Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

మొదటి భాగం

First part

క్షణాల్లో మీ అలసట తీర్చే ఓ 'దివ్య ఔషధం' ఆమె.

తలెత్తి మీరు అలాఅలా అలోవోకగా పైకి చూస్తే ఆ ఆకాశం కాయితంపై నక్షత్రాల అక్షరాల్తో ఏ కవీ రాయలేని వెలుగుజిలుగుల మహాకావ్యం 'శృంగార నైషధం' ఆమె.

క్రీగంటి చూపుల్తో గ్రీటింగ్ లిస్తూ, పల్చటి ఎర్రటి పెదాల్తో 'ఐష్' చేస్తూ... మత్తుగా నవ్వుతూ మెస్మరైజ్ చేస్తూ... గమ్మత్తుగా కవ్విస్తూ రెచ్చగొడ్తూ, పిచ్చెక్కిస్తూ ఊరిస్తూ, ఉడికిస్తూ 'నడిబజారులో సౌందర్య జాతర' ఆమె.

ఎదురుగా కన్పించే ఎత్తయిన భవనం అంచున, ఫ్లై ఓవర్ల పక్కన, బస్ బేల నుదుట... అనాచ్చిదిత తన దేహాన్నే విల్లుగా సుందరంగా వంచి... ఆ వంపుసొంపుల్లో హంపీశిల్పాన్ని, రామప్ప రమనుల్ని రమణీయంగా, కమనీయంగా కళ్ళముందుకు తెచ్చే సొగసుగత్తె ఆమె.

లైట్లారిన థియేటర్లలో అంతలేసి కాటుక కళ్ళతో కాటేస్తూ... వీక్షకుల హృదయవేదికలపై 'కాట్ వాక్' చేసే కలలరాణి ఆమె.

చూసిన మరుక్షణమే మనీపర్సులా మనసు పారేసుకుని నిద్రలేనిరాత్రులెన్నొ గడిపే యువకులపాలిటి 'అందాల రాక్షసి' ఆమె.

ఓ అర్ధరాత్రి సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వస్తున్న సమయంలో ఒంటరితనం పోగొడ్తూ చెవుల్లో గుసగుసలు చెప్పే ఏకాంత సహచరి ఆమె.

చూసేవారికి చూడముచ్చటగా తన 'లో' అందాన్ని ఏ మోమాటం లేకుండా కనువిందు చేసే సహృదయశీలి ఆమె.

కొత్తగా పైటవేసే కుర్రదాని రోల్ మోడల్...

అపుడపుడే నూనుగు మీసాలొస్తున్న యువకుడి కన్రెప్పల్లో వాలిన కలలధూళి.

కలకాలం 'కలకలం' సృష్టించే రంగుల హోలీ.

అంతెందుకు?

ఏ అన్నమయ్య రాయని శృంగార కీర్తన ఆమె.

ఏ ప్రవరాఖ్యుడూ విరచించలేని వెండితెర వరూధని...

హార్ట్ బీట్ తో హాయిరాగాలు పలికించే మధుర రసధుని.

ఆమె వెండితెర కావ్యనాయిక.

ఏ కొండల్లోనో చిన్నబిందువుగా పుట్టి వాగులూ, వంకలై కోనలూ అడవులు దాటి అఖండ జలరాశిగా మారిన మహానదిలా... ఆమె ఓ మహానటి. గలగలపారే నదికి భౌగోళిక హద్దులు, భాషాభేదాలు లేనట్టే ఆమెకీ అన్ని ప్రాంతాలూ తనవే.

సిటీలో ఎక్కడ చూసినా ఆమె నిలువెత్తు కటౌట్లే.

ఏ దిక్కున చూసినా వయారాల కనికట్లే.

ఆమె స్వరుల్నీ సంతృప్తిపరిచే సమ్మోహనాస్త్రం.

వెండితెర దృశ్యాల్లో ఆవిష్కృతమయ్యే అభినవ కామశాస్త్రం.

సెవన్టీ ఎంఎం స్క్రీన్ పై వెల్లువెత్తిన వెన్నెల సంతకం.

నులివెచ్చని ఊహల్లో రెచ్చిపోయే పచ్చల పతకం.

ఆమె చరిత్ర సుదీర్ధం... అమోఘం... అత్యద్భుతం. ఆ చంద్రతారార్కం.

తొలిసారి 'కేలండర్ ఫోటో' ఫోజులిచ్చి తారలకు గ్లామర్ ఇమేజ్ తీసుకొచ్చిన ఒకనాటి కాంచనమాల మొదలుకుని కళ్ళతోనే శతకోటి భావాలు పలికించే మహా నటి సావిత్రిని దాటుకుంటూ వంపుసొంపు వయారాల్తో అలరించే ఇలియానా, కాజల్ అగర్వాల్, తమన్నాల మీదుగా భవిష్యత్ తరాల్లోనూ తళుక్కున మెరిసే ఆమె - అక్షరాలా ఓ అభినేత్రి.

ఎపుడూ ఆమె నామవాచకం ఏదైనా -
ఇపుడు మాత్రం ఆమె గాయత్రీ పాటిల్...
ఓ రొమాంటిక్ హల్చల్.
కథలోకి వెళ్తే -

ప్రారంభం:
"ఎన్నాళ్ళబట్టో మిమ్మల్ని చూడాలనుకుంటున్నా... విపరీతమైన పనివత్తిడి వల్ల కుదరలేదు. ఇప్పటికి దొరికిన ఈ కాస్త తీరికని సద్వినియోగపరుచుకుంటూ మిమ్మల్ని కలవాలని నిర్ణయించుకున్నా. ఇంతకాలం మనమధ్య అనివార్యంగా ఏర్పడిన ఎడబాటుని దూరం చేస్తూ సరదాగా మనం కలిసి కాఫీ తాగుదాం. ఇవాళ్టి సాయంసంధ్య కలకాలం గుర్తుండేలా కమ్మని కబుర్లు చెప్పుకుందాం. మీరు వస్తే నా భవిష్యత్ ప్రణాళిక వివరంగా తెలియజేస్తా. తప్పక వస్తారు కదూ! మనం కలవాల్సిన స్థలం: గోల్కొండ హోటల్. సమయం: సాయంత్రం ఆరుగంటలు. ఇట్లు... కుమారి గాయత్రీపాటిల్"

'ఇది నిజంగా ప్రేమలేఖే అయితే ఎంత బాగుణ్ణు?' చదివిన వెంటనే సుదర్శన్ లో కలిగిన స్పందన అది. మనసుకి నచ్చిన ప్రియుడికి ఓ ప్రేయసి రాసిన ప్రేమలేఖలా ఎంత తీయగా ఉంది? భరించరాని విరహవేదన కారణంగా తననితాను గాయపరచుకున్న తర్వాత రక్తంతో రాసినట్లు ఎర్రగా ఉన్నాయి ఆ అక్షరాలు.

అలాటి ఆ ఆహ్వానం అందుకున్న తర్వాత ఎంతటి ప్రవరాఖ్యుడైనా ఓ క్షణం వెర్రెత్తిపోవాల్సిందే. మరి, సుదర్శన్ ప్రవరాఖ్యుడు కాదు. అందుకే... ఆ లేఖ చదివి వివశుడయ్యాడు. తర్వాత పదేపదే కవర్ మీద తన పేరుని తడిమి చూసుకున్నాడు. ఆ ఆహ్వానం ఇన్నాళ్ళ తన బ్రహ్మచర్యాన్ని సవాల్ చేసినట్లనిపించింది. సుదర్శన్ మనసు ఒక్కసారి విపశమైంది. మొహంలోకి రక్తం పొంగుకొచ్చింది. చెవుల్లో వేడిసెగలు.

'గాయత్రీ పాటిల్' ఆమె పేరుని మెత్తగా స్మరించుకున్నాడు.

ఆ పేరుకి ముందు 'కుమారి' అన్న పదం ఇంకా ఇంకా అతడికి నచ్చింది.

"ఈ లెటర్ అందుకున్న తర్వాత ఏం చేయాలి? ఖచ్చితంగా ఆ పిలుపుకి స్పందించాల్సిందే. ఇవాళ సాయంత్రం గోల్కొండ హోటల్ కి వెళ్లి తీరాల్సిందే. అంతేకాదు... ఆమె సూచనమేరకు తమ అపురూప కలయిక పదికాలాలపాటు పదిలంగా ఉండేందుకు వీలుగా... వెళ్తూ వెళ్తూ కెమెరా కూడా తీసుకెళ్ళాలి' నిర్ణయించుకున్నాడు.

గాయత్రీపాటిల్ - పేరుని బట్టీ ఇక్కడి శాల్తీ కాదు. ఉత్తరాదినుంచి రెక్కలు కట్టుకుని వాలినట్లుంది. ఆమె మొహం ఒక్కసారి కూడా చూడలేదు. ఎలా ఉంటుంది? చూడచక్కగా చందమామలా... సప్తవర్ణాల ఇంద్రధనువులా... సన్నజాజిలా... సంపెంగలా ఉంటుందా?

ఎలా ఉంటుంది?

సుదర్శన్ కళ్ళముందు తెలుగు తెర తారలంతా ఒక్కసారిగా కదిలారు. వాళ్ళందరిలో కాల్ షీట్లతో క్షణం తీరికలేకుండా యమబిజీగా ఉన్న కాజల్... తమన్నా... ఇలియానా... సమంత... ముందువరుసలో ఉన్నారు. అంతేనా... నిన్నమొన్నటిదాకా తెలుగు ఇండస్ట్రీని తన కనుసన్నల్లో శాసించిన అందాలరాణి అనుష్క కూడా అలవోకగా అతడికి 'హలో' చెప్పింది. ఇన్నేసి అందాల్లో గాయత్రీ పాటిల్ ఏ అందానికి సరిపాటి? ఎవరిలా ఉంటుంది? అదే సందేహం అతడిని పదేపదే సతాయిస్తోంది.

'ఊహూ... వాళ్ళలా అస్సలు ఉండదు. అలా అంటే ఆమె గాయత్రీ పాటిల్ కానే కాదు. ఖచ్చితంగా ఆమె కొత్తగా ఉంటుంది. అపుడే విచ్చుకున్న ముద్దమందారంలా ముగ్దమనోహరంగా ఉండి తీరుతుంది' అలా అనుకున్న తర్వాతే సుదర్శన్ కి తృప్తి కలిగింది. ఇక, అప్పట్నుంచీ, చేస్తున్న ఏ పనిమీదా మనసు లగ్నం కాలేదు. ఎపుడెపుడు సాయంత్రం అవుతుందా... ఎపుడెపుడు ఆమెని కలుస్తానా అనే ఆత్రుతతో నలిగిపోతున్నాడు సుదర్శన్... 'నవతార' సినీ పత్రిక జర్నలిస్ట్.

ఆ సాయంత్రం - గోల్కొండ హోటల్ కాన్ఫరెన్స్ హాల్ సందడిసందడిగా ఉంది. ప్రోగ్రామ్ కవర్ చేసేందుకు వచ్చిన ప్రతి జర్నలిస్ట్ ఒకర్నొకరు పలకరించుకుంటూ నవ్వుకుంటున్నారు.

"లైఫ్ లో లవర్ నే ఎరుగను... ఇక, లవ్ లెటర్ నాకు రావడమొకటి. ఇవాళ ఈ లెటర్ అందుకున్నాక  నాకూ లవర్ ఉంటే బాగుండనిపించింది" అన్నాడో జర్నలిస్ట్.

"ఔనౌను... నాదీ సేమ్ ఫీలింగ్. 'రారమ్మ' ని ఎంత క్యూట్ గా గాయత్రి వెల్ కమ్ చెప్పింది" అన్నాడింకొకడు.

"ఏం సుదర్శన్... నీ సంగతి చెప్పవేం?" అడిగాడు మనోహర్.

"ఒక్క క్షణం ఒళ్ళు ఝల్లుమంది. సెల్ ఫోన్స్, ఇంటర్ నెట్ యుగంలో మనం మరచిపోతున్న ప్రేమలేఖ. అక్షరాల్లో హృదయాన్ని అవిష్కరించిన ఆర్ద్రత... ఆ లేఖ అందుకుంటుంటే ఎంత బాగుందో?" అన్నాడు సుదర్శన్.

"ఆ అమ్మడు చూడు... ఇలా ఇండస్ట్రీలో కాలు పెట్టిందో లేదో... ఇవాలొక్కరోజే ఎంతమందికి ప్రేమలేఖ రాసిందో కదా!" అన్నాడొకడు..

"ఔనౌను. సినీ హీరోయిన్ అంటే మహాజనానికి మరదలిపిల్ల. కెమెరాకి ఒక్క లుక్కిస్తే చాలు... కోట్ల హృదయాలు ఖుదేలవుతాయి" అన్నాడు. మనోహర్.

సుదర్శన్ మాట్లాడలేదు. గాయత్రీపాటిల్ ఇంతమందికి ఇలా లవ్ లెటర్ రాయడం అతడికి అసూయగా ఉంది. అర్ధం చేసుకుంటే నిజానికది లవ్ లెటర్ కానేకాదు. 'తెరం'గ్రేటం చేస్తున్న ఓ హీరోయిన్ తొలిసారి నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ పిలుపు.

"ఇంతకీ పిల్ల అదుర్సా" అడిగాడు మనోహర్.

"ఎవరైనా చూస్తే కదా... అదుర్సో, బెదుర్సో చెప్పడానికి" అన్నాడు సుదర్శన్.

"విజేతా ప్రొడక్షన్ తీరే అంత. ప్రతిదానికీ ఓ కాన్సెప్ట్ డిజైన్ చేస్తారు. ఇదిగో... ఈ ప్రెస్ మీట్ కి హీరోయిన్ లవ్ లెటర్లా. సిన్మా మొదలెట్టి మూడునెలలైనా గాయత్రీపాటిల్ మొహం మన జర్నలిస్టులకే చూపించలేదు. అమ్మడిని సీక్రెట్ గా ఉంచి ప్రాజెక్ట్ కి గొప్ప హైప్ క్రియేట్ చేసారు" అన్నాడు మనోహర్.

"ఔనౌను..." అన్నాడు సుదర్శన్.

ఆ హాల్ లో నలువైపులా గాయత్రీపాటిల్ కి వెల్ కమ్ చెప్తూ అందమైన బ్యానర్లు వేలాడుతున్నాయి.

"సినీవినీలాకాశానికి కొత్తతారక"

"వెండితెర వైభవ కాంతిధార నవ్యసితార"

"నడిచొచ్చే నక్షత్రానికి స్వాగతం... సుస్వాగతం"

"గాయత్రీపాటిల్... ఇక, తెలుగు తెర నీదే"

ఇలాటివే ఇంకా ఎన్నో బ్యానర్లు చూపరులకు కనువిందు చేస్తున్నాయి.

"చూసావా...సిన్మా కంప్లీటై రిలీజింగ్ డేట్ ఎనౌన్స్ అయినా ఇంకా, హీరోయిన్ ని కనీసం ఆ బ్యానర్లలో కూడా చూపించలేదు"
"మరే... హీరోయిన్ ఎలా ఉంటుందో ముందే తెలిస్తే ఇంత క్యూరియాసిటీ ఉండేదా...?" ఒక జర్నలిస్ట్ మరో జర్నలిస్ట్ తో అంటున్నాడు.

ఇంతలో వేదిక దగ్గరకు ఆ సిన్మా పిఆర్ఓ మన్మధరావు వచ్చాడు.

"జర్నలిస్ట్ మిత్రులందరికీ స్వాగతం. ఇవాల్టి ఈవెంట్ ఏంటో మీ అందరికీ తెలుసు. మా సినిమా హీరోయిన్ కుమారి గాయత్రీపాటిల్ మిమ్మల్నందరినీ ఫస్ట్ టైం కలుస్తోంది. అంతకుముందుగా... ఈ సిన్మా నిర్మాత మాతంగరావు. దర్శకుడు సుందరమూర్తిగారిని వేదిక ఆలంకరించాల్సిందిగా కోరుతున్నా" ఆహ్వానించాడతను.

మాతంగరావు వేదిక ఎక్కి పిఆర్ఓ మన్మధరావు చేతుల్లోంచి మైకు తీసుకుని - "ఈ ప్రెస్ మీట్ కి విచ్చేసిన జర్నలిస్ట్ లందరికీ స్వాగతం. ముందుగా ఒక మాట. ఈ సిన్మా చాలా బాగా వచ్చింది. ఎంత బాగా వచ్చిందంటే... ఈ సిన్మా చూసిన తర్వాత ప్రతిఒక్కరూ మరోసారి ప్రేమలో పడ్తారు. అన్నట్లు... ఈ సిన్మా హీరోయిన్ గాయత్రీపాటిల్ ని మీ అందరికీ చూడాలనుంది కదూ" అడిగాడతను.

"ఔను... చూడాలనుంది" జర్నలిస్టుల గుంపులోంచి ఒకరిద్దరు అరిచారు.

"ఇదే... ఈ ఉత్కంట కోసమే మా హీరోయిన్ ని ఇంతవరకూ చూపించలేదు. ఇండస్ట్రీతో సన్నిహిత సంబంధమున్న మీకే హీరోయిన్ ని చూడాలనే ఇంట్రస్ట్ ఇంత ఉంటే... ఇక, ఆడియన్స్ గురించి వేరే చెప్పాలా? మీ హీరోయిన్ ని ఎపుడు చూపిస్తారంటూ ప్రతి రోజూ మేం అందుకుంటున్న ఫోన్ కాల్స్ కి లెక్కే లేదు. ఆమెని చూడాలనుకుంటున్న ఫాన్స్ ఆరాటాలకి అవధులే లేవు..." చెప్తున్నాడతడు.

"మా క్రియేటివ్ డైరెక్టర్ సుందరమూర్తి ఎంతో ఇష్టంగా రాసుకున్న ఈ ప్రేమకథ ఇది. ఇందులో నాయిక కోసం ఇండియా మొత్తం గాలించాం. పేపర్లో ప్రకటించాం. చానెల్స్ లో టాలెంట్ షోలు నిర్వహించాం. వీటన్నిటిలోనూ చాలామంది పార్టిసిపేట్ చేసారు కానీ... మాకు మాత్రం హీరోయిన్ దొరకలేదు. వయసులో ఉన్న ఎవరో ఒకర్ని పెట్టి సినిమా లాగించేయడానికి... ఇది అల్లాటప్పా కథ కాదు. ఓ అప్సరస కథ. అలాటి అప్సరస కోసం విసుగూ విరామం లేకుండా వెతుకుతూనే ఉన్నాం. ఈలోపున మా ప్రొడక్షన్ నుంచి రెండు సినిమాలు రిలీజై సక్సెస్ సాధించాయి" చెప్తున్నాడు మాతంగరావు.

జర్నలిస్టుల్లో అసహనం పెరుగుతోంది. మూడునెలల క్రితం సినిమా మొదలైన దగ్గర్నుంచీ హీరోయిన్ ని అజ్ఞాతంలో ఉంచి మరీ షూటింగ్ చేసారు. అడపాదడపా కవరేజ్ కోసం మీడియా ఆఫీసులకి ప్రెస్ నోట్ లు పంపించేవాళ్లు. ఉత్సాహం కొద్దీ జర్నలిస్టులు హీరోయిన్ కోసం ఆరా తీసినా... ఆ 'ఒక్కటి' తప్ప అన్ని వివరాలందించేవాళ్ళు.

"మీ హీరోయిన్ కి అంత ఘోషా అయితే... రేపు తెరమీద ఏం చూపిస్తుంది?" నిర్మాతతో చనువున్న ఒకరిద్దరు జర్నలిస్ట్ లు నవ్వుతూ చురకలంటించేవాళ్ళు.

"రేపు మీరే చూస్తారుగా... ఎంతమంది కంటిమీద కునుకు లేకుండా చేస్తుందో?" అనేవాడు మాతంగరావు.

అదే సస్పెన్స్ ని ఇపుడు కూడా కొనసాగిస్తూ - "మా సినిమా ప్రారంభమైన మూడునెలలుగా గాయత్రీపాటిల్ పేరు మీకు సుపరిచితం. ఫిల్మ్ జర్నలిస్ట్ లుగా మా మూవీ అప్ డేట్స్ ఇస్తున్న సందర్భాల్లో ఈ పేరుని మీరు చాలాసార్లు జనంలోకి తీసుకెళ్ళారు. ఇంకా తీసుకెల్తూనే ఉన్నారు. అయినా... ఆమెని ఇప్పటివరకూ మీరు చూడలేదు. కాదు... కాదు... ఆమెని మేమే మీకు చూపించలేదు. ఆమె నటిస్తున్న సన్నివేశాల చిత్రీకరణ సమయంలో జర్నలిస్ట్ లైన మిమ్మల్ని కూడా అనుమతించలేదు. కారణం... మేం ఇంట్రడ్యూస్ చేస్తున్న ఈ కొత్త తార ఎలా ఉంటుందో... అనే సస్పెన్స్ సర్వత్రా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆమెని ఇంతకాలం తెరమరుగున ఉంచాం. ఇపుడామె తెరముందుకు... మీ ముందుకు వచ్చేస్తోంది..." అన్నాడు మాతంగరావు.

అంతలో ఆ హాలంతా పరిమళాలు వెదజల్లుతూ తుఫానులా అక్కడికి వచ్చింది గాయత్రీపాటిల్.

( ...ఇంకా వుంది )

మరిన్ని సీరియల్స్
Anubandhaalu Seventh part