Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasini pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

 

జరిగినకథ: రెండు గంటల సేపు సాగిన ప్రదర్శనలో, “అయిగిరినందిని  శ్లోకం,  తారంగం, హిమగిరి తనయే కీర్తన,చక్కని తల్లికిచాంగుభళా హైలైట్స్,” అని చంద్రకళతో అంటుంది శారదమ్మగారు. ప్రేక్షకులు  కరతాళధ్వనులతో  హోరెత్తిస్తారు. భూషణ్ అంకుల్, నీరు ఆంటీ చాలా బాగా చేసావని పొగుడుతారు చంద్రకళని. ఆ మరునాడు సిటీ న్యూస్ పేపర్స్ లో, మంచి రీవ్యూలతో పాటు కాస్ట్యూమ్స్ ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ డాన్స్ ఫోటోలు పబ్లిష్ చెస్తారు......  ఈ వారమంతా కేబిల్ టి.వి చానల్స్ వాళ్ళు ప్రోగ్రాం రిలే చేస్తారని, ‘సిటీ రౌండప్’ లో టెలికాస్ట్ చూడమని భూషణ్ అంకుల్ చంద్రకళకి చెప్తారు. .  ఆ తరువాత...

 

వస్తూనే  సంతోషంగా  వాళ్ళ  డాడీని హగ్  చేసింది.  ఎన్నడు లేనిది, నా వద్దకు వచ్చి, నన్నూ హగ్  చేసింది.  నా భుజం తట్టి, వెళ్లి ఎదురుగా సోఫాలో కూర్చుంది....

“ఎందుకురా ఈ సంతోషం?” అడిగారు అంకుల్ రాణిని.

యాం ఎగ్జైటెడ్ డాడీ.  ఇప్పుడే జగదీష్ తో మాట్లాడాను,”, “తన కజిన్స్ ని చూడ్డానికి క్రిస్టమస్ హాలిడేస్ లో చెన్నై వస్తాడట.  ఇక మరో సంగతేమంటే, చెస్ టోర్నమెంట్ లో ఫస్ట్ ప్లేస్  గెలుచుకున్నాడట,  హి ఈజ్ సో కూల్ ,”  అంటూ మా వంక చూసింది రాణి.

“ఇంతకీ, నీకు చెప్పాడా తను వస్తున్నట్టు?” నన్నడిగింది.

నేను ఏమనలేదు.

“చంద్ర పెద్దగా ఫోన్ వాడదు, మాట్లాడదు,”, “నేను మాట్లాడి తెలుసుకోవలసిందే,” అంది అమ్మ.

“చూసావా రాణీ?  నువ్వు కూడా ఫోన్ వాడకం తగ్గించాలి...,” నవ్వుతూ రాణీతో అంకుల్.

సరే, నువ్వేదో అంటున్నావు.. జగదీష్ గురించి...అదే….చెస్ టోర్నమెంట్ గెలిచాడని.... అయితే  అతను ఓ  మంచి  క్రీడాకారుడన్నమాట,”  అన్నారాయన.

“ఔను డాడీ, ఈ సారి జగదీష్ ని మీ క్లబ్  చెస్-టీమ్ కి పరిచయం చెయ్యండి...

పోతే, సరిగ్గా క్రిస్టమస్ టైంకే, జగదీష్ ఢిల్లీ నుండి వస్తున్నాడంటే,  మన స్టుడియోలో జరగబోయే క్రిస్టమస్ పార్టీ కూడా స్పెషల్ గా ఉండాలి.  అసలీసారి పార్టీ ఫార్మాట్  మార్చేయాలి... ముందునుంచే ప్లానింగ్ చెయ్యాలి.  కొందరు  క్లోజ్  ఫ్రెండ్సుని ఇన్వైట్  చేస్తాను,”  ఆగకుండా మాట్లాడుతూనే ఉంది రాణి.

**

వాళ్ళింటి  నుండి  వచ్చేసాక  కూడా,  రోజంతా, రాణి మాటలే గుర్తొస్తున్నాయి.  ఆ మాటలకి అమ్మ ఏమనుకుందో గాని, నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది.

‘జగదీష్ తనకేదో  సొంత కజిన్ అయినట్టు, తన కోసమే చెన్నైకి వస్తున్నట్టు ఆ అమ్మాయి  మాట్లాడ్డం ఏమిటి!’ అని అసహనంగా ఉంది.అయినా జగదీష్ చెన్నై వస్తున్న ప్రతిసారి, మాకంటే ముందు రాణీకి తెలియడం కూడా నచ్చలేదు నాకు. ఇవే ఆలోచనలతో మౌనంగా డిన్నర్ కూడా అయిందనిపించాను..

బట్టలు మార్చి పడుకోబోతుంటే, అమ్మ వచ్చి నా బెడ్ మీద కూర్చుంది...

“ఏమిటమ్మా?” అడిగాను...

“చూడు చంద్రా, రాణి గురించి అంకుల్ వాళ్ళు అన్నవి ఎవరితోనూ అనవద్దు. నువ్వు కూడా మరిచిపోవాలి.  మనమీద నమ్మకంతో ఆ విషయాలు మనతో పంచుకున్నారు... నిజానికి, హైసోసైటీలో, అతిగారాబంగా పెరుగుతుంది రాణి. కాబట్టి పెంకితనం, ఫార్వార్డ్ గా ఉండడం మామూలే. 

పోతే, అంకుల్  నీతో  ఆప్యాయంగా ఉంటారు కదా!  ఎంతో  సపోర్ట్  చేస్తారు.  దాంతో ఆ అమ్మాయికి  నీవంటే అసహనంగా ఉండడం కూడా సహజమే మరి,”  అని భుజం మీద చేయి వేసింది.

“ఏమైనా, నీవు మాత్రం బుద్దిగా నీ డాన్సు, చదువు మీదే దృష్టి పెట్టు, సరేనా?”  అంది...

ఔననట్టు తలూపాను...

అసలు ఇకనుండీ, ముఖ్యంగా ఆదివారాలు రాణి వాళ్ళింటికి వెళ్ళకూడదనుకున్నాను. ... రాణి మాటలు, చేష్టలు ఎప్పుడూ ఏదోగా అనిపిస్తాయి.  ముఖ్యంగా జగదీష్ తో తన ఫ్రెండ్షిప్, అతనికి చాలా క్లోజ్ అన్నట్టు మాట్లాడ్డం - నాకు నచ్చడం లేదు.

“వచ్చేవారం నుండి, గుళ్ళో భగవద్గీత క్లాసుకి వెళదాము.  నెలకి రెండు ఆదివారాలు, ప్రత్యేకంగా చిన్నవాళ్ళకోసమే,  ఆ  క్లాస్ నిర్వహిస్తున్నారట.  మధ్యాహ్నం మూడు నుండి నాలుగు వరకు జరిగే ఆ క్లాసులో మనం ఎంతో నేర్చుకోవచ్చు.  ఆ గురువుగారు చక్కగా చెబుతారని విన్నాను.... సరేనా,”  అంటూ నా భుజం మీద తట్టింది, అమ్మ.

సరేనన్నాను.

“ఇక ఆలోచన కట్టిపెట్టి,  లైట్ ఆర్పి, నిద్రపో మరి,” అంటూ బయటకి నడిచింది....

**

సండే నాటి డాన్స్ క్లాసులో,  ప్రోగ్రాములకని కొత్త నాట్యాంశాలు నేర్పుతూనే ఉంటారు మాస్టారు... రెండునెల్లగా నేర్చుకుంటున్న ‘శృంగారలహరే,  ఆశ్రితజన శుభకరి’ అనే కీర్తన – ఎదురు తాళన సాగే జతితో,  ఈ రోజు ముగిసినందుకు, అందరికీ ఉత్సాహంగా ఉంది.  

....’పదునెనిమిది కరంబులు బరుగు దుర్గా...సింహవాహిని మమ్ము రక్షించుగాక ‘...

శ్లోకం లోని ఆ చివరి వరస పాడుకుంటూ, క్లాసు ముగిసాక ఇల్లు చేరాను...  

భూషణ్ అంకుల్, నీరూఆంటీ, అమ్మతో మాట్లాడుతూ హాల్లో కూర్చునున్నారు...   విష్ చేసి, వెళ్లి వారికెదురుగా కూర్చున్నాను..తేజశ్విని మేడమ్ తో అంకుల్ మాట్లాడారంట.  డిసెంబర్ పదిహేనో తేదీ నుండి, టెలి-ఫిలిం  ఆడిషన్స్ మొదలవుతాయట.  నా స్క్రీన్ టెస్ట్ – రెండు సెషన్స్ గా, రెండురోజుల పాటు  ఉండవచ్చంట.

“క్రిస్టమస్ సెలవలే కనుక ఆలోచించి చెబితే,  మీ వీలుని బట్టి డేట్స్ ఫిక్స్ చేద్దాము,” అన్నారు అంకుల్. మరికసేపు కబుర్లు, కాఫీ, అయ్యాక వాళ్ళు వెళ్ళిపోయారు.

**

భగవద్గీత క్లాసుకి వెళ్ళొచ్చి,  హోం-వర్క్  అయ్యేప్పటికి  లేట్ అయింది.  ఆడిషన్స్ గురించి ఆలోచిస్తూ పడుకున్నాను. అంతలో, అమ్మ పిలిచింది.   “చంద్రా! ఇలా రా!”

వెళితే, “జగదీష్ బావ ఫోన్..... మాట్లాడు,” అంది ఫోనందిస్తూ...

క్షణమాగాను.  మాట్లాడమని సైగ చేసింది అమ్మ.

‘హలో” అన్నాను.

“సారీ, లేట్ అయింది. రేపు నీకు స్కూల్ అని తెలుసు గాని, నేను చెప్పేది విను.  సెలవల్లో, నన్ను మీ వద్దకు పంపాలని నాన్న ప్లాన్ చేసారు.  నేను డిసెంబర్ ట్వంటియత్ న చెన్నై వస్తాను. నీ ఆడిషన్స్  ట్వంటిఫస్ట్ నుంచి ఫిక్స్ చేస్తే, నేను మీకు తోడుగా వస్తా,” అటునుండి జగదీష్ అంటుంటే ఆశ్చర్యపోయాను..  

ఇంతలోనే, అమ్మైతే ఆడిషన్స్ గురించి ఎవరికీ చెప్పుండదు.  చెప్పలేదని తెలుసు..

మరి ఇంత త్వరగా విషయం జగదీష్ కి తెలిసిందంటే.....

‘నీకెలా తెలిసింది?  ఆడిషన్స్ సంగతి’ అని నేనడిగే లోగానే...

“నేను మా స్కూల్ ‘హైకింగ్ ట్రిప్’ నుండి వచ్చేప్పటికి, అర్జెంటుగా ఫోన్ చేయమని రాణి మెసేజులు పెట్టింది.  కాల్ చేస్తే,  టెలిఫిలిం ఆడిషన్స్ విషయంగా, మీరు  వాళ్ళింటికి  వచ్చివెళ్ళారని  చెప్పింది.   డిటైల్స్  కోసం భూషణ్ అంకుల్ తో మాట్లాడాను.  మొత్తానికి వెరీ ఎగ్జైటింగ్  చంద్రా,” అన్నాడు జగదీష్.

“అవును...నీవు వచ్చే డేట్స్ అమ్మకి చెబుతాను,” అన్నాను.

“అత్తయ్యకి ముందే చెప్పానులే,’ అంటూ ‘బై’ చెప్పి ఫోన్ పెట్టేసాడు.

“అయితే, మనకి జగదీష్ తోడుంటాడు.  వాడన్న డేట్స్ లోనే, ఆడిషన్స్ అయ్యేలా చూడాలి.  మన గురించి ఎంత ఆలోచిస్తాడు వాడు,” అంది అమ్మ.

నాకూ సంతోషంగానే ఉంది...జగదీష్ ఉంటే సరదాగా ఉంటుంది... అదీ నాన్న దగ్గర లేనప్పుడు, కాన్ఫిడెంట్ గా ఉంటుంది... జగదీష్ వస్తున్నట్టు వినోద్ కి చెప్పాలని చూస్తే, వాడు నిద్ర పోతున్నాడు....

**

ఆత్రుతగా ఎదురు చూసిన రోజు వచ్చేసినట్టే....రేపే నా టెలిఫిలిం ఆడిషన్స్ ....

ఇవాళ సాయంత్రం ఫ్లైట్ కి వస్తున్నాడు జగదీష్.

పొద్దున్నించీ అమ్మ హడావిడి పడిపోతుంది.  ‘వాడికి ఏ రూమ్ వీలుగా ఉంటుందో’ అనుకుంటూ ఇల్లు సర్ధించడంతోనే సరిపోయింది ఆమెకి.  అతనికి ఇష్టమైన వంటకాలు  తనే స్వయంగా  చేసింది.  కాక, మధ్యాహ్నం వరకు, దగ్గరుండి మీనాక్షితో స్నాక్స్ కూడా చేయించి డబ్బాలకి వేసి, అతని రూములో సర్దింది.

సాయంత్రమయ్యాక, జగదీష్ కోసం ఎయిర్పోర్ట్ కి వినోద్ బయలుదేరగానే, నేను డాన్స్ క్లాసుకి వెళ్ళిపోయాను...

**

ఆడిషన్స్ గురించి, జగదీష్ రాక గురించిన ఆలోచనలతో,  డాన్స్ ప్రాక్టీసుపై పూర్తి మనసు పెట్టలేకపోయాను.

‘జగదీష్ వచ్చేసుంటాడు’ అనుకుంటూ క్లాస్ అవగానే, పరుగున ఇల్లు చేరాను,,,

వరండాలో అమ్మతో, వినోద్ తో కబుర్లు చెబుతూ కూర్చునున్నాడు జగదీష్.

నన్ను చూస్తూనే,  “వెరీ హంగ్రీ.  నీ కోసమే వెయిటింగ్,” అన్నాడు.

“ఒక్క నిముషంలో వస్తా,” వాష్-రూమ్ వైపు నడిచాను.....

“తను వచ్చేస్తుంది, మీరిక లేవండి... నేను వడ్డించేస్తా,” లేచి నా వెనుకే నడిచింది అమ్మ.

ఫ్రెష్ అయ్యి, బట్టలు మార్చుకున్నాను... అమ్మ వడ్డనల ఘుమఘుమలతో, నాకూ విపరీతంగా ఆకలి వేస్తుంది...వెళ్లి డైనింగ్ వద్ద వినోద్ పక్కన కూర్చున్నాను. జగదీష్ చెప్పే కబుర్లు వింటూ, డిన్నర్  కానిచ్చాము.

అమ్మ అందించిన ఐస్క్రీం కప్స్ పట్టుకుని, హాల్లో టి.వి ముందు చేరాము. పాత హిందీ సినిమా – ‘మిస్టర్ ఇండియా’ – చూస్తూ తన  హైకింగ్ ట్రిప్, చెస్ గేమ్స్ గురించి చెప్పాడు జగదీష్...

సినిమా అవ్వగానే,  “లేట్ అయింది.  అత్తయ్యా..... ఇక మీరంతా వెళ్లి పడుకోండి.   కాసేపు స్పోర్ట్స్ చూసి నేనూ పడుకుంటాను,”  అన్నాడు మాతో....

**

పొద్దున్నే నైన్ కంతా, ఆడిషన్స్ కి, ‘మ్యూజియం థియేటర్’  చేరాము.   నాకంటే ఎక్కువగా వినోద్, జగదీష్ టెన్షన్  పడిపోతున్నారు....లోపలున్న ‘వేదిక’ మీద కనీసం నాలుగు

టెలి-కెమెరాలతో కొత్తరకం  సెటప్ గా ఉంది.

మా మృదంగం మాస్టారు, సింగర్ వేద, ఫ్లూటిస్ట్ అప్పటికే వచ్చున్నారు.

**

మరికాసేపటికి, గ్రీన్ రూములో ఉన్న మా వద్దకు వచ్చి, తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకొన్నారు తేజశ్విని మేడమ్. ఎర్రటి చూడిదార్ వేసుకొని, ఫోటోలో లాగానే అందంగా ఉన్నారమె....

ఆమెని చూస్తూ నిలబడున్న నన్ను, “ఏమ్మా చంద్రకళా,  నీ పేరుకి తగ్గట్టుగా ఉన్నావు.  నర్వస్ గా ఫీలయ్యే అవసరం లేదు.... రెడీనా డాన్స్ కి?” అడిగారామె.

**

‘వేదిక’నంటి నమస్కరించి,  ఇరవైఐదు నిముషాల్లో మూడు ఐటమ్స్ వరసగా చేసి, మంగళంతో ముగించాను.

హాల్లో, తేజశ్విని మేడమ్ వెనుకే కూర్చున్న అమ్మవాళ్ళ దిశగా వెళుతుంటే,  తేజశ్విని మేడమ్ నన్ను దగ్గరకు రమ్మని సైగ చేసారు...

“వేరి నైస్. ఇవే ఐటమ్స్, అమెరికాలో నా స్టూడెంట్స్ కూడా చేస్తున్నారు.  నీవు మాత్రం, ఎంతో మెచ్యూరిటీతో హావభావాలు చక్కగా చూపించావు.  నీ గురించి మాస్టారుగారు చెప్పినది అక్షరాల నిజం,” అని మెచ్చుకున్నారావిడ.

మరునాడు  కూడా  మమ్మల్ని  తొమ్మిదికల్లా రమ్మన్నారు.

నా తరువాత ఆడిషన్  చేసే అమ్మాయి రావడంతో, మేము అక్కడినుండి కదిలాము.

**

నైస్ పర్ఫామెన్స్,” అన్నాడు,  ఇంటికి  తిరిగొచ్చేప్పుడు, జగదీష్.

సంతోషంగా అనిపించింది..

ఇల్లు చేరాక, లంచ్ తినేసి చాలా సేపు కేరమ్స్, బోర్డ్ గేమ్స్ ఆడాము.

వినోద్ బాబు చేత తన ల్యాప్టాప్ మీదున్న గేమ్స్ ఆడించాడు జగదీష్...

నిజంగా, రాణి పక్కన లేకుండా, అతను, మాతో మాత్రమే సమయం గడపడం హాయిగా అనిపించింది.

‘కాని రేపటి నుండి మ్యూజిక్ క్లాస్ కి వస్తుందిగా రాణి... ఈ రెండు రోజులే, నా ఆడిషన్స్ వల్ల, తన నుండి డిస్టర్బెన్స్  ఉండదు’ అనుకున్నాను.

తలగడలు  వేసుకుని టి.వి. చూస్తూ, సిటింగ్ లోనే, తలా ఒక సోఫాలో పడుకుండిపోయాము..

**

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
death mistery