Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
avee - ivee

ఈ సంచికలో >> శీర్షికలు >>

యువ - రవీంద్ర

 

జీవితంలో సంతృప్తి సాధ్యమే...!

యువత నిర్వీర్యమైపోతుంది. యువశక్తి దేశపురోభివృద్ధికి తోడ్పడాలి. కాని వారి ప్రతిభ పూర్తిగా వెలుగులోకి రావడం లేదు. యువతే దేశానికి వెన్నుముఖ. కానీ వారిలో సగం మంది సమయాన్ని, శక్తిని వినియోగించుకోవడం లేదు. వారి శక్తి సామార్థ్యాలు పూర్తిగా వినియోగించుకుంటే దేశం ఇప్పటికంటే రెండింతలు ముందుకు వెళ్తుంది. ఇలాంటి మాటలు మనం ప్రసంగాలలో వింటూ ఉంటాం. కానీ ఆ మాటలను విని వదిలేస్తాం. లేదా కొద్దిసేపు ఆలోచించి, నిజమే కదా... అనుకొని సాధారణ జీవితంలోకి వచ్చేస్తాం. ఒక్క యువతే కాదు ప్రతి మనిషి తనకున్న శక్తిలో పదిశాతాన్ని మాత్రమే వినియోగిస్తున్నాడు అని మేధావులు చెప్తున్నమాట. దీనివెనుక కారణాలు చాలానే ఉన్నాయి.

యువత - ఆలోచన

యువతలో చాలామంది కేవలం ఒక విధమైన చట్రంలో జీవించడానికి అలవాటు పడిపోయారు. ఉన్నదానిలోనే ఆనందాన్ని వెతుక్కొనేందుకు ఆలోచిస్తుంటారు. చదువు, ఉద్యోగం, పెళ్లైతే కుటంబం, పిల్లల గురించే వారు జీవిస్తున్నారు. ఢబ్బు, పేరు, స్టేటస్ కోసం ప్రాకులాడుతున్నారు. వారాంతాల ఎంజాయ్ మెంట్స్ కోసం తపించే వాళ్లు కొందరైతే, దైనందిన జీవితంకోసం ప్రతిరోజూ కష్టపడే వాళ్లు ఇంకొందరు. ఇక సినిమాలు, ఫ్రెండ్స్, గేమ్స్, జెల్సాలు... లాంటివి మామూలే. యువతలో చాలామందికి ఇదే జీవితం. ఇంతకు మించి ఏమీ ఆలోచించడం లేదు. ఇదే జీవితం అని ఫిక్సయిపోతున్నారు. చదువుకున్నంత సేపు చదవు, చదవు పూర్తయిన తర్వాత ఐదెంకల జీవితం కోసం తపన. నిద్రలేచింది మొదలు పడుకోబోయే వరకు ఏరోజుకారాజు మామూలే... ప్రత్యేకంగా ఏమీ ఉండదు.

కొత్తదనం కోరుకో...

ప్రతిరోజూ ఒకేలా సంతకం చేయలేను అన్నాడో కవి. పేజీలో మార్జిన్ల మధ్య ముడగదీసుకోవడం జీవితం కాదన్నాడు మరోకవి. మరి మనసుకు, శరీరానికి యంత్రంలా ఓ ప్రక్రియను అలావాటు చేసి, అలానే తిప్పుతున్నారు నేటి యువత. ఏరోజుకారోజు ఓ పండగలా, ఉత్సవంలా జీవించాలి. దైనందిని కార్యక్రమాలు చేస్తూనే కొత్తదనాన్ని ఆహ్వానించాలి. మీ మనసుకు ఉత్సాహాన్ని ఇవ్వాలి. చదువు, ఉద్యోగమే కాదు జీవితానికి కావాల్సింది. ఆనందాన్ని ఇచ్చేవాటికోసం ప్రయత్నించాలి. కొత్తకొత్త కలలు కనడానికి, వాటిని నిజం చేసుకోడానికి పూనుకోవాలి. ఏదో పాటలో అన్నట్లు నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపులా... మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోడానికి, భిన్నంగా, వైవిధ్యంగా ప్రజెంట్ చేసుకోడానికి కృషి చేయాలి.

మీ ప్రతిభే... మీ గుర్తింపు

అందరిలా ఉంటే నన్ను ఎవరు గుర్తిస్తారు... నాలో ఏదో ప్రత్యేకమైన శక్తి దాగి ఉంది... అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ధోని తన ప్రతిభను గుర్తించకపోయి ఉంటే భారత్ కు రెండు ప్రపంచ కప్పులు వచ్చేవా... బాలు తనలో దాగిఉన్న శక్తిని గుర్తించి ఆ వైపు ప్రయాణించకుంటే ఇన్ని మంచి పాటలు తెలుగు ప్రజలకు మిగిలేవా... సత్యం నాదెళ్ల తనలోని సాఫ్ట్ స్కిల్స్ గుర్తించి ఆ దిశగా అడుగులు వేయకుంటే మైక్రోసాఫ్ట్ లోకి అడుగు పెట్టేవాడా... క్లాసులో ఫస్ట్ మార్కు రావడం ఎంత ముఖ్యమో, మీలో దాగిన కళలో గుర్తింపు తెచ్చుకోవడం కూడా అంతే ముఖ్యం. కానీ మన సమాజంలో చదవుకున్న గుర్తింపు మిగిలిన రంగాలకు లేకపోవడం నిజంగా లోటే.  ఏ రంగంలోనైనా, మీకున్న అభీష్టానికి అనుగుణంగా ముందుకు వెళ్తే మీకు గుర్తింపు దొరుకుతుంది. అంటే మీ ఇష్టమే మీ ప్రతిభను వెలికి తీస్తుంది. ఆ ప్రతిభే మీకు గుర్తింపును తెస్తుంది.

బద్దకం... బద్ద శత్రువు

సహజంగా సురేష్ కు ఏ విషయాన్నైనా ఇట్టే గ్రహించే శక్తి ఉంది. లోతుగా విశ్లేషిస్తాడు. ఎప్పుడు ఫ్రెండ్స్ మధ్య ఏ చర్చ జరిగినా అతని కోణం విభిన్నంగా, వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. కానీ ఎప్పుడో కానీ తన ఆలోచనలకు పదునుపెట్టడు. క్లాసులకు వెళ్లడు. పుస్తకాలు చదవడు. ఎవరన్నా అడిగితే- సరేలే, చూద్దాం, చేద్దాం అని సమాధానం చెప్తాడు. ప్రవీణ ఏ విషయాన్నైనా ఒక్కసారి వింటే గుర్తు ఉంచుకుంటుంది. కానీ చెప్పేటప్పుడు వినదు. మందు నుంచీ చదవదు, తీరా పరీక్షలప్పుడు నాలుగు పాయింట్లు చదివి రాసేస్తుంది. ఇక శ్రీధర్ విషయానికి వస్తే ఉద్యోగం తప్ప మరోలోకం తెలియదు. నెలజీతం తీసుకోవడం, ఖర్చులకు అనుకూలంగా వాడడం. టీవి చూసి నిద్రపోవడం. ఇదే అతని అలవాటు... కొత్తగా ఆలోచించాలన్నా చిరాకు. నే బాగానే ఉన్నానుగా అంటాడు. అతనికి గొప్ప టెక్నికల్ నాలెడ్జి ఉందని ఆఫీసులో అందరూ అంటారు. వీరందరూ వీరిలో దాగిఉన్న బద్దకాన్ని వదులుకుంటే రాణిస్తారు. వీరి ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

కళాత్మకమైన కృషే... జీవితం

జీవించడం అంటే జీవిచడం కాదు. ఎందుకు జీవిస్తున్నాం, ఎవరికోసం జీవిస్తున్నాం. ఎలా జీవిస్తున్నాం. మన స్థాయి, స్థితి, గుర్తింపు ఏంటి.. ఎక్కడ ఉన్నాం. సమాజం మనల్ని ఎలా చూస్తుంది. ఇవన్నీ మీ మీ వ్యక్తిత్వాన్ని బట్టే ఉంటాయి. మీ కృషిని బట్టే ఉంటాయి. మీ వ్యక్తిత్వమే మీ ప్రవర్తన. మీ ప్రవర్తనే మీ జీవితం. మీ జీవించే విధానమే మీకు లభించే గుర్తింపు. పని చేయడం ముఖ్యమే... పనిని కళాత్మకంగా చేయడమే నైపుణ్యం. జీవించడం అందరూ చేసే పనే. కానీ జీవితాన్ని మీ ఇష్ఠాలకు అనుకూలంగా జీవించడమే కళాత్మకత. అలా జీవించడంలోనే ఆనందం ఉంటుంది. ఒక్కొకరికి ఒక్కో దానిలో ఆనందం ఉంటుంది. దానిని పొందడం కోసం చేసే ప్రయాణమే జీవితం అని నిర్వచిస్తారు కళాతత్వశాస్త్రవేత్తలు. మిల్లులో తయారైన బట్టమీద నగిషీలు కుట్టినట్లు, లేత ఆకుల మీద నిలిచిన మంచు బిందువులు లేలేత సూర్యకిరణాలకు మెరిసినట్లు పనిని కళాత్మకతతో జతకలపాలి అంటారు. అలానే యువత జీవితాన్ని కూడా కళాత్మకతో జీవించినప్పుడే... అటు దేశానికి, ఇటు యువతకు సంతృప్తి.

వారానికి ఒక్కసారైనా దినచర్యకు భిన్నంగా. మీ ఇష్టానికి అనుగుణంగా ఒక్క పనిచేయండి. వచ్చే వారమంతా ఆ పని ఇచ్చిన తృప్తిని పొందుతారు. మీలో మీకు తెలియని ఉత్సాహం గమనిస్తారు. అది సేవ కావచ్చు, ఇష్టమైన వారికి ఇచ్చే గిఫ్టు కావచ్చు, వారితో టైం స్పెండ్ చేయడం కావచ్చు, కొత్త పరికరాన్ని కనిపెట్టడం కావచ్చు, నచ్చిన గేమ్ ఆడడం కావచ్చు, ఇష్టమైన పుస్తకాన్ని చదవడం కావచ్చు, ఆహ్లాదకరమైన ప్రకృతిలో గడపడం కావచ్చు... ఇలా ఏదైనా మీ ఇష్టాన్ని మీరు గౌరవించిండి. దాన్ని ఆచరించండి. మీలో వచ్చే సరికొత్త సంతోషాన్ని మీరే గుర్తిస్తారు. 

మరిన్ని శీర్షికలు
navvunaluguyugaalu