Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : మహదేవ నాయకర్ ధాటికి త్యాగరాజన్ ఎస్టేట్ అంతా ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది.  అందులో ఉన్న కలెక్టర్ లక్ష్మి, మహదేవ నాయకర్ కి ఎదురు రాబోయి మౌనంగా తప్పుకొంటుంది. సహస్రను చంపించేందుకు త్యాగరాజన్ కుట్ర చేసాడని తెలియగానే కోపోద్రేకంతో త్యాగరాజన్ ఎస్టేట్ మీదా దాడికి దిగుతారు ప్రజలు. పరిస్థితులను అదుపు చేయడానికి ప్రభుత్వం రకరకాల కారణాలచేత వెనకా ముందూ ఆలోచిస్తూంటుంది....ఆ తర్వాత...

‘‘ఒకె ధర్మా ఓ పని చెయ్యండి. మీరు నేరుగా సిటీ లోకి రావద్దు. చెన్నై సిటీ లిమిట్స్ పరిసరాల్లో ఏదో ఒక హోటల్లో బస చేయండి. వీలు చూసి నేను ఫోన్ చేస్తాను. అప్పుడు రావచ్చు’’ అంటూ రాత్రి సంఘటనల్ని క్లుప్తంగా వివరించి లైన్ కట్ చేసాడు విరాట్.

తర్వాత ఇంటి వద్ద తల్లి మంగ తాయారు కంగారు పడుతుందనే ఉద్దేశంతో కోయంబత్తూరు ఫోన్ చేసాడు.

‘‘విరాట్...........ఎలా ఉన్నావ్ రా........... ఏమైందిరా?’’ అంటూ ఏడ్చేసిందావిడ.

‘‘మమ్మీ ఏం కాలేదు వూరుకో.  మేం క్షేమంగా వున్నాం. మీరేం కంగారు పడొద్దు’’ అంటూ విరాట్ ఓదార్చాక గాని ఆమె స్థిమిత పడలేదు.

‘‘డాడీతో కలసి చెన్నై వస్తున్నాను, మిమ్మల్ని చూడాలి’’ అంది స్థిరంగా.

ఆ మాట వినగానే కంగారు పడ్డాడు విరాట్. ఇప్పుడున్న పరిస్థితిలో ఒకరి తర్వాత ఒకరు యిలా చెన్నై వచ్చేస్తే అంతా గందరగోళమైపోతుంది. ఆ పైన బలవంతంగానయినా తనను తీసుకెళ్ళి సాగరికతో పెళ్ళి జరిపించాలని చూస్తారు డాడీ. అందుకే విరాట్ అంగీకరించలేదు.

‘‘మమ్మీ ఇక్కడ పరిస్థితులేం బాగలేదు. వీలు చూసి నేను ఫోన్ చేస్తాను. అప్పుడు రావచ్చు. ప్రస్తుతం వద్దు. ఉంటాను’’ అంటూ ఇక మాటలు పొడిగించకుండా లైన్ కట్ చేసాడు.

మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటినా...

సహస్ర ఇంకా స్పృహలోకి రాలేదు.

ఆ విషయంలో అందరిలోనూ ఆందోళన వుంది. ఈ లోపల విరాట్ తన గదిలోకి వెళ్ళి జాగ్రత్తగా భుజాన బాండేజీ తడవకుండా స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చాడు. ఈ లోపల విశాల డైనింగ్ రూలో అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తూ కింద వుండిపోయింది. ఆమెకు సాయంగా దీక్షక్కూడ వెళ్ళింది. విరాట్ చందూతో ఏదో మాట్లాడుతుండగా విరాట్ సెల్ ఫోన్ మోగింది. తీసి చూస్తే అది తన పర్సనల్ నంబర్ కొచ్చిన కాల్. కాల్ చేసింది సాక్షాత్తూ స్టేట్ సియం చెల్విచెందామరై.

‘‘నమస్తే మేడం’’అన్నాడు.

‘‘చూడు బాబు నీ పేరు విరాట్ కదూ?’’ అడిగిందావిడ.

‘‘హానరబుల్ సియం గారు స్వయంగా నాకు ఫోన్చేసి విచారిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞుడ్ని మేడం. నా పేరు మీకు తెలిసి పోయిందంటే ఖచ్చితంగా మధురై నుండి మహ దేవ నాయకర్ గారు మీకు ఫోన్ చేసుండాలి యామై కర్ట్.’’

‘‘యస్ యు ఆర్ కరక్ట్’’ అంటూ నవ్విందావిడ.

‘‘నువ్వు చాలా తెలివైన వాడివి విరాట్. ఆ విషయం మొదటి సారిగా నీతో మాట్లాడినప్పుడే గ్రహించాను. సహస్ర స్పృహలోకి వచ్చిందా? నీ గాయం ఎలా వుంది.’’

‘‘ట్రీట్ మెంట్ జరిగింది గాబట్టి నా గాయం గురించి భయం లేదు మేడం. సహస్ర ఇంకా స్పృహలోకి రాలేదు. ఇంకో రెండు మూడు గంటలు పట్టొచ్చు.’’

‘‘ఇప్పుడు ఎక్కడున్నారు? మీ క్షేమం కోసమే చెప్తున్నాను. మీకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తాను.’’

‘‘సారీ మేడం. మా మీద దయతో ఇంత శ్రద్ద చూపిస్తున్న మీకు కృతజ్ఞుడ్ని. కాని మేం ఎక్కడుందీ చెప్పను. నాయకులు ఎవరయినా సరే సందర్భాన్ని అనుకూలంగా మార్చుకొని లబ్ది పొందాలని చూస్తారు. ఇక్కడ జరుగుతున్నది త్యాగరాజన్ కి జర్నలిస్టు లహరికి మధ్య పోరాటం. లహరి స్పృహలోకి రాకుండా నేను సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడ లేదు. కాబట్టి దయచేసి వివరాలు అడక్కండి’’ అన్నాడు నిర్మొహమాటంగా.

‘‘ఒకె అడగను. కాని మీ కోసం పోలీసులే కాదు చాలామంది గాలిస్తున్నారు తెలుసా?’’ అంది సియం చెందామరై.

‘‘తెలుసు మేడం. అందుకే మా జాగ్రత్తలో మేం వున్నాం.’’

‘‘ఒకె విరాట్ నీ అభిప్రాయాల్ని కాదనలేను. కాని చెప్పాగా సహస్ర మా పార్టీకి ముఖ్యుడయిన మహ దేవ నాయకర్ కూతురు. కాబట్టి మీకే సాయం కావాలన్నా నేనున్నానని మర్చిపోవద్దు. టేక్ కేర్ ఉంటాను.’’

‘‘మేడం..............ఒక్క విషయం.’’

‘‘చెప్పు విరాట్.’’

‘‘రాత్రి జరిగిన గొడవలో మా మనుషులు అయిదుగురు పోలీసులకు పట్టుబడ్డారు. వాళ్ళు అమాయకులు. వాళ్ళని విడిచి పెడ్తే చాలు మీ మేలు మర్చిపోలేం’’

‘‘‘ఒకె వాళ్ళ పేర్లు చెప్పు’’

పక్కన వున్న చందూ రాసిచ్చిన అయిదుగురి పేర్లు చదివి చెప్పాడు విరాట్. అందులో ముగ్గురు మునుసామి మనుషులు, ఇద్దరు కదిరేషన్ మనుషులు, సి యం తో మరి కాస్సేపు మాట్లాడిన తర్వాత అటు నుంచి లైన్ కట్ అయింది. విరాట్ తన సెల్ జేబులో వేసుకొని సహస్ర సెల్ స్విచ్ ఆఫ్ చేసి కవర్ లో ఉంచాడు.

ఇంతలో దీక్ష వచ్చి పిలవటంతో విరాట్ చందూలు భోజనానికి కిందకు వెళ్ళారు దీక్ష వెంట.

*************************************************

మధురైలో అల్లర్లు సాయంత్రం మూడు గంటలకి గాని అదుపులోకి రాలేదు. అల్లరి మూకల్ని రౌడీల్ని అదుపు చేయటంలో స్పెషల్ ఫోర్స్ తో బాటు నగర పోలీసులు చాలా శ్రమ పడవలసొచ్చింది. అక్కడ పోలీసులు మధురైని అదుపు లోకి తెచ్చిన అదే సమయానికక్కడ త్యాగరాజన్ ప్రయాణిస్తున్న కారు చెన్నై నగరంలో ప్రవేశించింది.

*************************************************

సాయంత్రం సరిగ్గా మూడు గంటలు కావస్తోందనగా సడెన్ గా స్పృహలోకి వస్తూ ఇటు నుంచి అటు కదిలింది సహస్ర కదిలిన కొద్ది సేపటికే ఆమె పూర్తిగా స్పృహలోకొస్తూ చిన్నగా కళ్ళు తెరిచింది కళ్ళు రెండూ మసకబారి కంటి ముందు ఏముందీ కన్పించలేదు. వెలుతురు చూడలేక పోతోంది తలంతా దిమ్ముగా  వుంది. భరించరాని శిరోవేదన అంతకు మించి ఒంట్లో కదల్లేనంతగా నీరసం ఏం జరిగింది? కొద్దిసేపు ఆమె మస్తిష్కం మొద్దు బారి పోయింది. తను ఎవరు ఎక్కడుంది? ఏ విషయం గుర్తు లేకుండా పోయింది. కాని తన పాదాల వద్ద ఎవరో వున్నారు. పాదాలు నొక్కుతూ అరికాళ్ళు మర్ధిస్తూ సేవలు చేస్తున్నారు. ఎవరయి ఉంటారు? తనకేమైంది? ఎందుకిలా బెడ్ మీద ఉంది? తలకి ఈ బాండేజ్ దేనికి? కళ్ళు మూసుకొని కొద్దిసేపు అలాగే ఉండిపోయింది. ఆమెకు తెలీయకుండానే కనుకొలకుల్లోంచి కన్నీరు ముత్యాల్లా జాలువారుతోంది. అతి ప్రయత్నం మీద....

క్రమంగా జరిగిన సంఘటనలన్నీ...

ఒక్కటొక్కటిగా గుర్తు రానారంభించాయి.

జియన్ చెట్టి రోడ్ లో గొడవ, సుకుమారి ఆన్టీని పంపించేసాక శిఖమణి వాడి మనుషులతో ఫైటింగ్ తనకు సాయంగా వాళ్ళంతా రావటం, విరాట్ శిఖమణిని అటాక్ చేయటం, పోలీసుల రంగ ప్రవేశంతో తాము తప్పించుకునే ముందు విరాట్ భుజానికి బలమైన గాయం, అంతా గుర్తొచ్చింది. చివరిగా వేన్ లోంచి కాల్పులు జరుపుతుండగా తను రాళ్ళు విసరటం గుర్తుంది. అంతలో తల మీద ఏదో పిడుగులా పడిరది. అంతే తర్వాత ఏంజరిగిందో తెలీదు. తను తెలివి తప్పి ఎంత సేపయిందో కూడ తెలీదు. విరాట్.........విరాట్ ఎలా వున్నాడు? విరాట్ గుర్తు రాగానే బలవంతంగా కళ్ళు తెరిచి చూసింది పది క్షణాల తర్వాత స్పష్టంగా చూడగలిగింది. 

పాదాల వద్ద నడి వయస్సు స్త్రీ ఒకామె కూచునుంది. తన రెండు పాదాలను ఒడిలో ఉంచుకొని సేవ చేస్తోంది. ముఖాన బొట్టు లేదు కాని చూడగానే నమస్కరించాలనిపించే శాంత గంభీర వదనం. ఆవిడ ఎవరు? తనకింత శ్రద్దగా ఎందుకు సేవలు చేస్తోంది ఏమీ అర్ధంకాలేదు. చట్టున పాదాలు వెనక్కు తీసుకుంది సహస్ర.

‘‘అమ్మా...............ఎవరు మీరు? నాకు మీరు సేవలు చేయటం ఏమిటి? అనడిగింది బలహీనంగా వుండి ఎక్కడో నూతిలోంచి వస్తున్నట్టుంది మాట. బహుశ ఆవిడ సేవలు చేయటం వల్ల తనకి స్పృహ ఏర్పడిన్దనిపించింది.

సహస్రకి స్పృహ రావటం చూసి...

ఆవిడ ఎంతో సంతోషిస్తూ లేచి...

తల దిళ్ళు సర్ది సహస్ర వెనక్కి వాలి కూచునేలా సాయం చేసింది.

‘‘నన్ను అమ్మా అన్నావ్ గా నేనూ నీ తల్లిలాంటి దాన్నే. నీకు స్పృహ రాలేదని అంతా కంగారు పడుతున్నారు. పిలుచుకొస్తానుండు’’ అంటూ సంతోషంతో పాబోతుంటే చేయి పట్టి ఆపింది సహస్ర.

‘‘కాస్సేపు నా పక్కన కూచోండి. వాళ్ళని పిలవచ్చులే.......విరాట్ ............. విరాట్ ఎలావున్నాడు?’’ అడిగింది.

‘‘నువ్వు చాలా బలహీనంగా వున్నావ్ తల్లీ. నిన్నెప్పుడు తిన్నావో ఏమిటో. ఇప్పుడు సాయంత్రం మూడు గంటలు. రాత్రి నుంచి నువ్వు స్పృహలోనే లేవు. ఏమన్నా తెస్తాను కనీసం కాఫీ........’’

‘‘అవన్నీ తర్వాత.........విరాట్ ఎలా వున్నాడు?’’

‘‘తను క్షేమంగానే వున్నాడు. అర్ధరాత్రి కంతా మిమ్మల్ని ఆస్పత్రికి చేర్చటం, మూడు గంటలకి ఆపరేషన్ చేయటం జరిగింది. విరాట్ ఉదయమే స్పృహ లోకి వచ్చాడు’’

‘‘మీరెవరు?..............నన్ను కాపాడిన్ది ఎవరు?’’

‘‘నా పేరు కాంచన మాల’’ చెప్పిందావిడ.

‘‘నాకు తెలిసింది చెప్తాను, రాత్రి నీ తల మీద పైన వేలాడుతున్న వూల కుండీ తెగి పడ్డంతో తల వెనక భాగంలో దెబ్బ తగిలి స్పృహ కోల్పోయావ్. నీ పరిస్థితి చూడగానే ఆవేశంలో వేన్ లో నలుగుర్ని విరాట్ షూట్ చేసి చంపేసాడు. నిన్ను భుజాన వేసుకుని ప్లే గ్రౌండ్ చివరి కొచ్చే లోన భుజం గాయం నుంచి ఎక్కువ రక్తం పోడంతో పక్కన చెత్త కుప్పలో ఎవరి కంటా పడకుండా నిన్నుపడుకోబెట్టి తను తెలివి తప్పే లోన విశాలకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ అర్ధరాత్రి చందూతో వెళ్ళి విరాట్ ని నిన్ను కార్లో తీసుకొచ్చి తన ఫ్రెండు డాక్టర్ గుణ దీపిక క్లినిక్ లో మీకు ఆపరేషన్ చేయించి గండం గడిచిందని డాక్టర్ చెప్పాక ఎవరికీ తెలీకుండా ఇక్కడికి చేర్చింది విశాల.’’

‘‘అంటే...........విశాల........’’

‘‘అది ఎవరో కాదమ్మా నా కూతురే. నాకంతా తెలుసు. నువ్వు నిశ్చింతగా ఉండి త్వరగా కోలుకుంటే మా అందరికీ అదే సంతోషం. బయట శత్రువులతో బాటు పోలీసులూ మీ కోసం వెదుకుతున్నారు. మీకు ఇంత కన్నా సేఫ్ ప్లేస్ ఉండదని విశాల మిమ్మల్నిక్కడ ఉంచింది. అంచేత నువ్వు ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దు, దీక్ష ఇక్కడే వుంది. చందూ ఇంటికెళ్ళొస్తానని వెళ్ళాడు. విరాట్ నిద్రపోతున్నాడు. నేవెళ్ళి వాళ్ళని పంపిస్తాను’’ అంటూ కాంచన మాల హడావుడిగా బయటి కెళ్ళిపోయింది.

తనకు స్పృహ రావటం చూసి ఆవిడ పడుతున్న సంతోషం చూస్తుంటే తన కూతురికి స్పృహ వచ్చినట్టే సంబర పడుతోంది. ఎంత మంచి మనసు. భుజం మీద చెయ్యేసి మాట్లాడినందుకే విశాల గురించి విరాట్ తో అంత గొడవ పడి తను విశాలను ద్వేషించింది. కాని విశాల? ఓ మైగాడ్ విరాట్ తనను ప్రేమించాడని తెలిసి కూడ ఏ మాత్రం పక్షపాతం చూపకుండా విరాట్ తో బాటు తననూ కాపాడిన్దంటే ఎంత మంచి మనసై ఉండాలి?
ఆలోచించే లోపలే...

సహస్రకు స్పృహ వచ్చిందని తెలిసి కింద నుంచి విశాల దీక్షలు ఇద్దరూ మేడ మీదకు పరుగులెత్తుకొచ్చారు ఈ సంఘటనికి రెండు గంటల సమయం వెనక్కి వెళ్తే...

*************************************************

మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత అంతా భోజనం చేసాక సుమారు ఒంటి గంట వరకూ విరాట్ వద్ద వున్నాడు చందూ. తర్వాత ఓసారి ఇంటి కెళ్ళి సాయంత్రం వస్తానంటూ తన బైక్ మీద వెళ్ళిపోయాడు. విరాట్ కాస్సేపటికి తన గదిలోకి వెళ్ళి నిద్ర పోయాడు. కాంచన మాల బయటి గార్డెన్ లో పని వాళ్ళ చేత ఏవో పనులు చేయిస్తోంది.

‘‘మమ్మీ గది చూపిస్తాను నాతో రా’’ అంటూ దీక్షను తల్లి కాంచన మాల పడగ్గదిలోకి తీసుకెళ్ళింది విశాల.

గది చాలా విశాలంగా అందంగా తీర్చి దిద్దబడి వుంది. ఆ గదినానుకొని ఈశాన్యంలో చిన్న పూజ గది వుంది. డబుల్ కాట్ బెడ్ వేసి ఉంది. ఎటు చూసినా ఖరీదైన ఫర్నీచర్ వీటన్నిటికన్నా గదిలో అడుగు పెట్టినప్పుడే ఒక పక్క గోడకు తిగిలించబడి వున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి దీక్షను ఆకర్షించింది.

ఈ రోజుల్లో ఇంకా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఎవరు తీస్తున్నారు. బహుశ ఏదో పాత ఫోటో అయి వుంటుంది అనుకుంది. ఆ ఫోటోలో ఒక నడి వయస్సు వ్యక్తి పక్కన వయసు లోని యువకుడు నిలబడి వున్నారు. యధాలాపంగా చూడ్డంలో ఆఫోటో గురించి పట్టించుకోలేదు దీక్ష.
ఇద్దరూ గదిలో కూచొని మాటల్లో పడ్డంలో కాంచన మాల మేడ మీదకు ఎప్పుడు వెళ్ళిందో గమనించలేదు. సుమారు అర్ధగంట గడిచాక తిరిగి ఆ ఫోటో మీదకు వెళ్ళింది దీక్ష దృష్టి. ఆ విషయం గమనించిన విశాల ఏమిటలా చూస్తావ్? ఆ ఫోటోలో వుంది మా తాత గారు, ఆయన కొడుకు అంటే మమ్మీకి అన్నగారు’’ అంది నవ్వుతూ విశాల.

‘‘అవునా......!’’ అంటూ లేచి దగ్గర కెళ్ళి పరీక్షగా చూసింది దీక్ష.

పెద్దాయన పక్కనున్న యువకుడ్ని.

ఎక్కడో చూసినట్టనిపిస్తోంది.

ఎవరు? ఎక్కడ?

ఎక్కడ అని ఆలోచించే లోపలే దీక్ష కళ్ళముందు వెంకట రత్నం నాయుడు గారు మెదిలాడు.

‘‘విశాల ............... ఈ ఫోటోతీసి ఎంత కాలమవుతుంది?’’ వెనక్కి వచ్చి కూచుంటూ అడిగింది దీక్ష. ఆమె మనసులో ఒక సందేహం పుట్ట గొడుగులా విచ్చుకుంటోంది.

‘‘అది ఎప్పుడో పూర్వం తీసిన ఫోటో. ఎందుకడుగుతున్నావ్?’’

‘‘ఉత్తినే తెలుసుకోవాలని. ఇంతకీ మీ తాతగారి పేరేమిటి? పక్కనుంది నీకు మావయ్య అవుతాడుగా ఆయన పేరేమిటి? వాళ్ళది ఏవూరు?’’ కుతూహలంగా అడిగింది.

పెదవి విరిచింది విశాల.

‘‘వాళ్ళది ఏ వూరో తెలీదు, వాళ్ళ పేర్లు తెలీదు,  మమ్మీ డాడీతో వచ్చేసేప్పుడు ఆ ఫోటో వెంట తెచ్చుకుందట కాని డాడీకి భయపడి ఎప్పుడూ బయటికి తీయలేదు. డాడీ పోయాకే ఈ ఫోటోనిక్కడ తగిలించింది. ఎన్నిసార్లడిగినా ఎప్పుడూ వీళ్ళ పేర్లుగాని వూరు గాని చెప్పలేదు. ఇద్దరిదీ ఒకే వూరు. అక్కడ బంధు వర్గం చాలా వుందని మాత్రం చెప్పింది అంతే,’’

దీక్షకి అర్ధమైపోయింది......

ఫోటోలోని యువకుడిలో విరాట్ తండ్రి వేంకట రత్నం నాయుడు గారి పోలికలు కన్పిస్తున్నాయి. అంతే కాదు అన్నా చెల్లెళ్ళు గాబట్టి కాంచన మాల ముఖంలో కూడ గమనిస్తే వెంకట రత్నం నాయుడి గారి పోలికలు కన్పిస్తున్నాయి. అప్పట్లో మదురౖౖెలో ఆయన తమ ఇంటికొచ్చి పోతూండటం చేత ఆయన తనకు బాగా తెలుసు.

అంటే విరాట్ కి విశాల స్వయాన మరదలు.... ఓ మైగాడ్...

కాని ఈ విషయం ఇటు విశాలగ్గాని అటు విరాట్ గ్గాని తెలీదు. తన అంచనా తప్పదు. ఫోటోలో వున్నది ఖచ్చితంగా వెంకట రత్నం నాయుడు గారే.

‘‘అవునూ విరాట్ ని ఇంత గాఢంగా ప్రేమిస్తున్నావ్ గదా అతడి వివరాలు ఏమన్నా తెలుసా లేదా?’’ అసలు విషయం బయట పెట్టకుండా అడిగింది దీక్ష.

‘‘వివరాలా?’’ అంటూ అందంగా నవ్వింది విశాల.

‘‘వివరాలు తెలిసి ప్రేమించలేదుగా. వాటితో నాకు పనేంటి? నేనడగలేదు, తనూ చెప్పలేదు’’ అంది.

‘‘అలాగా అయితే నువ్వు ఆశ్చర్య పోయే సంఘటనలు త్వరలోనే జరుగుతాయి.’’

‘‘అదెలా చెప్తావ్? ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఇవాళ గాకపోయినా రేపు తన వివరాలు ఎలాగూ తెలుస్తాయి గదా’’

‘‘అది సరి. కోయంబత్తూర్లో లక్ష్మీ క్లాత్ మిల్స్ గురించి విన్నావా? మీ గార్మెంట్ ఫ్యాక్టరీకి క్లాత్ మెటీరియల్ అక్కడ్నుంచి వస్తుందా?’’

‘‘వస్తుంది ఒక్క కోయంబత్తూరేమిటి? బాంబే సూరత్, అహ్మదాబాద్, కలకత్తా నుంచి కూడ మాకు మెటీరియల్ వస్తుంది. ఆర్డర్ పెట్టగానే వాళ్ళు పంపిస్తారు. నెల తర్వాత మిల్లు తరఫున ఏజంట్ వచ్చి బిల్లు కలక్ట్ చేసుకొని వెళ్తుంటాడు. అవునూ ఎందుకిదంతా అడిగావ్?’’

విశాలకు సందేహం రాకూడదు వస్తే అసలు విషయం చెప్పేవరకు వదలదు. అందుకని ఏదోచెప్పి తప్పించుకుంది దీక్ష. ఇప్పుడే ఈ విషయం బయట పెట్టడం ఆమెకిష్టం లేదు కాని తను బయట పెట్టే లోపలే తెలిసి పోయే క్షణాలు దగ్గరపడుతున్నాయని దీక్షకు తెలీదు.

విధి చాల బలీయమైందంటారు.

వీళ్లను చూస్తుంటే...

అది నిజమే అన్పిస్తుంది.

లేకపోతే మేనరికం వద్దనుకున్న విరాట్ కి వివరాలు తెలియకుండానే మరదలు విశాల దగ్గరవటం ఏమిటి..? ఈ విషయం తెలిస్తే సహస్ర ఎలా స్పందిస్తుందో చూడాలి.

దీక్ష ఆలోచనలు ఓ కొలిక్కి రాముందే కాంచన మాల హడావుడిగా లోనకొచ్చింది. సహస్రకు స్పృహ వచ్చిందని ఆవిడ చెప్పగానే ఆతృతగా విశాల దీక్షలు ఇద్దరూ మేడ మీదకు పరుగు తీసారు.

*************************************************

సహస్ర గదిలోకి అడుగు పెట్టగానే...

లేచి తల దిళ్లకు ఆనుకుని కూచున్న సహస్ర కన్పించింది.

ప్రాణ స్నేహితురాల్ని ఆ స్థితిలో చూడగానే దుఖ్ఖం ఆగలేదు. దీక్ష కళ్ళ వెంటా జల జలా కన్నీరు పొంగింది.

ఒక్క దూకులో బెడ్ వద్ద కెళ్ళి పక్కన కూచుంటూ సహస్రను కౌగిలించుకుని ఏడ్చేసింది దీక్ష.  విశాల కళ్ళలోనూ నీరు నిలవగా బెడ్ సమీపంలోకి వెళ్ళి నిలబడిన్ది. సహస్ర దీక్ష భుజం తడుతూ ఏడవకే ప్రాణాలతో వున్నాను సంతోషించు అంటూ ఓదార్చింది.

‘‘ఒంట్లో ఎలా ఉందిప్పుడు? నీకింకా స్పృహ రాలేదని మేమంతా ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? విశాలయితే మేడ పైకి కిందకి తిరుగుతూ మాట మాటకీ వచ్చిచూసి పోతూనే వుంది.’’ అంటూ లేచి కళ్ళు తుడుచుకుంది దీక్ష.

సహస్ర  విశాల వంక అభిమానంగా చూస్తూ...

దగ్గరకు రమ్మని సైగ చేసింది.

దగ్గర కెళ్ళి పక్కన కూచుంది విశాల.

‘‘ఒంట్లో ఎలా ఉందక్కా?’’ అంటూ అడిగింది.

‘‘ఫరవాలేదు.’’ అంది హీనస్వరంతో సహస్ర.

ఈ సస్పెన్స్ వచ్చేవారం దాకా....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
death mistery