Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
eigth part

ఈ సంచికలో >> సీరియల్స్

కోట గోడలు - పాలగుమ్మి పద్మరాజు

kotagodalu telugu story

మా ఊరి రాజవీధి  కోటగుమ్మం దగ్గర ఆఖరవుతుంది. వీధికి రెండు ప్రక్కలా ఇళ్ళకు మధ్య అక్కడక్కడ లోతైనపాటి గోతులు ఆవులిస్తూ ఆకాశంవేపు చూస్తూంటాయి. ఇళ్ళ ఆవరణకు చుట్టూ మట్టితో కట్టిన మదురగోడలు వానలకు కరిగి చారికలు పడ్డాయి. మదుర్ల మీది పెంకులు జారిపోయాయి అక్కడక్కడ. ఆ చారికలు పాతబడిపోయాయి. వీధి మధ్యలో గుంటలు కూడా ఎప్పుడో పాతబడిపోయాయి. మా ఊళ్ళో కొత్తది ఏదీ వుండదు. పాతపడ్డదాకా దేన్నీ గుర్తించడం మాకు అలవాటు లేదు.

మా ఊళ్ళో అన్నిటికన్నా పాతవి కోటగోడలు. అంచేత అవి మా ఊరందరి గర్వకారణం. ఆ గోడలు మా రాజవంశీయులకు ఆదిపురుషుడు వందమైళ్ళ దూరాన్నున్న ఆరుద్రకోడు నుంచి మెట్టి తెప్పించి, మేకపాలతో మర్దించి కట్టించాడని ప్రతీతి. ఒకానొకప్పుడు ఆంగ్ల సైన్యాలు మా కోటని చుట్టుముట్టాయని లోపలికి బయటికి మనుష్యుల రాకపోకలే కాకుండా, సరుకుల రవాణా కూడా అరికట్టాయనీ, అప్పటి రాజావారు, వారి సైన్యాలూ ఆకలిదప్పుల బాధ కాగలేక లొంగిపోయినప్పటికీ కోట గోడలు మాత్రం ఆంగ్ల శతఘ్నుల దాటికి అణుమాత్రం జంకక గర్వంగా నిలబడి భారతభూమి గౌరవం కాపాడాయనీ, మా పెద్దలు మాకు కథలుగా చెప్పేవారు కాని ఇంత పౌరుషవంతమైన కోటగోడలూ కాలం తాకిడికి మాత్రం తలొగ్గి ఈనాడు శిథిలావస్థలో ఉన్నాయి. గోడల పైభాగం అంతా అడివిలా దట్టంగా చెట్లు పెరిగిపోయాయి. మా కోటగోడ లిప్పుడు త్రాచుపాములకు ఆవాసాలైనాయి.

మా ఊళ్ళో కరణం రామలింగం ఉన్నాడు. పురోహితుడు సుబ్బావధాని ఉన్నాడు, కోమటి సుబ్బన్న ఉన్నాడు, మంగలి రామన్న ఉన్నాడు. అతనే మా ఊరి వైద్యుడు కూడా.

వీరుగాక మా ఊళ్ళో పద్మసాని ఉంది. దొంగాప్పన్న ఉన్నాడు. మా ఊళ్ళో అన్నింటి లాగే పద్మసానికి దొంగప్పన్నకి మధ్య తగాదా కూడా చాలా పురాతనమైనది. అల్లిబిల్లిగా అల్లుకుపోయిన చరిత్ర అనే డొంకంతా కదిలించి ఈ తగాదాల తాలూకు తల్లివేళ్ళు ఎక్కడున్నాయో పట్టుకోడం ఈనాడు అసంభవం. ఒకరికొకరు గర్భ శత్రువులని ఇద్దరికీ తెలుసు, అంతే.

పద్మసాని ఇల్లు కోటగోడను ఆనుకుని ఉంది. ఒకప్పుడా ఇల్లు చాలా వైభవంగా ఉండేది. ఆ వైభవం తాలూకు చిహ్నాలు, కాలమనే సాలిపురుగు అల్లిన దట్టమైన గూడులోంచి, ఈనాడు కూడా తొంగి చూస్తుంటాయి. దొంగప్పన్న ఇంటికి, ఆ ఇంటికీ మధ్య ఒక్క గోడే అడ్డం. దొంగప్పన్న దొడ్డి కూడా కోటగోడని ఆనుకునే ఉంది. పద్మసాని అమ్మమ్మ, 'కలవాణి.' రాజావారితో తనకుగల పలుకుబడిని పురస్కరించుకుని అప్పన్న తాతని ఆ ఇంట్లోంచి వెళ్ళగొట్టించి తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించిందట.

అతను మాత్రం ధైర్యంగా నిలబడి తన ఇల్లు కలవాణి కాజెయ్యకుండా కాపాడుకున్నాడట. ప్రస్తుతం పద్మసానికి దొంగప్పన్న ఇల్లు సొంతం చేసుకోవాలన్న ఆశా లేదు. అందుకు అవకాశమూ లేదు. జమీందారువారి ఆసరా అంతకన్నా లేదు. కాని ఏది తరిగినా తగాదా మాత్రం పెరుగుతూనే ఉంది. తగాదాల డొంక ప్రతిదినం కొత్త చిగుళ్ళు తొడుగుతూనే ఉంది.

ఆరోజున తగాదా దొంగప్పన్న కోడిపెట్ట మూలంగా వచ్చింది. అది మదురుదాటి పద్మసాని పెరట్లోకిపోయింది. అప్పన్న కోటగోడ ఎక్కి దాన్ని మొహమాటపెట్టి తిరిగి తన దగ్గరకు తెచ్చుకోవాలని ప్రయత్నించాడు. కాని ఇది తిన్న ఇంటికి ద్రోహం తలపెట్టి, రెండు ఇళ్ళకూ మధ్య అనాదిగా వస్తున్న వైరాన్ని మరిచిపోయి పద్మసాని కోడిపుంజుతో సిగ్గూ బిడియం విడిచి సరసాలాడ్డం ప్రారంభించింది. దొంగప్పన్నకి కోపం ఆగలేదు. కోటగోడ మీది నుంచి పద్మసాని పెరట్లోకి మెట్లున్నాయి - వెనక ఎప్పుడో వాటి ఉపయోగం ఉండేది. వాటి మీద ఏ మనిషయినా అడుగుపెట్టి కొన్ని సంవత్సరాలై ఉంటుంది.
అప్పన్న కోపంతో ఒళ్ళు మరిచిపోయాడు. ఆ మెట్లు చకచకా దిగాడు. తన పెట్టని పట్టబోయాడు. అది డబ్బుల చుట్టూ అతన్ని తిప్పి మూడు చెరువుల నీళ్ళు తాగించింది. అయినా పట్టుదలగా దాని వెనకాల పరిగెత్తాడు.
హటాత్తుగా. "దొంగ! దొంగ!" అన్న పద్మసాని గొంతు విన్నాడు. పిడుగు పడినట్టు నిలబడిపోయాడు. ఇరుగు పొరుగు జనం చేరేసరికి కోడిపెట్ట మళ్ళీ అప్పన్న దొడ్లోకి ఎగిరిపోయింది. తను దొంగతనం కోసం రాలేదని నలుగురికీ రుజువు చెయ్యడానికి సాక్ష్యంగానైనా అది పద్మసాని దొడ్లో ఆగలేదు ఆఖరికి.
పద్మసాని తన్ను దొంగ అన్నందుకు అప్పన్నకి కోపం రాలేదు. పట్టపగలు దొడ్లోకి దూరి దొరికింది పట్టుకుపోయే చిల్లర దొంగ కాడని పద్మసానికి బాగా తెలుసు. అతను దొంగతనానికి పోతే ఇంటికి కన్నంవేసి అర్ధతాత్రివేళ రాజాలాగా ప్రవేశిస్తాడు. పద్మసాని, 'దొంగ దొంగ' అని అరవడం, పట్టపగలు అతను ఆమె దొడ్లో నలుగురికీ కనపడ్డం, అతనికి తల తీసేసినట్లయింది.

ఆరోజున పద్మసాని మీద అంతులేని ద్వేషం కలగడానికి మరో కారణం ఉంది.

ఇదివరకు పద్మసాని అతన్ని ఎన్నోసార్లు దూషించింది. కానీ స్త్రీ సహజమైన సిగ్గు కనబరుస్తూ తలుపు వెనక నిలబడి ఆమె ఎంతగా అతన్ని దూషించినా, ఆమె కంటి ఎదుట లేకపోవడం కారణంగా, అతను ఆమెకేమీ తీసిపోకుండా దులిపెయ్యగలిగేవాడు. ఈరోజుని అతని కళ్ళెదుట నిలబడి ఆమె తిట్టింది. అతని పెదవి పెగలలేదు. అతని గర్వం దెబ్బతింది.

అప్పన్నకి సృష్టిలో మూడు గర్భ శత్రువులు. మొదటిది ఆడది. ఆడదాని ముఖంవేపు కన్నెత్తి చూస్తే అతని నవనాడులు కృంగిపోతాయి. అతనికి ముచ్చెమటలు పోస్తాయి. వయసులో ఉన్నప్పుడు అతనికి కొంతమంది పడుచులతో చనువు ఏర్పడకపోలేదు. అయితే ఆ చనువు గుడ్డి ఉద్రేకంతో అర్ధరాత్రి చీకటి మరుగున ఏర్పడ్డది. వీధిలో అతనికి ఆడది ఎదురయితే అతను దూరంగా తొలగిపోయి తలవంచుకుని ఈ గండం గడిస్తే చాలన్నంత ఆందోళనతో సాగిపోతాడు. ఆడవాళ్ళంటే అతనికి గౌరవం, ఈర్ష్య, భయం.
అతని రెండో శత్రువు ఎలక. అతను కన్నం వేసినప్పుడు చూరెలుకలు చప్పుడు చేస్తే అతను మంచుగడ్డలా బిగుసుకుపోతాడు. ఎంత భయంకరమైన కుక్కనైనా అతను సునాసయంగా మచ్చిక చేసుకోగలడు. కాని అతనిలాలనకి అణుమాత్రమైనా లొంగకుండా జర్రున జారిపోతాయి ఎలకలు.

ఇంకా మూడో శత్రువు - రాంబాబు. పద్మసాని రెండేళ్ళ కొడుకు. ఆమెకు నలభయ్యో పడి దాటిపోతుందనగా అనుకోకుండా పుట్టాడు. అతని కళ్ళు రెప్పవాల్చకుండా సూటిగా చూసి అతన్ని భయపెడతాయి. ఆ చూపులు అప్పన్న గుండెల్లోకి చొచ్చుకుపోయి అక్కడ పేరుకుపోయిన అశాంతిని కవ్వంలాగ చిలికి మనసంతా గందరగోళం చేసేస్తాయి. తల్లిలాగ రాంబాబు ఎప్పుడూ అప్పన్నని తిట్టి ఎరుగడు. అంతేకాదు, అతని చూపులో చనువు చేసుకోవాలన్న కుతూహలం ఆకలిగా ఆవురుమంటుంది. అయితే ఏ రకమైన బంధాలన్నా అప్పన్నకి అపరిమితమయిన భయం. ఆ చూపులు అతనికి యమపాశాల్లా కనబడతాయి. రాంబాబు ఎదుటలేకపోయినా ఆ చూపులు అతన్ని వెంటాడుతుంటాయి.

ఆ మధ్యాహ్నం అలవాటు ప్రకారం అప్పన్న కోటగోడ ఎక్కి రావిచెట్టు నీడలో నడుం వాల్చుకున్నాడు. అరవై ఏళ్ళ అతని జీవితంలో ఆనాడు జరిగినంత అవమానం ఇంకెప్పుడు జరగలేదు. అతనికి జ్ఞానం వచ్చిన దగ్గర నుంచీ జరిగిన విషయాలన్నీతెర మీద బొమ్మల్లాగా అతని మనసులో కొచ్చి ఒత్తిడి చేసాయి.

అయిదేళ్ళ వయసులోనే తండ్రితో బాటు కన్నాలకు బయలుదేరి అతను కులవిద్య అతి శ్రద్ధగా నేర్చుకున్నాడు. అతని వేళ్ళకు అతి సున్నితమైన స్పర్శజ్ఞానం అలవడింది. ఏ గోడనైనా సరే అతను తన వేళ్ళతో ఆప్యాయంగా తడిమితే, ఆ గోడ తన రహస్యాలన్నీ అతనికి విప్పి చెప్పేస్తుంది. ఇటుకలు గుల్లబారిపోయాయో, ఎక్కడ సిమెంటు గుణపం పోటుకన్నా జంకకుండా బిగుసుకుపోయిందో, అన్నీ దాపరికం లేకుండా చెప్పేస్తుంది. ఈనాటి కన్నపు దొంగలకు ఆ స్పర్శజ్ఞానం పోయింది.

వయసులో ఉన్నప్పుడు పద్మసాని మహా వయ్యారంగా ఉండేది. ప్రతి సాయంత్రం ఆమె అందంగా అలంకరించుకొని తన దొడ్డిలోంచి మెట్ల ద్వారా కోటగోడ ఎక్కి అవతలపక్క కోటలోకి దిగిపోతుండేది. రావిచెట్టు నీడలో నిద్ర నటిస్తూ పడుకున్న అప్పన్న ఆమెను రోజూ చూస్తుండేవాడు. ఆమె మెడ పండు తమలపాకులా వుండేది. దాని మీద కన్నపు కత్తి కన్నా సన్నగా మూడు చారలుండేవి. చిన్న గడ్డానికి సరిగ్గా మద్యని చక్కని సొట్ట వుండేది. మధ్య పాపిడి తీసిన ఆమె ముఖం ఎదురుగా నిలబడి చూస్తే అరకు చక్కలా గుండేది. అతను రావిచెట్టు మొదట్లో తన కన్నాపు కత్తితో ఎన్నో అరకు చుక్కలు గీశాడు ఆరోజుల్లో. అవన్నీ ఇంకా అల్లాగే ఉన్నాయి. వెనుకటి రోజుల్లో ఆమె ముఖాన్ని గుర్తు తెస్తున్నాయి.

ఆరోజుల్లో పద్మసాని పెరట్లో మంచి పూలతోట ఉండేది. అప్పుడప్పుడు ఆస్థాన కవిగారు ఆ పెరట్లో ఆమెతో కూర్చుని పద్యాల్లోనే ఆమెతో సంభాషణ సాగించేవారు. ఆమె పద్యాల్లోనే సమాధానం చెప్పేది. ఆమె గొంతు తీగలాగ మోగేది. అప్పన్న రావిచెట్టు మొదట్లో పడుకుని చెవులప్పగించి వినేవాడు.

ఆమె పూర్తి పేరు పద్మాయాతాక్షి. రాజుగారు మేనత్త పెట్టిందా పేరు. రాజావారికి పద్మశానికి మధ్య ప్రణయాన్ని వర్ణిస్తూ మంచి ప్రబంధమొకటి రాసారు ఆస్థాన కవిగారు.

పద్మసానికి కులవృత్తి మీద గురి చాలా ఎక్కువ. అయితే కాల ప్రభావానికి లొంగిపోయి తన కుమార్తెలకిద్దరికీ ఆమె పెళ్ళిళ్ళు చేసేసింది. అందుకు అన్నివిధాలా తగిన అల్లుళ్ళు దొరకటం ఒకటే కారణం కాదు, అప్పటి రాజావారి ఆదరం సన్నగిల్లిపోవడం ముఖ్య కారణం. ఆ పెళ్లికెప్పుడు అలంకరించారో ఆ ఇంటిని. ఆ తరువాత మళ్ళీ ఆ ఇంటికి వెనుకటి కళ ఎన్నడూ రాలేదు. పూలతోటలో చీదరగా గడ్డీగాదం మొలిచిపోయాయి. గోడలకు వెల్ల వెలిసిపోయింది. ఇంటి కప్పొక పక్క దిగిపోయింది. అది బాగు చేయించే ప్రయత్నం జరగలేదు. రాజావారే కోట వదిలేసి పట్నానికి పోయారు. అంచేత పద్మాయాతాక్షి మెట్లెక్కి కోటలోనికి పోయే అవసరం తీరిపోయింది. ఆ మెట్ల అంచులు అరిగిపోయాయి. పద్మాయాతాక్షి శరీరంలోని సున్నితమైన వంపులన్నీ పూడిపోయాయి. ఆమె నడక మొద్దుగా బరువుగా తయారైంది. ఆ వెనకటి అందానికి చిహ్నాలుగా మెడ మీద మూడు గీతలు అప్పన్నకిప్పుడు మట్టుకు మిగిలాయి. ఆమెను చూస్తే వెగటు.

అప్పన్నకీ పద్మసానికీ మధ్య తగాదాలు ఎలా ప్రారంభమైనా ఒకలాగే ఆఖరవుతాయి. తన కులవృత్తి పద్మసాని కులవృత్తి కంటే చాలా గౌరవమైనదని గట్టి నమ్మకం. కాని అది రుజువు చెయ్యడానికి అవసరమైన వాలులేవితోచేవి కావు. అంచేత ఆమె గొంతు పెద్దది చేసి,

"కన్నాలేసుకు బతికే వెధవ్వి నువ్వూ మాట్టాడ్డవే," అనగానే,

"అబ్బోసి, కన్నెపిల్లవి, ముగ్గురు బిడ్డల్ని కన్నావు," అని ఎత్తిపొడిచేవాడు. ఆ మాట అనగానే ఆమె మూర్చబోయింది. 'అబ్బా,' అని అరుస్తూ. వైద్యుడు రాముడు అది గుండెజబ్బని అన్నప్పటికీ, అప్పన్నకి మట్టుకు అదొక పెద్ద నాటకమని అనుమానం.
ఆనాటి పొద్దున్న అతనికి అన్యాయంగా జరిగిన అవమానం అతనిలో అగ్నిపర్వతంలా రగిలింది.
అంతవరకూ అప్పన్న పద్మసాని ఇంటికెన్నడూ వేయలేదు. ఆమె ఆడది, ఒంటరిది. ఏ సహాయంలేని ఆమె ఇంటిని దోచుకోవడం తన వృత్తి ధర్మానికి వ్యతిరేఖమనిపించింది అప్పన్నకి. ఆమె తన హద్దు మీరి, ఆడదై యుండి కూడా అతని ఎదుటపడి బహిరంగంగా తిట్టింది. ఇంక తన హద్దుల్లో మాత్రం అతనెందుకుండాలి? ఆమె ఇంటికి కన్నం వేస్తే అతనికేమి దొరుకుతుందన్నది వేరే విషయం. కన్నం వెయ్యడమే ముఖ్యం.
అర్ధరాత్రి వేళ తన తొడలాగు తొడుక్కున్నాడు. అలవాటు ప్రకారం వొంటికి ఆముదం పట్టించాడు - ఎవరైనా పట్టుకుంటే జరిపోడానికి. కన్నపు కత్తి మొలలో దోపాడు. బుగ్గని పొగాకు బిగించాడు. అడ్డుగోడ దూకి అవతల ఆవరణలో ప్రవేశించాడు.
పద్మసాని పడకగది ఇంటికి దక్షిణాన్నుంది. కాని ఆగదికి కన్నం వెయ్యడానికి అతనికి మనసొప్పలేదు. ఉత్తరవేపుని ఉన్నది ఆ ఇంట్లోకి హాలు. హాలుకి కన్నం వెయ్యడం అతని వృత్తివిద్యకే వ్యతిరేఖం. అయినా సరే అతను హాలు కిటికీ ప్రక్కని మోకరించి కూర్చున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. గోడని ఆప్యాయంగా నిమిరాడు. చూపుడువేలితో సున్నితంగా కొట్టి చూచాడు. ఆ గోడ ఇచ్చిన సమాధానం అతి శ్రద్ధగా విన్నాడు. కిటికీ క్రింద ఒక చోటు చూసుకున్నాడు. తను లోపలికి దూరడానికి వీలైనంత కన్నం తవ్వుకున్నాడు.

కన్నపుకత్తి మొలలో దోపాడు. కళ్ళు మూసుకుని చేతులు జోడించి కులపెద్దల్ని భక్తిగా తలుచుకున్నాడు. ఒంగి జాగ్రత్తగా ఆ కన్నంలో నుంచి లోపలికి తొంగి చూసాడు. లోపల చీకటీ, నిశ్శబ్దం. అలవాటు ప్రకారం కాళ్ళు కన్నంలో పెట్టి మెల్లగా మోచేతుల మీద లోపలికి దేకాడు. అరవై ఏళ్ళ అతని అవయవాలు, ఇంకా అతను చెప్పినట్టు వింటాయి. కాస్త చప్పుడైనా చెయ్యకుండా లోపలికి చేరుకున్నాడు. కాళ్ళ మీద లేచి నిలబడ్డాడు.

అకస్మాత్తుగా అతని నరాలన్నీ బిగుసుకుపోయాయి. చెమటతో శరీరమంతా తడిసి ముద్దయిపోయింది. ఆ చీకటిలో నుంచి ఒక ఆకారం క్రమంగా అతని ఎదుట రూపొందింది. ఆ ఆకారం రాంబాబు.

రాంబాబు మౌనంగా అప్పన్న కళ్ళలోకి చూశాడు. అప్పన్న మనసంతా పిండిముద్ద లాగైపోయింది. అతడు చలనం లేకుండా స్తంభించిపోయాడు. కాస్త తెప్పరిల్లి పారిపోవాలన్న ఆలోచన మనసులో ప్రవేశించేసరికి రాంబాబు గొంతు అతని మనసుని వలలో పట్టింది.
"అప్పన్నా, ఎల్లిపోకు," అంది ఆ గొంతు.
ఆ గొంతులో అస్పష్టంగా ధ్వనించిన ఆందోళన అప్పన్నకి ఆశర్యం కలిగించింది.
"అమ్మ అలా ఉందేం?" అన్నాడు రాంబాబు. పడకగదివేపు చూపిస్తూ, అప్పన్న సమాధానం చెప్పకుండా అతన్ని అనుసరించాడు.

పద్మసాని శరీరం అసందర్భంగా మంచం మీద పరుచుకుని ఉంది. మెడ అసహజంగా వంపు తిరిగి, మంచం పట్టీ ఇవతల వేళ్ళాడుతోంది. పెదవుల సందు నుంచి కారిన రక్తం నేల మీద చిన్న మడుగు చేసింది. కొంత పెదవుల కొసని పేరుకుపోయింది.

"నాకు భయంగుంది," అన్నాడు రాంబాబు. చటుక్కుని అతన్ని చంకనేసుకుని బయటికి పరిగెత్తాడు అప్పన్న.
"గుండెజబ్బు." అన్నాడు వైద్యుడు రాముడు.
పద్మసాని అంత్యక్రియలు సుబ్బావధాని చేయించాడు. దహనం అవుతుంటే కరణం రామలింగం బతికున్న రోజుల్లో ఆమె వైభవాన్ని వర్ణించాడు. అంతసేపు రాంబాబు అప్పన్న చంకనే అంటి పెట్టుకుని ఉన్నాడు. అప్పన్న కూర్చోలేదు. పద్మసాని ఇంటి హాలులో వున్న కన్నాన్ని గురించిగాని, అప్పన్న వేసుకున్న తొడలాగు, పూనుకున్న ఆముదాన్ని గురించిగాని ఎవరూ ప్రస్తావించలేదు.

దహనమాయ్యాక అడ్డదారిని ఇంటికి బయలుదేరాడు అప్పన్న. కోటగోడ ఎక్కాడు. కాలిదారిన తన ఇంటి వెనక వున్న రావిచెట్టు నీడకొచ్చాడు.
అకస్మాత్తుగా అప్పన్నకి బ్రతుకులో ముఖ్యమైనదేదో జారిపోయినట్టు అనిపించింది. పద్మసాని దొడ్డివేపు చూసాడు. నేలంతా రకరకాల మొక్కలతో చీదరగా పెరిగిపోయింది. ఎన్నడూ మనిషి సంచారం ఎరగనట్టు. కోటగోడ శిథిలమైపోయింది. తను కూర్చున్న చోట ఎన్నడూ చూడనటువంటి అడవిలాగా అనిపించింది. అతను చటుక్కున చతికిలబడిపోయాడు. అరవై ఏళ్ళ అలసట ఒక్కసారిగా అతని అవయవాలను నిర్వీర్యం చేసింది. నిద్రపోతున్న రాంబాబును ఒళ్లోకి తీసుకున్నాడు. సున్నితమైన తన వేళ్ళతో అతని లేత చెక్కిలి నిమిరాడు. కన్నపు కత్తి మొలలో గుచ్చుకుంటోంది చాలాసేపుగా. అది లాగాడు. అటూ ఇటూ తిప్పి చూసాడు. ఆ పగటి ఎండలో అది తలతలా మెరిసింది. అతను ఎన్నడూ ఎరగని వింతప్రాణిలా అతని చేతికది కొత్తగా తగిలింది.

అతని ఒళ్ళు గొంగళిపురుగును తాకినట్టు జలదరించింది. తొందరగా ఆ కత్తిని శక్తికొద్దీ విసిరేశాడు. ఆ కత్తి ఆ కోటగోడల శిథిలాల్లో ఎక్కడో కలిసిపోయింది.

రావిచెట్టు మొదలు వానుకొని కళ్ళు మూశాడు. రాంబాబు అతని ఒళ్ళో నిద్రపోతూనే ఉన్నాడు.

మరిన్ని సీరియల్స్