Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
avee - ivee

ఈ సంచికలో >> శీర్షికలు >>

మయూరేశ్వర గణపతి (మోర్గావ్ ) - కర్రా నాగలక్ష్మి

అష్ఠగణపతులలొ మొదటిది గా చెప్పబడే మయూరేశ్వర గణపతిని గురించి తెలుసుకుందాం .


మయూరగణపతి లేక మయూరేశ్వర గణపతిగా పిలువబడే గణపతి ఆలయం మహారాష్ట్రా లో పుణే జిల్లలో కర్హ నదీ తీరాన  ' మొర్గావ్ ' అనే ఊరిలో వుంది . పూణే షోలాపూరు రోడ్డు మీదుగా వెళ్తే  సుమారు 65కిమి.. దూరంలో వుంది .

యీ వూరు చుట్టుపక్కల చాలా నెమళ్లు వుండేవట అందుకని యీ వూరికి మొర్గావ్ అనిపెరొ చ్చిందని కొందరు అంటారు , యీ వూరు మొత్తం నెమలి ఆకారం లో వుంటుంది కాబట్టి యీ వూరు మొర్గావ్ గా పిలువబడుతోందనేది కొందరి వాదన , యిక్కడ గణపతి వాహనం మయురం కాబట్టి , యీ గణపతికి మయూరగణపతి లేక మయురేశ్వర గణపతి అని పిలువబడుతున్నాడు , ముయూర గణపతి వెలసిన వూరు కాబట్టి యీ వూరు మొర్గావ్ అయింది అనేది కొందరి అభిప్రాయం .

యీ కోవెల చుట్టూ రా 50 అడుగుల నల్లరాతి గోడ కట్టి వుంటుంది . నాలుగు వైపులా నాలుగు ద్వారాలు . బయటి నుంచి చూస్తే మసీదు లా కనిపిస్తుంది . బహమనీ సుల్తానుల కాలం లో యీ కోవెలను నిర్మించారట . కోవెల నిర్మాణం లో ముస్లిం శిల్పకళ కనిపిస్తుంది . పేష్వాల కాలంలో యీ కోవేలకి కానుకలు , మాన్యాలు యిచ్చి కోవేలని పునరుద్ధరించేరు .

కోవేలకి వున్న నాలుగు ద్వారాలు నాలుగు పురుషార్ధాలకు ప్రతీకలు . ముందుగా వున్న తూర్పు ద్వారం దగ్గర బాలగణపతి , యిద్దరు సేవకులతో వున్న విగ్రహాలు , మర్యాదా పురుషొత్తముడుగా పూజలందుకున్న విష్ణుమూర్తి అవతారమైన రాముడు , సీత లను చూడొచ్చు , దీనిని ధర్మ ద్వారం అంటారు . దక్షిణాన వున్న ద్వారం దగ్గర స్థితి కారకుడైన విష్ణు మూర్తి వినాయకుడు , శివపారతీ సమేతుడైన గణపతి లను లయకారకుడైన చింతామణి శివుని  విగ్రహంచూడొచ్చు . యీ ద్వారం అర్ధానికి ప్రతీక . యిక పడమర నున్న ద్వారం దగ్గర చెరకు విల్లుగా , తుమ్మెదల అమ్ములు కలిగిన   మన్మధుడు అతని భార్య రతీదేవి విగ్రహాలని చూడొచ్చు . యీ ద్వారాన్ని కామ ద్వారం అని అంటారు . ఉత్తర ద్వారం దగ్గర మహా గణపతి విగ్రహం వుంటుంది . యీ ద్వారాన్ని మోక్ష ద్వారం అని అంటారు .

మోక్ష ద్వారం పక్కనే మహీ ( భూ దేవి ) సమేతుడైన వరాహావతారం , పక్కనే రెండు దీప స్తంభాలు వుంటాయి . మయూరేశ్వరుని గర్భ గుడికి యెదురుగా ఆరు అడుగుల వినాయకుని వాహనమైన మూషికాన్ని చూడొచ్చు . నగారా ఖానా ( నాగారాలు ఉంచే ప్రదేశం ) లో రెండు నగారాలు చూడొచ్చు . సభా మండపం చాలా విశాలం గా వుంటుంది . సభామండపం యొక్క పైకప్పు ఏకశీలానిర్మితం . సభా మంటపం లో వినాయకుని 23 రూపాలను తెలియ చేసే విగ్రహాలు వున్నాయి . వీటిని గణేశ అవతారాలు అని గణపత్యం స్వీకరించిన వారి అభిప్రాయం . యిక్కడ వున్న కొన్ని విగ్రహాలు యోగేంద్ర ఆశ్రమానికి సంబందించినవి . ముద్గల పురాణం లో వివరించిన విధంగా   ఎనిమిది దిక్కులలోనూ వరుసగా వక్రతుండ గణపతి , మహోదర , ఏక దంత , వికట  , ధూమ్రవర్ణ , విఘ్నరాజ , లంబోదర గణపతులు కొలువై వున్నారు .

గర్భ గుడికి పక్కగా నగ్న భైరవ మందిరం వుంది . గర్భ గుడికి ఎదురుగా పరమశివుని వాహన మైన పెద్ద నంది విగ్రహం వుంటుంది . వినాయకుని వాహనమైన మూషికం కాకుండా నంది వుండడం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు . కుతూహలం తో యిక్కడి పుజారులని విషయం అడుగగా , మయూరేశ్వరుని మందిరం పునరుద్ధరించక ముందు పక్క గ్రామం నుంచి మరో గ్రామానికి తరలిస్తూ  వుండగా యీ ప్రదేశం చేరగానే నందిని తరలిస్తున్న బండి విరిగి పోవడం తో మరో బండీ లోకి మార్చే క్రమం లో నంది విగ్రహాన్ని క్రింద పెట్టేరుట , తరవాత మరి ఆ విగ్రహాన్ని కదిలించ లేకపోయేరుట . ఎన్నిమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆ నంది విగ్రహాన్ని అక్కడే విడిచి పెట్టేరని చెప్పేరు

ముందుగా నగ్న భైరవుని దర్శించుకున్న తరవాత మయూర గణపతిని దర్శించుకోవాలి . మయూర గణపతి కుడా స్వయంభూ గా వెలసిన విగ్రహం . గర్భగుడిలోని మయూరేశ్వరుడు తలపైన పాము పడగపట్టి , నాలుగు చేతులు మూడు కళ్ళు కలిగి సిద్ధి , బుద్ధిలను చెరోవైపు కూర్చుండ పెట్టుకొని , పై నున్న రెండు చేతులలోను  పాశం , అంకుశం పట్టుకొని , క్రిందనున్న చేతిలో మోదక్ , మరో చెయ్య తొడపైన పెట్టుకొని , ఎడమ వైపుకి తిరిగిన తొండంతో ఉత్తరాభి ముఖంగా వుంటాడు . గణేశునికి  నాభి , కళ్ల స్థానాలలో వజ్రాలు పొదగబడి వుంటాయి . మయూరేశ్వరుని దర్శనం తరువాత సాక్షి గణపతిని దర్శించుకోవాలి . 

1375 లో జన్మించిన మౌర్య గోసాయి గణపత్యాన్ని స్వీకరించి గణపతి ని గురించి అనేక శ్లోకాలు రచించేడు . మౌర్య గోసాయి తరచుగా మయూర గణపతిని దర్శించుకొనేవాడు . మౌర్య గోసాయికి యిక్కడే  చెట్టుకింద జ్ఞానోదయం కలిగింది . యీ కోవెల ప్రదేశమంతా మౌర్య గోసాయి వినాయకుని తో ఆడుకునే వాడని , మాట్లాడేవాడని అంటారు .ఆ చెట్టుని స్థల వృక్షం గా పూజిస్తారు . యీ కోవెలలో బిల్వ , శమీ వృక్షాలు  స్థల వృక్షం తో పాటు పూజలందుకుంటున్నాయి . 

18 వ శతాబ్దం లో పుణె ని పరిపాలించిన పేష్వా లు యీ కోవెలకు కానుకలు . మాన్యాలు యిచ్చినట్లు  గా చరిత్ర చెప్తోంది . వినాయకుడు గిరిజాత్మ గణపతిగా గణేశ గుహలలో అవతరించిన తరువాత  మయూర వాహన ధారియై ' సింధు ' అనే రాక్షసుని యీ ప్రదేశం లో సంహరించేడు . అనేది యిక్కడి స్థల పురాణం .

యీ కోవెల పొద్దున్న 5 గం.. నుంచి రాత్రి 10 గం .. ల వరకు తెరిచే వుంటుంది . పొద్దున్న 5 గం .. లకు కోవెల ప్రధాన పూజారి ఆధ్వర్యం లో  ప్రక్షాళన పూజ జరుగుతుంది . కిచిడి , చపాతి నైవేద్యం గా సమర్పిస్తారు . మధ్యాహ్నం షోడశోపచార పూజ భ్రాహ్మణ పూజారులు నిర్వహిస్తారు .అనంతరం అన్న నైవేద్యం సమర్పిస్తారు . రాత్రి పూజానంతరం పాలు ,అన్నం నైవేద్యం గా సమర్పిస్తారు . ఇక్కడ ప్రతి చవితికి అంటే పదిహేను రోజులకి వొకసారి యిక్కడ విశేష పూజలు జరుగుతాయి . మాఘ శుక్ల చవితని గణేష జయంతిగా , భాద్రపద శుక్ల చవితి వినాయక చవితిగా విశేష పూజలు జరుపుతారు .వినాయక చవితినుంచి ఆశ్వీజ శుక్ల దశమి వరకు ' పాలకి ' ( పల్లకి ) యాత్ర జరుపుతారు . పల్లకీ యాత్ర పూణే కి జంట నగరం గా చెప్పబడే ' చించ్ వాడ్ ' లోని మంగళ మూర్తి గణపతి కోవెల నుంచి ( మౌర్య గోసాయి జన్మ స్థానం ) మయూరేశ్వర గణపతి మందిరం వరకు సాగుతుంది . పల్లకీ వెనకాల వందల సంఖ్యలో భక్తులు కాలి నడకన చించ్ వాడ్ నుంచి మోర్ గావ్ వరకు సాగుతుంది . యీ కోవెల చించ్ వాడ్ దేవస్థానం ట్రస్ట్ వారి ఆధ్వైర్యం లో వుంది .

ఇక్కడ చాలా వైభవం గా జరిగే ఉత్సవం ' సోమావతి అమావాస్య ' . సోమవారం , అమావాస్య కలిసిన రోజుని  ' సోమావతి అమావాస్య ' అంటారు . ఇప్పుడు భక్తుల సందర్శనార్ధం వున్న విగ్రహం వెనుక అసలు విగ్రహం వుందని అంటారు . పాండవులు , యిసుక , యినుము , వజ్రాలతో చేసిన అసలు విగ్రహానికి రాగిరేకుతో కప్పి యిప్పటి విగ్రహం వెనుక గోడలో దాచిపెట్టేరని అంటారు .

యీ కోవెల బయటి నుంచి చూస్తే మసీదులా వుంటుంది , మొఘల్ సైనుకులని పక్కదారి పట్టించడానికి కోవెల పునర్నిర్మాణం జరిగినప్పుడు యీవిధంగా కట్టించేరని అంటారు .

మరి ఆలస్యమెందుకు బయలు దేరండి మయూర గణపతిని దర్శించుకుందాం .
మరిన్ని శీర్షికలు
veekshanam