Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
First part

ఈ సంచికలో >> సీరియల్స్

ఏడవ భాగం

Anubandhaalu Seventh part

"నిన్ను భార్యగా పొందడం నా అదృష్టం సత్యా!' అంటూ ఆమె చెంప మీద నుదుటి మీద ముద్దు పెట్టాడు.

"లేవండి భోంచేద్దాం" అంది.

"పిల్లలిద్దరూ ఎక్కడ? అప్పుడే నిద్రపోయారా?"

"ఇంకా రాలేదు"

"వ్వాట్?"

"ఇవాళ సెలవు రోజుగదా. ఎక్కడో పార్టీ వుందని మధ్యాహ్నం వెళ్ళినవాళ్ళు ఇంకా రాలేదు. ఇంతక్రితమే సెల్ కి ఫోన్ చేశాను. వచ్చేస్తున్నాం. ఆన్ ద వే అన్నాడు అనంత్" అంటూ విషయం చెప్పింది సత్యవతి.

"అన్నా చెల్లెలిద్దరూ కలిసే వెళ్ళారా? కొంచెం సీరియస్ గానే అడిగాడు.

"అవును. దానికి వీడు సపోర్ట్ కదా. ఈపాడు అలవాట్లు వద్దురా అంటే వినరు. పార్టీలకు వెళ్ళడం, తాగి రావడం అలవాటైపోయింది"

'వాడంటే మగాడు. కనీసం అమ్మాయి శివానికైనా ఇలాంటి అలవాట్లకు దూరంగా వుంచడం మంచింది. నువ్వు చెప్పొచ్చుగా?"

"అలవాట్లకు ఆడ, మగ తేడా ఏముంది? వాళ్లు నా మాట వినరు. మీరే చెప్పి చూడండి. ఇదే ఇండియాలో అయితే చెంప పగలగొట్టి బుద్ధి చెప్పేదాన్నిఖర్మ! ఇక్కడ ఆ ఛాన్సు లేదే! ఇక్కడి చట్టాలు పిల్లల హక్కుల్ని కాపాడ్డంలో ముందుంటాయి. ఇక్కడి చట్టప్రకారం పిల్లల్ని తిట్టినా, కొట్టినా, బెదిరించినా, భయపెట్టినా, ఆఖరికి మందలించినా కూడా నేరమే. ఏమన్నా అంటే మనమీదే రిపోర్టిచ్చేలా వున్నారు వీళ్ళు. ఏం చేయమంటారు" అంటూ అసహనంగా భార్య వివరిస్తుంటే ఆలోచిస్తూకాసేపు అలాగే కూర్చుండిపోయాడు డాక్టర్ గోపాల్.

ఇంతలో ఫోర్టికోలో కారు ఆగిన చప్పుడైంది. ఇరవై మూడేళ్ళ కొడుకు అనంతసాయి, ఇరవై ఒక్క సంవత్సరం వయసు కూతురు సాయిశివాని ఇద్దరూ ఒకరివెనుక ఒకరు లోనకొచ్చారు. పూర్తిగా లోకల్ యూత్ స్టయిల్లో, పిచ్చి పిచ్చి డ్రస్సుల్లో వున్నారిద్దరూ. పార్టీలో మందుతాగిన ఛాయలు ఇద్దరిలోనూ కన్పిస్తున్నాయి. వస్తూనే "హాయ్ డాడ్... హాయ్ మామ్..." అంటూ తల్లిదండ్రుల్ని విష్ చేశారు. వాళ్ళ తీరు చూసి అసంతృప్తితో ముఖముఖాలు చూసుకున్నారు భార్యాభర్తలిద్దరూ.

"రండి భోజనం చేద్దాం" అంటూ లేచింది సత్యవతి.

"సారీ మమ్మీ! పార్టీలో మేం భోంచేసి వస్తున్నాం. మాకోసం చూడొద్దు. గుడ్ నైట్" అంటూ తన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు అనంతసాయి. తనూ మమ్మీ, డాడీలకు గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది శివాని.

"ఏమిటి వీళ్ళు... నాకేమీ అర్ధంగావడం లేదు. వయసు వచ్చేకొద్దీ మారతారని ఆశించాను. కానీ తాము పూర్తిగా భారత సంతతికి చెందిన వాళ్ళమన్న స్పృహే వీళ్లకు లేనట్టుంది. పూర్తిగా అమెరికా సంస్కృతికి అలవాటు పడిపోతున్నారు. తాగి, అర్ధరాత్రి కొంపకొచ్చి గుడ్ నైట్ చెప్తున్నారు. ఏం చెప్పాలి ? వీళ్ళనిలా చూసిందంటే మా అమ్మ వీళ్ళనేమీ అనదు. నాకు తలంటు పోస్తుంది" అన్నాడు బాధపడుతూ.

"నా పెంపకంలో లోపముందంటారా?" అనుమానంగా అడిగింది సత్యవతి.

"అలాగని నేననను... పెంపకంలో లోపం కాదు. వాళ్లని మన ఆచార వ్యవహారాల పట్ల చైతన్యవంతుల్ని చేయడంలో విఫలమయ్యాం అనుకుంటున్నాను. ఇక్కడి నాగరికతతో బతుకుతూ మన నాగరికతను బతికించుకోవాలని మనం తాపత్రయపడ్డంలో అర్ధం ఉంది. కానీ ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్లకి అంత త్వరగా మన నాగరికత మీద స్పృహరాదు". ఇందులో నువ్వు, నేను కూడా కొన్ని పొరపాట్లు చేశాం. చిన్నప్పట్నుంచీ వాళ్లని మన పద్ధతుల్లో తీర్చిదిద్దటంలో నువ్వు ఫెయిలయ్యావ్. విపరీతంగా సంపాదిస్తూ, వాళ్లకి చేతినిండా డబ్బులిచ్చి నేను తప్పుచేశాను. నీకు తెలియందేముంది? ఇక్కడి పద్ధతుల్లోనూ క్రమశిక్షణకు సంబంధించి కొన్ని మంచి పద్ధతులున్నాయి. అధికశాతం తల్లితండ్రులు పిల్లల్ని ఇక్కడ పదో తరగతికే చదివిస్తారు. పై చదువులు చదవాలంటే పిల్లలు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఆ డబ్బులతో చదువులు చదువుకోవాలి. డబ్బుపట్ల అవగాహన, కష్టం ఏమిటో తెలుస్తుందని, పిల్లలు తమ కాళ్ళమీద తాము నిలబడగలమన్న ఆత్మవిశ్వాసం పెరగడం కోసం అలా చేస్తారు. అందరిలాగే నేనూ వీళ్ళను చదువుకోమంటే దారిలో కొచ్చేవారేమో... కానీ వాళ్ళని కష్టపెట్టడం ఇష్టంలేక నేనలా చేయలేదు. ఫలితం చూస్తున్నాంగదా. గాలి తిరుగుళ్ళు, దుబారా ఖర్చులకి అలవాటుపడిన యువత బాగుపడడం కష్టం. ఏదో ఒకటి చేసి వీళ్ళని దారిలోకి తేకపోతే ముందు ముందు చాలా ఇబ్బందిపడాలి" అంటూ భోజనానికి లేచాడాయన.

ఆయన చెప్పిన ఇబ్బందులేమిటో అవి సత్యవతికి తెలీనివికాదు. తన ఆడపడుచు భ్రమరాంబకి కొడుకు, కూతురు ఉన్నారు. చాలా చక్కగా ఉంటారు. బావామరదళ్ళయిన ఈ రెండు జంటలకీ పెళ్ళిళ్ళు చేయాలనేది తన అత్తగారు అన్నపూర్ణేశ్వరి చిరకాలవాంఛ. చెల్లెలంటే గోపాల్ కి ప్రాణం. అన్న రామలింగేశ్వరరావు గారంటే గౌరవం. అభిమానం. ముఖ్యంగా తనుగాని, ఆయనగానీ అన్నపూర్ణేశ్వరిని కాదని తమ బిడ్డలకు బయట సంబంధం చేయలేరు.

ఈ పరిస్థితుల్లో ఇక్కడి పద్ధతులకు తమ కొడుకు, కూతురు పూర్తిగా అలవాటుపడిపోయి రేపు ఆ సంబంధం చేసుకోమని ఎదురు తిరిగితే అయిన వాళ్ళలో విభేదాలొస్తాయి. బంధువుల్లో చెడ్డపేరు వస్తుంది. తమ పెంపకం సరిగా లేదనే అపవాదుగా భరించాలి. కాబట్టి ఈ సమస్యకు ఇప్పట్నుంచే పరిష్కారం ఆలోచించకపోతే ముందు ముందు చిక్కులు తప్పవు.

ఆ భవంతిలో ఎటు చూసినా రిచ్ నెస్ కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఖరీదైన ఫర్నీచర్, విలువైన సామానులు, సొగసైన అలంకరణ, సాటి డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కి అనువుగా థియేటర్, అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలతో కంప్యూటర్ కి అనుసంధానం చేయబడిన ఆటోమాటిక్ డోర్స్ సిస్టం. ఆ భవంతిని ఆనుకొనే వెనక స్విమ్మింగ్ పూల్, ఆ పక్కనే టెన్నిస్ కోర్ట్, ఇలా అనేకవిధాలుగా అద్భుతమైన మహారాజసౌధంలా వుందా భవంతి.

పొడవాటి డైనింగ్ టేబుల్ ముందు భోజనానికి కూర్చున్నాడు గోపాల్. ఆయనతోపాటు తనకూ వేడివేడి భోజనం, కూరలు వడ్డించుకుంది సత్యవతి. ఇద్దరూ భోజనానికి ఉపక్రమించారు. చాలాసేపటి తరువాత సత్యవతి ఆయనవంక చూసింది. అప్పటికి భోజనం పూర్తి కావచ్చింది. ఆమె ఏదో చెప్పడానికి సంశయిస్తోందని గ్రహించి చిన్నగా నవ్వాడు.

"ఏమిటి విషయం?" అడిగాడు.

"ఏం లేదు" అంది.

"ఏదో వుందని అర్ధమవుతోంది చెప్పు" అడిగాడు.

"భోంచేయండి చెప్తాను."

"నా భోజనం అయిపోయిందిగా."

"సాయంత్రం అత్తయ్య మాట్లాడారు"

"ఈజిట్?" నమ్మలేనట్టు చూసాడు.

"ఏమిటి సడన్ గా. వారం తిరక్కుండానే మళ్ళీ ఫోన్ చేసిందా?" నమ్మలేనట్టు అడిగాడు.

"అవును. అమెరికా వస్తానంటోంది. మీరు రాగానే ఒకసారి ఫోన్ చేయమని చెప్పమంది." అంది సత్యవతి ఉద్రిక్తతను అణుచుకుంటూ.

షాక్ తిన్నయిపోయాడు ఆమాట వినగానే... కాస్సేపు మౌనంగా ఉండిపోయాడు గోపాల్. తల్లి అమెరికా వస్తానని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో చాలా సార్లు ఆమెను అమెరికా తీసుకొచ్చి అంతా తిప్పి చూపించాలని ప్రయత్నించాడు. కానీ ఆ పల్లెటూళ్ళో బాధ్యతలన్నీ వదిలి రావడానికి ఆవిడ ఇష్టపడేది కాదు. అలాంటిది ఇప్పుడు తాను వస్తానందంటే ఇంతకన్నా ఆనందం ఏముంటుంది?
కానీ వున్న సమస్య అంతా తమ కొడుకు, కూతురుతోనే. వీళ్ల అలవాట్లు మారకుండా ఆవిడవచ్చి వీళ్లనిలా చూస్తే గుండాగిపోతుంది. ఏం చేయాలి?

"నీ ఉద్దేశం ఏమిటి?" భార్యను అడిగాడు.

"ఆవిడ వస్తే సంతోషమే కదా. ఆవిడ వున్నన్ని రోజులు పిల్లల్ని కంట్రోల్లో వుండేలా చూద్దాం. రేపు మీరు మాట్లాడండి. తర్వాత ఆలోచించొచ్చు. ఆవిడ రావాలంటే అన్నీ పూర్తి చేసుకొని బయలుదేరడానికి మూడు మాసాలు పడుతుంది" అంది.

"ఆ మాట నిజమే" అంటూ భోజనం ముగించి లేచాడు గోపాల్.


****    ****    ****

ఉదయం ఏడుగంటలు కావస్తోంది. అయినా డెట్రాయిట్ నగరం ఇంకా పలుచని పొగమంచు తెరలో ఆదమరచి గాడనిద్రపోతున్నట్టుంది. తూర్పుదిక్కున ఆకాశంలో ఉదయ భానుడు పెద్ద సైజులో బంగారు పళ్ళెంలా, పగలే వెన్నల కురిపిస్తున్న పున్నమి చంద్రుడిలా కనువిందు చేస్తున్నాడు. నగర వీధుల్లో ఇప్పుడిప్పుడే వాహనాల సందడి మొదలవుతోంది.

ప్రశాంతమైన ఉషోదయవేళ ప్రతినిత్యం జాగింగ్ చేయడం డాక్టర్ గోపాల్ కి అలవాటు. అలా జాగింగ్ మిత్రుల్లో ఇద్దరు తెలుగు మిత్రులు కూడా ఉన్నారు. ఒకాయన డాక్టర్ చౌదరి. గోపాల్ కన్నా వయసులో పదేళ్ళు పెద్ద.

ఇక రెండో వ్యక్తి గోపాల్ కన్నా పదేళ్ళు చిన్నవాడు. ఆయన పేరు జగన్మోహన్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్. చాలాకాలంగా ఇక్కడే వుంటున్నవాళ్లు. గ్రీన్ కార్డ్ హోల్డర్స్. జాగింగ్ ముగించుకొని తమ కార్లవద్దకు తిరిగి రాగానే కొద్దిసేపు విశ్రాంతిగా అక్కడే కూర్చుని బయలుదేరటం అలవాటు. ఎప్పటిలాగే వచ్చి శాఖోపశాఖలుగా విస్తరించిన చెట్టు మొదట్లోని తిన్నెమీద కూర్చున్నారు.

"డాక్టర్ గోపాల్! ఇవాళ మీరెందుకు మూడీగా ఉన్నారు? వాట్ హాపెండ్?" అంటూ మనసులోని మాట దాచుకోలేక అడిగేశాడు డాక్టర్ చౌదరి. ఆయన గుంటూరు జిల్లా నించి ఇక్కడకు వచ్చిన వ్యక్తి.

"దట్స్ రైట్. రోజూ మీరు మాట్లాడుతుంటే మేం వినేవాళ్ళం. ఇవాళ మేం మాట్లాడుతున్నా మీరు మౌనంగా ఉన్నారు. ఏమైంది డాక్టర్?" అంటూ చౌదరి మాటల్ని సమర్ధిస్తూ తనూ అడిగాడు జగన్మోహన్. ఇతను చిత్తూరు జిల్లాకు చెందినవాడు.

వారి మాటలకు పెద్దగా నిట్టూర్చాడు గోపాల్.

"ఏంలేదు. పిల్లల సమస్య" అన్నాడు.

"మీకేమండీ రత్నాల్లాంటి బిడ్డలు. అబ్బాయి, అమ్మాయి కూడా బిజినెస్ మేనేజ్ మెంట్ చదువుతున్నారు. సమస్య ఏముంది? అయినా చాలామంది డాక్టర్లు తమ పిల్లల్ని కూడా డాక్టర్లగానే చూడాలనుకుంటారు. కానీ మీరెందుకో ఈ విషయంలో మీ పిల్లల్ని రూటు తప్పించారు." అన్నాడు చౌదరి.

"నేను తప్పించలేదు. నా అభిప్రాయాన్ని బలవంతంగా వాళ్లమీద రుద్దటం ఇష్టంలేక చదువు విషయంలో వాళ్లకి ఇష్టమైన కోర్సులే తీసుకోమన్నాను. అంతే" చెప్పాడు గోపాల్.

"అలాంటప్పుడు ఇక సమస్య ఏముందండీ?" అడిగాడు జగన్మోహన్.

"ఎందుకు లేదు? ఉన్న వూరు, కన్నతల్లి, అయినవాళ్ళు, అందర్నీ వదులుకుని మనం ఎందుకొచ్చాం? ఒక్కసారి ఆలోచించండి. బాగా డబ్బు సంపాదించాలని, వృత్తిలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని.... ఇలా ఒక లక్ష్యం కోసం ఎక్కడో వేలమైళ్ళ దూరంలోని ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం. సంపాదించుకున్నాం. కానీ మనం మనలాగా జీవించడం లేదేమోనన్న అసంతృప్తి అప్పుడప్పుడూ మనసులో బాధపెడుతూంది."

"భలేవారండీ. మనం మనలాగే జీవిస్తున్నాం. ఎందుకు జీవించడం లేదు?" అంటూ పెద్దగా నవ్వేశాడు గోపాల్ మాటలు విన్న చౌదరి. జగన్మోహన్ కూడా నొసలు ముడివేసి చూసాడు.

"మీరెందుకిలా ఫీలవుతున్నారో అర్ధం కావడం లేదు గోపాల్ గారూ! మనం ఇక్కడ హేపీగా ఉన్నాం. తెలుగువాళ్ళుగానే జీవిస్తున్నాం. ఉగాది, దీపావళి మొదలైన పండగల్ని జరుపుకుంటున్నాం. మనకిక్కడ తెలుగు వాళ్లకి తానా అసోసియేషన్ వుంది. తానా సభలు అద్భుతంగా జరుగుతున్నాయి. అప్పుడప్పుడూ తెలుగువాళ్ళం ఏదో సందర్భంలో కలుసుకుంటూనే ఉన్నాం."

"సారీ జగన్మోహన్! మీరు మన గురించి మాట్లాడుతున్నారు. నేను పిల్లల గురించి మాట్లాడుతున్నాను. మనం పుట్టిపెరిగిన మాతృభూమిని వదిలి ఇక్కడికొచ్చిన వాళ్ళం గాబట్టి ఇండియా గురించి, తెలుగు నేల గురించి, మన వారసత్వ సంపదలయిన ఆచారాలు, కట్టుబాట్ల గురించి, మన తెలుగు సంస్కృతి గురించి మనకు బాగానే తెలుసు. ఇక్కడి అమెరికా నాగరికతలో మనం జీవిస్తున్నా మనం తెలుగు వాళ్ళం అనే స్పృహ మనకు ఎప్పుడూ వుంది... వుంటుంది.

ఏదోరోజు స్వదేశానికి వెళ్ళిపోయి మాతృభూమికి మనవంతు సేవ చేయాలనే ఆశకూడా ఇక్కడి వాళ్లలో చాలామందిలో వుంది. అలా తిరిగి వెళ్లి ఖరీదైన వైద్యాన్ని కూడా పేదలకు అందుబాటులోకి తెచ్చి ప్రజాసేవ చేస్తున్న విశాల హృదయులూ ఉన్నారు.

అయితే మన పిల్లల్లో మనం తెలుగువాళ్ళం అనే స్పృహ కలిగి ఎంతమంది వుంటున్నారంటే మనకు సమాధానం దొరకదు. బయటివారి సంగతి ఎందుకు? మా పిల్లల్నే చూడండి. తెలుగు భాషకు అక్షరాలు ఎన్ని అంటే వాళ్లకి సమాధానం తెలీదు. ఏదో కొద్దిపాటి చదవను రాయను వాళ్ళ అమ్మ నేర్పిందిగాబట్టి పట్టిపట్టి చదువుతారు. మనలా ఫ్రీగా తెలుగు మాట్లాడటం వాళ్లకిరాదు. ఇంగ్లీషు స్టయిల్లో తెలుగు మాట్లాడతారు. బరువు, బాధ్యతల గురించి తెలియదు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెడతారు. ఎప్పుడూ పార్టీలు, డ్యాన్సులు, బీరుతాగడం, లోకల్ కల్చర్ లో వాళ్ళు పూర్తిగా మునిగిపోతుంటే ఏం చేయాలో అర్ధంగావడం లేదు." అంటూ తన బాధ వివరించాడు గోపాల్.

"మీ బాధ నాకు అర్ధమవుతుంది డాక్టర్ గోపాల్. దీన్ని మీరు సమస్యగా ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగాడు డాక్టర్ చౌదరి. ఇది సమస్య కాదంటారా?"

కాదంటే కాదు, అవునంటే అవును. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్నింటిని వదులుకోక తప్పదు కదా. బాగా డబ్బు సంపాదించాలి. మనమూ, మన కుటుంబం సంతోషాలతో ఉండాలని ఇంత దూరం వచ్చాం. సంపాదిస్తున్నాం. పిల్లలు వాళ్లకు నచ్చిన విధంగా హ్యాపీగా ఉండనివ్వండి. ప్రాబ్లం ఏమిటి? మా పిల్లల విషయంలోనూ నేను మొదట్లో తల పెట్టుకొని ఆలోచించాను. తర్వాత రియలైజ్ అయ్యాను. మా ఆవిడకు చదువురాదు. నాకు తీరిక లేదు. మా పిల్లలకు తెలుగు చదవడం రాదు సరికదా... తెలుగు సరిగ్గా మాట్లాడటం కూడా రాదు. అదే ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మనీ ధారాళంగా మాట్లాడతారు. ఏం చేస్తాం? తెలుగు భోదించడానికి కూడా ఇక్కడ తెలుగు స్కూళ్ళు లేవుకదా. అయినా నీటిలో మునిగాక చలికి భయపడి లాభం ఏముంది చెప్పండి? ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు ఇక్కడ కల్చర్ కు అలవాటు పడకుండా ఎలా ఉంటారు? వాళ్ళను ప్రత్యేకించి మన తరహాలో పెంచడం సాధ్యంకాని పరిస్థితులున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడ్డం కోసం కొందరు తమ పిల్లల్ని ఆంధ్రాలోని బంధువుల వద్దే వుంచి చదివిస్తున్నారు. అంచేత మన సానుకూలతను బట్టి సర్దుకుపోవడం తప్ప మనం చేయగల్గింది ఏముంది? అంటూ తన అభిప్రాయాల్ని వివరించాడు డాక్టర్ చౌదరి.

మా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి ప్రస్తుతం నాకు పెద్ద సమస్యలేవీ లేవు. ఇక్కడి చదువులతోపాటు ఇంట్లో మేమే తెలుగు నేర్పుతున్నాం. కానీ వయసుకొచ్చాక కూడా వాళ్లనిక్కడి నాగరికతలో కలిసిపోకుండా మన సంస్కృతి, అలవాట్లపట్ల అవగాహన కల్పించి అదుపులో వుంచగలమా? అంటే చెప్పలేను. ప్రస్తుతం గోపాల్ సమస్య ఏమిటో నాకిప్పుడు అర్ధమవుతోంది. ఆలోచించాల్సిన విషయమే" అన్నాడు జగన్మోహన్.

( ...ఇంకా వుంది )

మరిన్ని సీరియల్స్
uttarapoddu