Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
uppiliyappan temple

ఈ సంచికలో >> శీర్షికలు >>

పద్యం - భావం - - సుప్రీత

వేమన పద్యం

 

మేడి పండు చూడు మేలిమై యుండును

పొట్ట విచ్చి చూడ పురుగులుండు

పిరికివాని మదిని బింకమీలాగురా

విశ్వదాభి రామ వినుర వేమ .

 

తాత్పర్యం

అత్తి పండు పైకందంగా ఉండి లోపల పురుగులతో నిండి ఉంటుంది. అలాగే పిఱికివాని మనస్సు పైకి ధైర్యం గా నున్ననూ లోపల మాత్రం అధైర్యంగానే ఉంటుంది.

 

విశ్లేషణ

కొంతమంది పైకి గంభీరం గా ఉంటారు , లోపల మాత్రము చాలా పిరికి వాళ్ళు, పైకి కనిపించినట్లుగా మనిషి ఉండకపోవచ్చును. కొందరు పైకి కఠినంగా ఉన్నా మనస్సు మాత్రం వెన్నలాగ ఉంటుంది . కాబట్టి మేడిపండులాగ పైన మెరుగులు చూసి మనిషి మనస్తత్వాన్ని అంచనా వెయద్దు అని ఈ పద్యానికి అర్దం.
 

 దాశరధీ పద్యం

 

నీ సహజంబు సాత్వికము , నీ విడిపట్టు సుధా పయోధి ,ప

ద్మా సనుడాత్ముజుండు , గమలాలయ నీ ప్రియురాలు , నీకు సిం

హాసనమిద్ధరిత్రి గొడు గాకస మక్షులు చంద్ర భాస్కరుల్  

నీ సుమతల్ప మాదిఫణి నీవే సమస్తము గొల్చునట్టి నీ

దాసుల భాగ్యం మెట్టి దయ దాశరధి కరుణా పయోనిధి.

 

తాత్పర్యం

నిన్ను సేవించే భక్తుల భాగ్యమే భాగ్యం. ఏలయన సత్వగుణ ప్రధానుడవైన నీవు విశ్వ రూపివి కదా.పాల సముద్రమే నీ విడిది , బ్రహ్మ దేవుడు నీ తనయుడు.లక్ష్మి దేవి నీ భార్య . ఈ భూమి నీకు సిం హాసనం.  ఆకాశము గొడుగు సుర్య చంద్రులే రెండు కళ్ళు . ఆది శేషుడే పూల పాన్ పు.

 

విశ్లేషణ

శ్రీరాముడు సద్గుణ సంపన్నుడు , సాత్విక స్వభావం కలవాడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు.అలాంటి వాడిని సేవించటమే భక్తుల భాగ్యం అని ఈ పద్యం చెప్తుంది.
 

 సుమతీ శతకం

తల నుండు విషము ఫణికిని

వెలయంగా దోకనుండు వ్రుశ్చికమునకున్

దల తోక యనక యుండును

ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ

 

తాత్పర్యం

పాముకి విషం తలల్లోను , తేలుకి తోకలోను , దుష్టుడికి నిలువెల్లా విషమే .

 

 విశ్లేషణ

పాము కాటేస్తుందేమో అని మనిషి భయపడతాడు ఎందుకంటే దాని తలలో కోరల్లో విషం ఉంటుంది. తేలు కుట్టినప్పుడూ కూడ మనిషి బాధపడతాడు ఎందుకంటే దాని తోకలో విషం ఉంటుంది కాని దుష్టుడు ఎలా ఎదుటివాళ్ళని మోసం చేసి బాధపెట్టి అన్యాయం చేస్తాడో అంచనా వేయటం చాలా కష్టం ఎందుకంటే వాడికి నిలువెల్లా విషమే ఉంటుంది.

మరిన్ని శీర్షికలు
Beerakaya Pachadi - బీరకాయ పచ్చడి