Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Stammering | నత్తి | Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)

ఈ సంచికలో >> శీర్షికలు >>

యువ - రవీంద్ర

 

వ్యక్తీకరణే వ్యక్తిత్వం
    
                                        
కార్తీక్ మూడు ఏళ్లుగా ప్రణీత ప్రేమకోసం ఎదురు చూస్తున్నాడు. ఆమె చుట్టు తిరుగుతున్నాడు. కానీ అదే విషయం చెప్పాలంటే బెరుకు, భయం. ఎలా చెప్పాలి?, ఎప్పుడు చెప్పాలి? ఏ విధంగా చెప్పాలి?.  ఫ్రెండ్స్ సలహాలిచ్చారు. సంకేతాలిచ్చారు. కానీ చెప్పడు. చెప్పాలంటే భయం. నిత్యకు క్లాసులో ఉండే మీనాతో స్నేహం చేయాలని ఎప్పటి నుంచో కోరిక. మీనా సున్నిత స్వభావం, చదువుకునే తీరు, తెచ్చుకునే మార్కులు అన్నీ ఇష్టం. కానీ ఎలా తన క్లోజ్ సర్కిల్లో ఒకరిగా చేసుకోవాలో తెలియదు.? అప్పటికీ ఓ సారి పలకరించింది. కానీ అది ముక్తసరిగానే, మీనా కూడా అలానే సమాధానం చెప్పి వెళ్లిపోయింది. కార్తీక్ కు పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. కానీ పరీక్షల మార్కులతో పాటు, వైవా ( చిన్న ఇంటర్య్వూ) లో మాత్రం జీరో మార్కులు వస్తాయి. ఏంటంటే..! తనకు తెలిసిన సమాధానాన్ని సరీగా వ్యక్తీకరించలేడు. ఎంతగా ప్రిపేరై వెళ్లినా అదే పరిస్థితి. దానివల్ల తనకు రావాల్సిన క్లాస్ ఫస్ట్ కూడా మిస్సవుతున్నాడు.

మీ నమ్మకమే... మీ మాట
వీరందరి సమస్య ఒక్కటే... చెప్పలేకపోవటం, వారి వారి అభిప్రాయాలను, నిర్ణయాలను చక్కగా వ్యక్తీకరించలేకపోవటం. వారికి వచ్చిన భాషలో, వారి మనసులోని భావాన్ని, ఎదుటి వాళ్లకు అర్థమయ్యేలా చెప్పటం రాకపోవటం. భాషకు అర్థం, పరమార్థం భావాల్ని ఇతరులకు చేరవేయడమే. మనిషి అంటే కేవలం భౌతికమైన రూపం మాత్రమే కాదు. అనేక ఆలోచనల తాలూకు భావనాలోకం కూడా. ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం. చాలామంది వారిలో వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. చేతులు తిప్పుకుంటూ ఉంటారు. 'ఏంటీ?' అని అడిగితే. 'ఏమీ లేదు' అని చెప్తారు.

మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పడు, మీరు చేసేది తప్పు కాదు అని మీరు పరిపూర్ణంగా నమ్మినప్పుడు. మీ ఆత్మ సాక్షి మీరు చేసేది రైట్ అని మీకు వందశాతం మార్కులు వేసినప్పుడు బెరుకు, భయం అక్కర్లేదు. ఒక్కొక్కరు అంటూ ఉంటారు 'నాకు స్టేజ్ ఫియర్', 'సార్ ముందు మాట్లాడాలంటే భయం', 'ఎందుకో! తనను చూస్తే మాటలు రావు'. ఇవన్నీ నిజమే.. కానీ అవి మీలో ఉన్న మైనస్ లు. పెద్ద వాళ్లను గౌరవించాలి. అలానే మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకోవాలి. మీరేంటో వాళ్లకు తెలియాలి. అంటే మీరు నోరు విప్పాలి. ఎవరికీ, ఎప్పడూ, ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు నమ్మితే చాలు. కార్తీక్ తన ప్రేమను ప్రణీతకు చెప్పకపోతే, అలానే గుండెల్లో ఆ భాధ జీవితాంత మిగలొచ్చు. మీనాతో స్నేహం చేయాలనే చిన్నవిషయం మీనాకు అర్థమయ్యేలా చెప్పకపోతే నిత్య కోరిక  మిగిలి పోతుంది. కాలేజ్ రోజులు ముగిసిపోతాయి కూడా.        

వ్యక్తీకరణ వేయి విధాలు

 
కొంతమంది మాటల్ని పొదుపుగా వాడతారు. కొంతమంది అదుపు లేకుండా వాడతారు. కొంతమంది ఆచితూచి మాట్లాడతారు. కొంతమంది వాగుడుకాయల్లా మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది నోట్లో నాలుక లేనట్లే ఉంటారు. కొంతమంది తుఫాను వచ్చినట్లు మాట్లాడతారు. కొంతమంది చిరుజల్లులా తీయగా మాట్లాడతారు. కొంతమంది తప్పదు అన్నప్పుడే నోరు విప్పుతారు. కొంతమంది ఏడుపులా మాట్లాడతారు. కొంతమంది నిస్సత్తువుగా, నీరసంగా మాట్లాడతారు. కొంతమంది పీకమీద కత్తి పెడితేనే నోరు తెరుస్తారు. అసలు మీరు మాట్లాడే విధానమే మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఓ సామెత ఉంది 'మాట నోరు జారితే, ఫృథివి దాటినట్లే'నని. మీరేంటో నిరూపించేది, మిమ్మల్ని ఇతరులకు దగ్గర చేసేది మీ వ్యక్తిత్వం. అయితే ఆ వ్యక్తిత్వం ఇతరులకు తెలిసేది మాత్రం మీ మాటల ద్వారానే. అందుకే మాట, ఓ బంగారు మూట లాంటిది.
 
మాట్లాడటమే కాదు మెప్పించడమూ ఓ కళే 

ఈ మధ్య కాలంలో కౌన్సిలింగ్ సెంటర్లు పెరిగిపోతున్నాయి. కళాశాలల్లోనే ఇంటర్వ్యూలకు ఎలా ప్రిపేరవ్వాలో తర్ఫీదులిస్తున్నారు.మీ మాటే మిమ్మల్ని పదిమందికి దగ్గర చేస్తుంది. మీ మాటే మిమ్మల్ని పది మందికి దూరం చేస్తుంది కూడా. మీ పనితీరు నచ్చినా, మీ మాటతీరు సరీగా లేకపోతే మీకు ఎవ్వరూ దగ్గర కారు. మాట ఏదైనా మనస్ఫూర్తిగా రావాలి. మీరు చెప్తున్నది ఎదుటి వాళ్లు వినడమే కాదు. నిజమే అని నమ్మాలి. అంటే ముందుగా మీరు చెప్పే విషయం మీద మీకు పూర్తి నమ్మకం ఉండాలి. నమ్మకంతోపాటు పూర్తి అవగాహన ఉండాలి. అన్ని కోణాల్లో సమగ్రమైన దృష్టి కావాలి. అప్పుడే మీరు కరెక్టుగా మాట్లాడగలరు. నిక్కచ్చిగా చెప్పగలరు. అందుకు కృషి అవసరం, అధ్యయనం అవసరం. మనో ధైర్యం అవసరం.  సరే ఇంటర్వ్యూల విషయం పక్కన పెడితే- ఇతరులతో  మీ సంభాషణ, అత్యంత సన్నిహితులతో మీ సంభాషణ, కొత్తవాళ్లను పరిచయం చేసుకునేటప్పుడు మీ సంభాషణ మీ వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తుంది. మీతో నాలుగు రోజులు తిరిగిన ప్రెండ్ మీకు దూరమయ్యాడు అంటే, మీతో పదిరోజులు కలిసి తిరిగిన గాళ్ ఫ్రెండ్ పదకొండో రోజు మరో అబ్బాయిని వెతుక్కుంది అంటే, మీ బ్యాచ్ లోని వాళ్లు మిమ్మల్ని దూరం పెడుతున్నారు అంటే- మీ వ్యక్తిత్వం గురించి ఆలోచించుకోండి. అదే మీ మాటలకోసం, మీతో టయాన్ని స్పెండ్ చేయడం కోసం పది మంది ఎదురు చూస్తున్నారు అంటే- మీలో మాట్లాడే కళ, ఇతరును మెప్పించే కళ ఉన్నట్లే... విషాన్ని కూడా అమృతంలా చెప్పగలరు కొందరు. అమృతాన్ని కూడా విషంలా చెప్పగలరు ఇంకొందరు.

మనసు మాట ఒక్కటే

చాలామంది మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఒకటి మాట్లాడతారు. మాటల్లోనే కాదు, చేతల్లోనూ తేడాలు ఉంటాయి.  అవసరమైనప్పడు, అవకాశం వచ్చినప్పుడు, లోభాలకు, ప్రలోభాలకు మాటే కాదు, మనసును కూడా మార్చుకుంటుంటారు. ఇలాంటి వాళ్లతో జాగ్రత్త అవసరం. వెంటనే కాకపోయినా, గుర్తుపట్టడం తేలికైన విషయమే. వీళ్లతో జాగ్రత్తగా మెలగాలి. ఇంకొంత మంది ఉంటారు. ఆరునూరైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. చేసే ప్రతిపనిలో, మాటలో నిజాయితీ ఉంటుంది. మనసు ఉంటంది. మీ మీద ప్రేమ ఉంటుంది. అలాంటి అబ్బాయి, అమ్మాయి స్నేహితులుగా దొరికేతే, ప్రేమికులుగా దొరికితే జీవితాంతం సంతోషంగా ఉంటారు.

అందుకే యువకులుగా ఉన్నప్పుడే మీ మనసుకు మీరు తర్ఫీదు ఇచ్చుకోవాలి. స్వచ్ఛమైన మనిషిగా, విలువలు కలిగిన వ్యక్తిగా మార్చుకోవాలి. అదే మీ మాటల్లో వ్యక్తీకరింపబడాలి. అలాంటప్పడు మీ చుట్టూ అభిమానం, స్నేహం, ప్రేమ అన్నీ వ్యక్తుల రూపంలో తిరుగుతూ ఉంటాయి. నేడంతా స్పీడ్ యుగం అయిపోయింది. యువత మధ్య స్నేహాలు, ప్రేమలకు ఎంత తొందరగా ఏర్పడుతున్నాయో, అంత తొందరగా దూరమవుతున్నాయి. అంటే వారి మాటల్లో ఓ మానసిక ఇన్ వాల్వ్ మెంట్ తగ్గిందన్నమాట. మనసు, మాట, ప్రవర్తన ఒకటిగా ఉండాలి. అదే నిండైన, నిజమైన, దార్శనికమైన వ్యక్తిత్వం. ఇప్పుడు యువత ఆచరించాల్సిన మంత్రం.  
మరిన్ని శీర్షికలు
human interview