పొద్దుట నువ్వు పనిమీద పొరుగూరెల్లినప్పుడు ఈడు మనింటికొచ్చేడు."

"వచ్చి... వచ్చి ఏం చేసేడ్రా?" అన్నాడు ముసిలోడు.

"ఈడికి మనం బాకీ అంటగదా... మన గింజలన్నీ తన బండ్లోకెక్కించాడు. అడ్డుపడ్డ అమ్మని దుడ్డుకర్రతో దబదబా బాదేడు."

"ఏంటీ మళ్ళీ చెప్పు?"

"కర్రతో మా అమ్మని చితగోట్టేడు... ఆ తర్వాత అందరూ చూస్తుండగానే..." అంటూ ఒగురుస్తున్నాడు బాలరాజు.

"అందరూ చూస్తుండగానే... ఆపేసేవేంట్రా చెప్పు... అందరూ చూస్తుండగా ఏమయ్యింది చెప్పరా?" అంటూ అరిచేడు ముసిలోడు.

"కోక ఇప్పేసేడు... మా అమ్మ కోక ఇప్పుసేడీడు."

అంతే -

ముసిలోడు పారల్లాంటి పళ్ళు పరమ కసిగా నూరుతున్నాడు. కళ్ళల్లో గంధకం మంటలు మండుతున్నాయి. ముక్కు బెజ్జాల్లోంచి వేడి పొగలొస్తున్నాయి. పటపట మంటా పిడికిళ్ళు బిగుసుకుంటున్న చప్పుల్లొస్తున్నాయి. ముసిలోడి ముఖం ఒకానొక భయంకరమైన రాక్షసుడి ముఖంలాగ మారిపోతుంది. తోస్తే ప్రాణాలు పోయేట్టున్న వాడిలో వెయ్యి ఏనుగుల బలం వచ్చేసింది.

దాంతో పెద్దపెద్ద అంగలేసుకుంటూ ఆ రాయి దగ్గరకెళ్ళి అంతా చూస్తుండగానే దాన్నెత్తి ఆ నర్సింహులు మీదేసేసరికి పచ్చడయిపోయిన ఆ నర్సింహులు ప్రాణాలు అరక్షణంలో ఆకాశంలో కలిసిపోయాయి.

మరిన్ని సీరియల్స్