Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
death mistery

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగినకథ: త్యాగరాజన్, మహదేవనాయకర్ పై తనకు చాలా గౌరవమని, లహరి జర్నలిస్ట్ కాబట్టి తన వృత్తి ధర్మాన్ని తాను నిర్వర్తించిందని వివరణ ఇస్తాడు.   త్యాగరాజన్ ఇంటర్వ్యూ   వింటున్న సహస్ర కోపం పట్టలేక చేతికి దొరికిన పేపర్ వెయిట్ని టివి మీదకు విసిరి కొట్టబోతుంది. సమయానికి విరాట్ పట్టుకొని ఆపుతాడు. సహస్ర ఆవేశం చూసి చట్టున లేచి టివి ఆఫ్ చేస్తుంది విశాల. ఆ తరువాత...  

 

నేను కొంతకాలం ఇక్కడే ఉంటాను. వేరే ఏర్పాటు కూడా చేసాను. హర్యానా నుంచి రివాల్వర్ షూటింగ్ లో సిద్దహస్తులయిన ఆరుగురు షూటర్స్ ని పిలిపిస్తున్నాను. ఈలోపల కొందరు లోకల్ క్రిమినల్స్ ని కలుపుకొని స్వయంగా లహరి కోసం గాలించి నివాసం ఎక్కడో తెలుసుకో. వాళ్ళు రాగానే పని ముగించటం తేలిక. అర్ధమైందిగా?’’ వివరించాడు త్యాగరాజన్.

అర్ధమైనట్టు తల వూపాడు ఎట్టయప్పన్.

‘‘ఒక్క విషయం గుర్తు పెట్టుకో. పొరబాటున కూడ ఆ పిల్లతో హ్యాండు టు హ్యాండ్ ఫైటింగ్ కి పోవద్దు. శిఖామణితో ఎలా పోరాడిందో టివిలో చూసావ్ గదా? గప్ చుప్ గా షూట్ చేయటం ఒక్కటే దీనికి పరిష్కారం’’ తిరిగి తనే హెచ్చరించాడు త్యాగరాజన్.

‘‘లహరికి తోడుగా ఒక యువకుడున్నాడు. టివిలో చూసాం. అతడి విషయం ఏమిటి? వాడి జోలికి పోవద్దంటారా?’’ సందేహం తెలియబుచ్చాడు ఎట్టయప్ప.

‘‘వద్దు. మన టార్గెట్ లహరి అంత. రేపు ఉదయం మరింత వివరంగా చర్చిద్దాం. వెళ్ళి భోంచేసి రెస్ట్ తీసుకోండి వెళ్ళండి’’ అన్నాడు త్యాగరాజన్.

తేలిక పడ్డ మనుసుతో తన మనుషుల్ని తీసుకొని కిందకు వెళ్ళి పోయాడు.

అదే రాత్రి ఆమూల ఓల్డ్ మాంబళం విశాల యింట్లో మరో సంఘటన చోటు చేసుకుంది.

******************************************

అర్ధరాత్రి కావస్తోంది సమయం...

ఇల్లంతా ప్రశాంతంగా వుంది.

ఎవరి గదుల్లో వారు నిద్రపోతున్నారు.

కాని తన గదిలో విశాల మాత్రం నిద్ర పట్టక బెడ్ మీద అటు యిటు దొర్లుతోంది. తనువు మనసు ఎంత నచ్చచెప్పినా వినుకోమంటున్నాయి. విరహాన్ని మించిన తీపి బాధ మరోటి లేదంటారు. ఎందుకో ఇప్పుడర్ధమవుతోంది.

కావ్య నాయికల్లో విరహోత్కంఠిత అనే నాయిక వుంది. ఇపుడు ఆలోచిస్తే తనకీ ఆ నాయికకూ తేడా లేదనిపిస్తోంది. పక్క గదిలో బావ దగ్గరకు వెళ్ళమని మనసు లాగేస్తోంది.

తనెవరో తెలీనప్పుడే గాఢంగా ప్రేమించింది. సొంత బావని తెలిసాక ఆ ప్రేమ రెట్టింపయింది. బావ చాలా గడుసు వాడు. లేకపోతే కార్లో వెళ్ళేప్పుడు రాత్రిళ్ళు తన అవస్థ గురించి అంత స్పష్టంగా ఎలా చెప్పగలిగాడు? నిజంగానే తను డోర్ లాక్ చేసుకుని పడుకుంటున్నాడా?ప్రేమికులకు చూపులు, మాటలు, స్పర్శ, కౌగిలి, ముద్దులు ఇవన్నీ విరహాన్ని శాంతింపజేసే చర్యలే, తను అవే కోరుకుంటోంది. అంతే గాని పెళ్ళికి ముందే పరువాన్ని ఆరబోసి విందారగించాలనే తొందరే కాదు. అయినా తనకేనా ? బావకి మాత్రం విరహముండదా? అక్క సహస్రకి ఉండదా? తనింకా కోలుకోలేదు గాబట్టి ఈ ఫీలింగ్స్ ఏవీ అక్కని బాధించవు. బాధంతా తనకే.అయినా ఇన్ని ఆలోచనలెందుకు? నిజంగా తలుపు లాక్ చేసుకుంటున్నాడో లేదో ఓసారి పోయి చెక్ చేస్తే పోలా? తన ఆలోచనకి తనే నవ్వుకుంది.ఏయ్ కోతి....... వాడు లాక్ చేసుకోలేదనుకో ఏం చేస్తావ్ లోనకెళ్ళి పోతావా’ కొంటెగా వెక్కిరించింది మనసు. వెళ్తే తప్పేంటి? వాడు నా బావే కదా ? అని మనుసును తనే వెక్కిరిస్తూ బెడ్ దిగింది విశాల.జుత్తు లాగి జారు ముడి వేసుకుంది. నైటీ సరిచేసుకుంది. అద్దం ముందుకెళ్ళి ఓసారి తన రూపాన్ని తనే చూసుకుంటూ బయలుదేరింది. బయటి వరండాలో అడుగు పెట్టింది. ఎందుకైనా మంచిది ఎవరూ చూడకుండా వుంటారని వరండాలో లైటు కూడ ఆఫ్ చేసింది.

పక్కన సహస్ర గది ముందుకొచ్చి ఓరగా తొంగి చూసింది. లోన బెడ్ మీద గాఢ నిద్రలో ఉంది సహస్ర. బెడ్ లైటు డిమ్ గా వెలుగుతోంది.ఆ గది దాటి విరాట్ గది ముందుకెళ్ళింది.డోర్ మీద చేయి వేయగానే చప్పుడు గాకుండా తెరుచుకుంది. లోన బెడ్ లైట్ కాంతిలో విరాట్ కూడ గాఢనిద్రలో వున్నాడు. గుమ్మానికి జేరబడి కాస్సేపు అలాగే చూస్తూ నిలబడింది. అతన్ని చూసే కొద్ది శ్వాస వేడెక్కుతోంది. ఛాతీ బరువైనట్టుంది. మనసు ఆగనంటోంది.బావా..........నేనిక్కడ విరహంతో కాలిపోతుంటే నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావా ఆగు నీ పని చెప్తా డోర్ లాక్ చేసుకుంటున్నానంటూ బడాయి కబుర్లు వేరేనా.... చెప్తా అనుకుంటూ గదిలోకి అడుగు పెట్టింది.

సరిగ్గా అదే సమయంలో

వరండా చివర చిన్నగా ఏదో అలికిడి విశాల చాలా చలాకీ అమ్మాయి. వుషారుగా ఉంటుంది. దేన్ని అశ్రద్ధ చేయదు. ఆ చప్పుడేమిటీ అనుకుంటూ గిరుక్కున తిరిగి వరండా చివర బాల్కనీ వైపు చీకట్లోకి దృష్టి సారించింది. అంతే...ఆమె గుండె ఝల్లుమంది.నీడ లాంటి ఆకారం ఏదో వాటర్ పైపు వెంట పైకెక్కి బాల్కనీలోకి దిగుతోంది.ఎవడు వాడు? దొంగా........... ఇంతవరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. భయాన్ని కంగారును అణుచుకొంటూ ఒక్క దూకులో గదిలోకెళ్ళి తలుపు దగ్గరగా మూసింది. బెడ్ వద్దకెళ్ళి.బావా........బావా......... అంటూ చిన్నగా పిలిచింది.

విరాట్ కదల్లేదు.దాంతో కోపంగా భుజంమీద తట్టింది.తృళ్ళిపడి లేచాడు విరాట్.విశాలను చూసి కంగారు పడుతూ ఏదో అడగబోతుంటే ‘‘ష్’’ అంటూ నోటి మీద వేలు అడ్డంగా ఉంచి సైగ చేసింది.‘‘దొంగ బావా........ దొంగ’’ .............. అంది.‘‘ఏయ్ నేను దొంగనేమిటే...........అర్ధరాత్రి అంకమ్మ శివాలని ఏంటి నీగోల?’’ అన్నాడు విసుగ్గా.‘‘అయ్యో మొద్దు మనింట్లోకి దొంగ వచ్చాడు. వరండా చివర బాల్కనీలో ఉండగా చూసా....’’ అంది.దొంగ అనగానే విరాట్ నిద్ర మత్తు...మంత్రం వేసినట్టు మాయమైంది.వాడు నిజంగా దొంగాడా లేక సహస్ర కోసం వచ్చిన శతృ మనిషా......... ఆలోచించే టైం లేదు. వెంటనే బెడ్ దిగి సీలింగ్ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసాడు. విశాల చేయి పుచ్చుకొని వేగంగా తలుపు వెనక్కి లాక్కుపోయాడు. వచ్చిన అవకాశాన్ని వదలకుండా విరాట్ ని వాటేసుకొని చప్పుడు రాకుండా ముద్దులు పెట్టింది విశాల.ఇదే టైంలో నెమ్మదిగా డోర్ తెరుచుకుంది. ఎవరో లోనకు తొంగి చూసారు. వాడులోనకొస్తే అటాక్ చేయటానికి సిద్దంగా వున్నాడు విరాట్. కాని అవతలి వ్యక్తి గదిలోఎవరూ లేరని నిర్ధారించుకుంటూ తిరిగి తలుపు దగ్గరగా మూసాడు.

తలుపు వెనకే వున్న విరాట్ విశాలను అక్కడే ఉండమని సైగచేసి డోర్ కొద్దిగా తెరిచి చిమ్మచీకటిగా వున్న వరండాలోకి తొంగి చూసాడు. నీడలా కదులుతున్న ఆ ఆకారం పక్కన సహస్ర గది డోర్ కూడ నెట్టి లోనకు తొంగి చూసింది. బెడ్ లైట్ కాంతి పడి వాడు తలకు ధరించిన మంకీ క్యాప్ తెలుస్తోంది వాడి చేతిలో పదంగుళాల పొడవున తళతళ మెరుస్తోంది డాగర్. దాన్ని చూడగానే ఉలిక్కి పడ్డాడు విరాట్. సందేహం తీరిపోయింది. వచ్చిన వాడు శతృ మనిషి. ఎవడు వాడు ఎలా వచ్చాడు? ఆలోచించే టైం లేదు. వాడు పిల్లిలా సహస్ర గదిలోకి పోతున్నాడు.ఇక ఆలస్యం చేయలేదు విరాట్. క్షణం ఆలస్యమైన అది సహస్ర ప్రాణాన్ని బలి తీసుకోవచ్చు. సమయానికి విశాల పసిగట్టి లేపింది. లేకపోతే ఘోరం జరిగి పోయేది.వేగంగా బయటికి కదిలాడు విరాట్. చప్పుడు గాకుండా తనూ అనుసరించింది విశాల. విరాట్ సహస్ర గదిలో ప్రవేశించే సరికి అగంతకుడు బెడ్ పక్కన చేతిలో డాగర్ పైకి లేస్తోంది. క్షణం ఆలస్యమైతే అది సహస్ర గుండెల్లో పిడివరకు దిగబడి పోయేది. వెను తిరిగాడు అగంతకుడు. తిరిగీ తిరక్క ముందే విరాట్ కుడి చేతి పిడికిలి వాడి మెడనరాన్ని దారుణంగా తాకింది. ఏం జరిగిందో కూడ వాడికి అర్ధం కాలేదు. నిలుచున్న వాడి చేతిలో డాగర్ జారి కింద పడి ఖంగున శబ్ధం చేసింది. ఆ శబ్దానికి సహస్ర ఉలిక్కి పడి లేచి కూచుంది.

క్షణ కాలం ఏం జరుగుతుందో సహస్రకి అర్ధం కాలేదు. కింద పడున్న అగంతకుడ్ని ఇంకా చూడలేదామె. ఎదురుగా విరాట్ ఆ వెనకే విశాల యిద్దర్ని చూస్తూ ‘‘ఏంజరిగింది?’’ అనడిగింది. ఏం జరిగిందా! క్షణం ఆలస్యమైతే నీ ప్రాణాలు పోయుండేవి. కట్ల పామొకటి నీ గదిలో ప్రవేశించింది. దీని సంగతి చూద్దాం అంటూ వెళ్ళి లైటు స్విచ్ ఆన్ చేసాడు.

గది నిండుగా ట్యూబ్ లైట్ కాంతి పరుచుకుంది.

అప్పుడు గమనించింది సహస్ర అగంతకుడ్ని.బెడ్ దిగింది. క్షణంలో విషయం అర్ధమైందామెకు. విశాల పక్కకొచ్చి నిలబడింది. ఎంత ప్రమాదం తప్పిందో వూహించుకుంటేనే గుండె దడ పుట్టింది.

విరాట్ తెలివి తప్పిన అగంతకుడ్ని లాగి కుర్చీలో కూచొ బెట్టి చేతులు కుర్చీ వెనక్కి కట్టేసాడు. వాడి ముఖాని కున్న మంకీ క్యాప్ తొలగించాడు. పాతిక సంవత్సరాల యువకుడు. వాడ్ని ఎప్పుడూ చూసిన గుర్తు లేదు. జేబులు వెతగ్గా ఒక రివాల్వర్ సెల్ ఫోన్ మనీ పర్సు దొరికాయి. వివరాలు తెలిపే ఆధారాలేవీ దొరకలేదు. సెల్ ఫోన్ మనీపర్స్ వాడి జేబులోనే వుంచి రివాల్వర్ని తన వద్ద ఉంచుకున్నాడు. ముఖాన చల్లటి నీళ్ళు కొట్టగానే స్పృహ వచ్చింది వాడికి. భయం భయంగా విరాట్ ని సహస్రని విశాలని మార్చి మార్చి పిచ్చి చూపులు చూసాడు.ఓ కూర్చీ దగ్గరకు లాక్కుని...

వాడికి ఎదురుగా కూచున్నాడు విరాట్.

‘‘చెప్పరా నీ పేరేమిటి?’’ అడిగాడు.

వాడికి నోరు పెగల్లేదు.

గొంతులో ఏదో అడ్డం పడ్డట్టుంది.

వచ్చిన పని పూర్తవుతోందన్న ఆనందంలో వెనక నుంచి ముంచుకొచ్చిన ప్రమాదాన్ని గమనించలేదు. దొరికిపోయాడు. కర్తవ్యం బోధ పడక కొట్టుమిట్టాడుతున్నాడు వాడు.

‘‘నిజం చెప్పకపోతే ఇక్కడే నిన్ను చంపి తీసుకెళ్ళి కూనం నదిలో పడేస్తాను’’ హెచ్చరించాడు విరాట్.

‘‘వద్దు సార్ చంపొద్దు నిజం చెప్పేస్తాను’’ ఎలాగో నోరు పెకల్చి బదులిచ్చాడు వాడు.

‘‘చెప్పు ఎక్కడ్నుంచి వచ్చావ్? ఎవరు పంపించారు?’’

‘‘నేను ధనగిరి మనిషిని సార్. మీ చేతుల్లో చచ్చిన వాళ్ళు చావగా మిగిలిన ముగ్గుర్లో నేనొక్కడ్ని.’’

‘‘ఇప్పుడు ఎంత మంది వచ్చారిక్కడికి? కింద ఎంత మంది వున్నారు?’’

‘‘ఎవరూ లేరు. ఒక్కడ్నే వచ్చాను.’’

‘‘మిగిలిన వాళ్ళకు కూడ ఈ అడ్రసు తెలుసా?’’

‘‘లేదు. ఎవరికీ తెలీదు. నాకు మాత్రమే తెలుసు.’’

‘‘నీకు మాత్రం ఎలా తెలిసింది? మేం ఇక్కడున్న విషయం చాల రహస్యంగా ఉంచాం. ఎవరు చెప్పారు నీకు?’’

‘‘చందూ.... మీ ఫ్రెండు చందూ మూలంగా తెలిసింది.’’

వాడా మాటన్న మరుక్షణం విరాట్ కొట్టిన చెంప దెబ్బకి వాడి చెంప పేలిపోయినట్టయింది. కెవ్వుమన్నాడు.

‘‘మా మధ్య కలతలు రేపాలని చూస్తే ఇప్పుడే నిన్ను చంపేస్తాను. రాస్కెల్ నిజం చెప్పు’’ గద్దించాడు.

‘‘లేదు లేదు మీరు నా మాటల్ని తప్పుగా అర్ధం చేసుకున్నారు. నా ఉద్దేశం అది కాదు’’ అన్నాడు ఏడుపు ముఖంతో అగంతకుడు.

‘‘ఇంకేమిటి? చందూ ఎలా తెలుసు నీకు?’’

‘‘చెప్తాను. మేం చెన్నై వచ్చి లహరి కోసం గాలిస్తుండగా చందూ మీరు ఒకే బైక్ మీద తిరగటం చాలా సార్లు చూసాను. మామూలుగా అయితే మీరు గుర్తుండే వారు కాదు. నాకు బైక్ లంటే ఇష్టం. మీది ఫారెన్ బైక్. అలాంటిది మరో బైక్ ని నేను చూళ్ళేదు. అందుకే ఆ బైక్ మీద తిరుగుతున్న మీ యిద్దరు గుర్తుండి పోయారు.

ఆ రోజు శిఖామణి వర్గంతో జరిగిన పోరులో మీరు ఉండటం టివిలో చూసాక గుర్తు పట్టాను. చందూ మీ ఫ్రెండు గాబట్టి చందూని పట్టుకుంటే లహరి ఆచూకీ దొరుకుతుందనుకున్నాను. మూడు రోజుల క్రితం చందూని గుర్తించాను అతని బైక్ ని ఫాలో చేసి గోస్వామి కాలనీకి వెళ్ళాను. అక్కడే ఇరుగు పొరుగు వల్ల తెలిసింది మీ పేరు విరాట్ అని మీ ఫ్రెండు పేరు చందూ అని మీరు అక్కడ ఉండటం లేదనీ తెలిసింది. తర్వాత చందూ బైక్ ని ఫాలో చేస్తూ ఈ ఇంటి వరకు వచ్చాను. చందూ మేడపైకి రావటం వీధిలోంచి గమనించి గాయ పడిన మీరిద్దరూ ఎవరికీ తెలీకుండా పై అంతస్థులో ఉంటున్నారని వూహించాను.

వచ్చిన పని పూర్తి గాక, తన మనుషుల్ని కోల్పోయి ధనగిరి చాలా బాధలో వున్నాడు. ఏభై వేలు రెడీగా ఉంచు. ఈ రాత్రికే లహరిని చంపి వస్తానంటూ సవాల్ విసిరి బయలుదేరాను. నా బేడ్ టైం దొరికి పోయాను’’ అన్నాడు బాధగా వాడు. వాడు అబద్ధం చెప్పటం లేదని ముగ్గురికీ అర్ధమైంది. విరాట్ సీరియస్ గా చూసాడు.

‘‘నువ్వు చాలా తెలివైన వాడివిరా. అందుకే ఇంత దూరం వచ్చేసావ్. నిన్ను మెచ్చుకోవాలి. చెప్పింది చేస్తావా? అనడిగాడు.

‘‘ఏం చేయాలి?’’

‘‘ధనగిరిని చంపేయాలి’’

‘‘నేనా!’’

‘‘అవును నువ్వే. నిన్నక్కడికి తీసుకెళ్తాను. ఏదో వంకతో వాడ్ని కిందకు పిలిచి పొడిచి చంపెయి. నేను కార్ లో ఉంటాను. నీకు బోలెడు డబ్బులిస్తాను. వాడ్నిచంపి హేపీగా ఇష్టమైన చోటుకి వెళ్ళిపో. కాని మోసం చేయాలని చూస్తే అక్కడే చంపేస్తాను. నీ రివాల్వర్ నా దగ్గరుంది. అది నిన్ను గమనిస్తూనే ఉంటుంది.’’

విరాట్ ఆఫర్ విని.

కాస్సేపు తటపటాయించాడు వాడు.

ముందు నుయ్యి వెనక గొయ్యిలా వుంది పరిస్థితి. ఇంత కాలం పోషించిన ధనగిరి తనకు గురువు లాంటి వాడు. చంపటానికి మనసంగీకరించటం లేదు. కాదంటే విరాట్ చంపేస్తాడు. అవునంటే బతికిపోవచ్చు. అయినా తామంతా క్రిమినల్స్ తమకు నీతేమిటి జాలేమిటి చంపటం తమ వృత్తి. పైగా బోలెడు డబ్బు వస్తుంది. అంతే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే బతికిపోవచ్చు ఆలోచిస్తున్నాడు.‘‘నీ పేరేమిట్రా?’’ అడిగాడు విరాట్

‘‘ఇళంగో’’........చెప్పాడు.

‘‘ఏంటి?’’

‘‘నన్ను ఇళంగో అంటారు సార్’’

‘‘చూడు ఇళంగో ఉన్న పళంగా పార్టీ మర్చేయాలంటే కొంచెం కష్టమే. కాని నువ్వు బ్రతకాలంటే లహరిని చంపాలని కంకణం కట్టుకున్న ధనగిరి చావాలి. చంపుతావా చస్తావా? త్వరగా తేల్చుకో’’ హెచ్చరించాడు.‘‘చంపుతాను సార్ ధనగిరిని చంపేస్తాను’’ చివరికి అంగీకరించాడు.‘‘ఇళంగో’’‘‘వెరీ గుడ్ అయితే ఇప్పుడే బయలుదేరుతున్నాం. మీరు దిగిన లాడ్జి ఎక్కడుంది?’’‘‘పరశువాక్కం మెయిన్ రోడ్ లో సర్. పోస్టాఫీస్ కు సమీపంలో చంద్రా లాడ్జి.’’

‘‘వెరీ గుడ్’’ అంటూ ఇళంగో నోటికి టేప్ అంటించాడు విరాట్. దారిలో అరిచి గోలచేసి తప్పించుకునే ప్రయత్నం చేయకుండా ముందు జాగ్రత్త చర్య అది.

తన గది లోకి వెళ్ళి ప్యాంటు షర్టు ధరించి వచ్చాడు. రివాల్వర్ జేబులో వేసుకున్నాడు. విశాలను కారు తీయమని చెప్పి ఇళంగోను తీసుకుని బయలుదేరాడు.

మరో సారి తన ప్రాణాన్ని కాపాడిన విరాట్ కి థాంక్స్ చెప్తూ దుఖ్ఖం ఆపుకోలేక కౌగిలించుకొని ఏడ్చేసింది సహస్ర. ఆమె వెన్నుతట్టి ఓదార్చాడు.‘‘నువ్వు చెప్పిన థాంక్స్ నిజానికి విశాలకి చెందాలి. సమయానికి గమనించి వచ్చి నన్ను లేపటం వల్లనే నిన్ను కాపాడుకోగలిగాను.’’ అన్నాడు విరాట్.ఆ మాటతో సహస్రకి విశాలమీద మరింత అభిమానం ఏర్పడింది. ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని కృతజ్ఞతగా చూసింది ‘‘నీ రుణం తీర్చుకోలేనిది విశాల. ఇంత నిస్వార్దంగా నన్ను రక్షిస్తున్నావే.....నీ స్థానంలో ఎవరున్నా వదిలేస్తారు తనకి లైన్ క్లియరవుతుందని. కాని ........నువ్వు........ నాకో చెల్లెలున్నా నా గురించి ఇంత శ్రద్ద తీసుకొనేది కాదేమో.....’’ అంటుంటే ‘‘వద్దక్కా మనలో మనకి పొగడ్తలు వద్దు. నాకు స్వార్ధం లేదు. నువ్వు విరాట్ నేను అందరం క్షేమంగా ఉండాలి. అదే నా ఆశ’’ అంటూ సహస్ర కన్నీరు తుడిచింది.‘‘ఒకె టైం ఒంటి గంట కావస్తోంది. బయలుదేరటం మంచిది. సహస్ర ఎందుకైనా మంచిది డోర్ లాక్ చేసుకుని పడుకో. ఓ గంటలోపే తిరిగి వచ్చేస్తాం’’ అంటూ ఇళంగోను తీసుకొని బయలుదేరాడు విరాట్.

విశాల తన గదిలోకెళ్ళి కారు తాళాలు టార్చిలైటు తెచ్చింది. అదృష్టం ఏమంటే కింద ఎవరూ నిద్ర లేవకపోటం. లైట్లు ఆన్ చేయకుండానే టార్ట్ లైటు సాయంతో ఇంట్లోంచి బయటికొచ్చి బయట వీధి గుమ్మానికి తాళం పెట్టింది విశాల. అంతా కార్ లో బయలుదేరే సరికి సరిగ్గా ఒంటి గంట సమయం.

*****************************

పరుశువాక్కం చంద్రా లాడ్జి.

గదిలో మంచి నిద్రలో ఉండగా ధనగిరి సెల్ ఫోన్ మోగింది. ధనగిరి బద్ధకంగా ఇటు తిరిగి టేబుల్ మీది సెల్ అందుకుని చూసాడు. అవతల తన మనిషి ఇళంగో లైన్లో వున్నాడు.

‘‘ఆ... చెప్పరా ఎక్కడున్నావ్?’’ ఫోన్ చెవికి ఆనించుకొంటూ అడిగాడు.

‘‘అన్నా ఇక్కడే లాడ్జ్ బయట రోడ్ మీదున్నాను’’ అటునుంచి ఇళంగో సమాధానం విన్పించింది.‘‘అక్కడేం చేస్తున్నావ్ రా అర్ధరాత్రి లోనకు రావచ్చుగా’’ విసుకున్నాడు.‘‘రాలేనన్నా. వెళ్ళిన పని పూర్తయింది. నీకు చూపించాలని సహస్ర తల నరికి సంచిలో వేసి తెచ్చాను. నువ్వు కిందికొస్తే చూపించి తీసుకెళ్ళి దూరంగా పారేసి వస్తాను.’’ధనగిరి తన చెవుల్ని నమ్మలేక పోయాడు.ఇన్ని రోజుల్లో తామెవరూ చేయలేని పని ఇళంగో సాధించాడంటే ఆనందంగా వుంది. అనుమానంగా వుంది. లేచి గబగబా బాల్కానీలో కొచ్చి చూసాడు. దిగువన వీధి లైటు కాంతిలో బరువుగా చేతి సంచితో నిలబడి చూస్తున్న ఇళంగో కన్పించాడు.

‘‘సరి. అక్కడే వుండు వచ్చేస్తున్నా’’ అంటూ గబ గబా షర్టువేసుకున్నాడు. రివాల్వర్ లేకుండా బయట అడుగు పెట్టే అలవాటు ధనగిరికి లేదు. రివాల్వర్ జేబులో వేసుకుని గది లోంచి బయటికొచ్చాడు. పక్క గదిలో నిద్ర పోతున్న అనుచరులిద్దర్ని లేపాలని వున్నా చివరి క్షణంలో విరమించుకొని ఒంటరిగానే చకచకా లాడ్జి మెట్లు దిగి కిందకొచ్చాడు. రోడ్డు నిర్మానుష్యంగా వుంది. ఎవరూ తిరుగుతున్న జాడలేదు. లాడ్జికి కాపలా ఉంటే సెంట్రీ కూడా ఎటువెళ్ళాడో అక్కడ మాత్రం లేడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్