Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Second Part

ఈ సంచికలో >> సీరియల్స్

ఎనిమిదవ భాగం

eigth part

మరోసారి పెద్దగా నిట్టూర్చి లేచాడు గోపాల్.

"చౌదరిగారూ! ఒక విధంగా మీరు చెప్పింది కరెక్టేమోగానీ, నా వరకు అది సరికాదు. నేను అమెరికా వచ్చేముందు మా అమ్మగారు చెప్పినమాటలు ఇప్పటికీ నాకు గుర్తొస్తున్నాయి. నువ్వు అమెరికా వెళుతుంది డబ్బు సంపాదన కోసం. ఎంతయినా సంపాదించు. కానీ తెలుగువాడిగానే బ్రతుకు. మనది తెలుగు కుటుంబమని, ఆంధ్రజాతి అని మర్చిపోకు, మర్చిపోవడమంటూ జరిగితే నువ్వు ఇండియా తిరిగిరావు. అక్కడివాళ్ళతో కలిసిపోతావు" అంది.

ఆవిడ పెద్దగా చదువుకోలేదు. కాని ఆ మాటల్లో ఎంత అర్ధం వుందో ఆలోచిస్తే తెలుస్తుంది. చాలామంది ఇక్కడకు రాగానే ఇక్కడి సుఖవంతమైన జీవితానికి, విలాసాలకు అలవాటుపడిపోయి మనం తెలుగువాళ్ళమన్న సంగతే మర్చిపోతున్నారు. ఇక అలాంటి పిల్లలు సరేసరి. నాలుగయిదు తరాలకు ముందు వచ్చేసిన కుటుంబాల్లో తాము బారత సంతతికి చెందినవారమని, తమ జాతి మూలాలు ఇండియాలోనే వున్నాయని తెలిసినా, తమ బంధువులు ఎవరు, ఎక్కడ వున్నారో కూడా తెలీని పరిస్థితి ఇదే. మా పిల్లల్ని అలాంటి పరిస్థితికి వెళ్లనీయటము నాకు ఇష్టంలేదు.

వాళ్ళని సరైన మార్గంలో పెట్టడం ఎలాగనేదే నా సమస్య... పరిష్కారం లభిస్తుందనే ఆశిస్తున్నాను. చూద్దాం" అంటూ నవ్వేశాడు.

"మీ బాధ అర్ధమైంది గోపాల్ గారూ. మాతృభూమిని, మాతృభాషని మర్చిపోవడం అంతతప్పని నాకు తెలుసు. కానీ, అయాం హెల్ఫ్ లెస్, మీ ప్రయత్నం ఫలించాలని ఆశిస్తాను." అన్నాడు డాక్టర్ చౌదరి.

"బెస్టాఫ్ లక్" అంటూ లేచి తన కారువైపు వెళ్ళిపోయాడు జగన్మోహన్.

డాక్టర్ చౌదరి, జగన్మోహన్ ల కార్లు వెళ్ళిపోగానే. తన కార్లో బయలుదేరాడు గోపాల్.

ఆ కారు విశాలమైన రోడ్ లోకి తిరిగి వేగం పుంజుకొంటుండగా అదే సమయంలో పెద్ద గండభేరుండపక్షిలా పాన్ అమెరికా విమానం ఒకటి డెట్రాయిట్ ఎయిర్ ఫీల్డ్ వైపు దూసుకుపోతూ కన్పించింది.

భర్త జాగింగ్ నుంచి ఇంటికి రాగానే కాఫీకప్పుతో హాల్లోకి వచ్చింది సత్యవతి. ఆ రోజు శనివారంగావటంతో తలారస్నానం చేసి చీర జాకెట్లో కడిగిన ముత్యంలా మెరిసిపోతోందావిడ. పూజ గదిలోంచి సాంబ్రాణి ధూపం అగరువత్తుల ఘుమఘుమలతో పాటు, సౌండ్ సిస్టం నుంచి మనసును ఆహ్లాద పరిచి భక్తిభావాన్ని మేల్కొలిపేలా వెంకటేశ్వర సుప్రభాతం మంద్రస్థాయిలో వినవస్తోంది.

"సో... నీ పూజాకార్యక్రమాలు ముగిసినట్టేగా?" కాఫీ కప్పు అందుకుని సోఫాలో కూర్చుంటూ భార్యను అడిగాడు గోపాల్.

"అలా అడక్కపోతే మీరు కూడా ఓసారి పూజగదిలోకొచ్చి పూజా కార్యక్రమంలోపాలు పంచుకోవచ్చు కదా...?" తనూ సరదాగా అడిగింది.

"అప్పుడప్పుడూ ఈ పనికూడ చేస్తున్నాగా. అయినా నా తరపున కూడా అన్ని పూజలూ నువ్వు చేసేస్తున్నావ్ గా, అర్ధాంగివి కాబట్టి నీ పూజా ఫలంలో నాకూ వర్తిస్తుంది. కాదంటావా?"

"ఆగండాగండి, పూజలు చేయటమేగానీ, ఫలితాల గురించి నాకు తెలీదు. మున్నలూరు ఫోన్ చేసి అత్తయ్యగారిని అడిగి చెప్తాను".

"ఏయ్... ఆ పని చేయకు నీకు పుణ్యం వుంటుంది. అమ్మచేత నన్ను తిట్టించాలనే ఆలోచన ఎప్పట్నుంచి నీకు?" అంటూ నవ్వేశాడు.

తనూ నవ్వుతూ వచ్చి పక్కన కూర్చుంది సత్యవతి. "నాకు ఎలాంటి ఆలోచనలు లేవుగాని, కనీసం స్నానం చేసాకనైనా ఓసారి మీరు పూజగదిలోకొచ్చి దేవుడికి దణ్ణం పెట్టుకుంటే నాకు తృప్తిగా వుంటుంది. మీరేమో ఎప్పుడూ హడావుడిగా బయలుదేరిపోతారు."

"ఆగాగు" అంటూ ఖాళీ కప్పు టీపాయి మీద వుంచి భార్య కళ్ళల్లోకి ప్రేమగా చూశాడు గోపాల్.

"అంటే నీ ఉద్దేశం ఏమిటి? నా మనసులో దేవుడిపట్ల భక్తి, భార్య పట్ల ప్రేమ లేవనా?" అనడిగాడు.

"మనం దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాం. మధ్యలో ప్రేమ విషయం లాగకండి."

"అంతేగా. భక్తిలేని మనిషిలో ప్రేమ కూడా ఉండదని కొందరి అభిప్రాయం"

"అదెలా?... నాస్తికులు దేవుడిని నమ్మరు. కానీ, వాళ్ళలో ప్రేమానురాగాలు లేవా? రెంటికి సంబంధం లేదు. అయినా మీరు నాస్తికులు కాదని నాకు తెలుసు."

"అవును కదా... నా వృత్తే నాకు దైవం. నేను నమ్మే వేంకటేశ్వరుడు నా మనసులో ఎప్పుడూ వుండి, నా వృత్తిలో నాకు సహకరిస్తున్నాడు. నేను ఆరాధించే, ప్రేమించే ఇల్లాలు నువ్వు నా పక్కనే ఉన్నావు. ఇక నాకేమిటి లోటు చెప్పు?" అంటూ ఆమెను దగ్గరకు తీసుకోబోతుంటే అటుగా వస్తున్న పనిమనిషిని చూసి అతన్ని వారించింది.

"నా గురించి చెప్పారు. పిల్లల గురించి చెప్పలేదు" కాస్త ఎడంగా జరుగుతూ గుర్తుచేసింది.

"సారీ మర్చిపోయాను. వాళ్ళిద్దరు ఎక్కడ? నిద్రలేచారా? లేదా?" అడిగాడు.

"రాత్రి పార్టీ నుండి లేటుగా వచ్చారు కదా... ఇంకా లేవలేదు"

"ఆలస్యంగా లేవటం, కాలేజీకి టైమైందని హడావుడిగా వెళ్ళిపోవడం. వాళ్ళతో మాట్లాడాలి ఉండమని చెప్పు. ఇంకో గంటలో నేను ఆస్పత్రికి వెళ్ళాలి. అక్కడి నుండి ఏర్ పోర్ట్ కు చేరుకుని ఫ్లైట్ కేచ్ చేయాలి. న్యూజెర్సీలో రెండు ఆపరేషన్స్ ఉన్నాయి. రాత్రికి రావడం వీలుపడకపోవచ్చు. రేపు సాయంత్రానికి ఇక్కడికి చేరుకుంటాను. వాళ్లని లేపు. ఈలోపల నేను స్నానం చేసి వస్తాను" అంటూ లేచాడు.

"మున్నలూరు ఫోన్ చేస్తానన్నారు. మర్చిపోయారా?" గుర్తు చేసిందావిడ.

"అవును కదూ, రా మరి... నువ్వు కూడా మాట్లాడుదువుగానీ, అమ్మా సంతోషిస్తుంది" అంటూ వీడియో ఫోన్ వున్న గదిలోకి భార్యతో సహా అడుగుపెట్టాడాయన.

ఇక్కడ ఇండియాలో...

రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయం. తల్లి గదిలోని వీడియో ఫోన్ మోగుతుంటే, అటుగా వచ్చిన పెద్ద కొడుకు రామలింగేశ్వరరావు గమనించి ఫోన్ ముందుకొచ్చాడు.

 వీడియో స్క్రీన్ మీద అన్నదమ్ములిద్దరూ ఒకరికొకరు ఆప్యాయంగా చూసుకున్నారు.

"తమ్ముడూ! ఎలా ఉన్నారక్కడ? అంతా బాగున్నారు గదా?' అంటూ అమెరికాలో వున్న తమ్ముడు గోపాల్ ని పలకరించాడు రామలింగేశ్వర్రావు.

"అంతా బాగున్నాం అన్నయ్యా! వదిన, పిల్లలు ఎలా ఉన్నారు?"

"బాగున్నాంరా"

ఇంతలో గోపాల్ పక్కకోచ్చిన సత్యవతి బావగారిని చూస్తూ మర్యాదపూర్వకంగా నమస్కరించింది.

"ఏమ్మా... పిల్లలు, మీరు అంతా బాగున్నారు గదా?" ఆమెను పలకరించాడు.

"అంతా బాగున్నాం బావగారూ!" అంది సత్యవతి.

"చెల్లాయి భ్రమరాంబ, బావగారు, వాళ్ళపిల్లలు అంతా ఎలా ఉన్నారు?" అడిగాడు గోపాల్.

"అంతా బాగున్నాంరా... నిన్న అమ్మమీకు ఫోన్ చేసింది..."

"సత్యవతి చెప్పింది. ఆ విషయం అడగాలనే ఫోన్ చేశాను. నిజమేనా...? నిజంగా అమ్మ అమెరికా వస్తానంటోందా...?"

"అవున్రా... మొదట నేనూ నమ్మలేదు. ఎప్పుడూ ఊరొదిలి ఎక్కడికీ వెళ్ళననేది. సడెన్ గా మిమ్మల్ని చూడాలని గొడవ చేస్తోంది."

"అమ్మ వస్తానంటే నాకు చాలా ఆనందంగా వుందన్నయ్యా. ఆ ఏర్పాట్లేవో త్వరగా చూడు."

"ఆ పని మీదే వున్నాన్రా... ఒకటి రెండు రోజుల్లో అమ్మకి పాస్ పోర్ట్ కి అప్లయ్ చేయిస్తున్నాను. ఒక నెలలో వచ్చేస్తుంది. నువ్వు స్పాన్సర్ పేపర్స్ పంపిస్తే, పాస్ పోర్ట్ రాగానే వీసాకి అప్లయ్ చేస్తాం."

"డోంట్ వర్రీ. వీసాకి అప్లయ్ చేసే ముందు ఒకసారి నాకు ఫోన్ చెయ్యి. ఆ విషయం నేనే చూసుకుంటాను. ఇంతకీ అమ్మ ఎక్కడుంది?"

"అదిగో... వస్తోంది. మాట్లాడు. అమ్మా! తమ్ముడు లైన్లో వున్నాడే. వచ్చి మాట్లాడు" అంటూ అప్పుడే లోనకొస్తున్న అన్నపూర్ణేశ్వరికి వినబడేలా అరిచి చెప్పాడు రామలింగేశ్వర్రావు.

ఆ మాట వినగానే గునగునా ఫోన్ ముందుకొచ్చేసింది అన్నపూర్ణేశ్వరి. కొడుకు, కోడల్ని ఆప్యాయంగా చూసింది. పలకరింపులు కాగానే, "అవున్రా అబ్బాయ్! ఏమిటో ఉన్నట్టుండి మీ మీద బాగా దిష్టి తిరిగిందిరా. అక్కడికొచ్చి మీతో కొద్ది రోజులు వుండి రావాలన్పిస్తోంది. అందుకే రావాలని నిర్ణయానికొచ్చేసాను" అంది.

"అదే గదా! ఇప్పటికైనా రావాలనుకున్నావ్. నాకు చాలా ఆనందంగా ఉంది. అన్నయ్య ఆ ఏర్పాట్లు చూస్తాడు. రెండు మాసాల్లో మా దగ్గరుంటావ్. సరేనా..."

"అలాగే! కానీ వాళ్ళెక్కడరా? అనంతసాయి, సాయిశివాని... మనవడు, మనవలు కన్పిస్తారేమోనన్న ఆశతో అడిగిందావిడ.

"వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోయారమ్మ! ఈసారి ఫోన్ చేసినప్పుడు మాట్లాడతారులే. చెల్లాయి వాళ్ళు ఎలా ఉన్నారు?"

"అంతా బాగున్నార్రా... అదిగో భ్రమరాంబ వస్తోంది. మాట్లాడు అంది.

అమెరికా నుంచి ఫోన్ వచ్చిన విషయం తెలీగానే భ్రమరాంబ, ఆమె భర్త, కొడుకు నవీన్, కూతురు మహేశ్వరి, ఇటు రామలింగేశ్వర్రావు, భార్య మహాలక్ష్మి అంతా అక్కడికి వచ్చేసారు. కాస్సేపు వాళ్ళందరితో ముచ్చటించి అవతల లైన్ కట్ చేసాడు. డాక్టర్ గోపాల్.

వీడియో ఫోన్ ఆఫ్ చేసి కాస్సేపు అక్కడే మౌనంగా కూర్చుండిపోయాడు డాక్టర్ గోపాల్. సత్యవతి కూడా భర్త పక్కన కూర్చుంది. "ఏమిటి ఆలోచిస్తున్నారు?" అని అడిగింది.

"మా అమ్మ వస్తోందంటే ఎందుకో నాకు భయంగా వుంది" చిన్నగా అన్నాడు.

"భయమా?" అంటూ నవ్వేసింది సత్యవతి.

"ఎందుకు భయం? అత్తా కోడళ్ళం పోట్లాడుకుంటామనా లేక మర్యాదల్లో లోటు పాట్లు జరుగుతాయనా? అత్తయ్యంటే నాకెంతిష్టమో మీకు తెలియదా? అంది నవ్వుతూనే.

"నా భయం అందుక్కాదు. నీకు తెలీని విషయం ఏముంది? చిన్నప్పుడే మా నాన్న పోయారు. తను ఒక్కతీ కష్టపడి మమ్మల్ని చదివించింది. ఏలోటూ రాకుండా పెంచింది. ఒంటిచేత్తో అటు వ్యవసాయాన్ని, ఇటు ఇంటిని నెట్టుకొచ్చింది. ఈరోజు మేమింత ఉన్నత స్థితిలో ఉన్నామంటే ఇదంతా అమ్మ చలవే. నేనిక్కడ కోట్లు గడిస్తున్నా ఏ రోజూ వాళ్ళు నా నుండి ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. పాత మండువా లోగిలి పడగొట్టించి, భవంతి కట్టిస్తానంటే ఒప్పుకోలేదు. మా నాన్న కష్టపడి కట్టిన ఇల్లు అది. తానున్నంత వరకూ ఈ ఇల్లు అలా ఉండాల్సిందే అంది. దేవుడి దయవలన అంతా బాగున్నాం. మా అన్న, మా బావగారు కూడా బాగానే సంపాదిస్తున్నారు. నువ్వు ఏ దేశమెల్లినా... డబ్బు పంపిస్తే విలాసాలు పెరిగి, భాద్యత మరిచిపోవడమే కాదు ఆ డబ్బుకి కాపలా ఎవరుంటారు? అంటూ ఒక్క పైసా కూడా నన్ను పంపనియ్యలేదు. అలాంటి అమ్మ మనసులో ఎప్పట్నుంచో ఓ కోరిక వుంది. మనమూ, మనపిల్లలు, మన సంప్రదాయాల్లోనే ఉండాలంటూ అమ్మ పడే బాధ చెప్పడానికి కారణం కూడా అదే. మా చెల్లెలు భ్రమరాంబ పిల్లలకు కుండమార్పిడి పద్దతిలో ఒకేసారి పెళ్ళిచేసి చూడాలని అమ్మ చిరకాల వాంఛ.

వీళ్ళు పుట్టునప్పుడే అలా అనుకున్నాం కూడాను. నీకు గుర్తుండే వుంటుంది. అక్కడికీ అమ్మను నమ్మించడానికి మన పిల్లల్ని సాంప్రదాయ దుస్తుల్లో ఫోటోలు తీసి, అమ్మకు పంపించి, నమ్మించాం. ఇప్పటికి కూడా వాళ్ళు లోపల నిద్రపోతుంటే, వాళ్ళు కాలేజీకు వెళ్లిపోయారని అమ్మతో అబద్ధం చెప్పాను. అమెరికా అంటేనే ఫ్యాషన్లకు నిలయమని లోకమంతా తెలుసు. పద్దతులు మారిపోతే మన పిల్లలు, మా చెల్లాయి పిల్లల్ని చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. మనల్ని, మన పిల్లల పద్ధతుల్ని గమనించడం కోసమే అమ్మ ఇక్కడికి రాబోతుందని, నా అనుమానం. అందుకే భయం. మన పిల్లల అలవాట్లు చూస్తె అమ్మ చాలా బాధపడుతుంది. ఆవిడ ఇక్కడ వున్నన్ని రోజులు వీళ్ళని పద్దతిగా వుంచడం సాధ్యపడుతుందంటే నాకు నమ్మకం కుదరడం లేదు." అంటూ మనసులో మాటను బయటపెట్టాడు గోపాల్.

అంతా విని మౌనంగా ఊరుకుంది" సత్యవతి.

"ఏమిటి మాట్లాడవు? సాధ్యం కాదంటావా?" అడిగాడు.

"కాకపోవచ్చు. అయినా మన పిల్లలు పద్దతిగా ఉన్నారని ఆవిడను నమ్మించడానికి ప్రయత్నించడం మోసం అవుతుంది. దానికన్నా వీళ్ళని మార్చి సరైన దారిలో పెట్టడం మంచింది. నాకూ చాలా బాధగానే వుంది. పార్టీలని, ఫ్రెండ్స్ అనీ ఊరిమీద తిరిగి, అర్ధరాత్రప్పుడు కొంపకి చేరటము, బీరు తాగడం, ఫ్యాషన్ల పేరిట పిచ్చిపిచ్చిగా డ్రస్సులు వేసుకోవడం. మనం తెలుగు వాళ్లమనే సంగతి క్రమంగా వీళ్ళు మర్చిపోతున్నారు. డేటింగ్ అనే వెధవ సాంప్రదాయం ఒకటి ఏర్పడిందిక్కడ. ఇంకా నయం. అలాంటి పెడ ధోరణి ఇంకా వీళ్ళకు సోకలేదు. అదికూడా జరిగితే మనపరిస్థితి పూర్తిగా చేయిదాటి పోయినట్టే అందుకే నాకూ బాధగానే వుంది. మన పద్ధతులు పట్టించుకోకుండా మన సంప్రదాయాలు పాటించకుండా, బాధ్యతలు మర్చిపోయిన వీళ్ళు... ఎంతకాలమిలా... ఏదో ఒకటి చేయాలి." అంది బాధగా.

"ఏం చేద్దాం? అదే అర్ధం కావడం లేదు." అన్నాడు నిస్సహాయంగా.

"ఈ టైం లో అత్తయ్య ఇక్కడకు రావడం ఇదీ ఒక మంచికే అన్పిస్తోంది నాకు. అత్తయ్య మూలంగా వీళ్ళని పద్ధతుల్లో పెట్టడానికి మనకీ మంచి అవకాశం కలిసి రావచ్చు.
ఏమంటారు?"

"నాకూ అదే అన్పిస్తోంది. మా చెల్లాయి పిల్లలు నవీన్, మహేశ్వరిలను చూశావ్ గా, వాళ్ళమీద నీ అభిప్రాయం ఏమిటి?"

" అభిప్రాయాలు కాసేపు పక్కన పెడదాం. ముందు నా సందేహం ఒకటి తీర్చండి."

"ఏమిటా సందేహం?"

"మీ డాక్టర్లే సలహా ఇస్తున్నారు. బావా మరదళ్ళు, మేనరికాలు వంటి దగ్గర సంబంధాలు చేసుకుంటే మంచిది కాదని, పుట్టబోయే బిడ్డల్లో ఆరోగ్య సమస్యలు, ఏవో లోపాలు తలెత్తే ప్రమాదం వుందని... ఇది ఎంత వరకు నిజం...?"

"నీ భయం నాకు అర్ధమైంది. కాని దగ్గర సంబంధాలు చేసుకున్న వాళ్ళందరికీ లోపాలతో వుండే పిల్లలు పుడతారని అర్ధంకాదు. ఒక్కో చోట అలా జరిగే అవకాశాలున్నాయి. జరిగాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు గదా. వ్యాధిని నయం చేయడం కన్నా అసలు వ్యాధి రాకుండానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటారు. అందుకే డాక్టర్లు దగ్గర సంబంధం చేసుకోవద్దని హెచ్చరిస్తుంటారు. మా వంశానికి సంబంధించినంతవరకూ అలాంటి సమస్యలు లేవు. భవిష్యత్తులో కూడా వుంటాయనుకోను. ఇంతకీ నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పలేదు."

"ఏ ప్రశ్న?"

"అదే. నా మేనల్లుడు నవీన్, మేనకోడలు మహేశ్వరి మీద నీ అభిప్రాయం అడిగానుగదా?"

"మీ అభిప్రాయానికి ఎప్పుడైనా నా అభిప్రాయం భిన్నంగా ఉంటుందా?"

"నువ్వు నా అర్ధాంగివని ప్రత్యేకించి గుర్తుచేయనక్కర్లేదుగాని సింపుల్ గా నీ మనసులో ఏముందో చెప్పవోయ్!"

"ఊ! మొత్తానికి నా మనసులో మాట చెప్పందే వదలరు. అంతేగా? వాళ్ళకేమండి, లక్షణంగా ఉన్నారు. వాళ్ళు ఇష్టపడి అతను మన అల్లుడు, ఆ అమ్మాయి మన కోడలు అయితే అంతకన్నా ఏం కావాలి? సమస్య అటునుంచి కాదు, ఇటునుంచి. వాళ్ళను చేసుకోవడానికి మన పిల్లలు ఇష్టపడతారా? చూడండి, మీ బావగారే వీళ్ళకి మామగారయితే సంవత్సరం తిరిగేలోపు పాపం కట్టుబట్టలతో వీధినపడాలి" అంటూ నవ్వేసింది సత్యవతి.

(.... ఇంకా వుంది)

మరిన్ని సీరియల్స్
kotagodalu telugu story