Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటిజరిగిన కథ: ఏర్‌పోర్ట్‌ రోడ్‌లో రెండు సిగ్నల్స్‌ని దాటడంలో ఏర్పడ్డ ఆలస్యంతో ఆ సమయం మరో పదినిముషాలు పెరిగుతుంది . విరాట్‌ బృందం సహస్రను పంపించిన పదోనిముషంలో బయలుదేరినా మరో పది నిముషాలు కలిపి ఇరవై నిముషాలు ఆలస్యంగా అడ్రసులోని రోడ్‌ని చేరుకుంటారు.  ఆ రోడ్‌ మలుపు తిరగ్గానే ఎదురుగా నిర్మానుష్యంగా వున్న రోడ్‌లో ఒంటరిగా పరుగెత్తుకొస్తున్న దీక్ష కనిపిస్తుంది . ఆమెను చూడగానే ఒక్కసారిగా  టెన్షన్‌ చోటు చేసుకుంటుంది  అందరిలో ఆ తరువాత....
 

దీక్షకు బదులు...

ఎట్టయప్ప బాధతో పొలికేక పెట్టాడు.

ఉలికిపడి కళ్ళు తెరిచిన దీక్షకు...

ఆయుధం వదిలి కింద పడి పోతూ కన్పించాడు ఎట్టయప్ప. వాడి కుడి భుజంలో ఒక ఛురిక, ఎడం భుజంలో ఒక నక్షత్రం లాంటి చక్రం దిగబడి ఎర్రగా నెత్తురు పొదుగుతోంది. సరిగ్గా భుజం. నరాల మీద నాటుకోవటంతో చేతులు రెండూ చచ్చు బడినట్టయి పోయి కదల్లేక బాధతో అరుస్తూనే వున్నాడు. వాడికి వెనగ్గా సుడిగాలి మాదిరి దూసుకొస్తూ కన్పించింది సహస్ర.

వస్తూనే కోపంతో వాడ్ని ఎండం కాలితో తన్ని వాడు వదిలేసిన ఆయుధాలు బరిసెను కత్తిని అందుకుంది. కళ్ళలో నిప్పుల వర్షిస్తుండగా ఉగ్రమూర్తిలా ఉరిమి చూసింది వాడి వంక.‘‘ఇది నా ప్రాణం రా. దీక్షని అడ్డం పెట్టుకుని నన్ను చంపాలని చూస్తావ్‌ రా చేత కాని వెధవ? దీన్ని చెంప దెబ్బ కొట్టినందుకు నీ చేయి విరిచేయాలకున్నాను. ఏకంగా తల నరకాలని చూసావ్‌. ఇక క్షమించను. నీ చేతులు నరికేస్తున్నాను. పోయి ఆ పంది కొక్కు త్యాగరాజన్‌తో చెప్పు. తప్పులు ఒప్పుకొని చట్టానికి లొంగి పోతే సరి. లేకుంటే ఏదో రోజు వాడికీ నీ గతే పడుతుంది’’ అంటూ వేట కత్తిని లేపింది.

‘‘వద్దు.. ప్లీజ్‌... వద్దు వద్దు’’ అనరిచాడు ఎట్టయప్ప. ప్రాణభయం అంటే ఏమిటో ఇపుడు వాడి కళ్ళలో కన్పిస్తోంది.

నిర్ధాక్షిణ్యంగా ఎట్టయప్ప రెండు చేతుల్ని మణికట్టు వద్దకి నరికేసింది సహస్ర. ఎట్టయప్ప వేసిన భయంకరమైన గావు కేకతో ఆ ప్రాంతం మారు మోగింది. ఆ సంఘటన చూసి గొల్లున అరిచారు ఎట్టయప్ప మనుషులు.చేతులు నరికిన మరు క్షణమే గిరుక్కున తిరిగి దీక్ష నోటికి అంటించిన టేప్‌ని లాగేసింది సహస్ర. అట్టే టైం లేదు. అవతల రెండో అంతస్థుకి పరుగెత్తిన గుండాలంతా కిందకు వచ్చేస్తున్నారు. ఒకే వేటుతో దీక్ష బంధనాల్ని తొలగించింది.ఏడుస్తూ సారీ చెప్పి తనను వాటేసుకోబోతున్న దీక్షను విసురుగా వెనక్కి నెట్టేసింది సహస్ర. ‘‘యూ బ్లడీ ఫూల్‌! సారీలకు ఏడ్వడానికి టైం లేదు. వాళ్ళొస్తే ఇద్దర్నీ చంపేస్తారు. పారిపో.. ముందిక్కడ్నుంచి పారిపో’’ అనరిచింది.‘‘నువ్వూ నాతో వచ్చేయ్యవే’’ అంది అమాయకంగా దీక్ష.

‘‘వాళ్ళ అంతు చూసి వెనకే వచ్చేస్తాను. వాళ్ళు నీ వెంట పడకుండా ఆపుతా. పారిపో. గో ఫాస్ట్‌’’ అంటూ మరో సారి దీక్షను తోసి వెనుతిరిగింది సహస్ర. అప్పటికే ఎట్టయప్ప మనుషులు కిందకు దిగి అరుపులు కేకలతో దూసుకొచ్చేస్తున్నారు. అంతే...మరోసారి సహస్రతో చెప్పించుకునే పని లేకుండా కాలి కొద్ది వేగంగా రోడ్‌ వైపు పరుగుతీసింది దీక్ష.త్యాగరాజన్‌ వద్ద...

ఎట్టయప్ప తర్వాత నంబర్‌ టు స్థానంలో వున్న వాడు పాండ్యన్‌ అనే గుండా. ఎట్టయప్ప వెంట మధురై నుంచి వచ్చిన వాళ్ళలో వీడొకడు. ముఫ్పై లోపు వయసులో నల్లగా దుక్కలాంటి మనిషి. త్యాగరాజన్‌ నిర్ణయం ప్రకారం ఎట్టయప్ప ఏం చేయాలో స్కెచ్‌ వేసి చెప్పగానే తమ మనుషులతో అమలు చేయించేది ఈ పాండ్యనే.ఎప్పుడైతే సహస్ర ఎట్టయప్ప చేతులు నరికేసిందో, ఎప్పుడైతే అంత వరకూ బంధీగా వున్న దీక్ష తప్పించుకు పోతోందో, వెంటనే ‘‘ఆ రాక్షసి మన ఎట్టయప్ప చేతులు నరికేసిందిరా ఆ పిల్ల దీక్ష తప్పించుకోకూడదు. దాన్ని ఆపండి అరే ఎక్కడ చచ్చార్రా ఈ హర్యానా షూటర్స్‌ కాల్చమనండిరా. వాళ్ళిద్దర్ని కాల్చి చంపమనండి’’ అనరుస్తూ హెచ్చరిస్తూ సహస్ర వైపు పరుగునెత్తుకున్నాడు పాండ్యన్‌.సహస్ర ఓ చేత బరిసే రెండో చేతిలో నెత్తురొడుతున్న వేట కత్తితో బలి కోరుతున్న అమ్మవారిలా అక్కడే నిలబడుంది. ఎప్పుడైతే కొందరు దీక్ష వెనక పరుగెత్తబోయారో ఆ మరు క్షణం చేతిలోని వేట కత్తిని బలంగా వాళ్ళ వైపు విసిరింది.గింగిరాలు తిరుగుతూ  వస్తున్న వేట కత్తిని చూసి గొల్లున అరుస్తూ వాళ్ళంతా వెనక్కి పరుగులు తీసారు.

వేట కత్తి వాళ్ళని హెచ్చరిస్తున్నట్టుగా నేలలో దిగబడింది. ఈ లోన బయటకు పారిపోయి రోడ్‌ మీద అదృశ్యమైంది దీక్ష. ఇక ఆమె వెంట పడ్డానికెవడికీ ధైర్యం చాల్లేదు. ఎందుకంటే చేతిలో బరిసెతో అపర చండీలా నిలబడుంది సహస్ర. ఈ సారి బరిసె విసిరతే ఎవడు ఛస్తాడో తెలీదు. చెట్టంత ఎట్టయప్ప చేతుల్నే నరికేసింది. తామెంత? ఆ అమ్మాయి గురించి తెలిసే ముందుకెళ్ళటమంటే కళ్ళు మూసుకొని ఆత్మ బలి దానం చేసుకున్నట్టే. అందుకే సహస్ర రాగానే కాల్చి చంపండి. హేండ్‌ టు హేండ్‌ ఫైటింగ్‌కి పోవద్దంటూ త్యాగరాజన్‌ సార్‌ పదే పదే హెచ్చరించాడు. ఎట్టయప్ప అలాగే ప్లాన్‌ చేసాడు. కాని ఆ పిల్ల తెలివి ముందు తమ ప్లానంతా మట్టి కొట్టుకు పోయింది. అనుకుంటూ దీక్ష కోసం పరుగెత్తే ఆలోచన విరమించుకొని పాండ్యన్‌ వైపు వచ్చేసారు వాళ్ళంతా. చాలా వేగంగా వెంట వెంటనే జరిగి పోయిన సంఘటనలివి. చేతులు తెగిన ఎట్టయప్ప నేల మీద దొర్లుతూ పెడ బొబ్బలు పెడుతూనే వున్నాడింకా.

తను ఒంటిగా నిలబడితే షూటర్స్‌ కాల్చి చంపేస్తారని సహస్రకు తెలుసు. అప్పటికే పాండ్యన్‌ గుంపుకి వెనక వస్తున్న షూటర్స్‌ నలుగురు రివాల్వర్లు గురి చేస్తున్నారు. తను గుంపులో జొరబడి వాళ్ళని మరింత కన్ ఫ్యూజ్‌ చేస్తే గాని బుల్లెట్టకు అందకుండా తప్పించుకోలేదు. అలా చేయాలంటే షూటర్స్‌ని కాస్సేపు ఆపాలి. సహస్ర జేబు లోంచి మినీ ఛురికలు నక్షత్రం షేపు లోని మినీ చక్రాల్ని వెంట వెంటనే షూటర్స్‌ దిశగా ప్రయోగించింది. సూర్యకాంతిలో మెరుపులు వెదజల్లుతూ తమ వైపు వస్తున్న ఆ మినీ ఆయుధాల్ని చూడగానే షూటర్స్‌ గుండె బేజారయింది. వాటి దెబ్బకి ఇప్పటికే తమ వాళ్ళిద్దరు రెండో అంతస్తులో ఎందుకూ పనికి రాకుండా పడున్నారు. వాటికి అందకుండా తప్పించుకోడానికి తిరిగి వెనక్కి పరుగు తీసారు నలుగురూ. ఆ గేప్‌లో బరిసె గిరగిర తిప్పుతూ సుడిగాలి మాదిరి గుంపుకి ఎదురు పరుగెత్తి వాళ్ళ మధ్యకు దూసుకు పోయింది సహస్ర.

ఆమె అంత సాహసం చేస్తుందని పాండ్యన్‌ కూడా వూహించలేదు. అతడి హెచ్చరికల్ని కూడా పట్టించుకోకుండా గొల్లున అరుస్తూ ఆయుధాలతో సహస్రను చుట్టు ముట్టారంతా. సహస్ర బరిసెను గిరగిరా తిప్పుతూ పోరాటం చేయనారంభించింది.బరిసె తిప్పటంలో ఆమె వేగం మెళకువలు చూసి పాండ్యన్‌ అంతటి వాడే ఆశ్చర్యపోయాడు. ఓ పక్క బరిసెను బాణాకర్ర మాదిరి తిప్పి ఆత్మరక్షణ చేసుకుంటూనే మరోపక్క సందు చూసి ఆమె కొడుతున్న బరిసె దెబ్బకి వంటి మీద దారుణమైన గాయాలు ఏర్పడి చావు కేకలు పెడుతున్నాడు ఒక్కొక్కడు.గుప్పెడు లావున ఆరడుగుల పొదవు దృఢమైన కర్ర చివర తప్పడగా మొగ్గ షేపులోని ఉక్కు తొడుగు బిగించబడి ఉంటుంది దానికి. రెండువైపులా పదునుండి చాలా ప్రమాదమైన ఆయుధం బరిసె. పొడిస్తే గుండెల్ని చీల్చేస్తుంది. తాకితే దారుణమైన గాయాల్ని చేస్తుంది. ‘‘కొట్టండి, నరకండి... చంపండి’’ అంటూ గుండాలు అరుపులతో ఆప్రాంతం మారుమోగుతోంది. పరిస్థితి చూస్తున్న పాండియన్‌కి సహస్ర వ్యూహం అర్థమైపోయింది. వెంటనే... ‘‘ఒరే తప్పుకోండి  దూరంగా తప్పుకోండి. మీరు తప్పుకుంటే మనవాళ్ళు దాన్ని కాల్చి చంపేస్తారు. లేకపోతే మనందర్ని అది చంపేస్తుంది. వెనక్కి వచ్చేయండి’’ అంటూ గొంతు చించుకొని అరిచాడు.పాండ్యన్‌ గొంతు విన్న మరు క్షణమే గుండాలంతా అలర్టవుతూ నేలక్కొట్టిన బంతుల్లా సహస్రను వదిలి వేగంగా చెదిరి పోనారంభించారు. వాళ్ళు తప్పుకుంటే తన ప్రాణాలకు ముప్పని సహస్రకు తెలుసు. ఎప్పుడైతే వాళ్ళు చెదిరపోనారంభించారో మరు క్షణం నేల మీది ఇనప రాడ్‌ ఒకటి అందుకొని తన వైపు రివాల్వర్లు గురి చేస్తున్న షూటర్స్‌ వైపు విసిరింది.

గింగిరాలు తిరుగుతూ వస్తున్న ఇనప రాడ్‌ను చూడగానే మరోసారి షూటర్స్‌ పక్కలకు పరుగు తీసారు. ఆ గేప్‌లో సహస్ర బరిసె వదలకుండా వేగంగా ఆవరణ లోంచి రోడ్‌ వైపు పొడవుగా వున్న శిథిలాల మండపం వైపు పరుగు తీసింది.‘‘పారి పోతోంది. ఆపండిరా దాన్ని కాల్చి పారేయండిరా’’ షూటర్స్‌ని హెచ్చరిస్తూ చిందులేస్తున్నాడు పాండ్యన్‌. కాల్పులు జరుపుతూ సహస్ర వెనక పడ్డారు నలుగురూ.బుల్లెట్లు గాల్లో దూసుకొస్తున్నాయి.తల మీదుగా దూసుకుపోతున్నాయి.కాళ్ళ వెనకే దుమ్ము తెరలు లేపుతున్నాయి.బుల్లెట్ల రేంజికి అందకుండా జిగ్‌ జాగ్‌గా పరుగులు తీస్తూ కన్ను మూసి తెలిచేలోన ఆవరణ దాటి వరండాలోకి వచ్చేసింది సహస్ర.పక్కనే రోడ్‌ వుంది.తనిప్పుడు రోడ్‌ దాటి అవతల చెట్ల తోపు లోకి పోతే చాలు. తను సేఫ్‌. వాళ్ళు పట్టుకోలేరు. కాని ఆ వెనకే రోడ్‌ వెంట ఏ జీప్‌లోనో పారిపోతున్న దీక్షను సులువుగా పట్టి వాళ్ళు చంపేస్తారు. పది నిమిషాల్లో వెనకే వచ్చేస్తామన్న తమ వాళ్ళింకా రాలేదు. వచ్చేవరకు వీళ్ళని ఆపుతూ తనిక్కడే ఉండాలి. లేదా పోరాడుతూ చావాలి. చచ్చేలోన కనీసం నలుగుర్ని చంపి తను చావాలి.

వరండాలోకి తప్పించుకున్న సహస్ర...ఒక ఎంట్రన్స్‌ పక్కన గోడకి స్థంభానికి మధ్యలో ఒదిగి కూచుంది. ధ్యాసంతా పక్కన ఎంట్రన్స్‌ వైపు ఎవరు వచ్చినా వేసేయడానికి సిద్ధంగా ఉంది.ఇదే సమయంలో ఆవరణలోని పాండ్యన్‌తో బాటు షూటర్స్‌ కూడా, ఎప్పుడైతే సహస్ర మండపం లోకి వెళ్ళి పోయిందో వెంటనే దూకుడు ఆపి ఉన్న చోట ఆగి పోయారు. ముఖ్యంగా షూటర్స్‌ నలుగురూ పాండ్యన్‌ సలహా మేరకు విడిపోయి ఒక్కొక్కడు ఒక్కొ ఎంట్రన్స్‌ వైపు రివాల్వర్లు గరి చేసి నెమ్మదిగా కదిలారు.ఆవరణ నుంచి మండపం కిందుగా రోడ్‌ మీదకు నాలుగు దారులున్నాయి. సుమారు రెండు వందల అడుగుల పొడవు మండపం అది. రోడ్డు అక్కడికి దిగువనుండటంతో ఆవరణలో వాళ్ళకి మండపంలో వాళ్ళగ్గాని అవతల రోడ్‌ కనబడదు. ఆచి-తూచి అడుగు ముందుకు వేయకపోతే ఏ ఎంట్రన్స్‌లోంచి సహస్ర దాడి చేసి ఎంత మందిని చంపుతుందో తెలీదు. అందుకే రివాల్వర్లతో కవర్‌ చేస్తూ నాలుగు మార్గాల వైపు విడి విడిగా కదిలారు షూటర్స్‌.లోపల స్థంభం పక్కప ఒదిగి బరిసెతో రెడీగా వున్న సహస్ర ధ్యాసంతా పక్కన ఎంట్రన్స్‌ మీద ఉండటంతో వెనక నుంచి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ఆలస్యంగా గుర్తించింది. తన వెనక ఏదో అలికిడి ఎవరో వస్తున్నారు. అదిరి పడి గిరుక్కున వెనక్కి చూసింది సహస్ర కాని అప్పటికే ఆలస్యమై పోయింది. సహస్ర తల తిప్పి చూసే లోపే ఆమె ముఖం మీదికి ఏదో బలంగా స్ప్రే చేయబడింది. అంతే ఆ తర్వాత ఏం జరిగిందో సహస్రకి తెలీదు.

క్షణాల్లో తెలివి తప్పి కిందకు వాలి పోయింది. వాలీ వాలక ముందే ఆమెను ఎత్తి భుజం మీద వేసుకుని రోడ్‌ మీదకు పారి పోయిందో ఆకారం.మరో అర నిముషం ఆలస్యంగా మండపం లోకి వచ్చిన షూటర్స్‌కి అక్కడ సహస్ర కన్పించ లేదు. పాండ్యన్‌తో సహా అంతా బిల బిలా రోడ్‌ మీదికొచ్చేసారు. కనుచూపు దూరంలో వాళ్ళకి ఎక్కడా సహస్ర జాడ తెలీటంలేదు. అంత దూరంలో ఇద్దరు కుష్టు వ్యాధి గ్రస్థులు తోపుడు బండిలో మరో కుష్టు వ్యాధి గ్రస్తుడ్ని తోసుకుంటూ కంజీరా వాయించి పాటల పాటుకొంటూ వెళ్తున్నారు.‘‘ఒరే... ఆ గండ్రా’’ అనరిచాడు పాండ్యన్‌.ఆగి తిరిగి చూసాడు వాళ్ళలో ఒకడు.‘‘లోపల్నుంచి ఓ అమ్మాయి పారిపోయి వచ్చింది ఎటెళ్ళిందో చూసారా?’’ అనడిగాడు పాండ్యన్‌.‘‘చూసాము సార్‌, రోడ్‌ దాటి అదో ఆ తుప్పలు దాటి చెట్ల తోపు లోకి పారిపోయింది’’ అని చెప్పి తమ దారిన ముందుకెళ్ళిపోయారు వాళ్ళు.తాము రోడ్‌ దాటి వెళ్ళినా అడవి లాంటి ఆప్రాంతంలో ఇక సహస్రను పట్టుకోడం అసాధ్యమని గ్రహించాడు పాండ్యన్‌. ఆ కోపం ఈ కోపం తమ వాళ్ళ మీద, హర్యానా షూటర్స్‌ మీద చూపిస్తూ వెంటనే బయలుదేరమని ఆర్డరిచ్చాడు.అంత వరకు కాస్త దూరంలో చెట్ల వెనక వుంచిన మూడు వేన్‌లు రివ్వున దూసుకొచ్చాయి. చేతులు తెగిన ఎట్టయప్పతో బాటు పాము కరచి చచ్చిన వాడి శవాన్ని క్షత గాత్రులని ఒక్కడ్ని కూడా వదలకుండా అందర్ని వేన్‌లోకి చేర్చారు. అక్కడ్నుంచి దక్షిణంగా అటు పక్క కాలనీ మీదుగా ఆస్పత్రి వైపు వేగంగా దూసుకు పోయాయి వేన్‌లన్నీ.నిజానికి అటుగా వెళ్తున్న కుష్టు వ్యాధి గ్రస్తులిద్దరూ వేరెవరో కాదు. కోయంచేడు మురడన్‌ ముత్తు, వాడి శిశ్యుడును. తోపుడు బండిలో కంబళి కప్పబడి వున్న మూడో మనిషి వేరెవరో కాదు మత్తు మందు ప్రభావంతో తెలివి తప్పిన సహస్ర. తల నుంచి పాదాల వరకు కంబళి కప్పేయటంతో ఎవరూ వూహించలేదు.నీ ప్రయత్నమనేది ఆపకు, ఏదో రోజు అదృష్టం నీ ఇంటి తలుపు తడుతుంది అని పెద్దలు వూరికే చెప్పలేదు ఇపుడా అదృష్టం ముత్తు తలుపు తట్టింది.

రక రకాల వేషాలతో సహస్ర కోసం వాళ్ళంతా గాలిస్తూనే వున్నారు. ఇవాళ అనుకోకుండా దిగువ కాలనీ మీదుగా ఏర్‌పోర్ట్‌ వైపు పోతున్న మురడన్‌ ముత్తు ఆ హవేలీ ప్రాంతానికి రాగానే స్థంభం పక్కన ఒదిగి సిద్థంగా మాటు వేసి వున్న సహస్రను గుర్తించటంలో పొరబాటు పడలేదు. అవతల ఆవరణ లోంచి కేకలు హెచ్చరికలు విన్పిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో కాస్త సాహసం చేయక పోతే పనులు కావు. తెగించి పిల్లిలా సహస్ర  వైపు కదిలి సాధించాడు.వాళ్ళు కొంత దూరం వెళ్ళే సరికి హడావుడిగా వేన్లు బైక్‌ మీద దీక్షతో సహా విరాట్‌ అంతా ఎదురయ్యారు. ఆ వెనకే ఒక ఆటో రివ్వున వచ్చి ఆగింది. బండితో సహా సహస్రను ఆటో లోకి చేర్చి ఇద్దరూ ఎక్కి కూచున్నారు. అంతే క్షణంలో ఆటో ఆ ప్రాంతం నుంచి అదృశ్యమైంది.అటు పాండ్యన్‌ తమ వాళ్ళతో రామ పురం ఆస్పత్రి  వైపు, ఇటు మురడన్‌ ముత్తు ఆటోలో తమ దారిన దూరంగా వెళ్ళి పోతుండగా విరాట్‌ బృందం నిర్మానుష్యంగా వున్న శిథిల భవంతికి చేరుకుంది.

******************************************

సహస్ర ఎక్కడ?

ఏమై పోయింది?

ఇక్కడ ఏం జరిగి వుంటుంది?

అక్కడ చెల్లా చెదురుగా పడున్న కర్రలు, ఇనప రాడ్‌లు మొదలైన మారణాయుధాల్ని, నేల మీది నెత్తుటి మరకల్ని చూస్తుంటే ఖచ్చితంగా సహస్ర ప్రత్యర్థులతో దారుణంగా ఘర్షణ పడిందనటంలో, పోరాటం చేసిందనటంలో సందేహం లేదు. కాని ఉన్నట్టుండి ఈ ప్రదేశం నిర్మానుష్యంగా అవటం అక్కడ సహస్ర జాడ లేక పోడం బోలెడు అనుమానాలకు తావిస్తోంది. అసలు, సహస్ర ప్రాణాలతో ఉందా అనే సందేహం కూడా కలుగుతోంది.

ఎవరికీ ఏమీ అంతు పట్టడం లేదు. ఒక్క అయిదు నిముషాలు ముందుగా వచ్చుంటే పరిస్థితి వేరుగా వుండేది. ఎంతో ధైర్యంగా ఉండే విరాట్‌ కూడా ఆక్షణంలో డీలా పడిపోతూ కూలబడి పోయాడు.

మరో ప్రక్కన...

ఈ అనర్థమంతటికీ తనే కారణమన్న బాధతో కన్నీరు మున్నీరుగా విలపిస్తొంది దీక్ష. ఎంత వెతికినా సహస్ర ఆచూకీ లేదక్కడ. మునుసామి, ధర్మ, కదిరేశన్‌ అంతా విరాట్‌ వద్ద కూర్చున్నారు. విరాట్‌ భుజం మీద చెయ్యేసాడు మునుసామి.‘‘ఏమై ఉంటుంది? వాళ్ళు సహస్రను చంపేసుంటారా?’’ రుద్ద కంఠంతో విరాట్‌ అడుగుతుంటే బాధగా ముఖ ముఖాలు చూసుకున్నారంతా.‘‘చిన బాబు ఏం మాటలవి?’’ అంటూ కోప్పడ్డాడు మునుసామి.

‘‘సహస్ర ఏమన్నా సాధారణ ఆడపిల్లా వాళ్ళ చేతుల్లో చావటానికి? రాచనెత్తురు. సాహసానికి మారు పేరు. ఆమెను చంపే మొనగాడున్నాడా? ఎందుకిలా అధైర్య పడతావ్‌? ఏమో శతృవుల్ని తరుముకెళ్ళిందేమో చూద్దాం వెయిట్‌ చేద్దాం. అన్నట్టు స్కూటీ.. సహస్ర వచ్చిన స్కూటీ ఎక్కడ? ఈ ప్రాంతం లోనే ఒక్కడో వుంటుంది? వెతకండిరా వెతికి తీసుకు రండి. అన్నాడు మునుసామి.’’ ఆ మాట వినగానే స్కూటీని వెదుకుతూ పరుగెత్తారు నలుగురు.

‘‘సహస్ర వద్ద సెల్‌ ఉందిగా ఓ ఫోన్‌ కొట్టి చూడరా’’ సలహా ఇచ్చాడు ధర్మ.

ఆ మాట వినగానే...

విరాట్‌ లో తిరిగి ఆశ చిగురించింది.

వెంటనే తన సెల్‌ నుంచి ఫోన్‌ చేసాడు.అవతల ఫోన్‌ రింగవుతోంది.కాని ఎత్తటం లేదు.ఇకసారి.... రెండోసారి..... మూడో సారి.ఫోన్‌ ఆన్‌ లోనే వుంది రింగవుతోంది. ఎత్తటం లేదంటే... తిరిగి సందేహం, విరాట్‌ ఇంకా డీలా పడిపోవటం చూసి... ‘‘ఆపకు ఇంకో సారి ఫోన్‌ చేయ్‌ చిన బాబు’’ అన్నాడు మునుసామి.విరాట్‌ ప్రయత్నం ఫలించింది.నాలుగో సారి ఫోన్‌ లిప్ట్‌ చేయబడింది.‘‘సహస్రా.... ఆర్‌ యు ఒకే?’’ ఆత్రంగా అడిగాడు విరాట్‌.అటునుంచి ఒక విటాట్టహాసం...అతడి ప్రశ్నకు సమాధానంగా...‘‘ఎవరు? ఎవడ్రా నువ్వు?’’ కోపంతో ముఖం జేగురిస్తుండగా గద్దించాడు విరాట్‌.‘‘ఎవర్నా... నేనెవర్నా? .... కిడ్నాపర్ని. ఇపుడు నీ సహస్ర మా బంధీ’’ అన్నాడు అవతలి వాడు.విరాట్‌కి పిచ్చి పట్టినంత పనైంది.అసలేమైందిక్కడ?త్యాగరాజన్‌ మనుషులేమయ్యారు? మధ్యలో ఈ కిడ్నాపర్లు ఎలా వచ్చారు? ఎవరు వాళ్ళు? సహస్రను ఎక్కడకు తీసుకు పోతున్నారు? ఫోన్‌లో వెనక ఏదో ఆటో పరుగెడుతున్న ఇంజన్‌ సౌండ్‌ వినబడుతోంది. త్యాగరాజన్‌ మనుషుల్నే ఇరగ దీసిన సహస్ర ఈ కిడ్నాపర్లకి ఎలా చిక్కింది? మధ్యలో వీళ్ళేవరో వస్తే ఎట్టయప్ప వాడి మనుషులు వూరుకుంటారా. నిజంగా కిడ్నాపా లేక తనను డైవర్ట్‌ చేయటానికి ఎట్టయప్ప వేసిన మరో ఎత్తుగడా!.‘‘మీరు కిడ్నాప్‌ చేస్తున్నారని నమ్మకం ఏంటి? ఫోన్‌ సహస్రకివ్వు’’ డిమాండ్‌ చేసాడు విరాట్‌.‘‘అబ్బో! నీ గురించి ఈ పిల్ల గురించీ మాకు తెలీదనుకున్నావా? నువ్వు చిరుతయితే ఈ అమ్మాయి శివంగి. స్పృహలో వుంటే మమ్మల్ని నంజుకు తినేయదూ? మత్తు మందిచ్చాం. స్పృహలో లేదు. తెలివి రాగానే మాటాడిస్తాలే.’’

ఆ మాటలు వింటంటే విరాట్‌కి నిజంగానే పిచ్చి పడుతున్నట్టుంది. అవతల వ్యక్తి గొంతు గంభీరంగా ఏమీ లేదు. ఎవడో కుర్ర వెధవలా మాటాడుతున్నాడు. ఒకటనుకుంటే ఇక్కడ మరేదో జరుగుతోంది.‘‘ఎవడ్రా నువ్వు? తను మీకెలా చిక్కింది?’’ విసుగ్గా అడిగాడు.‘‘ఆ చెప్పేస్తారండి పాపం, చెప్పను. చెప్పనంతే’’‘‘ఎక్కడికి తీసుకెళ్తున్నారు?’’‘‘అదీ చెప్పను’’‘‘ఇంకేం చెప్తావ్‌ రా?’’‘‘ఏదీ చెప్పనంటున్నానా?’’‘‘సహస్ర నిజంగా ప్రాణంతో వుందా?’’

‘‘అదేంటి బాసూ అంత మాటనేసావ్‌. మేం కిడ్నాపర్లం. హంతకులం కాదు. తను బతికుంటేనే గదా మాకు లాభం. తను నిక్షేపంగా వుంది. డౌట్‌ వద్దు. రాత్రికి ఫోన్‌ చేసి మాటాడిస్తా.’’‘‘మీ డిమాండ్‌ ఏమిటి?’’‘‘డబ్బు’’

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
death mistery