Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటిజరిగిన కథ : మందుల షాపులోకెళ్ళి కావలిసినవి కొనుక్కుని బయటపడిన విరాట్, సహస్రలిద్దరూ ఒక పార్కులో కూర్చుని కాస్త ఊపిరి తీసుకుంటారు. అక్కడే విరాట్ చేతికి సహస్ర కట్టుకడుతుంది. తమ వీధిలోకి చేరుకోగానే ఒక జీపు తమకేసి వేగంగా రావడం కనిపిస్తుంది. అందులో ఉన్న వాళ్ళను చూసి అవాక్కవుతారు ఇద్దరూ.. ఆ తరువాత.......

కళ్ళు జిగేల్ మన్పించే హెడ్ లైట్ల కాంతిలో కూడా వేన్ డోర్లో లేచి షాట్ గన్ ఎక్కు పెడుతున్న వ్యక్తిని గుర్తించాడు విరాట్. ‘ధన్’ మంటూ ఘర్జించింది షాట్ గన్. విరాట్ సహస్రను పక్కకు లాగుతూ చేతిలోని డాగర్ని ప్రయోగించాడు. గాలిని చీల్చుకొంటూ దూసుకెళ్ళిన డాగర్ షాట్గన్ వ్యక్తి  గొంతులో దిగబడింది. వాడు షూటర్ విక్కీ. డాగర్ గొంతులో దిగబడగానే అరిచే అవకాశం కూడా లేక గన్ వదిలేసి డోర్ బార్లా తెరుస్తూ విరుచుకు పడిపోయాడు రోడ్ మీదకి.

‘‘విక్కీ.. ఏమైందిరా? ఏమైంది?’’ పక్కనున్న ధనగిరి ఆందోళనగా అరుస్తూనే వున్నాడు. విక్కీ షాట్ గన్ ప్రయోగించినప్పుడే వెనక రైట్ డోర్లో వున్న డేవిడ్ రివాల్వర్ తో కాల్పులు జరిపాడు. విరాట్ సహస్రలు వెనక్కు దూకారు. సహస్ర చేతిలో పలుగు రాళ్ళు సుడిగాలిలా వెంటవెంటనే దూసుకెళ్ళి ఏక కాలంలో వేన్ ఫ్రంట్ గ్లాస్ ని తాకి, భళ్ళున పగలగొట్టాయి. అద్దం ముక్కలు ముఖం మీదకు చిమ్మి డ్రయివరు కెవ్వుమంటూ స్టీరింగ్ వదిలేసి చేతులతో ముఖాన్ని కప్పుకున్నాడు.

అంతా రెప్పపాటుకాలంలో...

చకచకా జరిగి పోయిన...

వూహించని సంఘటనలు...

కంట్రోల్ తప్పిన వేన్ రోడ్డు మీద అటూ యిటు అడ్డ దిడ్డంగా కొంత దూరం విరాట్ సహస్రలను దాటి పరుగెత్తి వేగంగా ఎడం పక్క మురుగు గుంటలోకి దూకేసి పక్కకు ఒరిగిపోయింది. లోతయిన మురుగు గుంట. డేవిడ్ కి మూడు రౌండ్ల తర్వాత వేన్ కంట్రోల్ తప్పటంతో కాల్పులు జరిపే అవకాశమే లేకపోయింది. అదే సమయంలో సహస్రకు జరిగిన ప్రమాదాన్ని కొద్ది క్షణాలు ఆలస్యంగా గుర్తించాడు విరాట్.వాళ్ళిద్దరూ నిలబడిన చోట పక్కనే పెద్ద భవంతి రోడ్ నానుకునే ఉంది. భవంతి రెండో అంతస్థు సన్ షేడ్ వెంట అందానికి తాళ్ళతో వేలాడ దీసిన పూల కుండీలు కొన్ని వున్నాయి. సహస్ర సరిగ్గా వాటి కింద ఉంది. దేవిడ్ జరిపిన కాల్పుల్లో తామిద్దరూ తప్పించుకున్నారు. కాని గురితప్పిన బుల్లెట్ ఒకటి నేరుగా పైకిపోయి ఒక కుండీ తాళ్ళను తెంచేసింది.సరిగ్గా ఆ కుండీ కింద నిలబడుంది సహస్ర. దెబ్బతిన్న పక్షిలా తూలుతూ తమను దాటి పోతున్న వేన్ ని చూస్తుండటంతో మీద పడుతున్న ప్రమాదాన్ని గుర్తించలేక పోయింది. తాడు తెగి జారిన పూలకుండీ సూటిగా వచ్చి సహస్ర తలమీద పడిన్ది. అంతే..........

తల మీద పిడుగు పడినంత బాధతో పెద్దగా అరుస్తూ తెలివి తప్పి విరుచుకు పడిపోయింది.

అలా పడి పోతున్న సహస్రను ఒడిసి పట్టుకున్నాడు విరాట్. ఎడం భుజం గాయం కలుక్కుమంది.‘‘ఓ మైగాడ్ ఎంత ఘోరం జరిగింది. సహస్ర... సహస్ర’’ అంటూ బుగ్గలు తట్టాడు. సహస్రలో కదలిక లేదు. తలమీద నెత్తురు చిక్కగా చేతికి తగిలింది. చిమ్మ చీకట్లో ఏమీ తెలీటం లేదు. ఈ సంఘటనతో పిచ్చెక్కిపోయాడు విరాట్. పూల కుండి నేరుగా తల మీద పడ్డంతో తల చిట్లిందో పగిలిందో ఏమైందో అర్థం కాలేదు. కోపంతో వీరభద్రుడై పోతూ సహస్రను కింద పడుకోబెట్డాడు.

వేగంగా పరుగెత్తి రోడ్ మీద పడున్న విక్కీ శవాన్ని కాళ్ళతో తన్ని పక్కన పడున్న షాట్ గన్ అందుకున్నాడు. ‘‘చంపేసారు గదరా. నా సహస్రను చంపిన మిమ్మల్ని క్షమించను’’ అనరుస్తూ గుంటలో పడిన వేన్ వైపు పరుగెత్తాడు. వేన్ డ్రయివరు అప్పుడే వేన్ లోంచి బయట పడి రోడ్ ఎక్కాడు. వెనక డోర్ లోంచి డేవిడ్. మరొకరు ఎలాగో బయట పడ్డారు. వేన్ లోంచి అరుపులు ఆర్తనాదాలు విన్పిస్తున్నాయి. వేన్ కింద బురదలో చిక్కి ఎందరు పోయారో తెలీదు.

వేన్ని సమీపిస్తూనే విరాట్ నిర్ధాక్షిణ్యంగా కాల్పులు జరిపాడు. షాట్ గన్ గుళ్ళకి ముందుగా రోడ్డెక్కిన ముగ్గురూ చావు కేకలతో విరుచుకు పడి ప్రాణాలు వదిలారు. అప్పుడే పైకి రాబోతున్న ధనగిరి తల వెనక్కి తీసుకొని లోపలే ఉండిపోయాడు. కోపం తీరక వేన్ మీద మరో రౌండ్ కాల్పులు జరిపి వెళ్ళినంత వేగం గానూ వెనక్కి వచ్చేస్తూ షాట్ గన్ని మురుగు గుంటలోకి విసిరేసాడు. సహస్రలో మార్పులేదు.చలనం లేకుండా పడుంది. తన షర్టు చించి ఆమె తలకు కట్టు కట్టాడు.

గన్ సౌండ్సు, కేకలు చుట్టుపక్కల వాళ్ళను అలర్ట్ చేసాయి. టార్చి లైట్లతో ఇళ్ళలోంచి జనం బయటకు వస్తున్నారు. ఇక ఒక్క క్షణం తనిక్కడున్నా ప్రమాదమని గ్రహించాడు. విరాట్ శక్తినంతా కూడ దీసుకుని కుడి చేత్తోనే సహస్రను లేపి భుజం మీద వేసుకొని కాలి కొద్ది చీకట్లలో ఎగువకు పరుగు తీసాడు.

కాల్పులు ఆగిపోయిన మరుక్షణం వేన్ లోని ధనగిరి పైకి వచ్చేసాడు. అతనితో బాటు మరో ముగ్గురు మాత్రం రాగలిగారు. అప్పటికే చుట్టు పక్కల వాళ్ళు లేచి వస్తున్న అలికిడి గావటంతో వాళ్ళంతా మరో దిశగా చీకట్లలో అదృశ్యమయ్యారు. చుట్టు పక్కల వాళ్ళు మురుగు గుంట వద్దకు వచ్చి టార్చిలైట్లు ఫోకస్ చేసేసరికి లోపలి నుంచి ఇంకా మూలుగులు అరుపులు విన్పిస్తున్నాయి. రోడ్డు మీద శవాన్ని చూసి అదిరి పడ్డారు. పోలీసులకు ఫోన్ చేసారు. ఇంతలో పోలీస్ పెట్రోలింగ్ వేన్ ఒకటి అటుగా వచ్చింది. సంఘటన గురించి తెలీగానే కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించారు. వేన్ లో ఇంకా ప్రాణాలతో చిక్కుబడి ఉన్న వాళ్ళని స్థానికుల సాయంతో బయటకు తీసే పని ఆరంభించారు పోలీసులు.

సహస్రను భుజాన వేసుకుని బయలు దేరిన విరాట్ ఎక్కడా ఆగలేదు. ఎడం భుజం గాయం నరకం చూపిస్తోంది. సహస్రను భుజం మార్చుకోలేడు. శక్తినంతా పాదాల్లోకి తెచ్చుకొని వేగంగా ఆ చీకట్లలో నడిచి పోతూనే వున్నాడు. తమ కోసం ఒక పక్క పోలీసులు మరో పక్క శిఖామణి తాలూకు గుండాలు గాలిస్తుంటారని తెలుసు. ఇప్పుడు తమను అటాక్ చేసింది ఖచ్చితంగా ధనగిరి బేచ్ మనుషులే. వాళ్ళలో ఎందరు చచ్చారో ఎందరు బతికారో తెలీదు. గెలుపు తమదైనా సహస్ర గాయపడ్డంతో ఓడినట్టే లెక్క. వూహించని ప్రమాదం యిది.ఈ పరిస్థితిలో మరో గ్రూపు ఏదన్నా ఎదురు పడితే వాళ్ళని ఎదిరించే శక్తి ఓపిక తనకు లేవు. తన పరిస్థితి అర్దం గాక ముందే సహస్ర ప్రమాదంలో పడింది. ముందు తమను కాపాడుకోవటం ముఖ్యం.

సుమారు ఫర్లాంగు దూరం భుజాన సహస్రతో శక్తినంతా కూడ దీసుకొని చీకట్లలో పరుగెత్తాడు. ఒళ్ళంతా చెమటలు కారుతోంది దుస్తులు రక్తసిక్తమయ్యాయి. క్రమంగా శక్తి సన్నగిల్లుతోంది. కళ్ళు తిరిగి పడిపోవచ్చనే సందేహం కలుగుతోంది. ఇంతలో కుడి పక్క సువిశాలమైన ప్లే గ్రౌండ్ కన్పించింది. పార్కుల్లాగే వీటినీ మెయింటెన్ చేస్తారు. అప్పుడప్పుడూ స్పోర్ట్స్ గాని ఇతర ఈవెంట్స్ గాని కండక్ట్ చేస్తారు. గ్రౌండ్ కి ఒక మూల వ్యాయామం చేస్తారు.  ప్లే గ్రౌండ్ కి నాలుగు పక్కలా వుండే రోడ్ వెంట ఉదయమే వాకర్స్ నడుస్తుంటారు.

ఆ ప్రాంతం పేరు గుర్తు లేదు. గాని గతంలో ఒకటి రెండు సార్లు ఈ ప్రాంతానికి వచ్చిన గుర్తు. ప్రస్తుతం ఇలా వీధుల్లో తిరగటం కన్నా గ్రౌండ్ లోకి వెళ్ళి పోవటం మంచిదనిపించింది. వెంటనే గ్రౌండ్ లో అడుగు పెట్టి అవతలి వైపుకి నడక ఆరంభించాడు. చిమ్మ చీకటి అడుగులు తడబడుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నట్టుంది. అధిక రక్త స్రావం తన ప్రభావాన్ని చూపిస్తోంది. విల్ పవర్ కూడగట్టుకొని నడుస్తున్నాడు. అంతలో అతడి సెల్ ఫోన్ మోగింది ఇప్పుడు ఆగి ఫోన్ తీసే ఓపిక లేదు. బహుశ చందూ చేసుండొచ్చు జేబులోంచి సెల్ తీసి స్విచ్ ఆఫ్ చేసేసాడు.

క్షణం తర్వాత తిరిగి సహస్ర చుడీధార్ జేబులో సెల్ రింగవటం ఆరంభించింది. దాన్ని కూడ స్విచ్ ఆఫ్ చేసాడు. క్రమంగా అడుగులు తడబడుతున్నాయి. అడుగు తీసి అడుగు వేయటం కష్టంగా ఉంది. భుజం మీది సహస్ర శరీరం క్రమంగా పది టన్నుల బరువైపోతున్నట్టు తోస్తొంది. తనకు తెలీకుండానే కళ్ళు కన్నీటిని వర్షిస్తున్నాయి.

ఎలాగో చివరికి ప్లే గ్రౌండ్ అవతలికి చేరుకున్నాడు. ఇక ముందుకెళ్ళే పరిస్థితి లేదు. కళ్ళు తుడుచుకొని అటు ఇటు చూసిన విరాట్ కి ప్లే గ్రౌండ్ నానుకొని రోడ్డు పక్క చెత్తకుండీ, దాని వెనక పేరుకొని వున్న చెత్త మీద పడిన్ది. ప్రస్తుతం తాము తలదాచుకోడానికి ఇంతకన్నా అనువైన చోటు దొరకదనిపించింది. తను తెలివి తప్పే లోపు సురక్షతమైన చోట వుండాలి.

ఇక క్షణం కూడా ఆలోచించ లేదు విరాట్...

కుప్ప తొట్టి వెనక చెత్త చెదారం వైపు వెళ్ళాడు. దుర్వాసన వస్తున్నా భరిస్తూ కళ్ళు చించుకొని చూసాడు. అక్కడ చినిగిన చాపలు ఏవో రెండు మూడు పడున్నాయి. సహస్రను నేలకు దించాడు చెత్త పక్కనే ఒక చాపను పరిచి సహస్రను ఆ చాప మీద పరుండ జేసాడు. పక్కనే తనూ పడుకుని  మరోచాపను తమ ఇద్దరిపైకి కప్పుకున్నాడు. ఇప్పుడు ఎవరన్నా అటుగా వచ్చినా చెత్త కుప్ప వెనక ఎవరో దాక్కున్నారని కనిపెట్టలేరు. ఆ చెత్తకుండీ ఎదురు గానే ఒక రోడ్ నేరుగా పోతోంది. విరాట్ తన సెల్ తీసి ఆన్ చేసాడు. ఇప్పుడున్న స్థితిలో చందూకి ఫోన్ చేసి లాభం లేదు. బైక్ మీద తమని పికప్ చేయలేడు. మునుసామికి ఫోన్ చేయొచ్చు. కాని అతడు చెన్నైకి కొత్త. వెంటనే తమకు చికిత్స అందకపోతే తెల్లవారే లోపలే ప్రాణాలు పోవటం ఖాయం. చివరి క్షణంలో కళ్ళ ముందు మెదలింది విశాల మాత్రమే.

ఆలస్యం చేయకుండా... విశాలకు ఫోన్ చేసాడు. రింగయిన వెంటనే లైన్ లో కొచ్చింది విశాల.

‘‘విరాట్.....ఎక్కడున్నావ్?’’ దుఖ్ఖంతో పూడుకుపోతున్న గొంతుతో పెద్దగా అరిచేసింది విశాల. ‘‘ప్రస్తుతం ప్రమాద స్థితిలో వున్నాను’’ బలహీన స్వరంతో బదులిచ్చాడు.

‘‘అక్క.... అక్కసహస్ర ఎక్కడ?’’

‘‘నా పక్కనే వుంది. తల మీద పూలకుండీ పడి ప్రమాద స్థితిలో తను తెలివి తప్పి పడుంది. నా భుజానికి బలమైన గాయం తగిలి చాలా రక్తం పోయింది. కళ్ళు తిరుగుతున్నాయి. శతృవుల నుంచి కాపాడుకుంటూ ఎలాగో ఇంత వరకు సహస్రను తీసుకొచ్చాను....’’‘‘ఓ మైగాడ్.........భయపడుతూనే వున్నాను. అలాగే జరిగింది ఇప్పుడు ఎక్కడున్నారు.?’’

‘‘ఏయ్... టివి చూస్తునే వున్నావా?’’

‘‘రెండు గంటలుగా టివికి అతుక్కు పోయి చూస్తున్నాను. జియన్ చెట్టి రోడ్ లో జరిగిందంతా లైవ్ టెలికాస్ట్ చేసారు. ప్రస్తుతం అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలు చూపిస్తున్నారు. మీ పరిస్థితి ఏంటో తెలీకుండా ఫోన్ చేయకూడదని ఇంత వరకు చేయలేదు...’’‘‘ఒకె ఒకె.... చెప్పేది జాగ్రత్తగా విను.’’

‘‘చెప్పు విరాట్’’ అంటూ ఏడ్చేసింది విశాల.

‘‘ఏయ్ ఇప్పుడు ఏడ్వకూడదు. ధైర్యం కావాలి. ఏడిస్తే పనులు కావు. మా కోసం రిస్క్ తీసుకోగలవా? నువ్వు తప్ప ఈ చోటు మన వాళ్ళెవరికీ తెలీదు.’’

‘‘మీ కోసం ప్రాణమే ఇస్తా. ఎంత రిస్కయినా చేసి మిమ్మల్ని కాపాడుకుంటాను. చెప్పు ఇప్పుడు ఎక్కడున్నారు?’’‘‘ఈ ప్రాంతం పేరు నాకు గుర్తులేదు. జియన్ చెట్టి రోడ్డులో గొడవ జరిగిన ప్రాంతానికి ఆనుకొనున్న ఇళ్ళమధ్యగా లోపలికొచ్చేస్తే’’ అంటూ ప్లే గ్రౌండ్ వివరాలు చెప్పాడు.‘‘ఆ ప్రాంతం నాకు తెలుసు. నీ బ్లడ్ గ్రూప్ ఏంటి?’’

‘‘ఎ బి పాజిటీవ్’’

‘‘సహస్ర బ్లడ్ గ్రూప్ తెలుసా?’’

‘‘ఓ పాజిటీవ్’’

‘‘కుప్ప తొట్టి వెనకాలే మీరున్నారా?’’

‘‘అవును... బహుశ.... నువ్వొచ్చే సరికి నేను స్రృహలో ఉండను. నమ్మకమైన వారిని ఎవరినన్నా వెంట... తీసుకు...’’ అంతవరకే చెప్పగలిగాడు. అంతటితో శక్తి పూర్తిగా హరించుకు పోయింది. అంతే...

చివరి అక్షరం పలక్కముందే...

స్పృహ తప్పి తలవాలేసాడు... జరిగిన పొరబాటు... తాము కుప్పతొట్టి వెనకే...చాప కింద వున్నామని చెప్పటం మర్చిపోయాడు.. విరాట్ హౌస్....

చందు, దీక్ష మునుసామి కదిరేషన్ లు వాళ్ళ మనుషులు అంతా అక్కడే వున్నారు. అందరూ హాల్లో సమావేశమై ఉన్నారు. టివి రన్నవుతూనే వుంది. అక్కడున్న ప్రతి ఒక్కరిలోనూ ఆతృత ఆందోళన కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి.

దీక్షయితే చందూ వెంట ఇక్కడికే వచ్చేసింది. ఇంత వరకూ ఇంటికి వెళ్ళలేదు. రోజూ సహస్రతో కలిసి ఇంటికొచ్చే అలవాటు. ఇప్పుడు ఒంటిగా వెళ్ళబుద్ధి గావటం లేదు. తమను వెళ్ళి పొమ్మని హెచ్చరించిన విరాట్ సహస్రలు ఇంత వరకు ఇంటికి చేరక పోవటం పెద్ద మిష్టరీగా ఉంది అందరికీ.

రాత్రి పదకొండు గంటలవుతున్నా...

ఇంత వరకూ ఎవరూ భోంచేయలేదు...

మునిసామి శిష్యుడు బండ శివ వంట వార్పు తెలిసిన వాడు. కదిరేషన్ కజిన్ సాయంతో రెండు సార్లు అందరికీ టీ యివ్వటంతో బాటు అందరికీ టిఫిను తయారు చేయటం ఆరంభించారు.

అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలు, కర్ఫ్యూ విధించిన ప్రాంతాల్ని టివిలో చూపిస్తూ మధ్య మధ్య పరిస్థితి వివరిస్తూ వార్తలు చెప్తున్నారు.ఒక వేళ...

విరాట్ సహస్రలు పోలీసులకు దొరికి పోయి వుంటే ఈ పాటికే ఆ వార్త ప్రముఖంగా టివిలో రావాలి అలాంటి సూచనలేదు. మరి ఇద్దరూ ఎటు పోయినట్టు ఏమైనట్టు? గుండాలకు చిక్కి ఉంటారా? ఛాన్సే లేదు, ఏభైమందినైనా పడగొట్టే శక్తి ఇద్దరికీ వుంది.పోలీసులు సంఘటన స్థలాన్ని పూర్తిగా కవర్ చేయకముందే వెళ్ళి పొమ్మని తమను హెచ్చరించిన విరాట్ సహస్రలు ఇంతవరకు ఇంటికి రాలేదు. ఫోన్ చేయలేదు. ఏమయ్యారు? క్షణ క్షణానికీ ఉత్కంఠ పెరిగి పోతోంది అందరిలో. అది తట్టుకోలేక అప్పటికే మునుసామి బాటిల్ ఓపెన్ చేసి కూచున్నాడు. వాళ్ళ ఫోన్ కోసం ఎదురు చూసి చూసి చివరకి చందు విరాట్ కి ఫోన్ చేస్తే రింగయినా ఫోన్ని స్విచ్చాఫ్ చేసాడు. దీక్ష సహస్ర సెల్ కి ఫోన్ చేసినా అదే జరిగింది? కనీసం ఒక్కమాట కూడ చెప్పకుండా ఫోన్ లు స్విచ్చాఫ్ చేయటాన్ని ఎలా అర్దం చేసుకోవాలో తెలీక తల పట్టుక్కూచున్నారు. జరిగిన పోరాటంలో...

గుండా శిఖామణి వాడి కుర్రాళ్ళు భారీగా నష్టపోయిన మాట నిజమే. అయినా తమ వైపు కూడ కొంత నష్టం జరిగింది. మునుసామి మనుషుల్లో ఇద్దరు, కదిరేషన్ మనుషుల్లో ముగ్గురు మిస్సవటం ఇంటికొచ్చాక గాని తెలీలేదు. వాళ్ళ గురించి ఆందోళన పడుతుండగా టివిలో పట్టుబడిన గుండాలను చూపిస్తున్నప్పుడు, వాళ్ళలో తమవాళ్ళు అయిదుగురూ కూడ ఉన్నందుకు సంతోషించి కాస్త తేలిగ్గా వూపిరి తీసుకున్నారు. వాళ్ళని ఎలాగోలా తర్వాత బయటికి తీసుకు రావచ్చు కాని మిస్సయిన విరాట్ సహస్రల గురించే అంతా టెన్షన్ పడుతున్నారు.

చందూ మళ్ళీ విరాట్ సెల్ కి ఫోన్ చేయబోతుటే వారించింది దీక్ష.

‘‘చేసింది చాలు ఇక ఆపు, వాళ్ళిద్దరూ ఏ పరిస్థితిలో వున్నారో ఏంటో వాళ్ళ గురించి ఎంతో కొంత సమాచారం తెలియాలంటే విశాలని కాంటాక్ట్ చేయటం మంచిది. విశాల సెల్ నంబరుందా నీ దగ్గర?’’ అంది.

ఇంత వరకు తనకీ విషయం తట్టనందుకు తనను తానే తిట్టుకున్నాడు. విశాల సెల్ నంబర్ కి ఫోన్ చేసాడు. వెంటనే లైన్ లో కొచ్చింది విశాల.

‘‘ఏమ్మా... విరాట్ సహస్రల జాడ తెలీక టెన్షన్ పడుతున్నాం. జరిగింది టివిలో చూసుంటావ్? నీకేమన్నా విరాట్ ఫోన్ చేసాడా?’’ అనడిగాడు.‘‘అన్నయ్యా ఇంతకు ముందే నాకు ఫోన్ చేసాడు. నేను బయలుదేరుతున్నాను. పక్కన ఎవరన్నా వున్నారా? కొంచెం దూరంగా రా చెప్తాను’’ అటు నుంచి అంది విశాల.

వెంటనే ఇంట్లోంచి బయటికొచ్చేసాడు.

‘‘చెప్పమ్మా ఎక్కడున్నారు వాళ్లు’’

‘‘పరిస్థితి బాగలేదు, ఓ పని చేయ గలవా?’’

‘‘ఏం చేయాలి చెప్పు. వాళ్ళ క్షేమం ముఖ్యం.’’

‘‘వెంటనే నువ్వొక్కడివే బయలుదేరి రాగలవా?’’

‘‘చెప్పమ్మా, వస్తాను, ఒక్కడ్నే వస్తాను’’

‘‘జియన్ చెట్టి రోడ్ కి అటు పాండీ బజార్ నుంచి లజ్ కార్నర్ కెళ్ళే రోడ్ కి మధ్య ప్రాంతంలో స్లమ్ ఏరియా దాని పక్కన ఒక పెద్ద ప్లే గ్రౌండ్ ఉంటాయి. ఆ ప్రాంతం నీకు తెలుసా? ’’

‘‘లేదమ్మా అటు లోనకెప్పుడూ వెళ్ళలేదు ’’

‘‘అయితే ఓ పని చెయ్యి, నేరుగా పాండీ బజార్ కి వచ్చెయ్, నీ కోసం ఆంధ్రా బ్యాంక్ ముందు వెయిట్ చేస్తుంటాను. నా కారు నంబర్ తెలుసుగా ’’

‘‘వచ్చేస్తాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను.’’

‘‘ఎంత సేపట్లో రాగలవ్?’’

‘‘జస్ట్ పావు గంట లేదా ఇరవై నిముషాలు మించదు’’

‘‘వచ్చేయ్ ఒక్కడివేరా. వాళ్ళు క్షేమంగా వున్నారు. ఎవర్నీ భయపడవద్దని చెప్పు. అలాగే ఈ రాత్రికి ఎవరికీ ఫోన్ చేయొద్దని చెప్పు. ముఖ్యంగా విరాట్ సెల్ కి. నీవు వెళ్ళటం లేటు కావచ్చు. ఎదురు చూడొద్దని చెప్పు. తర్వాత ఫోన్ చేద్దాం, బయల్దేరు’’ అంటూ లైన్ కట్ చేసింది విశాల.

విశాల చెప్పినట్టే లోనకొచ్చి...

అందరికీ చెప్పాడు చందూ.

అతను బయలుదేరుతుంటే మునిసామి అడిగాడు.

‘‘వాళ్ళెలా వున్నారో ఏమిటో వాళ్ళని చూడాలని మాకూ ఉండదా, మన వేన్ ఉందిగా, అందులో వెళ్దాం’’ అన్నాడు.‘‘సిటీలో పరిస్థితి బాగ లేదు. తెలుసుగా. నే వెళ్ళొచ్చేస్తాను. టెన్షన్ పడకుండా భోంచేసి పడుకోండి’’ అంటూ దీక్షతో కూడ తన గదిలో పడుకోమని చెప్పి బైక్ తీసి బయలుదేరాడు చందూ.

‘‘నాకేదో భయంగా వుంది చందూ’’ అంది బయటి కొచ్చిన దీక్ష కన్నీళ్ళతో ఆమె భుజం తట్టి ధైర్యం చెప్పాడు.’’‘‘అధైర్య పడకు. వాళ్ళు క్షేమంగా ఉంటారు. వస్తాను’’ అంటూ బైక్ ను బయటికి దూకించాడు చందూ.

విరాట్ నుంచి ఫోన్ రాగానే..

టివి ఆఫ్ చేసి హడావుడిగా...

బయలు దేరింది విశాల...

మెట్ల మీద కొస్తూ సెల్ అందుకుని.

ఈ సస్పెన్స్ వచ్చేవారం దాకా..........

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
death mystery