Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

 

జరిగినకథ: సుమారు సాయంత్రం మూడు గంటలవుతుండగా దీక్ష ఇంటికి చేరుకుంటారంతా. వచ్చినప్పట్నుంచి దీక్ష సహస్ర కోసం ఏడుస్తూనే వుంటుంది. అందరూ విశ్రాంతి తీసుకొని ఆరు గంటలకు లేస్తారు. కిడ్నాపర్ల నుంచి గాని, సహస్ర నుంచి గాని ఫోన్‌ రాకపోవటం కొంచెం కంగారు పుట్టిస్తోంది అందరికీ . ఈ లోపల ఆఫీసు నుంచి చందూ ఇంటికొస్తాడు. ఆ తరువాత...   

‘‘అక్కా ఆ ఎదురుగా ఉన్న బెడ్‌రూంకి అటాచ్డ్‌ బాత్‌ రూం వుంది. లోన నీకోసం రెండు కొత్త నైటీలు కూడ ఉంచాం. ఏకంగా స్నానం చేసివస్తే భోం చేద్దుగాని’’ అన్నాడు.

‘‘థాంక్యూ తమ్ముడూ’’ అంటూ ఆ గదిలోకెళ్ళి తలుపు మూసుకుంది సహస్ర.

బాత్‌రూం లో తనకోసం కొత్త సబ్బు కొత్త టవలు కూడ ఉంచారు వాళ్ళు. ప్రషప్‌ అయి చక్కగా స్నానం చేసి నైటీ లోకి మారిపోయింది.

ఆమె బయటికొచ్చే సరికి ఇరవై నిముషాలు పట్టింది.

ముత్తూతో సహా వాళ్ళంతా భయం భయంగా చూస్తూ అలాగే నిలబడ్డారు. సహస్ర వచ్చి తనను బంధించి ఉంచిన అదే కుర్చీలో కూచుంది. వెంటనే ముత్తూ ఒక ప్లేటులో చికెన్‌ బిర్యానీ పార్సిలు ఉంచి తెచ్చిచ్చాడు. పక్కన వాటర్‌ బాటిలుంచాడు. ఆకలితో వున్న సహస్ర భోజనం ఆరంభించి వాళ్ళ వంక చూసింది.

‘‘ఏమిట్రా నిలబడున్నారు కూచోండి. నన్ను నమ్మండ్రా. అక్క దగ్గర భయమెందుకు? తప్పు చేస్తేనే అక్క కొడుతుంది. ఒప్పు చేస్తే మెచ్చుకుంటుంది. మీరే తప్పు చేయలేదు. కూచోండి’’ అంది.

అంతే...

స్కూలు పిల్లల్లా సహస్ర ఎదురుగా అంతా కూచూండిపోయారు. ‘‘నాకు తెలిసి మీరంతా డబ్బు కోసం  నన్ను కిడ్నాప్‌ చేసి తెచ్చారనుకుంటున్నాను’’ అంది సహస్ర.

‘‘అవునక్కా’’ అన్నాడు ముత్తు.

‘‘మీ లీడర్‌ ఎవర్రా?’’

‘‘నేనే అక్కా. నన్ను మురడన్‌ ముత్తూ అంటారు. వీళ్ళంతా నా శిష్యుల్లాంటోళ్ళు. మేమంతా ఒక బేచ్‌. కోయంబేడు స్లమ్‌ ఏరియాలో పుట్టి పెరిగిన వాళ్ళం. బతకటానికి దారిలేక జేబులు కొట్టి బతికేస్తుంటాం.’’

‘‘అర్ధమైంది మీ మీద నా కోపం లేకపోడానికి కారణం తెలుసా?’’

‘‘తెలీదక్కా...  ఏంటక్కా?’’

‘‘కిడ్నాప్‌ చేస్తున్నామనుకొని మీరు నన్ను గొప్ప ప్రమాదం నుంచి కాపాడారు. ఆ సమయంలో నాకు మత్తు మందు స్ప్రే చేసి అక్కడ్నుంచి తప్పించక పోతే కనీసం నలుగురయిదుగుర్ని చంపి నేనూ చనిపోయేదాన్ని. వాళ్ళు నన్ను షూట్‌ చేసి చంపేసేవారు.’’

‘‘అంటే... లోపట్నుంచి రివాల్వర్ల శబ్ధం విన్పించింది. వాళ్ళంతా ఆ త్యాగరాజన్‌ మనుషులేనా అక్కా?’’

ముత్తూ ప్రశ్నతో ఈ సారి...

సహస్ర ఆశ్చర్యపోయింది.

తినటం ఆపి ముత్తువంక చూసింది.

తనను క్లోజ్‌గా అబ్జర్వ్‌ చేస్తూండాలి. లేకపోతే వీళ్ళకీ విషయాలు తెలిసే అవకాశం లేదు. సహస్రకి రాకూడని అనుమానమే వచ్చింది. ఇదేదో యధాలాపంగా తనను ఎత్తుకొచ్చిన విషయం కాదు. తనెవరో ఖచ్చితంగా వీళ్ళకి తెలిసే ఉండాలి.

‘‘ఏరా తమ్ముడూ నేనెవరో తెలుసా?’’ అనడిగింది.

‘‘తెలుసు నీ పేరు సహస్ర. పూర్తి పేరు లక్ష్మీ సహస్ర రచయిత్రివి. ఇంకా జర్నలిస్టు లహరివి. త్యాగరాజన్‌ గుట్టు బయటికి లాగి పత్రికలకెక్కించింది నువ్వేగదా. అందుకేగా వాడు నిన్ను చంపాలని చూస్తుంది. ఈ విషయాలు మాకెలా తెలుసని ఆశ్చర్యం వద్దక్కా. శిఖామణి వాడి మనుషులతో నీ ఫైటింగ్‌ని టివిలో సినిమా చూసినట్టు చూసినాం, త్యాగరాజన్‌ ఇంటర్వ్యూ ని చూసాం...’’

‘‘మరి నా గురించి తెలుసుకొని కూడ ఎందుకు కిడ్నాప్‌ చేసార్రా?’’

‘‘అబ్బో...  అదో పెద్ద కథక్కా. నా ప్రియురాల్ని పట్టిస్తే కోటి అంటూ బావ విరాట్‌ ప్రకటనిచ్చాడు చూడు. అప్పుడు మొదలైన కథ ఇంకా సాగుతూనే వుంది’’ అంటూ తమ గురించి  ముత్తు జరిగిందంతా చెప్తుంటే పడి పడి నవ్వుతూనే వుంది సహస్ర.

‘‘ఏమిట్రా మీరంతా నన్ను కిడ్నాప్‌ చేయాలని ముష్టి వాళ్ళ వేషాల్లో కూడా తిరిగారా!’’ అంటూ నవ్వుతూనే భోజనం ముగించి చేయి కడుక్కుంది.

‘‘ఒక్క ముష్టి అవతారాలేనా, కుష్టు వ్యాధి వాళ్ళలా బండిలో కూచొని తోసుకుని బిచ్చమెత్తుకుంటూ మరీ గాలించాం. నిన్ను చూసి ఎత్తుకొచ్చింది కూడా ఆవేషంలో ఉండగానే’’ అన్నాడు ముత్తు.

‘‘అయితే మీరు వేషాలు బాగా వేస్తారన్న మాట’’

‘‘ఏం చేయమంటావక్కా స్లం ఏరియాలో పుట్టి పెరిగిన గలీజు గాళ్ళం. చదువా అంతంత మాత్రం. బతకటానికి జేబు దొంగలుగా మారాం. కాని ఎంత కాలమీ వెధవ బతుకని బాధగా వుండేది. ఏదో జాక్‌ పాట్‌ కొట్టి జీవితాలు సెటిలయి పోవాలని కలలు కనే వాళ్ళం. ఎన్నో ప్రయత్నాలు చేసాం. ఏదీ కలిసి రాలేదు.

ఆ టైం లోనే ప్రకటన చూసి విరాట్‌కి ఫోన్‌ చేస్తే అప్పటికే నువ్వు తన వద్దకొచ్చేసావట. నా మీద మండిపడ్డాడు. అప్పుడే పాడు బుద్ధి పుట్టింది. పట్టిస్తే కోటి రూపాయలంటే విరాట్‌ బాగా సౌండ్‌ పార్టీ అనర్థమైంది. నిన్ను కిడ్నాప్‌ చేసి మూడు కోట్లు డిమాండ్‌ చేస్తే ఇస్తాడనిపించింది. దాంతో నీకోసం గాలించటం ఆరంభించాం’’ అన్నాడు ముత్తు.

‘‘మీ బాధ అర్థమైందిరా. మీరంతా నన్ను అక్కా అంటున్నారు.

మిమ్మల్ని బాగా చేసే పూచీ నాది. సరేనా?’’

‘‘‘సరక్కా నువ్వేం చెప్తే అది.’’

‘‘మరీ మీరు మూడు కోట్లు, నాలుగ కోట్లు అని ఆశ పడకండి. మీ అందరికీ తలా పది లక్షలిచ్చి, మీరు ఉద్యోగాల్లో గాని, వ్యాపారంలో గాని సెటిలయి గౌరవంగా బ్రతికేలా చేస్తాను. అక్కడి నుండి కష్టపడి సంపాదించుకొని జీవితంలో పైకి రండి. అది చాలదా?’’

‘‘అయ్య బాబోయ్‌ అడక్కుండానే వరాలిస్తున్నావాక్కా. అంత కన్నా మాకింకేం కావాలి? ఏరా ఏమంటారు?’’ అనడిగాడు ముత్తు కుర్రాళ్ళాని.

‘‘చాలు. అక్క దేవత. మనకి కష్టాలు తీరినట్టే’’ అన్నారంతా.

‘‘అయితే నేనిక్కడ మీతో బాటు ఇరవై రోజులుంటాను. నేనిక్కడ వున్నట్టు ఎవరికీ తెలీకూడదు. ముఖ్యంగా ఆ త్యాగ రాజన్‌ మనుషులకి అస్సలు తెలీకూడదు. మారు వేషంతో ఎవరూ గుర్తించకుండా నన్ను సైదాపేట కోర్టుకి మీరే తీసుకెళ్ళాలి’’

‘‘అదెంత పనక్కా ఆవిషయం మాకు వదిలేయ్‌. మూడో కంటికి తెలీకుండా నిన్ను కోర్టులో హాజరు పరుస్తాం సరేనా?’’ అన్నాడు ఉత్సాహంగా ముత్తు.

‘‘సరేగాని మీరు నాకో వాగ్దానం చేయాలి. ఇక మీద పిక్‌ పాకెట్‌ మానేయాలి. మీరు దొంగలు కాదు. దొరలుగా మారాలి’’

సహస్ర మాటలకి వాళ్ళంతా ముఖముఖాలు చూసుకున్నారు. ‘‘సారీ అక్కా దొంగతనం మానేయాలని మాకూ వుంది. కాని ఖర్చులకి డబ్బు కావాలి గదా’’ అన్నాడు ముత్తు.

‘‘డబ్చు గురించి ఆలోచన మానేయండ్రా. నేను ఏర్పాటు చేస్తాను. నాఫోను ఎవరిదగ్గరుంది. ముత్తు నీదగ్గరుందా? యిలా యివ్వు ఓ సారి విరాట్‌తో మాట్లాడతాను. వాళ్ళంతా నాకోసం కంగారు పడుతుంటారు’’

ముత్తు ఫోన్‌ ఇవ్వగానే ఆన్‌ చేసి విరాట్‌ సెల్‌కి ఫోన్‌ చేసింది. విరాట్‌ కోప్పడ్డంతో అలిగి లైన్‌ కట్‌ చేసింది. తర్వాత అటునుండి విరాట్‌ చేసాడు.

‘‘వాళ్ళని కాస్త కంగారు పెట్టాలి. నువ్వు మాట్లాడరా ముత్తు. మూడు కోట్లు డిమాండ్‌ చెయ్‌’’ అంది. సెల్‌ ఆన్‌ చేయగానే అవతల మునుసామి లైన్లో వున్నాడు. విలన్‌లా నవ్వాడు ముత్తు.

*************************************

ఫోన్‌లో సహస్ర చెప్పిందంతా విని...  తేలిగ్గా వూపిరి తీసుకున్నారంతా. కాని విరాట్‌ మనసు సహస్ర అక్కడే ఉండి పోతుందంటే అంగీకరించటం లేదు.

‘‘సో... వాళ్ళంతా పిక్‌పాకెట్‌ కుర్రాళ్ళంటావ్‌. వాళ్ళు నిన్ను కాపాడారు సరే. అంతగా అభిమానం వుంటే వాళ్ళకు కావల్సినంత డబ్బిచ్చేద్దాం. నువ్వక్కడే ఉండి పోడం బాగాలేదు. మేమంతా నిన్ను కాపాడుకోలేమా? వచ్చెయ్‌ సహస్రా ప్లీజ్‌. ఎక్కడున్నావో చెప్పు నేనే వస్తాను’’ అంటూ రిక్వెస్ట్‌ చేసాడు.

‘‘బావా. నీకర్థం గావటం లేదు. ప్రస్తుతం నాకింత కన్నా సేఫ్‌ ప్లేస్‌ దొరకదు తెలుసా? నేను కాలనీకి వచ్చేస్తే ఆ త్యాగరాజన్‌ తిరిగి ఎవరికో హాని తలపెట్టి నన్ను దెబ్బ తీయాలని చూస్తాడు. ఇక్కడుంటే ఆ సమస్య ఉండదు. నా గురించి అసలు తెలీదు. ఇక నువ్వు కూడా నేనింకా కాలనీకి తిరిగి రాలేదని ఏంచేసావో చెప్పకపోతే చంపేస్తానంటూత్యాగరాజన్‌కి ఫోన్లు కొడుతూ డ్రామాను కంటిన్యూ చెయ్‌. వాడ్ని నేనేమయ్యానో తెలీక టెన్షన్‌ పడనీ. మనజోలికి రాడు. ఈ ఇరవై రోజులూ మీరక్కడ నేనిక్కడ. అంతే. తమ్ముళ్ళంతా నాకు అండగా వున్నారు. భయం లేదు. తిరిగి కోర్టులోనే మనం కలుసుకునేది. కోర్టులో నన్ను ఎవడూ కాల్చి చంపకుండా మీరంతా అలర్ట్‌గా ఉంటే చాలు.’’

‘‘కాని... ప్లీజ్‌ సహస్రా నిన్ను చూడాలి. ఓసారి రావచ్చుగా’’

‘ఓకే బావా వస్తాను. ఎల్లుండి ఆదివారం మీకు ఆఫీసు శలవు గదా. నాకోసం ఓ లక్ష రెడీ చేసి ఉంచు. ఖర్చులకి అవసరం. నా క్రెడిడ్‌ కార్డులన్నీ నాగదిలోని లాకర్‌లో ఉండిపోయాయి’’

‘‘ఏయ్‌ డబ్బుగురించి ఇంతగా చెప్పాలా. లక్షకాదు ఎన్ని లక్షలయినా రెడీగా ఉంచుతా. కాని ఎక్కడకు రావాలి?’’

‘‘నేనే కాలనీకొస్తా. మనింటికే వస్తా’’

‘‘నిజంగా వస్తావా?’’

‘‘అరె వస్తానంటున్నానుగా, నా తమ్ముళ్ళందర్నీ తీసుకుని మరీ వస్తాను’’

‘‘వస్తే నీకే కాదు వాళ్ళందరికీ తలో లక్ష ఇస్తాను.’’

‘‘ఏంటీ? డబ్బులిచ్చి వాళ్ళని చెడగొట్టాలనే... వాళ్ళకి నేనిస్తాగాని ఫోన్‌ విశాలకివ్వు’’

ఆ తర్వాత విశాల, దీక్ష చందూ కదిరేశన్‌ అందరితో మాట్లాడి జాగ్రత్తలు చెప్పి లైన్‌ కట్‌ చేసింది సహస్ర. 

********************************

సహస్ర సలహా మేరకు...

ఆ  మరునాడు సాయంకాలమే...

త్యాగరాజన్‌ సెల్‌కి ఫోన్‌ చేసాడు విరాట్‌.

‘‘హలో మళ్ళీ ఎందుకు నాకు ఫోన్‌ చేసావ్‌?’’ విసుగ్గా అడిగాడు త్యాగరాజన్‌.

‘‘ఎందుకా! విందుభోజనానికి పిలుద్దామని. బుద్ధుందా? నా సహస్రని మాయం జేసి ఏమీ తెలీనట్టు కూచుంటే వూరుకుంటానా?’’ ‘‘నాకు తెలీదని నిన్నే చెప్పాను. ఉదయం ఫోన్‌ చేస్తే చెప్పాను. ఇంకా ఎన్ని సార్లు చెప్పాలి? తను పారిపోయిందంతే’’ ‘‘అంతే అంటూ బుకాయించక. పారిపోయింది నిజమైతే కాలనీకి ఇంత వరకు ఎందుకు తిరిగిరాలేదు.’’ ‘‘అందుకు నన్నేం చేయమంటావ్‌? మా గురించి భయపడి చెన్నై వదిలి పారిపోయిందేమో. మధురై వెళ్ళిపోయిందేమో. మహాదేవనాయకర్‌కి ఫోన్‌ చేసి అడుగు.’’ ‘‘మధురై కూడా వెళ్ళలేదు’’

‘‘అయితే వెతుక్కోండి. ఎక్కడ దాక్కుందో వెదికి పట్టుకోండి. నాకు ఫోన్‌ చేసి లాభం లేదు’’

‘‘కాని నిన్ను చంపేస్తే నాకు లాభం వుంది. నువ్వు చచ్చావని తెలిస్తే సహస్ర తిరిగొస్తుంది.’’

‘‘ఇక నీకా ఛాన్స్‌ లేదు విరాట్‌. నన్ను నువ్వు పట్టుకోలేవు’’

‘‘అలాగని భ్రమపడకు. నిన్ను క్లోజ్‌గా మావాళ్ళు కనిపెడుతూనే వున్నారు. కీల్పాక్కం వదిలి వేలచ్చేరి పారిపోతే వదులుతాననుకోకు. రెండు మూడు రోజుల్లో సహస్ర తిరిగొస్తే బతికి పోతావ్‌. లేదంటే నువ్వెక్కడున్నా వెతికి చంపుతా. నిన్ను వదలను’’ అని ఘాటుగా హెచ్చరిస్తూ లైన్‌ కట్‌ చేసాడు విరాట్‌.

అవతల త్యాగరాజన్‌ ముఖం షాక్‌తో ఎలా వుంటుందో వూహించుకొంటే విరాట్‌కి నవ్వొస్తోంది. ఆ రోజు గడిచిపోయింది. మరునాడు ఆదివారం. సహస్ర వస్తానని చెప్పిన రోజు.

ఉదయం తొమ్మిది గంటలకి ముందుగా విశాల తనకార్లో విరాట్‌ ఇంటికొచ్చేసింది. కాస్సేపటికి దీక్ష చందూ కదిరేశన్‌ మిగిలిన వాళ్ళు అంతా వచ్చేసారు. ధర్మ బృందం మాత్రం హోటల్‌ నుంచి ఇంకారాలేదు. ‘‘బావా అక్క నిజంగా వస్తుందంటావా?’’ విరాట్‌ ముందు తన సందేహాన్ని బయటపెట్టింది విశాల. ‘‘ఎందుకొచ్చిందా అనుమానం?’’ అడిగాడు విరాట్‌.

‘‘శతృవుల గురించి భయం ఉందిగా. అందుకే డౌటు’’

‘‘వస్తుందనేగా ఎదురు చూస్తున్నాం. చూద్దాం. ఏ టైమ్‌కి వస్తుందో తెలీదు. ఒక వేళ రాకపోనూవచ్చు’’ ‘‘ఆ డౌటే వద్దు. సహస్ర ఎప్పుడూ మాట తప్పదు వస్తుంది’’ అంది ధీమాగా దీక్ష.‘‘ఎలా వస్తుంది? నలుగురూ చూస్తారుగదా’’ అనడిగాడు బండశివా.‘‘ఏమో ఏ వేన్‌ లోనో రావచ్చు. అయినా ఈ అంచనాలెందుగ్గాని ముందు కాఫీ టిఫిన్ల సంగతి చూడండి’’ అన్నాడు మునుసామి.క్షణాలు భారంగా దొర్లుతున్నాయి. ఈ లోపల ధర్మ బృందం కూడా వచ్చేసింది. అంతా కాఫీ టిఫిన్లు తీసుకొని తీరిగ్గా సహస్ర రాక కోసం ఎదురుచూడసాగారు. క్రమంగా పదిగంటలు దాటింది సమయం. ఆకాశాన్ని మబ్బులు కప్పి ఉంచటంతో సూర్యుడు కన్పించటం లేదు. వాతావరణం చల్లగా వుంది. గోస్వామి కాలనీ వీధులు మూడూ ప్రశాంతంగా వున్నాయి.

ఇంతలో...

ఎగువన కాలనీ ఎంట్రన్స్‌ దిశగా కలగాపులగంగా ఏవో కొన్ని గొంతులు వినవచ్చాయి. కుక్కలు పెద్దగా అరుస్తున్నాయి. గేటు వద్దకొచ్చి చూసిన బండశివాకి ఒక నక్కలోల్ల గుంపు అడుక్కొంటూ తమ మొదటి వీధిలోకే వస్తూ కన్పించింది.వీళ్ళని తమిళనాట ‘‘కురవికారంగ’’ అంటారు. ఆంధ్ర ప్రాంతంలో నక్కలోళ్ళంటారు. మగాళ్ళు గోచీ పెట్టుకొని పైన నడుంకి టవలు చుట్టుకుంటారు. ఎప్పుడోగాని చొక్కా వేసుకోరు. మెడలో పూసల దండలుంటాయి.సైకిలు ట్యూబు ముక్కలతో పక్షుల్ని గులకరాళ్ళతో కొట్టడానికి పంగలకర్ర చేసి అమ్ముతుంటారు. తీగతో ప్లాస్టిక్‌ పూసల్ని చుట్టి దండలు చేసి అమ్ముతారు. ఇంకా సిటీల్లోని మార్కెట్‌ సెంటర్లలో చిన్నచిన్న ప్లాస్టిక్‌ వస్తువులు దువ్వెనలు దుకాణం పెట్టి అమ్ముతారు.

ఆడాళ్ళయితే మోకాలు దాటని పొట్టిపరికిణీ వేసుకొని భుజంమీదకు పైటలావేసుకొని డాల్డా డబ్బాను భుజాన తగిలించుకు తిరుగుతారు. చండి బిడ్డ తల్లులయితే ఎడం భుజాన జోలెలో బిడ్డను వేసుకుని తిరుగుతారు. తంబాకు నములుతుంటారు. వీళ్ళు అదృష్టం కలిసొస్తుంది నక్క కొమ్ము అంటూ నక్క గోళ్ళనే కొమ్ములంటూ అమ్ముతుంటారు. నక్కలకి కొమ్ములుండవని తెలిసి కూడా కొందరు అమాయకంగా  గోళ్ళని కొనుక్కుని దాచుకుంటారు. ఈ నక్కలోళ్ళ జీవనశైలి ఆచార వ్యవహారాలు చిత్రంగా వుంటాయి అడుక్కోవటం కూడా వీళ్ళ కులవృత్తిలో భాగమే. వీళ్ళు అధికంగా తమిళనాట, ఆంధ్రాసరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా కన్పిస్తుంటారు. అలాంటి నక్కలోళ్ళ గుంపు ఒకటి వీధిలోకొస్తూ హడావుడి చేస్తొంది. వాళ్ళంతా సుమారు పదిహేనుమంది వుంటారు. అయిదుగురు జట్టుగా ఒక్కో ఇంటి ముందు కెళ్ళి అడుక్కొంటున్నారు. వాళ్ళరాకతో వీధి మొత్తం సందడిగా మారిపోయింది. వాళ్ళలో ఓ గుంపు విరాట్‌ గేటు ముందుకొచ్చింది. ఆవరణలో తిరుగుతున్న మునుసామిని చూస్తూ వాళ్ళలో ఒకడు అరిచాడు.

‘‘అదిగదిగో పెద్దాయనున్నాడు పెద్ద మనసుగల సామి. చద్దన్నం పెట్టిస్తారు. పాత బట్టలిప్పిస్తారు. ఆడండిరా పాడండి.’’ అంటూ. ‘‘ఏయ్‌ ఆగండాగండి పొద్దుటే ఏంటిరా మీ గోల. మా టెన్షన్‌లో మేముంటే మీగోలేంటి. పోండి పోండి’’ అంటూ కసురుకున్నాడు మునుసామి. ‘‘రాకరాక వచ్చినం సామి. అక్కలం వచ్చినాం, చెల్లెళ్ళం వచ్చినాం. తమ్ముళ్ళం వచ్చినాం. దయగలసామి అట్టాకోప్పడకండి. అట్టు ముక్కో కాస్త పొంగలో ఇప్పించండి... ఆడండిరా... డమక్క డక్క డియ్యాలో. డిమిక్కి ఢక్కి డియ్యాలో’’ డాల్డా డబ్బాల్ని అదరగొడుతూ వాళ్ళంతా గేటు ముందు గంతులేస్తుంటే నవ్వు కోపం కూడా వస్తున్నాయి. ఇంతలో ఈ గోలకి లోపల్నించి విరాట్‌తో బాటు విశాల దీక్ష అంతా బయటకొచ్చేసారు.

‘‘ఒరే బండశివా నువు గేటు దగ్గరే వుండరా. వాళ్ళు గేటుతీసుకుని వచ్చినా వచ్చేస్తారు. పొమ్మని చెప్పు’’ అనరిచాడు మునుసామి.

ఇంతలో పక్క యిళ్ళ దగ్గర్నుంచి మిగిలిన నక్కలోళ్ళు కూడ వచ్చి చేరి పోయారు. పన్నెండు మంది మగాళ్ళు ముగ్గురు అమ్మాయిలు. అంతా పిన్నవయస్కులే. అమ్మాయిలు ముగ్గురిలోనూ పెద్దమ్మాయి చామనఛాయగా చలాకీగా వుంది. వస్తూనే` ‘‘ఏంది తమ్ముడూ. ఏమైంది?’’ అనడిగింది.

‘‘చూడక్కా ఆ పెద్దాయన పొమ్మని కసురుతున్నాడు’’ అంటూ రిపోర్ట్‌ చేసాడు కుర్రాళ్లలో కాస్త పెద్దవాడు.

‘‘పొమ్మంటే పోతామా ఏంది? నక్కకొమ్ము దిష్టితీసి ఆ పెద్దాయనికి కడితే కోపం పోతుంది. ఏడాదికో తూరి వచ్చినం. ఉత్తచేతులతో పంపిస్తారా? ఇక్కడ సానా మంది సాములున్నారు. మన ఆటనచ్చాలి పాట నచ్చాలి. చిందెయ్యండిరా’’ అనరిచిందా అమ్మాయి అంతే ‘‘ఢమక్క డియ్యా డియ్యాలో ` ఢమిక్క డియ్యా డియ్యాలో’’ అంటూ అంతా పాడుతూ డాల్డా డబ్బాల మీద బాదుతుంటే ఆ నల్లపిల్ల అద్భుతంగా చిందేయటం ఆరంభించింది.

నిజానికి ఆ నల్లపిల్ల ఎవరో కాదు.

సహస్ర.

మేలిమి బంగారు రంగులో మెరిసిపోయే ఆమె శరీరకాంతి ఇప్పుడు మేకప్‌ రంగులో నల్లగా మారి పోయింది. ఆమె వెంటవచ్చిన వాళ్ళంతా మురడన్‌ ముత్తు బేచ్‌. మరీ సహస్ర ఒంటరిగా రావటం బాగుండదని ముత్తు తన చెల్లెల్ని తెలిసిన మరో అమ్మాయిని ఇద్దరినీ సహస్రకి తోడుగా తీసుకొచ్చాడు. అద్భుతంగా వేషాలు కుదిరాయి. విరాట్‌తో సహా ఎవరూ సహస్రని గుర్తుపట్టలేక పోయారు. క్లోజ్‌ఫ్రండు దీక్షకూడా గుర్తించలేదు. కాని కాస్త ఆలస్యంగా అయినా విశాల గుర్తుపట్టేసింది ఎలాగంటే.

సహస్రవి విశాల నేత్రాలు. చక్కగా తీర్చిదిద్దినట్టుండి, ఎదుటివాళ్ళని శాసిస్తున్నట్టుంటాయి. రంగుమారినా రూపూ రేఖలు మార్చినా కళ్ళుమారవు. అందుకే అచ్చు గుద్దినట్టు నక్కలోళ్ళ అమ్మాయిలా మారిపోయిన సహస్రను చూస్తూ మతి పోగొట్టుకుంది విశాల. ‘‘అక్కా నీలో ఇంత టాలెంట్‌ ఉందనుకోలేదు’’ అనుకుంది మురిసిపోతూ.

అంతలో గేటుముందు వాళ్ళగోల భరించలేక తరిమికొట్టాలని గేటువైపు కదిలాడు విరాట్‌. అతడి చేయిపట్టి వెనక్కి లాగింది విశాల.

‘‘బావా...  తొందరపడమాకు. ఇంకా గుర్తు పట్టలేదా? ఆ నల్ల పిల్ల మన సహస్ర. వాళ్లంతా నిజంగా నక్కలోళ్ళుకాదు. సరిగా గమనించు’’ అంది.సమీపంలోనే వున్న మునుసామి అమాటలు విని దగ్గర కొచ్చాడు. విషయం క్షణాల్లో అందరికీ పాకిపోయింది. మీరు గమ్మునుండండి నేను హేండిల్‌ చేస్తాను. ఇదిగో కదిరేశా మనోళ్ళని వీధిలోకి తరుము శతృమనుషులెవరన్నా గమనిస్తున్నారేమో చూడమను’’ అని చెప్పి గేటు వద్దకెళ్ళి తెరిచాడు.

చుట్టుపక్కల యిళ్ళ తాలూకు పిల్లలు కొందరు వీధిలోకొచ్చి ఆ గుంపుని తమాషా చూస్తున్నారు.

‘‘ఇదిగో అమ్యాయ్‌ మీ ఆట పాట నచ్చిందిగాని లోనకి రండి. కాస్త చద్దిబువ్వ రొట్టెముక్కతిని పోదురుగాని రండి’’ అని పిలిచాడు.  

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika