Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

 

జరిగినకథ: ఇంటా, బయటా లభించే ప్రోత్సాహం తో ఆనందం గా గడిచిపోతుంటుంది చిన్నారి చంద్రకళకి. ఇంతలో మరో ఆనందం...  నృత్యహేళి లో తాను ఎన్నికవడం మరింత ఆనందాన్నిస్తుంది. ఆ తరువాత.....

మరునాటి  సాయంత్రం  ఏడింటికి  భూషణ్  అంకుల్  వాళ్ళింటికి  డిన్నర్ కి వెళ్ళాము.  ఇల్లంతా చాలా చక్కగా  డెకరేట్  చేసారు.

“ఏమ్మా చంద్రా, మీ  అత్తయ్యా  వాళ్ళని  చెన్నై తిప్పి చూపించడంతో  బిజీగా ఉన్నావంట?” అడిగింది నీరూ ఆంటీ నన్ను.

“చెన్నై చూడాలంటే ఐదు రోజులకే అవుతుందా?  పదిహేను రోజులు పడుతుంది,” అన్నారు అంకుల్  రాంమామయ్యతో...

మాకు,  వాళ్ళ ఇల్లు - గార్డెన్ – గేం-రూమ్ – తన హోమ్-థియేటర్ అంతా తిప్పి చూపించింది, రాణి...   ఓ ఫ్రెండ్ గా, తనకి జగదీష్ చాలా నచ్చాడని కూడా మా అందరితో చెప్పింది.  డిన్నరప్పుడు, పక్కనే  కూర్చుని,  తనే  జగదీష్ కి  అన్నీ వడ్డించింది.   డిన్నర్ అయ్యాక మమ్మల్ని వాళ్ళ ఐస్ క్రీమ్ పార్లర్ కి తీసుకు వెళ్ళింది.  జగదీష్, వినోద్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను  మాత్రం, తెల్లారితే  ‘విజయభూషణ్  స్టూడియో’ లో జరగబోయే  నా కూచిపుడి  ప్రోగ్రాం  ఆలోచనలోనే  ఉన్నాను.  ఇక ఇది కల కాదు ... నిజం..... చాలా హ్యాపీగా, ఉత్సాహంగా ఉంది.  భయంగా లేదు.  ప్రోగ్రాం ఎప్పుడెప్పుడా అని ఉంది.

**

“ఇక లేచి పనులు కానివ్వు, ఈ రోజేగా ‘బిగ్ డే’ - నీ మొదటి కూచిపూడి ప్రోగ్రాం. తలంటుతాను... నాకు చాలా పనుంది,”  అన్న అమ్మ మాటలకు నిద్ర లేచాను.

అందరి పనులు అయి, కామాక్షి చేత డాన్స్ సామానంతా సర్దించేప్పటికి లంచ్ టైం అయ్యింది....స్టూడియోకి  డ్రైవ్ ఒక గంట. లంచ్ అయ్యాక,  బయలుదేరాము.   

**

మమ్మల్ని గ్రీన్ రూమ్ వద్ద డ్రాప్ చేసి,  మామయ్యవాళ్ళని  స్టూడియో చూడ్డానికి తీసుకువెళ్ళారు, నాన్న. నా మేకప్ అవుతుండగా,  నాన్న కోసం అనౌన్స్మెంట్  టెక్స్ట్  ప్రిపేర్  చేస్తూ కూర్చుంది అమ్మ... మేకప్  అయ్యి,  కాస్ట్యూమ్  వేసుకునే  టైంకి,  ఆడిటోరియం  కూడా  చూసి  మరీ వచ్చారు నాన్నావాళ్ళు.   ప్రోగ్రాం  ‘వేదిక’  చాలా అందంగా డెకొరేట్  చేసారంట.  నావి, రాణివి ఫొటోలు ఎంట్రెన్స్ లో బానర్స్ లా పెట్టారంట.  బాగున్నాయని అత్తయ్య చెప్పింది.

**

కాస్ట్యూమ్ కూడా వేసాక, గజ్జెలు పెట్టున్న లెదర్ బ్యాగ్ నా చేతికందించింది అమ్మ.

“చిన్న దేవతలా ఉన్నావే,” అంటూ చెవి వెనుకగా దిష్టి చుక్క పెడుతూ, ముద్దు పెట్టుకుంది...

వినోద్  కూడా, “యు లుక్ లైక్ ఎన్ ఏంజల్, అక్క,”  అన్నాడు.  వాడి వెంటే ఉన్న మీనాక్షి నా దగ్గరగా వచ్చి, ఒక్కో మాట కూడబలుక్కుని  ‘చక్కగా ఉన్నావు’ అని చెప్పి వెళ్ళింది.

ఇంతలో మా ఆర్కెస్ట్రా వాళ్ళు,  వారి వెనుకే రాణి, నీరూ ఆంటీ, భూషణ్ అంకుల్ కూడా వచ్చారు.

“మీ ఇద్దరూ నాతో రండి,” అని నన్ను, రాణీని  ఎంట్రెన్స్ లోని రిసెప్షన్ ఏరియాకి తీసుకు వెళ్ళి అక్కడ పోస్టర్స్ లా ఉంచిన మా ఫోటోలు చూపించారు అంకుల్.

ఇంకొంచెం  లోపలికి,  చుట్టూ దీపాలతో అలంకారం చేసిన వాళ్ళ నాన్నగారి పెద్ద ఫొటో ఓ పక్కగా,  తమ్ముడి పుట్టిన రోజుకి ఏర్పాటు చేసిన ఏరియా మరో ప్రక్కన ఉంది.

“ఇది ఎంట్రెన్స్, అది ఫంక్షన్ ఏరియా .... ఇక మీ ఇద్దరి కోసమే ప్రత్యేకంగా  అలంకరించిన  ‘వేదిక’  చూద్దురు  రండి,” అంటూ మమ్మల్ని వేదిక ముందుకి తీసుకొని వెళ్ళారు అంకుల్.  మొదటి సారి నా గుండె వేగంగా కొట్టుకొంది.

‘వేదిక’ మీద లైట్స్ అన్నీ వేయించారు. ఒక్కసారిగా కళ్ళు జిగేల్ మన్నాయి.

అటువంటి ‘వేదిక’  నేనిప్పటివరకు  సినిమాల్లో కూడా చూడలేదు అనిపించింది...

అమ్మా, అత్తయ్యవాళ్ళు కూడా మేము నిలబడ్డ  దగ్గరికి వచ్చారు. “ఇట్స్ బ్యూటిఫుల్ డాడీ,” అంది రాణి.“థాంక్ యు అంకుల్,” అన్నాను నేను. నాన్న నావంక  చూసి కళ్ళెగరేసారు.  ‘చాలా హ్యాపీ’ అని సైగ చేసాను.  మేమక్కడ  ఉండగానే  హాల్లోకి  జనం  రావడం మొదలైంది.. స్టేజి కర్టన్స్  క్లోజ్ చేయించారు నాన్న. అమ్మ  నా చేతికిచ్చిన గజ్జెలని,  స్టేజీ మీదున్న నటరాజు విగ్రహం ముందుంచి దణ్ణం పెట్టుకున్నాను.  అమ్మానాన్నల  పాదాలు తాకి నమస్కరించాను.  మా శేషు మాస్టారుకి నమస్కరించాను.   ఆశీస్సులందుకొని  తిరిగి  గ్రీన్-రూముకి వచ్చేసాను.

**

అనుకున్న టైంకే  ప్రోగ్రాం మొదలు పెట్టించారు అంకుల్.  ప్రోగ్రాంకి నాన్నే ‘మాస్టర్  ఆఫ్ సెరమొనీస్’ .  ముందుగా రాణి ప్రార్ధన గీతం, రెండు కృతులు పాడింది. నా వంతు వచ్చింది.  నన్ను ఇంట్రడ్యూస్ చేయడానికి నాన్న వేదిక మీదకి వెళ్ళారు.

“చంద్రకళ  కూచిపూడి నృత్యాన్ని అభ్యసిస్తున్న విధ్యార్దిని.  స్వతహాగా ఉన్న ఆసక్తి, మక్కువతో నిత్యం  ఎటువంటి సంగీతానికైన  అడుగులు వేస్తుండేది.  ‘హోలీ ఏంజిల్స్ కాన్వెంట్ ’ టాలెంట్ షో లో రెండేళ్ళు  సెలెక్ట్ అయ్యి ‘చెన్నై యంగ్ టాలెంట్ ‘ ట్రోఫీని గెలుచుకుంది.  ఈ యేడు చిన్మయ వారి  ‘యంగ్ రోల్ మాడల్ ‘  అవార్డ్  అందుకుంది.  మీ ముందు ఈ ‘వేదిక’ పైన కూచిపుడి  నృత్యాలు చేసే అవకాశం  చంద్రకళ అదృష్టమే,”  అన్నారు  నాన్న నా గురించి అనౌన్స్ చేస్తూ..

“ఈ అవకాశాన్ని కల్పించిన  మంచి  స్నేహితుడు విజయ్ భూషణ్ గారికి, మా అమ్మాయి చంద్రకళ తరఫున కూడా కృతజ్ఞతలు.  నృత్యాన్ని తిలకించి  ఆశీర్వదించమని కోరుతున్నాను,” అంటూ  చేయబోయే డాన్స్ ఐటెం  గురించి వివరించారు  నాన్న.....

**

‘వేదిక’ పైకి అడుగు పెట్టి, చేతులతో  వేదికనంటి  కళ్ళకద్దుకొన్నాను. ఎంతో గర్వంగా అనిపించింది.  ‘పూర్వరంగం’  అయ్యాక, ముందుగా ‘ప్రార్ధనా శ్లోకంతో ‘ సభకి, భూమికి, నటరాజ స్వామికి, వాయిద్యాల వారికి నమస్కారాలు చేసాను.

‘గణపతి కౌత్వం’  ముగించి..... 

“కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం...!
సర్వాంగే హరిచందనంచ కలయన్ కంటేచ ముక్తావళిం
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాలచూడామణి...!!”

శ్లోకానికి –  నడకలు, అడుగులు, కదలికలతో ఆంగికాభినయం చేస్తూ ...‘వేదిక’ పై కదులుతుంటే, రంగుల లైట్లు నా మీద, నా ముఖం మీదా పడుతున్నట్టు తెలుస్తుంది.  గమ్మత్తుగా, అందంగా అనిపించింది. నేను,  నా మీద మెరుస్తున్న వెలుగులు తప్ప మరేమీ లేనట్టే అనిపించింది. ముద్రలు పడుతున్నప్పుడు నా చేతి వేళ్ళ కదిలికలు నా కళ్ళకి  మెరుస్తూ చక్కగా అనిపించాయి.  శ్లోకం చివరికి రాగానే, అప్పుడే అయిపోయిందా?  అనిపించింది...

**

ఆంగికం  భువనం  యశ్చ్యామి’ అనే శ్లోకం తో మొదలుబెట్టి, ‘నగుమోము కలవాని ’  చక్కగా పాడింది రాణి.  వింటూ కాస్ట్యూమ్ మార్చుకున్నాను. రాణి పాట ముగుస్తూనే,... నా డాన్స్ ఐటెం అనౌన్స్ చేసారు నాన్న. ...

గోవర్ధన గిరిధారి హరే’  అనే పాట ఈ సారి అమ్మ అందుకుంది.  నాకెంతో ఇష్టమైన ఆ పాటకి ‘వేదిక’  మీద చాలా ఆనందంగా  డాన్స్  చేసాను...ఆ వెంటనే ‘జణుతా శబ్దం’ కూడా చేసి ఆ ఐటెం ముగించాను. మళ్ళీ రాణి  పాటలు  రెండయ్యాక,   కాస్ట్యూమ్  మార్చుకొని  ‘మొక్కజొన్న తోటలో’  పాటకి  ఫోక్ డాన్స్ చేసాను.ఆఖర్న, రాణి పాడిన తిల్లాన తో ప్రోగ్రాం ముగిసింది.

అయిగిరినందిని నందితమేదిని  విశ్వవినోదిని  నందసుతే’  స్తోత్రం మంగళగీతంగా పాడింది అమ్మతో పాటు మా సింగర్.

**

నేను మేకప్ తీసి, పరికిణీ - వోణీ వేసుకుని రెడీ అయ్యి వెళ్ళేప్పటికి,  పక్కనున్న హాల్లో వర్ధంతి పూజ ముగిసింది.  ప్రసాదాలు  తీసుకున్న  తరువాత,  తమ్ముడు వినోద్ పుట్టినరోజు  కేక్-కటింగ్  అయింది. 

తమ్ముడితో కాసేపు గడిపాము.  వాడు తన ఫ్రెండ్స్ తో బిజీ అయ్యాక, అమ్మ, నేను, డిన్నర్  హాల్లోకి వెళ్ళాము.

**

అందరితో కలిసి మాట్లాడుతూ, కాస్త దూరంలో కనబడ్డారు మామయ్యా  వాళ్ళు. జగదీష్, రాణి కూడా వాళ్ళతోనే ఉన్నారు.మేము  బఫే  నుండి డిన్నర్ తీసుకొని,  ఓ టేబిల్ వద్ద కూర్చున్నాము... ప్రోగ్రాం చూసిన పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు కూడా దగ్గరగా వచ్చి ‘కంగ్రాట్స్’ చెప్పి వెళుతున్నారు.

**

మరి కాసేపటికి అత్తయ్య వాళ్ళు, రాణి, జగదీష్  మా వద్దకొచ్చి కూర్చున్నారు.  అప్పటికే వాళ్ళందరి డిన్నర్ అయిందట.

“అసలు నా కోడలు పిల్లవేనా నువ్వు?” , “లేక ఎవరన్నా చిన్నారి అప్సరసా?” అంటూ నా బుగ్గలు  నొక్కింది,  పక్కనే  కూర్చున్న  అత్తయ్య.

“మీ అమ్మని, నాన్నని కూడా ఆకాశానికి ఎత్తేస్తున్నారు నీ డాన్స్ చూసిన వాళ్ళంతా,” అన్నారు మామయ్య సంతోషంగా.“యువర్ డాన్స్ ఇజ్ ఫాన్టాస్టిక్, వావ్ ,” అన్నాడు జగదీష్ కూడా కాంప్లిమెంట్  చేస్తూ......

యు సింగ్ వెరీ వెల్ టూ రాణి,” అన్నాడు తన పక్కనే ఉన్న రాణితో...

కబుర్లు-కంగ్రాచ్యులేషన్స్ తో ఆకలి కూడా ఎగిరిపోయింది నాకు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasinipattiste koti