Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka by Cartoonist Bannu

ఈ సంచికలో >> సినిమా >>

మ్యూజిక్ ముచ్చట్లు

raja music muchchatlu

నిజాయితీకి నిర్వచనం - నిదర్శనం
సినిమా చూస్తున్నప్పుడు జనాల్ని బాగా ఆకర్షించిన బిట్ గాని, డైలాగ్ గానీ ఏదైనా సరే రిఫరెన్స్ వచ్చినా రాకపోయినా 'ఇది నాదే ... నేనే చెప్పాను' అంటూ ఆ సినిమాతో కొద్దిగా నైనా సంబంధం వున్నవాళ్ళు బైట చెప్పేసుకుంటూ ఆ క్రెడిట్స్ ని తమ ఖాతాలో వేసేసుకోవడం చాలా కామన్ గా జరుగుతుంటుంది. అలాగే నిజంగా తమ వంతుగా కాంట్రిబ్యూట్ చేసినా బైటికి అస్సలు చెప్పుకోని వాళ్ళూ వున్నారు. అలాంటి వారిలో కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు ఒకరు.

డాక్టర్ చక్రవరి సినిమాలో 'పాడమని నన్నడగ తగునా పదుగురెదుటా పాడనా' అనే పాట కొందరికైనా గుర్తుండే వుంటుంది . సావిత్రి పాడుతుంటే ఆ పాటని వింటున్న అక్కినేని, జగ్గయ్య, షావుకారు జానకి లలో  షావుకారు జానకి కి బోర్ కొడుతోందని తెలియపర్చడానికి ఓ మూమెంట్ కావాలి. ఆ రోజుల్లో డిజిటల్ వాచీలు వుండేవి కావు. కీ ఇచ్చే వాచీలే. అవి వర్క్ చేస్తున్నాయో లేదో తెలుసుకోవాలంటే చెవి దగ్గర పెట్టుకుని వచ్చే టక్ టక్ సౌండ్ ని బట్టి నిర్ణయించ వలసిందే. అంచేత "జానకీ ... నువ్వీ ఎక్స్ ప్రెషన్ ఇలా ఇవ్వు" అని విశ్వనాథ్ గారు చేసి చూపించారు. అది బాగా వర్కవుట్ అయింది.

అప్పుడు విశ్వనాథ్ గారు ఆ చిత్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి అసిస్టెంట్ గా వర్క్ చేస్తూ వుండేవారు. అంచేత ఈ విషయాన్ని ఎక్కడా ఎవ్వరి దగ్గరా చెప్పుకోలేదు. కానీ , షావుకారు జానకి గారు మాత్రం చెప్పేశారు. ఓసారి ఆవిడ్ని ఇంటర్ వ్యూ చేస్తూ "ఈ బిట్ భలే చేశారండీ" అని ప్రస్థావిస్తే అది "విశ్వనాథ్ గారి ఐడియా" అంటూ ఆ రోజు సెట్ మీద జరిగిందంతా చెప్పేశారు. దటీజ్ విశ్వనాథ్ , దిసీజ్ షావుకారు జానకి. ఒకరు క్రెడిట్ తీసుకోరు. ఇంకొకరు క్రెడిట్ ఇవ్వకుండా వుండలేరు.

పకడో పకడో
ఈ స్టిల్స్ 'యజ్ఞం' సినిమాలోనివి. ఇందులో హీరోకి రోషం కలిగి చాలెంజ్ చెయ్యాల్సి వస్తే జబ్బ చరుచుకునే మేనరిజం పెట్టారు. కాకపోతే ఆ పాత్ర చిన్నప్పుడు ఎడమ జబ్బ చరుచుకుంటుంది. పెద్దయ్యాక ( గోపిచంద్) కుడి జబ్బ చరుచుకుంటుంది.  ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత పోకూరి బాబూరావు గారి దృష్టికి తీసుకువస్తే "అలాగా !?" అన్నారు. అంతగా పట్టించుకోలేదనుకున్నాను. తర్వాత థియేటర్ కి వెళ్ళి చూసి "నిజమేనండీ మేం గమనించనే లేదు" అని  నిజం ఒప్పేసుకున్నారు నిజాయితీ గల నిర్మాత గనుక ...

 






రాజా (మ్యూజికాలజిస్ట్)

 

 

మరిన్ని సినిమా కబుర్లు
Aditya Hrudayam