Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

రెండవ భాగం

Second Part

"అందానికి అందంలా ఉందామె" ప్రతిఒక్కరిలోనూ అదే భావన. చూపు తిప్పుకోలేని తన్మయత్వం.

"మోస్ట్ బ్యూటీఫుల్ ప్రెట్టీ గాళ్" మనస్సుల్లోనే ఆమెకి అభినందన సభ ఏర్పాటు చేసి మరీ కితాబిచ్చేస్తున్నారు జర్నలిస్టులు.

"సినిమా పుట్టిందగ్గర్నుంచీ ఎందరో అందగత్తెలు ఎప్పటికప్పుడు తమ యవ్వనవిలాసాలతో వెండితెరకి కొత్త సొగసులద్దుతునే ఉన్నారు. తమ క్రీగంటి చూపుల్తో, నవ్వుల్తో, నడకల్తో, నాట్యాల్తో సోయగాలు వడ్డిస్తూనే ఉన్నారు. 'హీరోయిన్' అనే కామన్ నేమ్ తో ప్రతిఒక్కర్నీ పిలిచేస్తున్నా ఒకనాడు ఆమె ఓ వైజయంతిమాల... ఓ హేమమాలిని... దేశాన్నే ఓ ఊపు ఊపేసిన ఓ భాగ్యశ్రీ... మరిపుడో? గాయత్రీపాటిల్" అన్నాడు మనోహర్ ఆమెని ప్రత్యక్షంగా చూడగానే తనలో భావుకత పొంగులెత్తగా.

"ఔను... ఇప్పటి తరాన్ని వెర్రెత్తించేందుకు వస్తోంది ఈ అమ్మడు" ప్రశంసించాడు సుదర్శన్.

"అందరికీ నమస్కారం" అంది గాయత్రీపాటిల్ తుమ్మెదరెక్కల్లాంటి కన్రెప్పల్ని టపటపలాడిస్తూ.

"ఫ్లీజ్... ఇంతమాత్రమే నాకు తెల్గు వచ్చు. ముందు ముందు ఎంతో బాగా మీ లాంగ్వేజ్ లోనే కమ్యూనికేట్ చేయగలనని మాటిస్తున్నాను..." అంటూ ఆమె ఇంగ్లీషులో తన భావాల్ని వ్యక్తం చేసింది.

తన నేటివ్ ప్లేస్ సిమ్లా... ఫాదర్ బిజినెస్ మాన్, మదర్ హౌస్ వైఫ్... ఒకే ఒక బ్రదర్ మెడిసన్ ఫస్టియర్... తను ప్లస్ టూ చదువుతుండగా ఈ ఆఫర్ వచ్చిందని అనర్ఘలంగా ఆంగ్లంలో సెలవిచ్చింది.

"ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లకు, ఎగ్జామ్స్ కి అవసరమయ్యే పాస్ పోర్ట్ ఫోటోలకోసం తప్ప ఎపుడూ కెమెరా ఫేస్ చేయలేదని... అలాటిది ఫుల్ లెంగ్త్ మూవీలో తను హీరోయిన్ గా చేస్తూ ఫస్ట్ టైమ్ కెమెరాని ఫేస్ చేయడం ఎప్పటికీ మరచిపోలేని మధురానుభూతి అని ఆమె చెప్పుకొచ్చింది.

'మీ ఫస్ట్ క్రష్ ఎవరితో?' అని ఎవరైనా అడిగితే నా ఆన్సర్ ఒకటే ... కెమెరాతో' అని తన పెదాలకొమ్మపై ఇన్ని నవ్వులు పూయించింది.

"ఇండియా నిజంగా ఎంతో గొప్పది. ఇన్ని ప్రాంతాలు, కులాలు, భాషలున్నా మనమంతా భారతీయులం. ఆ భావనే మనందర్నీ కలిపే ఐక్యతా సూత్రం..." అంటూ భారతీయత చాటుకుంది.

"ఎక్కడో సిమ్లాలో పుట్టినతాను ఇపుడిలా తెల్గులో సిన్మా చేస్తున్నానంటే గర్వంగా ఉందంటూ ఆనందపడింది. అంతలోనే... ఈ సిన్మా సక్సెస్ నా చేతుల్లో లేదు. ఇకపై మీ చేతుల్లోనే ఉందని జర్నలిస్టుల వేపు ప్రేమగా చూసింది. ఆమె అలా చూసేసరికి సుదర్శన్ నిజంగానే ప్రేమలో పడిపోయాడు. సరిగ్గా అపుడే... అతడికి ఆమె సంతకం చేసి పంపించిన ప్రేమలేఖ గుర్తొచ్చి గుండెవేగంగా కొట్టుకుంది.

"నా గురించి ఇన్ని విషయాలు చెప్పాను కదా... ఇక, మీకేం కావాలో మీరు అడుక్కోండి" అంది మళ్ళీ వచ్చీరాని తెలుగులో. ఆమె ముద్దుముద్దు మాటలకి నవ్వారంతా.

"ఈ ఆఫర్ మీకెలా వచ్చింది?" అడిగాడో జర్నలిస్టు.

"అదృష్టం మా ఇంటి తలుపులు తడితే వచ్చిందీ ఆఫర్..."

"కాస్త విడమర్చి చెప్తారా?"

"సిమ్లాలోని ఓ ఫోటో స్టూడియోలో నా ఫోటో డిస్ ప్లే చేస్తే అక్కడికి ట్రిప్ కొచ్చిన డైరక్టర్ సర్ చూసి ఈ ఆఫర్ ఇచ్చారు" చెప్పేసింది ఆమె.

"ఆ స్టూడియోలో మీ ఫోటో ఎందుకుంది?" అడిగాడు మరో జర్నలిస్టు.

"అదే నాకు అర్ధం కాని విషయం. డైరెక్టర్ గారు చూసి చెప్పేదాకా... ఆ స్టూడియోలో నా ఫోటో ఉందని నాకు తెలీదు. తీరా వెళ్లి చూస్తే క్లోజప్ లో అద్దాలవెనుక అందంగా ఉంది నా బొమ్మే. స్టూడియో ఓనర్ ని అడిగితే... ఫోటో బాగుందని బిగ్ సైజ్ లో ఎన్ లార్జ్ చేసి మరీ డిస్ ప్లేకి ఉంచారట" చెప్పింది గాయత్రీ ఆనందంగా.

"మీ చేతుల్లో ఎన్ని ఆఫర్లున్నాయి?"

"ఆఫర్లయితే చాలానే ఉన్నాయి. ఈ మూవీ రిలీజయ్యాకే సైన్ చేస్తా?"

"నెక్స్ ట్ మూవీలో మీ కేరక్టర్ కి మీరే డబ్బింగ్ చెప్పుకుంటారా?"

"ట్రయ్ చేస్తా."

"యాక్టింగ్ లో మీ రోల్ మోడల్..."

ఆ మూవీ పిఆర్ వో వేపు గాయత్రీపాటిల్ చూసింది. తన పెదాల కదలిక ద్వారా మూడక్షరాల పదాన్ని అతడందించాడు.

ఆ మూడక్షరాలు - 'సా...వి...త్రి'.

గాయత్రి కూడా - 'సావిత్రి' అంది పైకి.

"సావిత్రా? యూమీన్ మహానటి సావిత్రి" అడిగాడు ఓ జర్నలిస్టు క్లారిఫికేషన్ కోసం.

"ఎస్... ఆ స్టార్ హీరోయిన్ నా ఫేవరేట్" అందామె.

"సావిత్రి నిజంగా స్టార్ హీరోయినా? హతవిధీ" ఓ జర్నలిస్టు మనసు కలుక్కుమంది. కాటుకపూసిన విశాలమైన కళ్ళు... ఆ కళ్ళలోనే ఉంది అనంతకోటి భావాల్ని వ్యక్తం చేసే సమ్మోహన శక్తి. ఆమె కష్టపడి నటించక్కర్లేదు. అలవోకగా కళ్ళు అలా కదిలిస్తే చాలు... వెయ్యి మాటలు వ్యక్తీకరించాల్సిన విషయాన్ని ఆమె ఒక్క చూపు వ్యక్తీకరిస్తుంది. అందుకే, సావిత్రి అభి'నేత్రి' అయింది.

"సావిత్రి యాక్ట్ చేసిన రీసెంట్ మూవీస్ ఎన్నో నాకు ఇన్ స్పిరేషన్ గా నిలిచాయి" ఇంకో బాంబు పేల్చింది గాయత్రి.

'ఏంటీ... సావిత్రి యాక్ట్ చేసిన రీసెంట్ మూవీస్ మీరు చూసారా?" అడిగాడో జర్నలిస్టు తను చూడని ఆ మహానటి సావిత్రి ఇటీవలి చిత్రాలేమిటా? అని మనసులోనే సందేహపడుతూ.

"మీ తెలుగు స్టార్ హీరోయిన్ గురించి మీకు తెలీదా? అన్నీ నన్నడుగుతారేంటీ? ఒక్కమాటలో చెప్పాలంటే నా నట జీవితంలో సావిత్రియే తొలిగురువు. కెమెరా ఎలా ఫేస్ చేయాలా? అన్న దగ్గర్నుంచీ తెరపై ఆమెని చూసే అన్నీ నేర్చుకున్నాను. ఇప్పటికీ నా మనసు బాగోలేకపోతే సావిత్రి నటించిన ఏదో ఒక మూవీ ప్లే చేస్తుంటాను" చెప్తోంది గాయత్రి.

"సావిత్రి నటించిన ఏ చిత్రాలు మీకు ఇష్టం"

"మల్లీశ్వరి..." టక్కున చెప్పిందామె.

"ఒకప్పటి గొప్ప చిత్రాల్నే కదా ఈమధ్య మళ్ళీ మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అప్పటి మల్లీశ్వరి చిత్రాన్ని మళ్ళీ నిర్మిస్తే..."

"మీరు నటిస్తారా?" అడిగాడో జర్నలిస్టు.

"అంత అదృష్టం కూడానా... ఆ అవకాశాన్ని కత్రినాకైఫ్ ఎపుడో కొట్టేసింది కదా" మళ్ళీ ఝలకిచ్చింది.

"ఏంటీ... కత్రినా కైఫ్ మల్లీశ్వరిలో యాక్ట్ చేసిందా?" ఇంకో జర్నలిస్టు అనుమానం.

"అరే... ఫిలిం జర్నలిస్టులై ఉండి మీ తెలుగు మూవీస్ గురించి మీకేం తెలీనట్లుందే... మూవీ మొఘల్ రామానాయుడిగారబ్బాయి విక్టరీ వెంకటేష్ పక్కన 'మల్లీశ్వరి' లో కత్రినా యాక్ట్ చేయలేదా?"

"కరెక్టే... లేటెస్ట్ 'మల్లీశ్వరి' లో కత్తిలాంటి కత్రినాయే హీరోయిన్" అన్నారు జర్నలిస్ట్ లంతా ముక్తకంటంతో.

"అదేగా నే చెప్తోంది" అంటోంది అమాయకంగా చూస్తూ గాయత్రి.

"ఏవోయ్ మన్మధరావ్... జర్నలిస్ట్ ల్తో ఏం మాట్లాడాలో..మ ఏం మాట్లాడకూడదో హీరోయిన్ కి తర్ఫీదు ఇచ్చానన్నావ్... ఇదేనా?" కోపంగా అరిచాడు ప్రొడ్యూసర్ మాతంగరావు.

"సర్...అదీ...నేను సరిగ్గా చెప్పాను. హీరోయిన్ గారే..."

"అంటే... నువ్వు చెప్పినదానికి ఆవిడ చెప్పినదానికీ లిప్ సింక్ కుదరలేదంటావ్?" కస్సుమన్నాడాయన.

తన మూవీకెంత పిఆర్ వో అయినా... అతడూ జర్నలిస్టే. ఇలా ప్రెస్ మీట్ లో జర్నలిస్ట్ లందరి సమక్షంలో పిఆర్ ఓపై తను ఎగరడం ఎక్కడికి దారితీస్తోందోననే కించిత్ భయంతో ఆ ప్రొడ్యూసర్ కాస్త వెనక్కి తగ్గాడు. తర్వాత జర్నలిస్ట్ లందరికీ వినయపూర్వకంగా నమస్కరిస్తూ - "మీ క్కావల్సిన విషయాలన్నీ వచ్చాయనుకుంటాను. ఇక, ప్రెస్
మీట్ ముగిద్దామా?" అడిగాడు.

ఆ తర్వాత - "ఎక్కడో సిమ్లాలోంచి ఇక్కడి సిన్మాలో యాక్ట్ చేసేందుకు వచ్చింది గాయత్రీపాటిల్. మన సిన్మాలో నటిస్తున్నా ఓరకంగా ఆమె మన గెస్ట్. ఇక్కడి ఇండస్ట్రీ గురించి... పాతతరం హీరోయిన్ల గురించి అవగాహన లేక ఏదో చెప్పింది.అవన్నీ మీరు పట్టించుకోకండి. ఆమె మాటల్ని కాదు... మనసుని అర్ధం చేసుకోవాలి. నిజానికి, ఆమె ఏం చెప్పిందంటే... సావిత్రిలాంటి ఇక్కడి హీరోయిన్ తనకు మార్గదర్శి అని, ఆ విషయం గుర్తించి మా హీరోయిన్ గాయత్రిపాటిల్ ని మీడియా ద్వారా జనాలకు ఇంట్రడ్యూస్ చేస్తారని ఆశిస్తాను. ఫ్లీజ్! మనం మనం ఇండస్ట్రీలో కలిసిమెలిసి ఉండాల్సినవాళ్ళం. అంతామంచిగానే రాస్తారనుకుంటా" అన్నాడాయన.

"అలాగే..." తలూపారు జర్నలిస్టులు.

"రిఫ్రెష్ అవండి" అన్నాడాయన.

ఇండస్ట్రీలో ఓ ప్రెస్ మీట్ తర్వాత జర్నలిస్టులు 'రిఫ్రెష్' అవడమంటే... మందులో మునిగితేలడమే. దాంతో... ఏ కొద్దిమందో తప్ప చాలామంది జర్నలిస్టులు స్టార్ హోటల్లో జరిగే ఇలాటి ప్రోగ్రామ్స్ ని వదులుకోవడానికి ఇష్టపడరు. ఒక్కోసారి ఒక్కోపత్రిక నుంచి ముగ్గురు నలుగురు జర్నలిస్టులు కూడా అటెండవుతుంటారు.

అందుకే...ఎక్కడే పొరపాట్లు జరిగినా జర్నలిస్టులు వార్తలు వండరు. అలా వండితేనే 'వండరు'.

ప్రొడ్యూసర్ ధైర్యం కూడా అదే.

అయితే, అంతటివాడు కూడా ఓ విషయాన్ని అంతగా పరిగణలోనికి తీసుకోలేదు. అదే... ప్రింట్ మీడియాకి సమాంతరంగా, మరింత బలంగా ఎదుగుతున్న ఎలక్ట్రానిక్ మీడియా గురించి. ఆ విషయం గుర్తించే లోపునే...'తన రోల్ మోడల్ సావిత్రినే ఎరుగని నూతననటి గాయత్రి'... అంటూ టీవీల్లో మొదట స్క్రోలింగ్ లు... తర్వాత హాఫెనవర్ ప్రోగ్రామ్ లు శరవేగంగా టెలికాస్ట్ అయిపోయాయి.

వెన్వెంటనే... విజేతా ప్రొడక్షన్ కార్యాలయంలోని ఫోన్లన్నీ లెక్కకు మిక్కిలి కాల్స్ తో బిజీ అయిపోయాయి.

"బాల్యానికి గుడ్ బై చెబుతూ యవ్వనాల మలుపు తిరుగుతున్న నూనుగు మీసాల కుర్రవాడి కళ్ళవాకిళ్ళలో ఆమె 'కలలదీపాలు' వెలిగించే ప్రేమరాణి. కొత్తగా లోకాన్ని అందంగా, ఆనందంగా వీక్షిస్తున్న యువతికి ఆమె ఒక 'గోల్'. ఎస్...ఖచ్చితంగా ఆమె ఆ యువతి లక్ష్యం. అచ్చం ఆమెలా ఉండాలని, ఎర్రెర్రని పెదవుల్లో విరిసీవిరియని చిర్నవ్వులను ఆమెలా విరజిమ్మాలని కొత్తగా వయసు తలుపు తెరిచిన సుందరి అభిలాష... ఇకపై, జగమంతా ఆమెనే విస్మయంగా చూస్తుంది. ఆమె అందాల్ని ఆరాధిస్తుంది. ఆమెని నిండుగా అభిమానిస్తుంది. ప్రేమిస్తుంది. నిఖిల జగమూ నిండు హర్షంతో ఆమె కదలికల్ని గమనిస్తుంది. అవున్నిజం - కొట్లలో ఒకరు ఆమె.

సినీవనానికి విచ్చేసిన వసంతభామిని. అందానికి నిర్వచనంలా... సౌందర్యానికి నిలువెత్తు రూపంలా భాసిల్లే ఆమె - గాయత్రీపాటిల్" చదివాడు రంగధామరావు. తర్వాత తన ఎదురుగా నిల్చున్న సుదర్శన్ వేపు ప్రశ్నార్ధకంగా చూసాడు. ఎడిటర్ అలా చూసాడంటే తను రాసిన కంటెంట్ నచ్చలేదని అర్ధమైపోయింది సుదర్శన్ కి.

"సర్... అదీ..."

"అదే... ఏమిటని అడుగుతున్నాను" అడిగాడు రంగధామరావు.

"కొత్తగా ఇండస్ట్రీకొచ్చిన ఓ హీరోయిన్ ఇంట్రడక్షన్ కి సంబంధించిన ఆర్టికల్. గోల్కొండ హోటల్ లో ప్రెస్ మీట్ జరిగింది కదా... ఆ కవరేజ్" చెప్పాడు సుదర్శన్.

"మందూ, విందూ బాగుందా?" అడిగాడు ఎడిటర్.

'జర్నలిస్టుల్లో ఫిల్మ్ జర్నలిస్టులు వేరయ్యా..." అన్నట్టుంటుంది ఫిల్మ్ జర్నలిస్టుల పరిస్థితి. ఎదురింటి గోడ మీద ప్రతి శుక్రవారం మారే పోస్టర్లు... రంగురంగుల్లో కనిపించి ఊరించే తారలు... గోడ దూకి అర్ధతాత్రి నిద్రమేల్కొని మరీ చూసిన సెకండ్ షోలు... ఊహకందని కొత్త ప్రపంచాల్ని పరిచయం చేస్తుంటే... తెలిసీ తెలియని వయసులో అలజడి. ఈస్ట్ మన్ కలర్ సినిమాల మీద వెర్రిప్రేమ... దాంతో, తాము కూడా రంగుల లోకంలో బతికేయాలని ఫిల్మ్ నగర్ చేరుకొని... తీరా, ఇక్కడికి వచ్చిన తర్వాత రెండ్రోజులు స్టూడియోలు, హీరో హీరోయిన్ల ఇళ్ళు చుట్టుముట్టేసి... ఇకపై బతికేందుకు ఏం చేయాలో తెలీక... ఇలా ఫిల్మ్ మాగజైన్లలో చేరిపోయేవాళ్ళు కొందరు. పత్రికల్లో జర్నలిస్ట్ లుగా పనిచేస్తుంటే 'ఆకలి' అనే సమస్యకు తక్షణ పరిష్కారం దొరుకుతుంది. ఓ స్టూడియోలో ఉదయం అల్ఫాహారం, మరో షూటింగ్ లో 'మధ్యాహ్న భోజనం', సాయం సమయంలో ఏ స్టార్ హోటల్లో జరిగే ఆడియో ఫంక్షన్ లో టీ స్నాక్స్... రాత్రి ప్రెస్ మీట్ లో మందు, విందు. ఇదీ ఇంచుమించు చాలామంది ఫిల్మ్ జర్నలిస్టుల లైఫ్ స్టయిల్. తాము నేర్చుకున్న అక్షరాల్ని ఇటు తిప్పి అటు తిప్పి పాటలనిపించే మాటలు పేర్చి అపుడే వేటూరి, సీతారామశాస్త్రి అయిపోయామనే భ్రమలో పడిపోయి ఫిల్మ్ నగర్ చేరుకొని ఇలా ఫిల్మ్ మాగజైన్ లో చేరిపోయినవాళ్ళెంతోమంది ఉన్నారు. అలాటివాళ్ళలో సుదర్శన్ కూడా ఒకడు.

"నీకు మందు విందు బాగుంటే నాకు ఆర్టికల్ బాగుండాలి" అన్నాడు రంగధామరావు సుదర్శన్ రాసిన పేపర్లను అతడిమొహం మీదే విసిరికొడ్తూ.

"అసలేం రాసావో నీకు తెలుస్తోందా?"

"గాయత్రీపాటిల్ గ్లామరస్ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతోంది. అందుకే, ఆర్టికల్ ఇంట్రోకి పొయెటిక్ టచ్ ఇచ్చా"

"నీ మొహంలా ఉంది కవిత్వం... ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములే వాడి" అన్నాడు రంగధామరావు చిరాకుపడ్తూ. అర్ధం కానట్టు పిచ్చిచూపులు చూస్తూ నిల్చున్నాడు సుదర్శన్.

"ఏంటలా చూస్తావ్. గాయత్రీపాటిల్ గురించి చానెల్స్ లో చూసి రాసుకురా. మహానటి సావిత్రి గురించి తెలీకుండానే ఏదేదో వాగిందటగా... అవన్నీ మిస్ చేసి ఆమె నడిచొచ్చే దేవత... నక్షత్రం... అంటూ నీ కవిత్వపు పైత్యాన్ని చూపించకు. ఆ పిల్ల నీకంతగా నచ్చితే నీ రూంలో నిద్రపోయే వేళ పిచ్చిపిచ్చి కలలు కను. అంతేకానీ... ఇలా పిచ్చిపిచ్చి రాతల్తో పత్రిక పరువు తీయకు" హెచ్చరించాడు ఎడిటర్.

అవమానభారంతో ఎడిటర్ చాంబర్ నుంచి బయటకొచ్చాడు సుదర్శన్.

(...ఇంకా వుంది)

మరిన్ని సీరియల్స్
eigth part