Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Interview with Sagar by Raja

ఈ సంచికలో >> సినిమా >>

మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు: చిత్ర సమీక్ష

mallela theeramlo sirimalle puvvu movie review

చిత్రం: మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు
తారాగణం: శ్రీదివ్య, క్రాంతి, జార్జి, రావు రమేష్‌ తదితరులు
ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి
సంగీతం: పవన్‌
కూర్పు: కాకరాల ధర్మేంద్ర
నిర్మాణం: ఉమా దేవి
కథ,  స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: రామరాజు
విడుదల తేదీ: 05 జులై 2013

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే టైటిల్‌తో సినిమా వస్తుందనగానే ‘తెలుగు’ ప్రేమికులు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. ఎప్పుడోగానీ అచ్చతెలుగు టైటిల్స్‌ కనిపించడంలేదు తెలుగు సినిమాలకు సంబధించి. మళ్ళీ ఆ షేడ్స్‌లో ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ అనే టైటిల్‌తో సినిమా వస్తోందంటే సహజంగానే ఆ సినిమాపై ఆసక్తి వుంటుంది. పోస్టర్స్‌ కొత్తగా, అందంగా తీర్చిదిద్దడంతో సినీ పరిశ్రమలో ఈ సినిమా హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఓ కొత్త ప్రయత్నంగా విడుదలకు ముందు ప్రచారం పొందిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

క్లుప్తంగా చెప్పాలంటే:
జాతకాలూ గట్రా చూసి తన కుమార్తె లక్ష్మి (శ్రీదివ్య)కి, పెళ్ళి చేస్తాడు ఆమె తండ్రి (రావు రమేష్‌). గుణగణాల్లో మంచోడేగానీ, ఒకప్పుడు బాగా బతికి, ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో చితికిపోయిన లక్ష్మి భర్త (జార్జి) డబ్బు సంపాదనే ధ్యేయంగా వుంటాడు. ఈ క్రమంలో భార్య చిన్ని చిన్ని కోరికలను తీర్చడంలో అశ్రద్ధ చూపుతాడు. తన భర్త తన కోసమే డబ్బు సంపాదిస్తున్నాడన్న విషయం తెలిసినా, మానసికంగా తన భర్త తనను దగ్గర చేసుకోవడంలేదన్న ఆవేదన పెరుగుతుంది లక్ష్మిలో. ఆ సమయంలోనే ఆమె మనసుకు దగ్గరవుతాడు గేయ రచయిత క్రాంతి (క్రాంతి). చేస్తున్నది తప్పా? ఒప్పా? అన్న అయోమయంలో మానసిక సంఘర్షణకు లోనవుతుంది లక్ష్మి. చివరికి లక్ష్మి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే:
మానసిక సంఘర్షణలో కొట్టుమిట్టాడే యువతి పాత్రలో శ్రీదివ్య నటనతో మెప్పించింది. చాలా బరువైన పాత్ర అయినా, అవలీలగా ఆమె నటనా ప్రతిభను ప్రదర్శించిందనే చెప్పాలి. రావు రమేష్‌ తన పాత్రకు న్యాయం చేశాడు. మంచి పాత్ర దక్కితే రావు రమేష్‌ ఏ రేంజ్‌లో నటనా ప్రతిభ ప్రదర్శిస్తాడో ఈ సినిమాతో రుజువయ్యింది. కొత్త హీరోలిద్దరూ బాగానే చేశారు.

కథకు లోబడి దర్శకుడు పనితనం ప్రదర్శించాడు. కమర్షియల్‌ హంగుల జోలికి పోలేదు. సంగీతం బాగా కుదిరింది. నేపథ్య సంగీతం కూడా సినిమాకి తగ్గట్టుగానే వుంది. బాల్‌రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి అందాన్ని తెచ్చింది. అయితే కొన్ని చోట్ల సినిమా టీవీ సీరియల్‌ని తలపించినా, పదునైన మాటలు అక్కడక్కడా సినిమాకి వెయిట్‌ పెంచుతాయి. ఎడిటింగ్‌ కూడా బాగానే వుంది.

సినిమాలో కొన్ని డైలాగ్స్‌ ప్రేక్షకుల మనసుల్ని తాకుతాయి. సన్నివేశాలకు సరిపడా వుండే ఆ డైలాగ్స్‌ థియేటర్‌ నుంచి బయటకొచ్చాకా వెంటాడుతాయి.

మాస్‌, కమర్షియల్‌ సినిమాలకి అలవాటుపడ్డవారికి కాదు ఈ సినిమా. అచ్చ తెలుగుదనం కోసం ఈ సినిమా చూడొచ్చు. మంచి సినిమాగా విమర్శకుల ప్రశంసలు అందుకోవచ్చేమోగానీ, కమర్షియల్‌ స్టామినా గురించి మాట్లాడుకోకపోతేనే మంచిది. ఓ మంచి ప్రయత్నంగా మాత్రం మిగిలిపోతుందీ సినిమా.

ఒక్క మాటలో చెప్పాలంటే: టైటిల్‌లానే సినిమా అందంగానే.. తెలుగుదనంతోనే వుంది.

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
Cine Churaka by Cartoonist Bannu