Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Maa Avida

ఈ సంచికలో >> కథలు >> బాబోయ్ బస్సు

Baboi Bassu story

"రైట్, రైట్" కండక్టర్ అరవడంతో బస్సు బయల్దేరింది.

బస్సంతా జనంతో నిండి ఖాళీ పాలిథీన్ సంచులు కూరిన జనపనార బస్తాలా వుంది.

రక రకాల వాసనలు కలగాపులమై ఓ విచిత్రవాసన బస్సంతా నిండివుంది. ఓ పక్క బయట ఎండ, లోపల ఇసకేస్తేరాలకపోవడం కాదు... గాలి వీచే అవకాశం లేక ప్రాణాలన్నీ విలవిల్లాడిపోతున్నాయి. అందులో... నుంచుని వున్న నాలాంటి ప్రయాణీకులు ఆక్సిజన్ అందక గిలగిల్లాడి పక్కకి వాలిపోయే పరిస్థితి ఇంకొద్ది సేపట్లో దాపురించే లోపల బస్సు కదలటంతో శరీరంలో ఓ చిన్న భాగానికి కాస్త గాలి సోకి శరీరాని కంతటికీ ఆహ్లాదాన్ని పాకించింది.

బస్సు నింపాదిగా వెలుతోంది. "టికెట్... టికెట్" కండక్టర్ అరుపులు దూరంగా వినిపిస్తున్నాయి. సీట్లో కూర్చున్న వాళ్ళు అందునా కిటికీ పక్కన కూర్చున్న వాళ్ళు సుడిగల వాళ్ళు. చచ్చాక యమలోకానికి వెళ్ళాక బహుశా వాళ్ళు నరకానికి మేము స్వర్గానికీ వెళతామేమో! ఎందుకంటే అంతకన్నా ఘోరమైన నరకం ఇక్కడ అనుభవించేశాము కదా! ఇలాంటి పరిస్థితుల్లో కూడా తమాషాలు ఊహించుకుని నవ్వుకోవడం బహుశా నాకే సాధ్యం అనుకుంటా. బయట వెలుతురున్నా లోపలికి ప్రసరించడంలేదు... మసక మసకగా వుంది. కాళ్ళు తిమ్మిరెక్కుతున్నాయి. కాస్త జరిపాను. అంతే "ఏంది సారూ అక్కడ టమేటాల గంప వుంది... దాని మీద కాలేస్తే అవి సితికి పోయి మాకు వారం రోజులు కూడుండదు. జరా సూసుకో." నా పక్కనున్న ముఖం నా ముఖం మీద వాలి బీడి కంపు చేస్తూ రిక్వెస్టూ కమాండింగూ కలిపిన వాయిస్తో దమాయించింది. నా కాలు యధాస్థానానికి తెచ్చే ప్రయత్నంలో ఓడిపోయాను కారణం అక్కడెవరిదో మరో కాలుంది. చేసేదేంలేక అలాగే ఒంటి కాలుమీద కొంగ జపం మొదలెట్టాను.

బస్సు చాలా పాతదనుకుంటా రణగొణధ్వనిలా వుంది. "టికెట్... టికెట్" అరుపు కాస్త దగ్గరకి వచ్చింది. ఒక చెయ్యి నా ముఖం ముందు కొచ్చింది. టికెట్ తీయడానికి నేను అతికష్టం మీద చేయి ప్యాంటు జేబుమీద పెట్టి హతాశుడనయ్యాను. నా పర్సు లేదు. గుండె చల్లబడిపోయింది. దాన్ని చేతితో సంరక్షించుకొవాల్సింది. పొరబాటుచేశాను. "ఏంటి సారూ.. చేతులు నా ప్యాంటు లో పెడుతున్నారు నేను చాలా జాగ్రత్తగా ఉంటా నా పర్సులు ఎవరూ కొట్టలేరు" అని నవ్వాడు నాకు కొద్దిదూరంలో వున్న వ్యక్తి. నేను అతని ప్యాంటుజేబులో చేయి పెట్టానా? మరైతే నాది? అతి కష్టం మీద నన్ను నేను గిల్లుకుంటూ చేతిని జేబుస్థానానికి పంపి పర్స్ చూసుకున్నాను వుంది. హమ్మయ్య! అదృష్టవంతుడ్ని పర్స్ పోతే ఇంకేమైనా ఉందా డబ్బులన్నీ అందులోనే వున్నాయి. తిరుమల శ్రీనివాసుడు నా యందు వున్నాడు. దాన్ని జాగ్రత్తగా పైకి తెచ్చి యాభై నోటు తీసి ఆచేతిలో పెట్టాను. ఒక నిమిషం ఆ చెయ్యి అదృశ్యమయ్యి మళ్ళీ ప్రత్యక్షమైంది టికెట్ తో కాని చిల్లరలేకుండా. కనీసం టికెటన్నా దక్కినందుకు కాస్త ఉపశమనంతో దాన్ని అందుకుని జేబులో భద్రపరచుకున్నాను.

బస్సు ఏదో స్టాపులో ఆగింది.

నేను ఇంకా రెండు స్టాపుల తర్వాత దిగాలి. బస్సులోంచి ఎవరూ దిగలేదు కానీ కొంతమంది ఎక్కినట్టుగా అనిపించింది... ఇంకాస్త ఇరుకయ్యేసరికి. నేను దిగి సోడా తాగి కాస్త గాలి పీల్చుకోవాలనుకున్నాను. కాని కదలడానికి స్థలం లేనప్పుడు ఇంకా ముందుకెళ్లడమెలాగ? పదిహేను నిమిషాల తర్వాత నాకు శోషవచ్చి పడిపోయేంతలో బస్సు బయల్దేరింది. మళ్ళీ ఓ సన్నగాలి శరీర భాగాల్లో ఎక్కడో తాకి జీవం పోసింది.

నాకు బస్సు ప్రయాణాలంటే ఫోబియా. అందులో శుభముహూర్తాలున్న ఇటువంటి రోజుల్లో ప్రయాణమంటే అది నరకసదృశ్యమే! మేగ్జిమం నేను అవాయిడ్ చేస్తాను. కాని అప్పుడప్పుడు ఆఫీసు పనిమీద ఇన్స్పెక్షన్లకి అర్జెంటుగా వెళ్ళవలసి వస్తుంది. అదీ ఒక గంట కోసం. అప్పటికప్పుడు రైల్లుండవు... ఒకటీ ఆరా వున్నా ప్రయాణం భయానకం. అందుకే తప్పనిసరై బస్సెక్కుతా. ఇలా తిప్పలు పడతా. నాకింకా లగేజ్ లేదు కాబట్టి సరిపోయింది అది వున్న వాళ్ళ పరిస్థితి ఏమిటో? బస్సు వేగంగా టర్న్ అయింది. అందరం ఒకరిమీద ఒకరం పడిపోయాం. "డ్రైవరన్నా జెర జూసే..." ఎవరో గట్టిగా అరిచాడు. మగాళ్ళమైన మాకే ఇలా వుంటే ఇంక ఆడవాళ్ళ పరిస్థితి ఎలా వుంటుందో? పాపం! ఏవేవో దుర్గంధ వాయువులు బస్సంతా ఆక్రమించాయి. అవి స్తంభించిన గాలికి తోడై కదలిక లేక మేము ముక్కుమూసుకునే అవకాశం లేక గిలగిల్లాడిపోయాం.

భగవంతుడా ఏమిటీ బాధ? స్వాతంత్ర్యం వచ్చి ఇంతకాలమైనా మన రవాణా వ్యవస్థ ఇంత అధ్వాన్నంగా ఉందేమిటి?. ప్రయాణీకులకి రోజూ నరకమేనా? దీనికి ప్రత్యామ్నాయం లేదా? బస్సు మరో స్టాపులో ఆగింది. ఏ దేముడి వరమో ఓ పదిమంది దాగారు. మా బస్సుకున్న కిటికీలు కనిపించాయి. బట్టలు తడిసిముద్దై ఒంటికి అతుక్కుపోయి వాసనేస్తున్నాయి. బస్సు బయల్దేరింది. కొద్ది దూరం వెళ్లి ఆగిపోయింది. మాకెందుకో అర్ధం కాలేదు. చెకింగ్ స్క్వాడ్ గబగబా ఎక్కి టిక్కెట్లు చెక్ చేస్తున్నాడు. నేను నా టికెట్ జేబు లోంచి జాగ్రత్తగా బయటికి తీశాను. దగరకొచ్చిన ఇన్స్పెక్టర్ కిచ్చాను. ఆయన దాన్ని పరీక్షించి అది డూప్లికేట్ అన్నాడు. నా పై ప్రాణాలు పైనే పోయాయి. కంప్లైంట్ రాసి ఫైన్ వేశాడు. టికెట్టు లేకుండా ప్రయాణించడం నా వ్యక్తిత్వ విలువలకి విరుద్ధం. నేను చేయని తప్పుకి శిక్ష అనుభవించాను. నేనూ నాలాంటి వాళ్ళం అయిదుగురమున్నాం. మేము జరిగింది ముక్త కంటంతో చెప్పాము. చివరికి ఆయన "మీరందరూ చదువుకున్న వారు... మోసపోయామని చెప్పడానికి సిగ్గేయడం లేదూ" అని ముక్తాయింపునిచ్చి నవ్వుతూ మిగతా వాళ్ళతో కలసి దిగిపోయాడు. బస్సు బయల్దేరింది.

ఇప్పుడు గాలి బాగానే వీస్తోంది కాని మనసు ఆహ్లాదించలేకపోతోంది. బస్సు మరో స్టాపులో ఆగింది. నేను కాస్త దిగి సోడా తాగి బస్సెక్కాను. మళ్ళీ బస్సునిండిపోయింది. టికెట్టు కొనుక్కుని అదీ ఫైను కట్టి నుంచుని వుండడం అవమానమనిపిస్తోంది. కాని ఏంచేయను? మళ్ళీ గాలి స్తంభించింది. బస్సు బయల్దేరింది. ఈసారి వెంట్రుకంత గాలి కూడా ఏ శరీరభాగానికీ తగలడంలేదు. ఒకరికొకరం అతుక్కుని ఎంతసేపున్నామో తెలియదు. నా స్టాపు వచ్చిందని ఎవరో అదృష్టవశాత్తూ అరిచాడు... నాకు ఆశ్చర్యం కలిగింది. మరో స్టాపు నాకు తెలియకుండా ఎలా దాటేశానా అని. నేను అందర్నీ విదిలించుకుంటూ ముందుకు దూసుకు పోయాను. నన్ను అక్కడున్న వాళ్ళందరూ తోస్తూ డోర్ లోంచి బయట పడేశారు.

కాసేపు అలాగే వుండి నా అంగాంగాలని స్వాధీనంలోకి తెచ్చుకుని నెమ్మదిగా లేచి నన్ను నేను చూసుకుని కెవ్వుమని కేకేశాను... కారణం నా బట్టలు, నేను సింగరేణి కాలరీస్ లో పనిచేసి వస్తున్నట్టువున్నాయి. అక్కడక్కడ చిరిగిపోయాయి కూడా. నేను ఇన్స్పెక్టర్ ని అంటే నమ్ముతారా? గౌరవిస్తారా? పర్స్ చూసుకున్నాను. అది వుంది. తీసి చూసుకున్నాను. గుండె రాజధాని ఎక్స్ప్రెస్ లా స్పీడ్ గా కొట్టుకుంది. పర్స్ వుంది కాని అందులో డబ్బు నా ఐడెంటిటీ కార్డు లేదు. అసలు దొంగతనం అలా ఎలా చేశాడో? నాకు పిచ్చెక్కి పోతోంది. ఇహ ఇన్స్ పెక్షన్ అయ్యేపనికాదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. వెనక్కి వెళ్ళడమే బెటర్. డబ్బులేదు కాబట్టి హాయిగా నడుచుకుంటూ వెళతా. అదే నయం. అనుకుని ఇంటిదారి పట్టాను.

(పండగల సీజన్లో బస్సు ప్రయాణం చేసిన వారి జీవితం ఎంత దుర్భరమో అనుభవించి... ఓ ట్వంటీఫై పర్సెంట్ కల్పించి రాసినది ఈ విషాద హాస్యకథ)

మరిన్ని కథలు
aritaaku