Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
raja music muchchatlu

ఈ సంచికలో >> సినిమా >>

'మనసంతా మీరే.... రాజు గారు'

Aditya Hrudayam

నిర్మాతగా శ్రీ ఎమ్.ఎస్. రాజు గారు మహా మేధావి. పర్ ఫెక్ట్ జడ్జ్. 'దేవీ పుత్రుడు' సినిమా తర్వాత కెమెరామెన్ ఎస్.గోపాలరెడ్డి గారి ద్వారా నా గురించి మంచిగా విని, ఆయనకున్న 'మనసంతా నువ్వే' లైన్ నాకిచ్చి, డెవలప్ చేయమన్నారు. సునీల్ డైలాగ్ 'ఈ వర్షం కూడా అప్పుడప్పుడు మనకి మేలు చేస్తుందిరా. మన కన్నీళ్లు ఎదుటివాళ్ళకు కనపడకుండా కాపాడుతుంది' అని చెప్పగానే నన్ను దర్శకుడిగా డిసైడ్ చేసి, అడ్వాన్స్ చెక్ ఇచ్చారు.

ఒక సీన్, సిట్టింగ్ లో కూర్చున్న నలుగురైదుగురిలో ఏ ఒక్కరికి డౌటొచ్చినా, అది తీరేవరకూ ఒక రైటర్ లాగో, డైరెక్టర్ లాగో ఆయనకూడా తీవ్రంగా ఆలోచించేవారు.

నిజానికి ప్రొడ్యూసర్ గా ఆయనకి ఆ అవసరం లేదు. కానీ ఆయనకి కూడా హీరోలాగ, దర్శకుడిలాగ, నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు గారిలాగ సినిమా అంటే పిచ్చి. సినిమా అంటే ప్రాణం. ఆయనతో సమానంగా సినిమాని పోటీపడి ప్రేమించే దర్శకుడికి ఇబ్బందులు అందుకే ఎదురయ్యేవి. సినిమా, ఎమ్మెస్ రాజు గారు, నేను - ముగ్గురి మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతున్నట్టు ఉండేది. ప్రతిరోజూ. అయినా ఇద్దరి ఉద్దేశం సినిమా బాగా రావడమే కాబట్టి, పర్సనల్ గా ఒకరంటే ఒకరికి అభిమానం, వాత్సల్యం ఉన్నాయి గనుక నేను తట్టుకోగలిగాను. అవి లేని మిగతా దర్శకులు ఆయన దగ్గర హిట్ సినిమాలు పొంది, బైటకెల్లి ఆయనపై బురద చల్లేవారు. డబ్బులు పెట్టే ప్రేక్షకుడిని తృప్తిపరిచే బాధ్యత గనక దర్శకుడిది అని మనం ఒప్పుకుంటే, అంతకన్నా ఎక్కువ డబ్బులు (కోట్లలో) పెట్టే నిర్మాతని శాటిస్ పై చేసే బాధ్యత కూడా దర్శకుడిదే. కానీ, ఇలా అంటే చాలామంది హీరోలు ఒప్పుకోరు. ఇలాంటి ఆలోచనలున్న దర్శకులకి డేట్స్ ఇవ్వరు. కథలు కూడా వినరు. అది వేరే విషయం. సినిమా మీద ప్రేమ ఎక్కువైపోయి, తనకంటే మిగిలిన వారి ప్రేమ తక్కువైపోవడం భరించలేక - ఈ రెండు కారణాల వల్ల నిర్మాత ఎమ్.ఎస్. రాజు గారు దర్శకులైపోయారు గానీ, 2000 సంవత్సరం తర్వాత నిర్మాతని హీరోని చేసిన మొదటి నిర్మాత మాత్రం కచ్చితంగా ఎమ్.ఎస్. రాజు గారే.

అందుకే "మనసంతా నువ్వే" సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఉన్నంతకాలం, నా హృదయంలో ఎమ్.ఎస్. రాజు గారు ఉంటారు. నాలుగు గదుల్లో ఓగదిలో కుర్చీ వేసుకుని కూర్చుంటారు.

చిత్రం ఏంటంటే, మనసంతా నువ్వేకి పనిచేసిన కో - డైరెక్టర్ శంకర్ కె. మార్తాండ్ తర్వాత దర్శకుడయ్యాడు - ఇది సహజం. ఆ చిత్ర సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ దర్శకుడయ్యాడు, నిర్మాత ఎమ్.ఎస్. రాజు గారు దర్శకుడయ్యారు. కెమెరామెన్ ఎస్.గోపాల్ రెడ్డి గారు దర్శకుడయ్యారు, కొరియోగ్రాఫర్ సుచిత్రా చంద్రబోస్ గారు దర్శకురాలయ్యారు. పరుచూరి బ్రదర్స్ సహాయకుడిగా స్క్రిప్ట్ వర్క్ చేసిన వీరు పొట్ల దర్శకుడయ్యాడు. కెమెరా అసిస్టెంట్ గా పనిచేసిన మదన్ దర్శకుడయ్యాడు. మొన్న "ప్రేమకథా చిత్రమ్"తో ఇంకో అసిస్టెంట్ కెమెరామెన్ జె. ప్రభాకరరెడ్డి దర్శకుడు అయ్యారు. ఇంతమంది దర్శకులనందించిన ఫ్యాక్టరీగా నాకు చాలా ఆనందంగా ఉంటుంది.

వచ్చేవారం... "బావగారూ... బాలేరు..." అని ప్రేక్షకుడు అంటే?

మీ
వి.ఎన్.ఆదిత్య

 

మరిన్ని సినిమా కబుర్లు
Varma is at Kashmir