Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

 

జరిగినకథ:  ప్రతిమను కలవడానికి సిద్దార్థ తన అసిస్టెంట్ తేజ తో కలిసి వస్తాడు. . ఆఫీస్ బాయ్ ప్రతిమకేబిన్ లోకి తీసుకెళ్తాడు.  కను రెప్పలు వాల్చకుండా ఆమెవైపు తదేకంగా, తన్మయంగాచూస్తాడు తేజ. ఆమె గురించి సిద్దార్థ చెప్పింది తక్కువేననిపిస్తుంది ఆ క్షణంలో తేజాకి.  ఆ తరువాత...

‘‘అదే కాన్సెప్ట్‌...రిలీజ్‌కి ముందే ఇంటర్నెట్‌లో హిట్టయిన చిత్రమంటూ కాప్షన్‌ పెట్టండి. ఆ మూవీలో లేని మరికొన్ని కొత్త సీన్లు యాడ్‌ చేస్తున్నామంటూ ప్రకటించండి. యాడ్స్‌ రిలీజ్‌ చేసే ముందు నాకోసారి చూపించండి. చేంజెస్‌ ఏమైనా ఉంటే సజెస్ట్‌ చేస్తా’’

‘‘ఓకే...’’అంటూ వెళ్లిపోయాడు పరంధామ్‌.

‘‘రాజుగారి బామ్మర్ది...’’అంది ప్రతిమ అతడివైపే చూస్తూ.

‘‘అతడు మీ బాస్‌ చుట్టమా?’’ అడిగాడు సిద్దార్థ.

‘‘ఔను. అందుకే అన్నాను రాజుగారి బామ్మర్ది అని. ఉద్యోగం ఎక్కడా పుట్టకపోయేసరికి మా చైర్మన్‌గారు జాలి తలచి ఇక్కడ పెట్టుకున్నారు.  బహుశా, ఏకంగా మూవీ మొత్తం ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ అయిందంటే ఇతడి హస్తమేదైనా ఉందేమోనని చైర్మన్‌గారి అనుమానం. ఫామిలీ పరువు పోకూడదనే ఈ విషయాన్ని సీక్రెట్‌గా విచారించమంటూ నాతో చెప్పారు’’ అంది ప్రతిమ.

‘‘ఆయనపై ఆ డౌటెందుకొచ్చింది?’’

‘‘కార్పొరెట్‌ స్టయిల్‌లో ప్రొఫెషనల్‌గా, అఫీషియల్‌గా ఎంత నడిపినా సినిమా సినిమాయే. కచ్చితంగా ఇది గ్లామర్‌ ఫీల్డ్‌. బలహీనతలుంటే చెడిపోవడం ఈజీ. అలా చెడిపోయాడనే అనుమానం ఆయనపై మా చైర్మన్‌గారికొచ్చింది. ఒక్కసారి చెడిపోవడమనే పాకుడురాళ్లమీద నిల్చుంటే చాలు పాతాళందాకా కూరుకుపోవచ్చు. అలాంటి సమయాల్లో డబ్బు అవసరాలు పెరగొచ్చు. నాకూ పరంధామ్‌ని చూస్తే కొంత అనుమానంగానే ఉంది. ఆఫీసులో జాయినైన కొత్తలోని వేషధారణ, మాట తీరు, మన్నన ఆయనలో అస్సలు లేవు. మారుతూ వచ్చాడు. ఆ మారడం తనవరకూ నష్టమైనా ఫర్వాలేదు. కానీ, సంస్థకు నష్టం తెస్తున్నాడనే అభిప్రాయం కలుగుతోంది’’ ఆమె చెప్తుంటే వింటున్నారిద్దరూ.

‘‘వాగ్దేవి ప్రొడక్షన్స్‌కి ఓ బ్రాండ్‌నేమ్‌ ఉంది. ఇక్కడ పనిచేసిన ఐడిరటిటీ ఉంటే ఎక్కడైనా పని దొరుకుతుంది. అంతేకాదు, ఈ ప్రొడక్షన్స్‌ ఇటు ఇండస్ట్రీలోనూ, అటు ప్రేక్షకుల్లోనూ అభిరుచి పెంచింది. సినీ మేకింగ్‌లో రొటీన్‌ ఫార్ములాను ఛేదిస్తూ న్యూవేవ్‌ క్రియేట్‌ చేసింది. ఓ రకంగా చెప్పాలంటే...సినిమాకొలతల్నే మార్చేసింది. సొసైటీ నుంచే సేకరించిన స్టోరీలు, కేరెక్టర్లే కావడంతో కౌంటర్లో టికెట్‌ కొనుక్కుని థియేటర్లోకి వెళ్లిన వీక్షకుడు ఎదురుగా సెవన్టీ ఎంఎం స్క్రీన్‌లో తనని తాను చూసుకున్నాడు. నిజానికి, వెండితెరంటే వెలుగు నీడల క్రీడే. ఆ నీడల క్రీడ నిజం కాదు. నేలమీద కాలు నిలవని పాత్రలు ఫిక్షన్‌ పేరుతో అతిగా ప్రవర్తించేవి. ఏసీగదుల్లో రాసుకునే కథల్లో ప్రేక్షకుడు హీరో కాలేడు. అయితే, ఆ కొరతను తీరుస్తూ ప్రేక్షకుడికి సిన్మాకి మంచి బ్రిడ్జి నిర్మించింది ఈ సంస్థ. ఈ సంస్థ నుంచి వచ్చే సినిమా కోసం వీక్షకుడు ఎంతగానో ఎదురుచూసేవాడు. ఆ ఎదురుచూపుల్నే పరంధామ్‌లాంటివాళ్లు క్యాష్‌ చేసుకుంటున్నారని నాకూ డౌటొచ్చింది’’ చెప్పింది ప్రతిమ.‘‘ఇది కేవలం మా అనుమానం మాత్రమే. నిజాలు నిగ్గు తేల్చాల్సింది మీ పరిశోధనే’’ చెక్‌ బుక్‌ తీసి ఎమౌంట్‌ రాసింది.

‘‘అడ్వాన్స్‌గా ఇది ఉంచండి’’ అంటూ సిద్దార్థ చేతికిచ్చింది.

‘‘ప్రతిమ చెప్పిందంతా నువ్వూ విన్నావుగా...నిజమేనంటావా?’’ అడిగాడు సిద్దార్థ కార్లో వెనక్కి వస్తూ.

‘‘ఆ ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌. ప్రతి ప్రాజెక్ట్‌లో ఆమె ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే స్క్రిప్ట్‌నుంచి రిలీజ్‌ దాకా అన్నీ ఆమె పర్యవేక్షణలోనే జరుగుతున్నట్లుంది. నీకు కేసు అప్పగించేముందే తనదైన శైలిలో ఇంటర్నల్‌గా ఇన్విస్టిగేషన్‌ చేసే ఉంటుంది. కొన్ని ఆధారాలూ దొరికుండొచ్చు. అయినా, తొందరపడకుండా కాగలకార్యాన్ని నీచేతులమీదుగా జరిపిస్తోందనిపిస్తోంది’’ చెప్పాడు తేజ.‘‘నీ ఎనాల్సిస్‌ కరెక్టే అయిండొచ్చు. అయినా, ప్రతిమను కూడా అనుమానించాల్సిందే’’

‘‘ఎందుకలా?’’

‘‘ఎందుకా? ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు కాబట్టి. నా అబ్జర్వేషన్‌ బట్టీ ఆ ప్రొడక్షన్‌ ఆఫీసులో రెండు అధికార కేంద్రాలు. ఓ అధికార కేంద్రానికి ఇన్‌చార్జ్‌ ప్రతిమ, మరో కేంద్రానికి పరంధామ్‌. ప్రతిమ ప్రతిభను బట్టీ బయటనుంచి వచ్చింది. పరంధామ్‌ చైర్మన్‌బంధువుగా ఆఫీసులో చేరాడు. క్రియేటివ్‌ హెడ్‌గా కీలకబాధ్యతలు ప్రతిమ నిర్వహిస్తున్నా, మేనేజర్‌ అనే హోదాలో ఆమెతో సమాంతరమైన పోస్ట్‌లోనే అతడూ ఉన్నాడు. సినిమా అనేది సృజనాత్మక ఉత్పత్తి కాబట్టి క్రియేటివ్‌హెడ్‌గా ప్రతిమకే ప్రాధాన్యత ఉంటుంంది. అయినా సరే, మేనేజర్‌ హోదా ప్లస్‌ చైర్మన్‌గారి బంధువనే టాగ్‌లైన్‌తో పరంధామ్‌కి కొమ్ములు మొలిచుంటాయి. మొలిచిన కొమ్ములు ఊరకే ఉండవు కదా...ఎవర్నయినా పొడవమంటూ దురద పెడ్తుంటాయి’’ చెప్పాడు సిద్దార్థ.

‘‘అంటే, కొత్తగా మొలిచొచ్చిన కొమ్ముల్తో పరంధామ్‌ ప్రతిమనే పొడుస్తున్నాడంటావ్‌. దాంతో, పక్కలో బల్లెంలా ఉన్న పరంధామ్‌ని తొలగించే క్రమంలో నీ చేతికి కత్తిచ్చింది...అదే చెక్కు. నీ థీసీస్‌ అదేనా?’’

‘‘అవొచ్చు..కాకపోవచ్చు. రెండు రెళ్లు నాలుగనే సమాధానం లెక్కల్లోనే వస్తుంది. మాథమేటిక్స్‌ వేరు...హ్యూమన్‌ సైకాలజీ వేరు. రెండు రెళ్లు ఆరూ అవొచ్చు. ఇరవై రెండూ కావొచ్చు. అయితే, అక్కడున్న సీన్‌ని బట్టీ రెండు అధికార కేంద్రాలమధ్య జరుగుతున్న పోరులా కనిపిస్తోంది అది’’ అన్నాడు సిద్దార్థ.

‘‘అద్సరే...! ఏకంగా సినిమాయే ఇంటర్నెట్‌లో హల్చల్‌ చేసింది కదా! దీన్నేమంటావ్‌?’’ అడిగాడు తేజ.

‘‘ఈ విషయంలో క్రియేటివ్‌ హెడ్‌గా ప్రతిమకీ మినహాయింపు లేదు. ఏం...ఈ నేరంలో ఆమె హస్తం ఎందుకుండకూడదు?’’

‘‘నువ్వు చాలా ఘోరంగా ఆలోచిస్తున్నావ్‌? పాపం, ప్రతిమ. నిన్ను నమ్మి అడ్వాన్సిచ్చి కేసు అప్పగిస్తే ఆమెనే దోషిగా చూస్తున్నావ్‌’’‘‘జరిగిపోయిన క్రయింను రాసుకునేవాడివి...ఈ ఫీల్డులో నీకు అనుభవం లేదు. మనచేతికొకరు ఆయుధమిచ్చి వాళ్ల శత్రువుని చూపించి యుద్ధం మనల్ని  చేయమంటారు. ఇదీ ఈ కార్పొరేట్‌ కాలంలో రాజనీతి. ఎవరికోసం ఎవరో చేస్తున్న ఈ యుద్ధంలో ఇంకెవరికో గాయాలవుతాయి. మరెవరో బలైపోతారు. చేతికి అస్సలు రక్తమంటించుకోనివాళ్లు అధికార రాజభోగాలనుభవిస్తుంటారు...ఇలాంటి కేసుల్ని నే చాలా చూసాను’’ అన్నాడు సిద్దార్థ

.‘‘అంటే...నువ్వు అంత అందమైన అమ్మాయి ప్రతిమను అనుమానిస్తున్నావన్నమాట’’‘‘కచ్చితంగా ఆ అందాన్ని అనుమానించకపోతే నన్ను అనుమానించాల్సిందే. ఐమీన్‌ నాలోని డిటెక్టివ్‌ని అనుమానించాల్సిందే. అనుమానించడమే డిటిక్టెవ్‌ల సహజ లక్షణం. తనపర భేదాలుండకూడదు. అన్నీ తెలిసిన డిటెక్టివ్‌లు

‘హనీ ట్రాప్‌’లో పడకూడదుగా’’‘‘అదేంటీ?’’ అడిగాడు ఆశ్చర్యంగా తేజ.

‘‘మా డిటెక్టివ్‌ పరిభాషలో ‘హనీ ట్రాప్‌’ అంటే అందాల వల. ఎవర్నయినా ఇరికించాలనుకున్నా, ఎవరిచేతనైనా నిజాలు కక్కించాలనుకున్నా ‘హనీ ట్రాప్‌’నే ఆయుధం చేస్తారు. ఎంచుకున్న టార్గెట్‌కి ఏ పార్టీలోనో హఠాత్తుగా ఓ మెరుపుతీగ ఎదురుపడుతుంది. కాటుక కళ్లతో కాటేస్తుంది. చూపుల్తో కబుర్లు చెప్తుంది. చిర్నవ్వులు చిందిస్తుంది. అల్లంత దూరం నుంచే గాల్లో ముద్దులు విసురుతుంది. అంతలోనే అతి దగ్గరగా వచ్చి వేడి ఊపిరితో సెగలు రేపుతుంది. నవ్విస్తుంది..కవ్విస్తుంది. గుండెల్లో తుఫాన్లు రేపుతుంది. అలా అలా కాట్‌వాక్‌ చేస్తున్న ఆ అందం తననే మెచ్చిందనుకుంటే అమాయకుడే. ఆమె వెనుకెనుకే తిరుగుతాడు. ఆఖరికి పార్టీలో ఏ టేబుల్‌ దగ్గరో సెటిలై ఆ బ్యూటీ మత్తులో పీకల్దాక మందు పీకేస్తాడు. ఆ తర్వాత మనసులో ఏం దాచుకోకుండా కక్కేస్తాడు. ఇంతకీ ఈ ఆధునిక  ప్రపంచంలో ఆ టార్గెట్‌ ఉన్నతహోదాలో ఉన్న ఎవడైనా కావొచ్చు’’

‘‘అంటే..నీ దృష్టిలో ప్రతిమ ‘హనీ ట్రాప్‌’ అంటావా?’’

‘‘నా ఉద్దేశం అది కాదు. కానీ, ఆమెకి పరంధామ్‌ మీద పీకల్దాక కోపముంది. ఆ విషయం ఆమె మాటల్లోనే వ్యక్తమవుతోంది. అంతేకాదు.. మనకో కేసు అప్పగించింది. అనుమానితుడు పరంధామ్‌ అంటూ చూపుడు వేలు సారించింది. అంటే...అతడే దోషి అని సంకేతమిచ్చినట్లే కదా!  పజిల్‌ తనే ఇచ్చి పరిశోధనా తనే చేసి ఆన్సర్‌ని మాత్రం మనల్నిమ్మంటోంది’’

‘‘ఆ ఆన్సర్‌ తనే ఇవ్వొచ్చు కదా!’’

‘‘తనిచ్చిన ఆన్సర్‌కి  చైర్మన్‌ శాటిస్‌ఫై కావాలి కదా! ఎంతైనా పరంధామ్‌ అతడి బంధువు’’

‘‘నువ్వో సంగతి మరిచిపోతున్నావు. ఈ ఇన్విస్టిగేషన్‌ చెయ్యమన్నది చైర్మనే!’’

‘‘ఆ విషయం మనకెవరు చెప్పారు?’’

‘‘ప్రతిమ...’’

‘‘ప్రతిమ తప్ప మనకు చైర్మన్‌ చెప్పలేదు కదా! చైర్మన్‌ చెప్పినట్లు ఆమె మనకు చెప్పింది. అంతే!’’

‘‘ఆమెవరో కాదు... చైర్మన్‌ ప్రతినిధి’’

‘‘ప్రతినిధే... చైర్మన్‌ కాదు.  ఐమీన్‌ ఆమె కూడా ఆ సంస్థలో అందర్లా ఓ  ఎంప్లాయే. అందుకే, ఆమెతో సహా  అందరూ అనుమానితులే’’ తేల్చేసాడు సిద్దార్థ.

ఒక్క క్షణం సిద్దార్థను కోపంగా చూసాడు తేజ. ఈ కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్నీ సిద్దార్థ తేజాతో చర్చిస్తూనే ఉన్నాడు.  ప్రతి అప్‌డేట్‌ను పంచుకుంటూ సజెషన్స్‌ తీసుకుంటున్నాడు. అంతేకాదు...విషయ సేకరణ కోసం ఒక్కోసారి టీవీ మాధ్యమాన్ని వినియోగించుకునే ఏ చిన్ని అవకాశాన్నీ సిద్దార్థ జారవిడుచుకోవడం లేదు.

ఓ శతాబ్దపు మహాద్భుతంగా ఖ్యాతి గడిరచిన సినిమా గత ప్రాభవాన్ని కోల్పోయింది. అప్పట్లో  ప్రతి ఫ్రైడే గోడమీద వెలసే పోస్టర్లు ప్రేక్షకుడిని రారమ్మని కన్నుగీటేవి. అందాల హీరోయిన్లు కాలర్‌ పట్టుకుని పర్సుతీయించి బలవంతంగా టికెట్‌ కొనిపించి మరీ లైట్లారిన ధియేటర్లోకి లాక్కెళ్లేవాళ్లు. స్క్రీనంతా పరుచుకున్న సొగసుసోయ‘గాలా’లకు చిక్కి విలవిల్లాడిన ప్రేక్షకుల పిడికెడు గుండె ఓ అర్ధరాత్రివేళ హఠాత్తుగా మేలుకుని అల్లరల్లరి చేసేది. దాంతో, వాళ్లు సిన్మాహాళ్ల చుట్టూ మళ్లీమళ్లీ ప్రదక్షిణాలు చేసేవారు.

ఇప్పుడు సిన్మాబొమ్మ తిరగబడిరది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్